ఎన్‌విడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎలా మారింది, మైక్రోసాఫ్ట్, యాపిల్ కంపెనీలను అధిగమించడానికి కారణమేంటి?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, మిచెల్ లాబియాక్
- హోదా, బిజినెస్ రిపోర్టర్
కంప్యూటర్ చిప్‌ల తయారీ సంస్థ ఎన్‌విడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. మంగళవారం (2024 జూన్ 18) నాడు ఆ కంపెనీ షేర్ల విలువ ఆల్ టైమ్ హైకి చేరుకోవడంతో ఇది సాధ్యమైంది.
ఈ కంపెనీ స్టాక్ విలువ మంగళవారం 3.5 శాతం పెరిగి, 136 డాలర్ల దగ్గర ముగియడంతో మైక్రోసాఫ్ట్ కంటే ఎక్కువ విలువైనదిగా మారింది.
ఈ నెల ప్రారంభంలోనే యాపిల్ కంపెనీని ఎన్‌విడియా దాటేసింది.
కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాఫ్ట్‌వేర్‌కు అవసరమైన చిప్‌లను ఎన్‌విడియా తయారు చేస్తోంది.
గత కొన్నేళ్ళుగా ఈ సంస్థ ఉత్పత్తులకు డిమాండ్ భారీగా పెరగడంతో అమ్మకాలు, లాభాలు ఊపందుకున్నాయి.
ఎన్‌విడియా ఆదాయం మరింత పెరుగుతుందనే ఇన్వెస్టర్ల నమ్మకం దాని షేర్ల విలువ భారీ పెరుగుదలకు కారణమవుతోంది.
అయితే, అతి తక్కువ కాలంలో దీని విలువ ఇంతగా పెరిగిపోవడంపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
మంగళవారం నాటి ఎన్‌విడియా షేరు ధర ఈ ఏడాది ప్రారంభంలోని ధరకంటే దాదాపు రెట్టింపు అవడంతో ఆ కంపెనీ మార్కెట్ విలువ 3.34 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఎనిమిది సంవత్సరాల కిందట ఎన్‌విడియా షేర్ విలువ ప్రస్తుత ధరలో 1% కన్నా తక్కువే ఉంది.
ఏఐ డెవలపర్ల మధ్య పోటీ ఎన్‌విడియాకు కలిసి వస్తోంది.
మైక్రోసాఫ్ట్, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్, ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా, యాపిల్ వంటి టెక్ దిగ్గజాలు ప్రపంచస్థాయి ఉత్పత్తులను రూపొందించేందుకు పోటీ పడుతున్నాయి.
ఈ పోటీ, ఏఐ చిప్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఎన్‌విడియాకు లాభదాయకంగా మారింది.
దీంతో ఈ కంపెనీ విలువ పెరుగుతూనే ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
ఇటీవల సంవత్సరాలలో ఎన్‌విడియా అమ్మకాలు, లాభాలు ఎనలిస్టుల అంచనాలను మించిపోయాయి.
మే నెలలో ఎన్‌విడియా తాజా ఆర్థిక ఫలితాలు వెలువడిన తరువాత క్విల్టర్ చెవియోట్ టెక్నాలజీ విశ్లేషకుడు బెన్ బారింగ్ మాట్లాడుతూ ‘‘మరోసారి కంపెనీ భారీ అడ్డంకిని అధిగమించింది’’ అన్నారు.
‘‘డిమాండ్ కూడా తగ్గే సూచనలు కనిపించడం లేదు’’ అని చెప్పారు.
అయితే, పెద్ద మార్కెట్ వాటాను ఎన్విడియా నిలబెట్టుకోవడం కష్టమని బార్‌క్లేస్ క్రెడిట్ అనలిస్ట్ సందీప్ గుప్తా ఫిబ్రవరిలో అభిప్రాయపడ్డారు.


ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock
వజ్రాలను తరలించినట్టుగా..
ప్రాసెసర్లు తయారు చేసే ఈ అమెరికన్ సంస్థ మార్కెట్ విలువ సాంకేతిక రంగ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, యాపిల్‌ను దాటేయడానికి కారణం అది తయారుచేసే చిప్‌లకు ఉన్న డిమాండే.
శక్తివంతమైన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను తయారు చేయడం ద్వారా చిప్‌ల తయారీ రంగంలో తానే మహరాజునని ఎన్‌విడియా నిరూపించింది.
గణాంకాలను చాలా వేగంగా లెక్కించగల ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను ఎన్‌విడియా తయారు చేస్తోంది. ఈ ప్రాసెసర్లను ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే అప్లికేషన్ల కోసం ఉపయోగిస్తున్నారు.
మార్కెట్‌లో వీటి విలువ ఒక్కొక్కటి వేల డాలర్లు పలుకుతోంది.
ఈ ప్రాసెసర్లకు గిరాకీ ఏ విధంగా ఉందంటే, వాటిని వజ్రాలను తరలించినట్లుగా కట్టుదిట్టమైన భద్రత మధ్య ట్రక్కుల్లో తరలిస్తున్నారు.
గ్రాఫిక్ ప్రాసెసర్ యూనిట్ల తయారీలో 80 శాతం మార్కెట్‌ను సంపాదించుకున్న ఇంటెల్, ఏఎండీ కంటే ఎన్‌విడియాకు అవకాశాలు పెరుగుతున్నాయి.

ఎన్విడియా సంస్థ ప్రయాణం..
30 ఏళ్ల క్రితం వీడియో గేమ్స్‌లో ఉపయోగించే చిప్స్ తయారీ సంస్థగా ఎన్‌విడియా ప్రయాణం ప్రారంభమైంది.
మార్కెట్‌లో బాగా గిరాకీ ఉన్న వీడియో గేములు, యానిమేషన్స్, ఇమేజేస్, రెండరింగ్ వీడియోస్ లాంటి విభాగాల్లో ఎన్‌విడియా తయారు చేసిన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లకు డిమాండ్ భారీగా ఉండేది.
వీడియో గేమ్స్ చిప్స్ తయారీ అనేది సంస్థకు సంబంధించి చాలా ఏళ్ల క్రితం నాటి మాట.
జీపీయూలకు ఇతర విభాగాల్లోనూ ఉన్న డిమాండ్‌ను సంస్థ త్వరగానే అర్థం చేసుకుంది.
గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థలు తమ వద్ద ఉన్న డేటాను భద్రపరిచేందుకు ఎన్‌విడియా తయారు చేస్తున్న ప్రాసెసర్ల అవసరాన్ని గుర్తించాయి.
అలాగే క్రిప్టో కరెన్సీల మైనింగ్ చేసే సంస్థలకు కూడా ఇవి అవసరంగా మారాయి.
అదే సమయంలో ఇంజనీర్లు కూడా తమ చిప్స్ ఉపయోగించి కృత్రిమ మేథస్సు సాయంతో గణాంకాల్ని వేగంగా సిద్ధం చేయడం కూడా ప్రారంభమైంది.
దీంతో వారికి అవసరమైన లెక్కల్ని చేయడానికి ప్రాసెసర్ల అవసరం పెరిగింది.
ప్రస్తుతం అత్యాధునిక జీపీయూల తయారీలో ఎన్‌విడియా ముందుంది.
అత్యాధునిక సాంకేతిక కృత్రిమ మేథలో ఈ సంస్థ తయారు చేసిన హెచ్100 రకం ప్రాసెసర్లను ఉపయోగిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పోటీని తట్టుకుంటూ..
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్‌కు శిక్షణ ఇచ్చేందుకు గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ కోసం తయారు చేసే సెమీ కండక్టర్స్ కూడా అవసరం అని సంస్థ గుర్తించింది.
ఈ రంగంలో ప్రత్యర్థుల మీద పై చేయి సాదించేందుకు ఎన్‌విడియాకు ఇది బాగా ఉపయోగపడింది.
2006ను అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో సంస్థ పూర్తి స్థాయి నిబద్దతను ప్రకటించింది.
కఠినమైన లెక్కలకు సంబంధించిన సమస్యలను కూడా సులువుగా పరిష్కరించగలిగే చిప్స్ తయారీ కోసం సీయూడీఏ అనే లాంగ్వేజ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
దీంతో ప్రత్యర్థులైన ఏఎండీ, ఇంటెల్ లాంటి సంస్థలు అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి అడుగు పెట్టకముందే నివిడియా ఆ మార్కెట్ మీద ఆధిపత్యం చలాయించడం మొదలైంది.
అయితే ఆ ఆధిపత్యం ఎంతో కాలం కొనసాగలేదు.
పోటీ సంస్థలు భారీ పెట్టుబడులతో తమ వేగాన్ని పెంచాయి.
మార్కెట్ వాటాలో ఎక్కువ భాగాన్ని దక్కించుకున్నాయి.
గూగుల్, అమెజాన్ , మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు ఓ వైపు గ్రాఫిక్స్ ప్రాసెసర్ యూనిట్లను తయారు చేస్తూనే క్లౌడ్ కంప్యూటింగ్‌ను కూడా అభివృద్ధి చేశాయి.
అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోసం తమదైన సొంత చిప్స్ తయారు చేయడం ప్రారంభించాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఎన్విడియా ఉత్పత్తులకు గిరాకీ
గేమింగ్, డేటా సెంటర్లు, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ల నుండి ఎన్‌విడియా ప్రాసెసర్ల కోసం డిమాండ్ ఊహించని స్థాయిలో పెరిగింది.
ప్రత్యేకంగా గతేడాది చూస్తే, పవర్ లార్జ్ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్‌కి చెందిన సర్వర్ల కోసం ఖరీదైన గ్రాఫిక్స్ ప్రాసెసర్లకు డిమాండ్ వేగంగా పెరిగింది.
మిగతా టెక్నాలజీ సంస్థలతో పోలిస్తే ఎన్‌విడియా పేరు అంతగా తెలియదు.
అయితే చాట్ జీపీటీ లాంచ్ చేసిన తర్వాత ఈసంస్థ వేగంగా తెర మీదకు దూసుకొచ్చింది. చాట్ జీపీటీని అందుబాటులోకి తెచ్చిన టెక్నాలజీ సంస్థ ఓపెన్ ఏఐ అభివృద్ధి చేసిన అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్‌లో ఎన్‌విడియా ప్రాసెసర్లను ఉపయోగిస్తున్నారు.
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అభివృద్ధిలో ఎన్‌విడియా చిప్స్ కీలకంగా మారాయని నిపుణులు చెబుతున్నారు.
జీపీయూ మార్కెట్‌లో ఎన్‌విడియా ప్రత్యర్థి సంస్థల మీద ఆధిపత్యం ఎంత కాలం కొనసాగుతుందనేది చెప్పడం కష్టం.

మార్కెట్‌లో పోటీ పరంగా చూస్తే ప్రస్తుతానికి ఎన్‌విడియా దాని ప్రత్యర్థులు కాస్త అటుఇటుగా సమానంగా ఉన్నారు.
ఎన్‌విడియా తయారు చేస్తున్న హెచ్ 100 చిప్స్‌కున్న గిరాకీ కొనసాగుతూనే ఉంది.
అనేక మంది ఈ చిప్ కోసం ఆరు నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ అభివృద్దికి అవసరమైన చిప్స్‌కున్న డిమాండ్ సప్లయ్ మధ్య అంతరం తగ్గడానికి మరో ఏడాది పట్టవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అది కూడా ఏఎండీ, ఇంటెల్ ప్రస్తుతం చేస్తున్న స్థాయిలో తమ ఉత్పత్తులను కొనసాగించగిలిగితేనే ఇది సాధ్యం అనేది వారి అభిప్రాయం.
అప్పటి వరకూ డిమాండ్‌కు తగ్గ సరఫరా నియంత్రిత స్థాయిలోనే కొనసాగుతుంది.
ఇవి కూడా చదవండి:
- రుషికొండ ‘రహస్య’ భవనాల్లో ఏముందంటే?
- మెదక్: బక్రీద్ సందర్భంగా ఇక్కడ జరిగిన గొడవేంటి? ఎందుకు జరిగింది?
- టీ20 వరల్డ్‌కప్: సూపర్-8 రౌండ్ పోటీలు ఎలా నిర్ణయించారు? సెమీస్, ఫైనల్లో వర్షం పడితే విజేతను ఎలా నిర్ణయిస్తారు?
- మెదక్‌లో ఉద్రిక్తత: ‘మేం ఏం తప్పు చేశామని మా హాస్పిటల్‌పై దాడి చేశారు?’
- సుసన్నా హెర్బర్ట్: ‘మా తాత కాలంలో జరిగిన వాటికి సిగ్గు పడుతున్నా’ అని ఈమె ఎందుకు అంటున్నారు?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














