బ్లడ్ షుగర్ మానిటర్లు: వీటి వాడకం గందరగోళాన్ని సృష్టిస్తుందా? డయాబెటిస్ లేకున్నాఇవి వాడొచ్చా?

బ్లడ్ షుగర్ కొలిచే సీజీఎం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డయాబెటిస్ ఉన్నవారికి సీజీఎంలు శక్తిమంతమైన సాధనాలుగా మారాయి
    • రచయిత, హోలీ హోండ్రిచ్
    • హోదా, బీబీసీ న్యూస్

త్వరలో లక్షలాది మంది అమెరికన్ల చేతికి రక్తంలో చక్కెర స్థాయిలను కొలిచే (బ్లడ్ షుగర్ మానిటర్లు) పరికరాలు దర్శనమివ్వబోతున్నాయి.

ఈ మాట ఎందుకు అంటున్నామంటే.. రక్తంలో చక్కెరను కొలిచే రెండు కొత్త పరికరాలను ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రజలు కొనుగోలు చేసి వాడటానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థలు ఆమోదించాయి.

ఈ చర్య ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక మార్గమా? లేక ఇది గందరగోళానికి, అనవసరపు భయాలకు దారి తీస్తుందా?

సిండీ బెకెడమ్‌ అనే ఒక మహిళ, జూన్‌లో ఒక రోజు రాత్రి ఎప్పుడూ వినని ఒక అలారం శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడి లేచారు.

చాలా బిగ్గరగా, ఎమర్జెన్సీ సమయాల్లో వచ్చే అలర్ట్‌లా ఆ శబ్ధం ఆమె ఫోన్ నుంచి వస్తోంది. ఫోన్‌లో కొత్తగా ఇన్‌స్టాల్ చేసిన ఒక యాప్ నుంచి ఆ శబ్దం వస్తోంది. ఆమె చేతికి అమర్చిన ఒక గ్లూకోజ్ సెన్సర్‌తో ఆ యాప్ లింక్ అయి ఉంది.

నిద్రలో ఉండగా ఆమె శరీరంలో బ్లడ్ షుగర్ ఆందోళనకర స్థాయిలో పడిపోవడంతో యాప్‌లోని అలారమ్ మోగింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానెల్

‘‘అలారం శబ్దంతో అర్ధరాత్రి నిద్ర లేచాను. వెంటనే ఒక గ్రనోలా బార్ తిని పడుకున్నాను’’ అని ఆమె చెప్పారు.

శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ‘కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటర్’ (సీజీఎం) అనే పరికరాలను ఏళ్లుగా డయాబెటిస్ ఉన్న లక్షలాది మంది వాడుతున్నారు.

డయాబెటిస్‌ రోగుల కోసం ఈ సాంకేతికత ఎలా పనిచేస్తుందో మెరుగ్గా అర్థం చేసుకోవడానికి బెండీ తన శరీరంలో ఈ సెన్సర్ అమర్చుకున్నారు. కెనడాలోని ఒంటారియోలో ఆమె డైటీషియన్‌గా పని చేస్తున్నారు.

రెండు వారాల పాటు ఆమె ఈ పరికరంపై ట్రయల్ నిర్వహించారు. ఈ ట్రయల్‌లో కొంత ఆందోళనకర అంశాలు ఆమెకు అనుభవంలోకి వచ్చాయి.

‘‘నాకు పిచ్చెక్కినట్లుగా అయింది. నాకు డయాబెటిస్ వచ్చిందా ఏంటి? అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను’’ అని ఆమె చెప్పారు.

కానీ, ఆమెకు డయాబెటిస్ లేదు. మరింత పరిశోధన చేసిన తర్వాత, తన శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పూర్తిగా సాధారణంగానే ఉన్నాయని ఆమె గుర్తించారు. డయాబెటిస్ లేనప్పటికీ, ఆ సెన్సర్‌ను అమర్చుకోవడం వల్ల ఎప్పటికప్పుడు శరీరంలో బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గుల అప్‌డేట్లు పొందడం ఆమెలో కొంత అనవసర భయానికి దారి తీసింది.

‘‘ప్రజలు గందరగోళానికి గురవుతారని నేను అనుకుంటున్నాను’’ అన్నారామె.

కానీ, ఈ పరికరాలు త్వరలోనే ఇంకా చాలామంది చేతులపై ఉండొచ్చు. ఎందుకంటే, మరో రెండు సీజీఎంలను ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండా విక్రయించేందుకు ఈ వారమే తమకు క్లియరెన్స్ లభించిందని అబాట్ ల్యాబరేటరీస్ అనే వైద్య పరికరాల సంస్థ ప్రకటించింది. వీటిలో ఒకదాన్ని డయాబెటిస్ లేనివారు వాడేందుకు రూపొందించారు.

సీజీఎంల వినియోగం ఇప్పటికే పెరుగుతోంది. వీటి వల్ల హాని కలుగుతుందనడానికి ఆధారాలు లేనప్పటికీ, డయాబెటిస్ లేకున్నా వీటి వాడకం అనవసర ఖర్చుకు దారి తీయొచ్చని నిపుణులు అంటున్నారు.

నెలకు సుమారు రూ. 25,000 (300 డాలర్లు) ఖర్చు అవుతుందని వారు అంచనా వేశారు.

సీజీఎంలు

ఫొటో సోర్స్, Getty Images

గ్లూకోజ్ హెచ్చుతగ్గులను నియంత్రించి సరైన మోతాదులో ఉండేలా చూసుకోవడం వల్ల మానసిక స్థితి, శక్తి, నిద్ర మెరుగుపడుతుందని బీబీసీతో అబాట్ సంస్థ అధికార ప్రతినిధి అన్నారు. ఆరోగ్యం మీద గ్లూకోజ్ హెచ్చుతగ్గుల ప్రభావం, గ్లూకోజ్‌ను మానిటర్ చేయడంలో సీజీఎంల పాత్ర గురించి వెల్లడించే అధ్యయనాలను ఆయన ప్రస్తావించారు.

ఇలాంటి వాదనలపై వైద్య సమాజంలో కొన్ని సందేహాలున్నాయి. అయితే, డయాబెటిస్ ఉన్నవారి సంరక్షణను సీజీఎంలు గణనీయంగా మెరుగుపరిచాయని నిపుణులు చెప్తున్నారు.

క్లోమగ్రంథి నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతే, రక్తంలో చక్కెర మోతాదు పెరుగుతుంది. ఇలా వచ్చేదాన్ని టైప్ 1 డయాబెటిస్ అని అంటారు. టైప్ 2 డయాబెటిస్ అనేది చాలా సాధారణమైనది. శరీరంలోని కణాల్లో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడినప్పుడు టైప్ 2 డయాబెటిస్ వస్తుంది.

డైట్, వ్యాయామం, మందులు, సరైన జీవన శైలితో టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు.

మధుమేహం ఉన్నవారు సాధారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఫింగర్ ఫ్రిక్ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు. అయితే, మధుమేహం ఉన్న వారిలో బ్లడ్ షుగర్ ప్రమాదకర స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనైనప్పుడు, ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడినప్పుడు సీజీఎంలు అప్రమత్తం చేస్తుంటాయి.

మధుమేహం లేని వారి ఆరోగ్యాన్ని సీజీఎంలు మెరుగుపరుస్తాయనడానికి బలమైన ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు.

సీజీఎం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డచ్ మారథాన్ రన్నర్ అబ్డీ నగీయే

సీజీఎంలు ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారం. వచ్చే నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సీజీఎంల అమ్మకాలు 20 బిలియన్ డాలర్లకు చేరుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి.

ఆరోగ్యం, వెల్‌నెస్, క్రీడా రంగాల్లో ఈ పరికరాల వాడకం పెరుగుతోంది.

శరీరంలో అందుబాటులో ఉన్న శక్తిని తెలుసుకోవడానికి తాను సీజీఎంను ధరించినట్లు పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొననున్న డచ్ మారథాన్ రన్నర్ అబ్డీ నగీయే వార్తా సంస్థ రాయిటర్స్‌తో అన్నారు.

మెటబాలిక్ హెల్త్ మీద గ్లూకోజ్ చూపించే ప్రభావాల నేపథ్యంలో సైంటిఫిక్ కమ్యూనిటీకి చెందిన కొందరు కూడా వీటిపై ఆసక్తి చూపించారు.

డైట్‌ను మార్చుకోవడంలో సీజీఎంలు ఎలా సహాయపడతాయనే ఆసక్తి కొంతమంది ఇంటర్నెట్ యూజర్లలో బాగా పెరిగింది. ఇంటర్నెట్‌లో మీ అల్గారిథమ్ ఆధారంగా, ఆన్‌లైన్‌లో మీరు సీజీఎంల గురించి వెదికినప్పుడు మీ టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో సీజీఎంలను సమర్థించే ఇన్‌ఫ్లూయన్సర్ల వీడియోలు మీకు కనిపించవచ్చు.

సీజీఎంను ధరించడం వల్ల శరీరంలో గ్లూకోజ్ మోతాదులను అదుపులో ఉంచుకునేలా డైట్‌ను మార్చుకోగలిగానంటూ బ్రిట్నీ బౌచర్డ్ అనే ఇన్‌ఫ్లూయన్సర్ టిక్‌టాక్‌లో పేర్కొన్నారు. ఆమె ఒక నిర్ధిష్ట సీజీఎం స్టార్టప్‌ను ప్రమోట్ చేస్తూ ఆ ఉత్పత్తిని కొనేందుకు తన ఫాలోయర్లకు ఒక డిస్కౌంట్ కోడ్‌ను కూడా ఇచ్చారు. ఆమె ఇచ్చిన లింక్ ద్వారా వినియోగదారులు సీజీఎంను కొన్నప్పుడు, బదులుగా కంపెనీ నుంచి ఆమెకు కమీషన్ అందుతుంది.

‘‘నా శక్తిలో, నిద్రలో, మెదడు పనితీరులో మార్పులను సీజీఎం ధరించిన తర్వాత నేను అర్థం చేసుకోగలిగాను. కార్బోహైడ్రేట్లు నా శరీరానికి సరిపడవనే సంగతి దీనివల్లే అర్థమైంది. పైనాపిల్ తిన్నప్పుడు అనారోగ్యానికి గురయ్యాను. ఓట్స్ తింటే ఒక గంటలోనే నేను అలసిపోతాను’’ అని లాస్‌ఏంజిల్స్‌లో హెల్త్ కోచ్ అయిన 41 ఏళ్ల బ్రిట్నీ బౌచర్డ్ తన ఫాలోయర్లకు వివరించారు.

బ్రిట్నీ

ఫొటో సోర్స్, Brittney Bouchard

ఫొటో క్యాప్షన్, బ్రిట్నీ బౌచర్డ్

పరిష్కారం కనిపెట్టి సమస్యను వెదుకుతున్నాం

ఒక సగటు వ్యక్తికి సీజీఎంల వల్ల గొప్ప ప్రయోజనాలు కలుగుతాయని పలువురు పరిశోధకులు, వ్యాపారులు పేర్కొన్నప్పటికీ సైంటిఫిక్ కమ్యూనిటీలో చాలామంది వీటిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సరైన రుజువులు లేవని చెబుతున్నారు.

గ్లూకోజ్‌లో హెచ్చుతగ్గులు రావడం అనేది మధుమేహానికి సంబంధించిన ఒక లక్షణం, అంతేకానీ మధుమేహానికి కారణం కాదు అని ఆక్స్‌ఫర్డ్ పరిశోధకులు, డైటీషియన్ డాక్టర్ నికోలా గుస్ అన్నారు. డయాబెటిస్ లేని వారికి సీజీఎంలతో ఎలాంటి ప్రయోజనం లేదని ఆమె చెప్పారు.

‘‘సాధారణంగా ఒక సమస్యను గుర్తించినప్పుడు, దాన్నుంచి బయటపడటానికి ఒక పరిష్కారాన్ని కనుగొంటారు. కానీ, ఇక్కడ ఇందుకు భిన్నంగా జరుగుతోంది. ఎలాగంటే, మనం ఒక టెక్నాలజీని తయారు చేశాం. ఇప్పుడు ఈ టెక్నాలజీ మీకు అవసరమంటూ దాన్ని వాడే వ్యక్తుల కోసం వెదుకుతున్నాం’’ అని బీబీసీతో ఆమె అన్నారు.

నిపుణులు చెప్తున్న ఒక కీలక అంశం ఏంటంటే, డయాబెటిస్ లేని వ్యక్తుల్లో గ్లూకోజ్ నమూనాలు ఎలా ఉంటాయనే అంశంపై డేటాను కనుగొనడం చాలా కష్టం. అందుకే సీజీఎం ధరించిన ఒక వ్యక్తిలో కనిపించిన ఫలితాలను విశ్లేషించడం కష్టం.

విటమిన్లు, పోషకాలతో కూడిన ఆహారమైన పండ్లను తిన్నప్పుడు చాలామందిలో షుగర్ లెవల్ పెరుగుతుంది. అయితే, దీనర్థం అవి తినడం ఆపేయాలని కాదు.

మధుమేహం లేని వ్యక్తుల్లో సీజీఎంల ద్వారా గ్లూకోజ్ స్థాయిలను ట్రాక్ చేయడం వల్ల వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని నిరూపించేందుకు పెద్దగా ఆధారాలు లేవని శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ క్లినికల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఈథన్ వీస్ అన్నారు.

అలాగే, సీజీఎంల వల్ల హాని కలిగినట్లు చూపించే అధ్యయనాల గురించి కూడా తనకు తెలియదని ఆయన అన్నారు.

అయితే, వీటివల్ల హాని కలిగే అవకాశం ఉండటం నిజమని డాక్టర్ గుస్‌తో పాటు ఇతరులు అంటున్నారు. తరచుగా వ్యాయామం, పోషకాలతో కూడిన ఆహారం వంటి వాటిని తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బదులుగా సీజీఎంల మీద ఆధారపడితే కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని వారు చెబుతున్నారు.

‘‘ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మంచి ఆహారం తినడం, వ్యాయామం చేయడం వంటి సులభమైన మార్గాలకు బదులుగా భోజన సమయాన్ని శాస్త్రీయ ప్రయోగంగా మారుస్తున్నాం. ఇదే నాకు ఆందోళన కలిగిస్తోంది. జీవించడం ఎలాగో ప్రజలు మర్చిపోయినట్లున్నారని ఒక్కోసారి నాకు అనిపిస్తుంది’’ అని వారు అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)