యూజీసీ-నెట్ పరీక్షను ఎందుకు రద్దు చేశారు, ప్రభుత్వం ఏం చెబుతోంది?

పరీక్ష రాస్తున్న అమ్మాయి.. కాలేజీ అమ్మాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం (18.06.2024) నిర్వహించిన యూజీసీ-నెట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

నెట్‌ అంటే నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా ఎన్‌టీఏ నిర్వహించింది. సుమారు 9 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

అయితే, ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖఒక ప్రకటనలో తెలిపింది. రద్దు చేసిన నెట్ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని ప్రకటించింది. ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత చెబుతామని పేర్కొంది.

జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌, పీహెచ్‌డీల్లో ప్రవేశాలు, యూనివర్సిటీ, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు అర్హత సాధించేందుకు అభ్యర్థులు యూజీసీ – నెట్ పరీక్ష రాస్తారు.

బీబీసీ వాట్సాప్ చానల్
పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న విద్యార్థులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, నెట్ 2024 పరీక్షను 9 లక్షలమంది రాశారు

ఎందుకు రద్దు చేశారు?

ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. నెట్ పరీక్ష జరిగిన మరుసటిరోజు అంటే జూన్ 19న నేషనల్ సైబర్ క్రైమ్ త్రెట్ ఎనలిటిక్స్ యూనిట్ నుంచి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కు ఒక సమాచారం అందింది.

యూజీసీ-నెట్‌ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనేది ఆ సమాచార సారాంశం.

దీంతో నెట్ పరీక్షను రద్దు చేసినట్టు కేంద్రం తెలిపింది.

హోం మంత్రిత్వశాఖలోని భారత సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్‌‌ ఆధ్వర్యంలో నేషనల్ సైబర్ క్రైమ్ త్రెట్ ఎనలిటిక్స్ యూనిట్‌ పని చేస్తుంది.

సమగ్ర దర్యాప్తు కోసం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

విద్యార్థినుల ఫోటో

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, నీట్ (యూజీ)2024 గ్రేస్ మార్కుల వివాదాన్ని పరిష్కరించామని ప్రభుత్వం చెప్పింది.

నీట్ గురించి ఏమంది?

గడిచిన కొన్ని రోజులుగా నీట్ పరీక్షపై దుమారం రేగుతోంది. కొందరు అభ్యర్థులకు గ్రేస్ మార్కులు కలిపిన వ్యవహారంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం తన ప్రకటనలో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించింది

ప్రభుత్వం తన ప్రకటనలో నీట్ (యూజీ) పరీక్ష -2024 గురించి ప్రస్తావిస్తూ గ్రేస్ మార్కుల అంశాన్ని పూర్తిగా పరిష్కరించామని తెలిపింది.

పట్నాలో పరీక్ష నిర్వహణలో జరిగిన కొన్ని అక్రమాలపై బిహార్ పోలీసుల ఎకనమిక్ అఫెన్సెస్ యూనిట్ నుంచి సమగ్ర నివేదిక కోరామని, నివేదిక రాగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపింది. దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది.

పరీక్షల పవిత్రతను, విద్యార్థుల నమ్మకాన్ని నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, జరిగిన అవకతవకల్లో వ్యక్తులు గానీ, సంస్థలుగానీ దోషులుగా తేలితే వారు కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది.

మల్లికార్జున్ ఖర్గే

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, నీట్ పరీక్ష గురించి మోదీ ఎప్పుడు మాట్లాడతారని మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు.

‘మోదీజీ.. నీట్‌, నెట్‌ పరీక్షల గురించి ఎప్పుడు మాట్లాడతారు?’

నెట్ పరీక్షను రద్దు చేశాక ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేశాయి.

యువత భవితతో మోదీ ప్రభుత్వం ఆడుకుంటోందని కాంగ్రెస్ విమర్శించింది.

‘‘దేశంలోని పలు ప్రాంతాలలో యూజీసీ -నెట్ పరీక్ష జరిగింది. పేపర్ లీక్ అయిందనే అనుమానంతో ఈరోజు పరీక్షను రద్దు చేశారు. అంతకుముందు నీట్ పేపర్ లీక్ అయింది. ఇప్పుడు యూజీసీ-నెట్. మోదీ ప్రభుత్వం ‘పేపర్ లీక్ ప్రభుత్వం’గా మారిపోయింది’’ అని సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్’లో కాంగ్రెస్‌ విమర్శించింది.

‘‘నరేంద్ర మోదీజీ.., మీరు పరీక్షల గురించి చాలా చర్చించారు. మరి నీట్, నెట్‌ పరీక్షల గురించి ఎప్పుడు మాట్లాడతారు?’’ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు.

‘‘యూజీసీ-నెట్ పరీక్ష రద్దు లక్షలాది మంది విద్యార్థుల విజయం. యువత భవితను తుంగలో తొక్కాలని చూసిన మోదీ ప్రభుత్వ అహంకారానికి ఇది ఓటమి’’ అని ఆయన విమర్శించారు.

‘‘ముందు కేంద్ర విద్యాశాఖా మంత్రి యూజీ నీట్ పరీక్ష పేపర్ లీక్ కాలేదని చెప్పారు. కానీ బిహార్, గుజరాత్, హరియాణాలో దీనికి సంబంధించి అరెస్ట్‌లు జరగగానే ఏదో కుంభకోణం జరిగిందనే విషయాన్ని విద్యాశాఖామంత్రి అంగీకరించారు’’ అని చెప్పారు.

యూజీసీ-నెట్‌లాగే, నీట్ పరీక్షను ఎప్పుడు రద్దు చేస్తున్నారని మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు.

''మీ ప్రభుత్వాల రిగ్గింగ్‌ను, నీట్ పరీక్షల్లో పేపర్‌ లీకులను అరికట్టే బాధ్యత తీసుకోండి’’ అని ఆయన మోదీని కోరారు.

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా పరీక్షల రద్దుపై ప్రభుత్వాన్ని విమర్శించారు.

‘‘అబ్‌కీ బార్, పేపర్ లీక్ గవర్న్‌మెంట్’’ అని అఖిలేష్ యాదవ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.

ఈ అంశంపై బీజేపీ నాయకులు ఇంకా స్పందించాల్సి ఉంది.

విద్యార్థుల ఫోటో

ఫొటో సోర్స్, YEARS

ఎన్‌టీఏ ఏం చేస్తుంది?

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ - ఎన్‌టీఏ అనేది కేంద్ర విద్యా శాఖా ద్వారా జాతీయ స్థాయిలో అర్హత పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటుచేసిన స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ.

పరీక్షల సన్నాహాలు, నిర్వహణకు సంబంధించిన మొత్తం ప్రక్రియను ఈ ఏజెన్సీనే చూస్తుంది. అందులో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కూడా దాని బాధ్యతే.

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, సమర్థత, పారదర్శక ప్రవేశాల ప్రక్రియ, నియామకాల కోసం అభ్యర్థుల మూల్యాంకనం ఈ సంస్థ ద్వారానే జరుగుతుంది.

ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం, ఫెలోషిప్ కోసం ప్రవేశ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ద్వారానే నిర్వహిస్తారు. ఇందులో నీట్, నెట్ తదితర పరీక్షలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)