JNU: లెఫ్ట్ పార్టీల కోటలో కాషాయ జెండా ఎగురుతుందా?

ఫొటో సోర్స్, BBC/SERAJ ALI
- రచయిత, అన్షుల్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశంలోనే అగ్రగామి విద్యాసంస్థలలో ఒకటైన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ తరచూ వివాదాలతో పత్రికల పతాక శీర్షికలలో కనిపిస్తూ రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పుడు ఈ విద్యాసంస్థలో ఎన్నికల హోరు జోరుగా వినిపిస్తోంది.
యూనివర్సిటీలోని జీలం హాస్టల్ లాన్‌లో ఓ వేదిక ఏర్పాటు చేశారు. క్యాంపస్‌లోని నలుమూలల నుంచి విద్యార్థులు అక్కడకు వచ్చిపోతున్నారు.
వేదికముందున్న టెంట్‌లో విద్యార్థుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. యూనివర్సిటీలో వివిధ ప్రాంతాలలో భద్రతాపరమైన చర్యలలో భాగంగా గార్డులను నియమించారు.
డప్పు చప్పుళ్ళు హోరెత్తుతుంటే వాటి మధ్యే అప్పుడప్పుడు నినాదాలు వినిపిస్తున్నాయి.
లాల్ సలామ్ అనే నినాదం జైశ్రీరామ్ నినాదాల్లో కలిసిపోయి కలగాపులగంగా వినిపిస్తోంది.
‘జై భీమ్’ నినాదాలతోపాటు నీలం రంగు జెండా కూడా కాషాయజెండాల పక్కనే ఎగురుతూ కనిపిస్తోంది.
అక్కడకు ఓ రెండు అడుగుల దూరంలో ‘లాల్ సలామ్’ నినాదాలు హోరెత్తుతుంటే ఆ పక్కనే ‘జై మండల్, జై సమాజ్ వాద్’ స్లోగన్లు వినిపిస్తున్నాయి.
చీకటి పడుతున్న కొద్దీ జేఎన్‌యు స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్‌లో ప్రెసిడెంట్ పోస్టు కోసం నిలబడిన అభ్యర్థుల మధ్య జరిగే బహిరంగ చర్చ కోసం విద్యార్థులలో ఆతృత మొదలైంది.
నేను వేదిక పక్కనే నుంచొని ఉన్నాను. ఓ విద్యార్థిని చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వస్తున్నారు. ఆమె చూపులేని ఓ విద్యార్థిని చేయి పట్టుకుని తీసుకువస్తున్నారు.
ప్రెసిడెంట్ అభ్యర్థుల ప్రసంగాలు వినేందుకు ఈ విద్యార్థినులిద్దరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.
అనన్య ఒడిస్సా నుంచి వచ్చారు. ఆమె ఎంఏ విద్యార్థిని. ఆమె జేఎన్‌యు క్యాంపస్‌లో అడుగుపెట్టి ఇంకా ఏడాది కూడా కాలేదు.
కానీ ఆమె ఇప్పుడు గతంలో కంటే ఎంతో స్వేచ్ఛగా ఉన్నట్టు భావిస్తున్నారు.
‘‘నేనిక్కడికి బీఏపీఎస్ఏ (బిర్సా ఫూలే, అంబేద్కర్ ల విప్లవ భావాల మార్గదర్శనంతో నడిచే అంబేద్కరైట్ విద్యార్థి సంఘం) భావజాలంతో వచ్చాను. ఇక్కడకు వచ్చాకా నా సమాజంలోని సమస్యలను ఇంకా సరైన పద్ధతిలో అర్థం చేసుకోగలగుతున్నాను’’ అని చెప్పారు అనన్య.
అనన్య చేయి పట్టుకుని వచ్చిన దివ్య మాట్లాడుతూ, ‘‘నేనిక్కడకు ఝార్ఖండ్ నుంచి కిందటేడాదే వచ్చాను. ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ఏంఏ మొదటి సంవత్సరం చదువుతున్నాను. మా లాంటి విద్యార్థులకు ఇక్కడ ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అలాగే సవాళ్ళు కూడా ఉన్నాయి. నేను కూడా బీఏపీఎస్‌ఏ భావజాలానికి ఆకర్షితురాలినయ్యా. ఈ ఎన్నికలు నాలాంటి వారి సమస్యలు లేవనెత్తేందుకు అవకాశం కల్పించాయి’’ అని చెప్పారు.

నాలుగేళ్ళ తరువాత...
జేఎన్‌యూలో చివరిగా 2019లో ఎన్నికలు జరిగాయి. తరువాత కరోనా కారణంగా ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు నాలుగేళ్ళ తరువాత ఎన్నికలు జరుగుతున్నాయి.
క్యాంపస్ రాజకీయాలలో పాల్గొనేందుకు విద్యార్థులకు ఈ ఎన్నికలు అవకాశం ఇవ్వడంతో వారంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.
ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్న అమీర్ అహ్మద్ నాలుగేళ్ళుగా జేఎన్‌యూలోనే ఉంటున్నారు. ఆయన మొదటిసారిగా క్యాంపస్ ఎన్నికలను చూస్తున్నారు.
‘‘నిజం చెప్పాలంటే ప్రెసిడెన్షియల్ డిబేట్ చూడాలనేది, క్యాంపస్ ఎన్నికలు చూడాలనేది జేఎన్‌యూకు వచ్చినప్పటి నుంచి నాకు ఓ కలలా ఉండేది. నాలుగేళ్ళ తరువాత ఇప్పడా అవకాశం వచ్చింది. మాలాంటి విద్యార్థులకు ఇది నిజంగా పెద్ద విషయమే. ఇక్కడ ప్రెసిడెంట్ అభ్యర్థుల మధ్య జరిగే చర్చలో జెఎన్‌యూ నుంచి మొత్తం ప్రపంచం దాకా అనేక విషయాలు మాట్లాడతారు. మేం వాటన్నింటినీ వినాలనుకుంటున్నాం. ఇది జెఎన్‌యూ సంస్కృతి.’’ అని అమీర్ చెప్పారు.
అమీర్‌లానే దీపశిఖ కూడా మొదటిసారి జేఎన్‌యూ ఎన్నికలను చూస్తున్నారు. ఆమె 2022లో క్యాంపస్‌కు వచ్చారు. ప్రస్తుతం ఎంఏ డిజాస్టర్ స్టడీస్ రెండో సంవత్సరం చదువుతున్నారు. ‘‘క్యాంపస్‌లో ఎన్నికలను మొదటిసారి చూస్తున్నా’’ అన్నారామె. నేను ఏ పార్టీకి చెందను. కానీ అన్ని పార్టీలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. హాస్టళ్ళ సంఖ్య పెంచడం, స్కాలర్‌షిప్పులు, నిధులు, పరిశోధనా సీట్ల సంఖ్య పెంచడం జెఎన్‌యూలో ముఖ్యమైన సమస్యలుగా ఉన్నాయి అని ఆమె తెలిపారు.
ఏంఏ రెండో సంవత్సరం చదువుతున్న అంజనా మాట్లాడుతూ ‘‘జేఎన్‌యూలోలో నాలుగేళ్ళ తరువాత ఎన్నికలు జరుగుతున్నాయి. మాకిప్పుడు నిజమైన జేఎన్‌యూ కనిపిస్తోంది. ఇది చూడటానికే మేం ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం’’ అని చెప్పారు.
జేఎన్‌యూ క్యాంపస్ తరహా రాజకీయాలే దేశమంతటా చూడాలనుకుంటున్నానని ఆమె తెలిపారు.

చర్చలో ఏం చెప్పారు?
జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ వేదికపై ప్రెసిడెంట్ అభ్యర్థుల చర్చలో వేడి వేడిగా సాగాయి.
సమాజ్‌వాదీ ఛత్రా సభకు చెందిన ఆరాధన యాదవ్ ముందుగా మాట్లాడుతూ ఎలక్టోరల్ బాండ్స్ ను లేవనెత్తారు. బెనారస్ యూనివర్సిటీలో జరిగిన సామూహిక అత్యాచారం, మనువాదం, యూనివర్సిటీలలో బీసీ టీచర్లను ఎంపిక చేయకపోవడంతోపాటు గాజాలో ప్రజల దుర్భర పరిస్థితుల గురించి కూడా మాట్లాడారు.
తరువాత ఆర్‌జేడీ స్టూడెంట్ ఆర్గనైజేషన్‌కు చెందిన అప్రోజ్ అలమ్ అన్సారీ మాట్లాడారు. ఈయన కూడా బీసీల సమస్యలను లేవనెత్తారు. దళితులు, మైనార్టీ విద్యార్థుల గురించి మాట్లాడారు. గాజా ప్రజల పోరాటానికి శాల్యూట్ చేశారు. కనిపించకుండా పోయిన జేఎన్‌యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ గురించి కూడా మాట్లాడారు.
బీఏపీఎస్‌ఏ అభ్యర్థి విశ్వజిత్ మాంజీ మాట్లాడుతూ చాలామంది విద్యార్థులకు ఈ ఎన్నికలు పండుగలా కనిపించినా బీఏపీఎస్‌ఏకు తన పోరాటాన్ని ముందకు తీసుకువెళ్ళడానికి ఇదో అవకాశమని చెప్పారు. ఆయన తన ప్రసంగాన్ని బిర్సాముండాకు నివాళులతో ప్రారంభించి మణిపుర్ హింస నుంచి సందేశ్‌ఖాలీ వరకు మాట్లాడారు.
ఏబీవీపీ అభ్యర్థి ఉమేష్ చంద్ర మాట్లాడుతూ తాను అభివృద్ధి రాజకీయాలు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. వచ్చ ఏడాదిలోపు యూనివర్సిటీలో చేయాల్సిన అభివృద్ధిపై ఓ బ్లూ ప్రింట్ ను ఆయన తీసుకువచ్చారు. విద్యార్థుల సౌకర్యాల కోసం అనేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. వామపక్ష సంఘాలు ఇక్కడ నియంతల్లా మారాయని, వారెలాంటి పనికొచ్చే పని చేయలేదని, జేఎన్‌యూను రాజకీయ వేదికగా మార్చుకున్నారని చెప్పారు. ఐదువందల ఏళ్ళ బానిసత్వాన్ని తుడిపేస్తూ శ్రీరాముడు అయోధ్యకు వచ్చాడని, అదే విధంగా రాముడి ఆశీర్వాదంతో జెఎన్‌యూ నుంచి వామపక్ష ఎర్ర బానిసత్వాన్ని రూపుమాపేందుకు వచ్చానని’’ చెప్పారు.
లెప్ట్ కూటమి అభ్యర్థి ధనుంజయ్ కుమార్ మాట్లాడుతూ ఉమర్ ఖలీద్, ఇతర జేఎన్‌యూ విద్యార్థుల పోరాటాలను గుర్తు చేశారు. మేమిక్కడకు వచ్చింది ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్, మిరాన్ హైదర్‌లను విడుదల చేయమని డిమాండ్ చేయడానికే. ఈ దేశంలో రాసిన రాజ్యాంగం పట్ల మాకు నమ్మకం ఉంది. అదెప్పటికి లౌకికంగానే ఉంటుంది’’ అని చెప్పారు.
‘‘మేం రాజ్యాంగాన్ని కాపాడటానికి పోరాడుతున్నాం. జేఎన్‌యూ విద్యాప్రమాణాలు ప్రపంచనికంతా తెలుసు. ఇక్కడి చర్చా సంస్కృతి, అందరిని కలుపుకుపోయే స్వభావం దీని సొంతం. కానీ ప్రభుత్వం జేఎన్‌యూను భ్రష్ఠు పట్టించాలని చూస్తోంది’’ అని ధనుంజయ్ కుమార్ తెలిపారు.

ఫొటో సోర్స్, ABVP
బరిలో ఎవరెవరు?
జేఎన్‌యూ ఎన్నికల బరిలో అధ్యక్ష స్థానానికి సహా మొత్తం నాలుగు పోస్టులకు 19మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రెసిడెంట్ పోస్టు కోసం 8మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నలుగురు వైస్ ప్రెసిడెంట్ కోసం, నలుగురు జనరల్ సెక్రటరీ కోసం, జాయింట్ సెక్రటరీ కోసం ముగ్గురు పోటీ చేస్తున్నారు.
2019 తరహాలోనే ఈసారి కూడా లెఫ్ట్ కూటమి ఏర్పాటైంది. ఇందులో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ), ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ), డెమొక్రాటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (డీఎస్ఎఫ్), ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) ఉన్నాయి.
లెఫ్ట్ కూటమి తరపున ధనంజయకుమార్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఉన్నారు. అభిజిత్ ఘోష్ (వైస్ ప్రెసిడెంట్), స్వాతి సింగ్ (జనరల్ సెక్రటరీ), సాజిద్ (జాయింట్ సెక్రటరీ) ఈ కూటమి తరపున ఫోటీ చేస్తున్నారు.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరపున ప్రెసిడెంట్‌గా ఉమేష్ చంద్ర అజ్మీరా, దీపక్ శర్మ వైస్ ప్రెసిడెంట్‌గా, అర్జున్ ఆనంద్ జనరల్ సెక్రటరీగా, గోవింద్ దంగీ జయింట్ సెక్రటరీగా పోటీపడుతున్నారు.
బిర్సా అంబేద్కర్ పూలే స్టూడెంట్ అసోసియేషన్ (బీఏపీఎస్ఏ) విశ్వజిత్ మాంజీని అధ్యక్షుడిగా నిలిపింది. మహ్మద్ అనాస్ వైస్ ప్రెసిడెంట్‌గా, ప్రియాన్షి ఆర్యా జనరల్ సెక్రటరీగానూ, రూపక్ కుమార్ జాయింట్ సెక్రటరీగా నిలబడ్డారు.
ఇక కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యుఐ, ఆర్జేడీ విద్యార్థి విభాగం ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ సమాజ్ వాదీ ఛాత్రా సభ కూడా యూనివర్సిటీ ఎన్నికలలో పోటీ చేస్తున్నాయి. జేఎన్‌యూ ఎన్నికలలో పాల్గొనడం సమాజ్ వాదీ ఛాత్రాకు ఇదే మొదటిసారి.
ఎన్‌ఎస్‌యుఐ నుంచి జైద్ రజా, ఆర్జేడీ నుంచి అప్రోజ్ అలమ్ అన్సారీ, సమాజ్‌వాడీ ఛాత్ర సభ నుంచి ఆరాధన యాదవ్ ప్రెసిడెంట్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.

ఫొటో సోర్స్, BBC/SERAJ ALI
ఏబీవీపీ దాహం తీరేనా?
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 2015 జేఎన్‌యూ ఎన్నికలలో జాయింట్ సెక్రటరీ పోస్టు గెలిచింది. అదే ఏడాది ప్రముఖ విద్యార్థి నాయకుడు కన్హయ కుమార్ జేఎన్‌యూ విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
2015లో ఏబీవీపీకి చెందిన సౌరభ్ శర్మ ఏఐఎస్ఏ అభ్యర్థిని 28 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ గెలుపుతో 14 ఏళ్ల తరువాత యూనివర్సిటీ సెంట్రల్ పానెల్లోకి తిరిగి ఏబీవీపికి చోటు దక్కింది.
2000 సంవత్సరంలో ఏబీవీపికి చెందిన మహాపాత్ర జేఎన్‌యూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఇప్పటికి 23 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ 23 ఏళ్ళలో ఏబీవీపి జేఎన్‌యూ సెంట్రల్ పానెల్లో ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. ఈ విషయాన్ని పక్కనపెడితే ఏటికేడాది ఏబీవీపీ బలపడుతూ వస్తోంది. ప్రస్తుతం జేఎన్‌యూలో మునెపన్నడూ లేనంత బలంగా ఉంది.
వామపక్ష విద్యార్థి సంఘాలు ఒకదానితో ఒకటి పోటీపడేవి. గతంలో ఈ సంఘాలు విడి విడిగా పోటీ చేసేవి.
ఏబీవీపీ తరపున జనరల్ సెక్రటరీగా ఎవరు పోటీచేస్తున్నారని అర్జున్ ఆనంద్‌ను అడిగితే ఈసారి సెంట్రల్ పానెల్‌లోని అన్ని స్థానాలలో ఏబీవీపీ గెలుస్తుందని చెప్పారు.
‘‘క్యాంపస్‌లో భావజాలపరమైన యుద్ధాలు ఉన్నాయని మేం నమ్ముతున్నాం. వీటి మధ్యన విద్యార్థుల సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోకూడదు. అందుకే ఏబీవీపీ విద్యార్థి సమస్యల పైనే ఎన్నికలలో పోటీ చేస్తోంది’’ అని చెప్పారు.
మరోపక్క జేఎన్‌యూ ను బయటి వ్యక్తుల దాడుల నుంచి మతశక్తుల నుంచి రక్షించాలని వామపక్ష విద్యార్థి కూటమి పదేపదే చెబుతోంది.
లెఫ్ట కూటమి ప్రెసిడెంట్ అభ్యర్థి ధనుంజయ్ కుమార్ మాట్లాడుతూ ‘‘జేఎన్‌యూ గురించి కొన్నేళ్ళుగా దుష్ప్రచారం సాగుతోంది. జేఎన్‌యూను అప్రదిష్ఠపాలు చేసేలా చిత్రాలు తీస్తున్నారు. అణగారిన వర్గాలు అతితక్కువ ఖర్చుతో ఇక్కడ చదువకోడాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ జీర్ణించుకోలేకపోవడమే దీనికి కారణం’’ అని చెప్పారు.
లెఫ్ట్ – రైట్ రాజకీయాలు కాకుండా క్యాంపస్‌లోని విద్యార్థులు బీఏపీఎస్‌ఏను బలమైనదిగా గుర్తిస్తున్నారని ఆ సంఘం చెబుతోంది.
ప్రెసిడెంట్ అభ్యర్థుల ప్రసంగాలు పూర్తయ్యాక మార్చి 22న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 24న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
మరి ఈ ఎన్నికలలో వామపక్ష విద్యార్థ సంఘాలు తమ పట్టును నిలుపుకుంటాయా, లేదంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జెండా ఎగరేస్తుందా?
ఇవి కూడా చదవండి:
- నకిలీ పోలీసుగా చలామణి అయిన మాళవిక అసలు పోలీసులకు ఎలా దొరికిపోయారంటే...
- బదాయు: ‘నా పిల్లలను చంపిన హంతకుడి సోదరుడు జావేద్‌ను ఎన్కౌంటర్ చేయొద్దు’ అని ఆ తండ్రి ఎందుకంటున్నారు...
- గర్భవతులను చేసే జాబ్: ‘మహిళతో ఒకరాత్రి గడిపితే రూ.5 లక్షలు, ఆమె ప్రెగ్నెంట్ అయితే రూ.8 లక్షల గిఫ్ట్...’అంటూ సాగే ఈ స్కామ్ కథ ఏంటి?
- గోల్డ్ లోన్ తీసుకునేప్పుడు మీరేమైనా నష్టపోతున్నారా... సరైన డీల్ పొందడం ఎలా?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














