కన్హయ్య కుమార్: 'ఉమర్ ఖాలిద్ అరెస్టును నేను ఖండించా' : BBC Exclusive

కన్హయ్య కుమార్

ఫొటో సోర్స్, TWITTER @kanhaiyakumar

దిల్లీ అల్లర్ల కేసులో విద్యార్ధి సంఘం మాజీ నేత ఉమర్ ఖాలిద్ అరెస్టుపై మౌనం వహిస్తున్నారన్న ఆరోపణలను జేఎన్‌యూ స్టూడెంట్‌ యూనియన్‌ మాజీ అధ్యక్షుడు, సీపీఐ నేత కన్హయ్య కుమార్‌ ఖండించారు.

కన్హయ్య కుమార్‌తోపాటు వివాదాస్పద నినాదాలు చేసినందుకు ఉమర్‌ ఖాలిద్‌పై కేసు నమోదైంది. అయితే ఇది ఒక్క ఉమర్‌ ఖాలిద్‌కు మాత్రమే సంబంధించిన అంశం కాదన్న కన్హయ్య దిల్లీ అల్లర్లు, బిహార్‌ రాజకీయాలు, వామపక్షాల ఐక్యత సహా పలు అంశాలపై బీబీసీతో మాట్లాడారు.

దేశంలో నిరసన గొంతుకలను నొక్కేసే ప్రయత్నం జరుగుతోందని కన్హయ్య కుమార్‌ ఆరోపించారు.

ఉమర్ ఖాలిద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉమర్ ఖాలిద్

ఉమర్‌ ఖాలిద్‌ అరెస్టుపై ఏమన్నారు?

“ప్రస్తుతం దేశంలో పాలన సాగిస్తున్న ప్రభుత్వం నిరసనకారులను నేరగాళ్లుగా నిరూపించే ప్రయత్నం చేస్తోంది. నకిలీ, రిపోర్టులు, తప్పుడు వీడియోలతో వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా ఉద్యమకారులపై దుష్ప్రచారం చేస్తోంది. దిల్లీ అల్లర్ల సమయంలో ప్రజలను కాల్చేయమని ప్రసంగాలు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు” అని కన్హయ్య ప్రశ్నించారు.

ఉమర్‌ ఖాలిద్‌ అరెస్టుపై న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తదితరులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి కన్హయ్య కుమార్‌ను కూడా ఆహ్వానించగా ఆయన రాలేదు. ‘నేను ఆ సమయంలో ఢిల్లీలో లేను, కావాలంటే నా ఫేస్‌బుక్‌ పోస్టులను చెక్‌ చేసుకోవచ్చు. అందులో నేను నిరసన కూడా తెలిపాను’’ అన్నారు.

ఉమర్‌ ఖాలిద్‌కు మద్దతిచ్చే విషయంలో పార్టీ వైఖరి స్పష్టంగా ఉందని చెప్పారు కన్హయ్య. “ మా పార్టీ రాష్ట్ర పతిని కలిసి ఈ అరెస్టుపై ఫిర్యాదు చేయాలని భావించింది. అయితే మరుసటి రోజే కాంగ్రెస్‌, ఆర్జేడీ, ఇతర లెఫ్ట్‌ పార్టీలు రాష్ట్రపతిని కలిసి ఈ అరెస్టుపై తమ వ్యతిరేకతను తెలిపాయి. అల్లర్ల కేసుల్లో దిల్లీ పోలీసులు విచారణ తీరు సరిగా లేదని ఫిర్యాదు చేశాయి’’ అని కన్హయ్య వెల్లడించారు.

కన్హయ్య కుమార్

ఫొటో సోర్స్, Getty Images

బిహార్‌ ఎన్నికలు ఇప్పుడు అవసరమా?

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం అంత మంచిదికాదని కన్హయ్య అభిప్రాయ పడ్డారు.

“ఈ పరిస్థితుల్లో ఎన్నికలు మేం కోరుకోవడం లేదు. భౌతిక దూరం పాటిస్తూ ఎన్నికల ప్రచారం ఎలా సాగించాలో ఎలక్షన్‌ కమీషనే చెప్పాలి. పోలింగ్‌ కేంద్రాల వద్ధ సురక్షితమైన వాతావరణం ఏర్పాటు చేయడం సవాలుతో కూడుకున్న వ్యవహారం. అయినా సరే మేం ఎన్నికలు నిర్వహించి తీరుతాం అంటే మేం కూడా ఎన్నికల్లో పాల్గొంటాం’’ అని కన్హయ్య అన్నారు.

బిహార్ ఎన్నికల్లో పోటీపై పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని కన్హయ్య చెప్పారు

ఫొటో సోర్స్, NurPhoto

ఫొటో క్యాప్షన్, బిహార్ ఎన్నికల్లో పోటీపై పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని కన్హయ్య చెప్పారు

వామపక్షాలు ఎందుకు వెనకబడుతున్నాయి?

గత బిహార్‌ ఎన్నికల్లో బాగా దెబ్బతిన్న కమ్యూనిస్టుల బలం ఇప్పుడు ఏవో కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. కమ్యూనిస్టులకు ఉన్న మాస్‌ బేస్‌ ఎందుకు కుచించుకుపోతోందన్న దానిపై కన్హయ్య స్పందించారు.

“ వామపక్షాలకు నిధుల కొరత ఉంది. మిగతా రాజకీయపార్టీల్లాగా లెఫ్ట్‌ పార్టీలు డబ్బులు సేకరించలేవు. ఉదాహరణకు బిహార్‌లో ఎన్నికల ప్రచారానికి బీజేపీ 70వేల ఎల్‌ఈడీ టీవీలు వాడుతోంది. అలాంటివి చేయడానికి మా దగ్గర డబ్బు లేదు. మెయిన్‌ స్ట్రీమ్‌ రాజకీయ పార్టీలు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాయి. మేం ఆ ఏర్పాట్లు చేసుకోలేకపోతున్నాం. దానికి చాలా డబ్బు కూడా కావాలి’’ అని కన్హయ్య వివరించారు.

రిజర్వేషన్‌లపై సీపీఐ వైఖరేంటి?

భారతీయ సమాజంలో రిజర్వేషన్లపై తమ వైఖరి స్పష్టంగా ఉందని కన్హయ్య అన్నారు. “ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి. శరీరంలోని అన్ని భాగాలకు సమానంగా ప్రాధాన్యత ఇచ్చినట్లే, రిజర్వేషన్ల విషయంలో కూడా వ్యవహరించాలి. ముక్కు, చెవులు మిగతా శరీర భాగాలకన్నా పొడవుంటే బాగుండదు. మొత్తం జనాభాలో ఒక సామాజిక వర్గం నిష్పత్తినిబట్టి రిజర్వేషన్లు కల్పించాలి’’ అన్నారు.

అగ్రవర్ణాల వారికి 10శాతం రిజర్వేషన్‌కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు.

కన్హయ్య కుమార్

ఫొటో సోర్స్, Getty Images

బిహార్‌ ఎన్నికల్లో కన్హయ్య పోటీ చేస్తారా?

బిహార్‌ ఎన్నికల్లో పోటీ చేయానికి కన్హయ్య సిద్ధంగా ఉన్నారా? ఇదే మాట అడిగినప్పుడు “ వ్యక్తిగతంగా నేనింకా పార్టీ అభ్యర్ధిని అనుకోవడం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు దానిపై మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నేను దానిని నిర్వర్తిస్తాను’’ అన్నారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)