బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన నేపథ్యంలో జామియా మిలియా యూనివర్సిటీ వద్ద పోలీసుల మోహరింపు

దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ చుట్టూ బుధవారం మధ్యాహ్నం 2.00 గంటల నుంచే భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.
‘ఇండియా: మోదీ క్వశ్చన్’ అనే బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు కొందరు విద్యార్థులు సిద్ధం కావడమే ఇందుకు కారణం. బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనకు అనుమతి లేదని యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ చెబుతోంది.
యూనివర్సిటీ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు.
యూనివర్సిటీ ప్రవేశ ద్వారం మూసివేశారు. విద్యార్థులను లోపలికి అనుమతించడం లేదు. రోడ్డుకు ఇరువైపులా పోలీసులు ఉన్నారు. వజ్ర వాహనం కూడా ఉంది.
వీధుల్లో గొడవ చేస్తున్న 13 మంది విద్యార్థులను నిర్బంధం లోకి తీసుకున్నట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐకి పోలీసులు తెలిపారు.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు అనుబంధంగా ఉండే విద్యార్థి సంస్థ ఎస్ఎఫ్ఐ, 'బీబీసీ డాక్యుమెంటరీ ఇండియా: మోడీ ది క్వశ్చన్'ను బుధవారం సాయంత్రం 6 గంటలకు జామియా మిలియా యూనివర్సిటీలో ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి పోస్టర్లు కూడా పెట్టింది.
యూనివర్సిటీలో గేట్ నంబర్ ఎనిమిది వద్ద ఎంసీఆర్‌సీ లాన్స్‌లో డాక్యుమెంటరీ ప్రదర్శన జరగాల్సి ఉంది. కానీ, యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ అందుకు అనుమతి ఇవ్వలేదు.
బీబీసీ బృందం జామియా యూనివర్సిటీకి వెళ్లినప్పుడు క్యాంపస్‌లో పూర్తి శాంతి నెలకొని ఉంది.
ఒక సెక్యూరిటీ గార్డు మమ్మల్ని చూసి "మీరు ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. డాక్యుమెంటరీ ప్రదర్శన ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కానీ, ఎక్కడా స్క్రీనింగ్ జరగట్లేదు" అని చెప్పారు.
డాక్యుమెంటరీ ప్రదర్శన నిర్వహణలో భాగం పంచుకున్న కొంతమంది విద్యార్థులను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

'జామియాను మిలిటరీ జోన్ చేసేశారు'
జామియాను మిలిటరీ జోన్‌గా మార్చారని, యాంటీ రైయట్ ఫోర్స్‌ను మోహరించారని క్యాంపస్ ఫాటర్నిటీ గ్రూపుకు చెందిన జామియా విద్యార్థి అల్ఫోజ్ అన్నారు.
"ప్రస్తుతం 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు నిర్థరణ అయింది. వాళ్లని ఎక్కడికి తీసుకెళ్తున్నారో పోలీసులు చెప్పడం లేదు. కస్టడీలోకి తీసుకున్న వారిలో ఎన్ఎస్‌యూఐకి చెందిన దివ్య త్రిపాఠి ఉన్నారు. ఫ్రాటర్నిటీ మూవ్‌మెంట్ జాతీయ కార్యదర్శి బషీర్, ఎస్‌ఎఫ్‌ఐకి చెందిన అజీజ్, నివేదియా కూడా ఉన్నారు. ఈ నలుగురినీ ఉదయం రోడ్డు మీదే అదుపులోకి తీసుకున్నారు" అని అల్ఫోజ్ చెప్పారు.
జామియాకి చెందిన మరో విద్యార్థి అబ్దుల్ మాట్లాడుతూ, “ప్రభుత్వం మా స్వేచ్ఛపై దాడి చేస్తోంది. డాక్యుమెంటరీ చూసిన తరువాత అది ఎలా ఉంది, ఎలా లేదు అన్నది మేం నిర్ణయించుకుంటాం. ప్రభుత్వం ఎందుకంత భయపడుతోంది?" అని ప్రశ్నించారు.
“మధ్యాహ్నం రెండు గంటల తరువాత స్క్రీనింగ్‌లో పాల్గొనని విద్యార్థులను కూడా లోపలికి అనుమతించలేదు. సినిమా ప్రదర్శన జరగలేదు. అల్లర్లు జరగలేదు. అయినా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు ఎందుకు భయపడడం? ఈ విశ్వవిద్యాలయం మహాత్మా గాంధీ, జాకీర్ హుస్సేన్‌ల కల. వారు బ్రిటిష్ వారితో విభేదించి ఈ విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు" అని జామియా విద్యార్థి మర్హబా అన్నారు.

ఫొటో సోర్స్, ANI
మోదీ మీద డాక్యుమెంటరీ
'ఇండియా: ది మోడీ క్వశ్చన్' పేరుతో బీబీసీ రెండు ఎపిసోడ్ల డాక్యుమెంటరీని రూపొందించింది. మొదటి భాగం జనవరి 17న బ్రిటన్‌లో ప్రసారమైంది. రెండవ భాగం జనవరి 24న విడుదలైంది.
బ్రిటిష్ విదేశాంగ కార్యాలయం నుంచి బీబీసీ సంగ్రహించిన ఒక నివేదిక ఆధారంగా ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. ఆ నివేదిక ఇంతకుముందు ఎక్కడా ప్రచురితం కాలేదు. డాక్యుమెంటరీ మొదటి భాగంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీలో ఎదుగుతున్న నరేంద్ర మోదీ ప్రారంభ రాజకీయ జీవితాన్ని చూపించారు.
2002లో గుజరాత్ అల్లర్లలో కనీసం 2000 మంది మరణించడంపై ప్రశ్నలు లేవనెత్తారు.
2002లో గుజరాత్‌లో హింసాత్మక వాతావరణం నెలకొనడానికి మోదీ ప్రత్యక్ష కారణమని బ్రిటిష్ విదేశాంగ కార్యాలయం నివేదిక పేర్కొంది.
గుజరాత్ అల్లర్ల విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను మోదీ చాలా కాలంగా తిరస్కరిస్తూ వచ్చారు.

బ్రిటిష్ విదేశాంగ కార్యాలయం కోసం ఈ నివేదికను రాసిన బ్రిటిష్ దౌత్యవేత్త మాత్రం నివేదికలో పేర్కొన్న అంశాలను సమర్థించారు.
కాగా, గుజరాత్ హింసాకాండలో మోదీ ప్రమేయం లేదని చెబుతూ, ఆయన్ను నిర్దోషిగా సుప్రీంకోర్టు ఇంతకుముందే ప్రకటించింది.
దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియా సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, "ఈ డాక్యుమెంటరీ ప్రధానమంత్రికి అపఖ్యాతిని అంటగట్టేందుకు రూపొందించిన కథనమని మేం భావిస్తున్నాం. పక్షపాతం, గతకాలపు వలసవాద మనస్తత్వం ఈ డాక్యుమెంటరీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిని రూపొందించిన ఏజెన్సీ విధానానికి, అపఖ్యాతిని అంటగట్టాలని చూస్తున్న వ్యక్తుల మనస్తత్వానికి ఈ డాక్యుమెంటరీ ప్రతిబింబం" అని ఆయన అన్నారు.
దీనిపై బ్రిటన్ ప్రధాని రిషి సునక్ మాట్లాడుతూ, "ఈ డాక్యుమెంటరీని వలసవాద మనస్తత్వంతో, దుష్ప్రచారాల కోసం రూపొందించారని ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఆరోపించారు. అయితే, క్షుణ్ణంగా పరిశోధన చేసిన తరువాత, తమ సంపాదకీయ ప్రమాణాల ప్రకారం దీన్ని రూపొమందించారని బీబీసీ చెబుతోంది" అన్నారు.
అంతకుముందు మంగళవారం దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో బీబీసీ డాక్యుమెంటరీ 'ఇండియా: ది మోడీ క్వశ్చన్' స్క్రీనింగ్ జరిగింది. ఈ డాక్యుమెంటరీని వీక్షించిన విద్యార్థులపై రాళ్లతో దాడి చేశారు. దాంతో, విద్యార్థులు జేఎన్‌యూ గేట్ వద్దకు చేరుకుని నినాదాలు చేశారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, కేరళలోని కొన్ని క్యాంపస్‌లలో కూడా విద్యార్థులు ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించగా, త్వరలో ఇతర యూనివర్సిటీ క్యాంపస్‌లలో కూడా ఈ వీడియోను ప్రదర్శిస్తామని విద్యార్థి సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి.
ఇవి కూడా చదవండి:
- భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీలో ఎవరెవరున్నారు? తొలి డ్రాఫ్ట్ రాసింది ఎవరు?
- శుభ్‌మన్ గిల్: మ్యాచ్ మ్యాచ్‌కు దూకుడు పెంచుతున్న యువ క్రికెటర్
- సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లూ... జర భద్రం
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు ఎందుకు ఇవ్వడం లేదు?
- 8 ఏళ్ల వయసులోనే సన్యాసినిగా మారిన వజ్రాల వ్యాపారి కూతురు...ఈ నిర్ణయంపై ఎవరేమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














