ముస్లిం మహిళకు ఇల్లు ఇవ్వడంపై నిరసనలు ఎందుకు?: గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, తేజస్ వైద్య
- హోదా, బీబీసీ ప్రతినిధి, వడోదర నుంచి
‘‘సంస్కారవంతమైన నగరంలోకి మీకు స్వాగతం’
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉండే వడోదర నగరంలో ఎక్కడ చూసినా ఇలాంటి బోర్డులే కనిపిస్తాయి.
ఇక్కడి హరానీ ప్రాంతంలోని మోట్‌నాథ్ రెసిడెన్సీ అనే కాలనీ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది.
మోట్‌నాథ్ రెసిడెన్సీ కాలనీలో మొత్తం 642 ఫ్లాట్లు ఉన్నాయి. అందులో ఒక ఫ్లాట్‌ను ముఖ్యమంత్రి ఆవాస్ యోజన కింద ఒక ముస్లిం మహిళకు కేటాయించారు.
దీన్ని వ్యతిరేకిస్తూ కాలనీలోని 32 మంది కొన్ని రోజుల ముందు నిరసన వ్యక్తం చేశారు.
ముస్లిం మహిళకు ఫ్లాట్ కేటాయింపును రద్దు చేయాలని పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ కాపీ బీబీసీకి లభించింది.
అల్పాదాయ వర్గాల కోసం ప్రభుత్వ పథకం కింద 2018లో ముస్లిం మహిళకు కేటాయించిన ఇంటిని రద్దు చేసి, ఆమెకు మరోచోట ఇల్లు కేటాయించాలంటూ జూన్ 5న అక్కడి నివాసితులు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవడం కోసం బీబీసీ బృందం మోట్‌నాథ్ రెసిడెన్సీకి వెళ్లింది.


‘కాలనీలో అందరూ హిందువులే.. ’
మోట్‌నాథ్ సొసైటీ ప్రవేశ ద్వారం దగ్గర రాముడి చిత్రం ఉంది. అన్ని ఇళ్ల మీద, కిటికీలపైన ఎక్కడ చూసినా కాషాయ జెండాలే కనిపిస్తాయి.
సొసైటీలోకి అడుగుపెట్టగానే, గేటు దగ్గర సొసైటీ అధ్యక్షుడు భవన్‌భాయ్ జోషి మాకు కలిశారు.
‘‘ఇక్కడున్న వాళ్లంతా హిందువులే. అయితే, ఒకే ఒక్క ఇల్లును ముస్లింలకు ఎందుకు కేటాయించారో అనే అంశంపై విచారణ జరిపించాలి’’ అని ఆయన అన్నారు.
ఇదంతా వడోదర మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) తప్పిదమేనని ఆయన అంటున్నారు.
నిబంధనల ప్రకారమే మహిళలకు ఇళ్లను కేటాయించామని, ఏ ప్రభుత్వ పథకంలోనూ మతం ఆధారంగా వివక్ష ఉండదని వడోదర మున్సిపల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది.
ఈ మొత్తం ఘటనకు కేంద్రంగా ఉన్న ముస్లిం మహిళతో బీబీసీ మాట్లాడింది.
‘‘గత ఆరేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. సొంత ఇల్లు ఉన్నప్పటికీ నా తండ్రి ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది’’ అని ఆమె అన్నారు. ఈ అంశంపై మరింత వివరంగా మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు.
సామాజిక కార్యకర్తలు ఈ మొత్తం వ్యవహారాన్ని ‘‘నగర ప్రతిష్టను దిగజార్చడం’’, 'సామాజిక ఐక్యతా స్ఫూర్తికి వ్యతిరేక చర్య’’ అని పిలుస్తున్నారు.

‘ముస్లిం మహిళకు మరో చోట ఇల్లు ఇవ్వాలి..’
ముస్లిం మహిళకు ఇంటిని కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నది సొసైటీలోని ఈ 32 మంది సభ్యులు మాత్రమే కాదని, చాలా మంది ప్రజలు దీన్ని ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నారని బీబీసీకి భవన్‌భాయ్ జోషి చెప్పారు.
ఆయన వ్యాఖ్యలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేకపోయింది.
ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని సొసైటీ అధ్యక్షులు డిమాండ్ చేస్తున్నారు.
ముస్లిం మహిళకు ఇల్లు ఇవ్వడంపై నిరసన తెలిపిన అక్కడి నివాసితులు తమ పిటిషన్‌లో ఇలా రాశారు.
‘‘హిందూ జనాభా ఉండే ప్రశాంతమైన ప్రదేశం హర్నీ ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, మా రెసిడెన్సీలో ఒక ముస్లిం కుటుంబానికి ఇల్లు కేటాయించారు. ఇక్కడి 461 ఇళ్లను హిందువులకు కేటాయించారు. ఇక్కడేదో పెద్ద తప్పు జరిగినట్లు అనిపిస్తోంది’’ అని పిటిషన్‌లో వారు పేర్కొన్నారు.
మొత్తం సంఘటన, కాలనీవాసుల నిరసన గురించి బీబీసీతో వీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నీలేశ్ పర్మార్ మాట్లాడారు.
“ఈ కాలనీలోని ఇళ్ల కేటాయింపు కోసం 2017లో డ్రా తీశారు. 2018లో ఇళ్లను కేటాయించారు. అప్పట్లో ఇక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకపోవడంతో ఇళ్ల కేటాయింపులో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాలేదు’’ అని నీలేశ్ చెప్పారు.
మతం ప్రాతిపదికన ప్రభుత్వం కేటాయింపులు చేయదని ఆయన అన్నారు.
‘‘ప్రభుత్వ పథకాలేవీ మతంపై ఆధారపడవు. నిబంధనల ప్రకారమే కేటాయింపు జరిగింది. అయితే, ఇప్పుడు ఈ ప్రాంతం డిస్ట్రబ్డ్ ఏరియా యాక్ట్ కింద ఉంది. కాబట్టి ఇప్పుడు కేటాయింపుల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది" అని నీలేశ్ అన్నారు.
వీఎంసీ అధికారి వాదనను సొసైటీ అధ్యక్షుడు జోషి వ్యతిరేకించారు.
మోట్‌నాథ్ రెసిడెన్సీకి చెందిన మరికొందరు, ముస్లిం మహిళకు వేరే చోట ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఒక్క కారణంతో ఈ ప్రాంతంలో ముస్లింల సంఖ్య, వారి జోక్యం పెరుగుతాయని పేరు చెప్పడానికి ఇష్టపడని, అదే సొసైటీకి చెందిన ఒక వ్యక్తి అన్నారు.
“ముస్లింల ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉంటాయి. అందుకే వారికి ఇక్కడ ఇళ్లు ఇవ్వకూడదు’’ అని కూడా వ్యాఖ్యానించారు.

‘సమాజం మమ్మల్ని అంగీకరించడం లేదు’
ఈ మొత్తం ఘటనపై ముస్లిం మహిళ తండ్రి విచారం వ్యక్తం చేశారు.
‘‘ఇలాంటి ఘటన జరగడం బాధాకరం. మా కుటుంబాన్ని శిక్షిస్తున్నారు. మేం సమాజంతో కలిసి బతకాలనుకుంటున్నాం. కానీ, ఈ సమాజం మమ్మల్ని అంగీకరించడం లేదు. ఇది చాలా విషాదకరం’’ అని అన్నారు.
అయితే, ముస్లిం మహిళ తనకు కేటాయించిన ఇంట్లో ఉండొచ్చని సొసైటీ అధ్యక్షుడు భవన్‌భాయి జోషీ అన్నారు.
"మేం కార్పొరేషన్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ ఇల్లు ఆ సోదరిది. ఆమె అందులో నివసించవచ్చు. ఆమెను మేం ఎప్పుడూ ఆపలేదు.
2018లో ఇల్లు రిజిస్టర్ అయినప్పటి నుంచి ఆ ముస్లిం మహిళ తన కుటుంబంతో కలిసి ఇక్కడ నివసించడానికి ఎప్పుడూ రాలేదు. ఆమె కార్పొరేషన్‌కు రూ.50 వేలు పన్ను కూడా చెల్లించారు. ఈ ఇల్లు ఆమె పేరు మీద రిజిష్టర్ అయి ఉంది’’ అని భవన్‌బాయి అన్నారు.
బీబీసీ బృందం అక్కడికి వెళ్లినప్పుడు ఆ ఇంటికి తాళం వేసి ఉంది.

డిస్ట్రబ్డ్ ఏరియా యాక్ట్ అంటే ఏంటి?
డిస్ట్రబ్డ్ ఏరియా యాక్ట్, మైనారిటీ హక్కులకు సంబంధించి 2018లో గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అహ్మదాబాద్ న్యాయవాది దానిష్ కుర్షీ బీబీసీతో ఈ అంశం గురించి మాట్లాడారు.
“రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైనా ఇల్లు కేటాయించినప్పుడు దానిపై మతపరమైన ఆంక్షలు ఉండకూడదు. ప్రభుత్వం ఏ మతానికి చెందినది కాదు. అయినప్పటికీ దీనిపై ఎవరైనా వివాదం చేస్తే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది’’ అని ఆయన అన్నారు.
ఒక సాంస్కృతిక నగరంగా వడోదర ప్రతిష్టను ఈ ఘటన దిగజార్చుతుందని వడోదరకు చెందిన ప్రొఫెసర్ భరత్ మెహతా అభిప్రాయపడ్డారు.
సాంఘిక వివక్షను తొలగించే ఒక పరిష్కారాన్ని భరత్ మెహతా సూచించారు.
"నా అభిప్రాయం ప్రకారం, ఆ కాలనీలో ఒకటి కాదు, పది ముస్లిం కుటుంబాలకు ఇళ్ళు కేటాయించాలి. ఎందుకంటే, ఇలా చేయడం ద్వారా మాత్రమే ఒక భారతదేశం ఏర్పడుతుంది. ఇలాంటి చిన్న చిన్న భారతదేశాలు ఏర్పడితేనే తేడాలు మాయం అవుతాయి’’ అని అన్నారు.
అదే సొసైటీలో నివసించే నమ్రతా పర్మార్ అనే మహిళ బీబీసీతో మాట్లాడుతూ, “హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అందరూ కలిసి జీవించినప్పుడే సంస్కృతి వర్ధిల్లుతుంది. పాఠ్యపుస్తకాల్లో పిల్లలకు బోధించేది ఇదే. నిజం చెప్పాలంటే సమాజంలో మనం జీవించే తీరునే పాఠ్యపుస్తకాల్లో రాశారు’’ అని ఆమె అన్నారు.
వడోదరలోని హథీఖానా అనే ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువ. ఇక్కడ నివసిస్తున్న ఇస్మాయిల్ పటేల్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
"మా ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల హిందువులు నివసిస్తున్నారు, వ్యాపారం చేస్తారు. మేం ఒకరితోఒకరం ప్రేమగా ఉంటాం. ఇక్కడ హిందూ వ్యాపారులు కూడా ఉన్నారు. వారి దుకాణ యజమానులు ముస్లింలు. మేమంతా కలిసి జీవిస్తాం. ప్రతీ ఒక్కరి మతాన్ని గౌరవిస్తాం.
మోట్‌నాథ్ ఏరియాలో ముస్లిం మహిళకు హిందూ కాలనీలో ఇల్లు దొరికింది. సమాజం దీన్ని అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి. ప్రజలు ఒకరినొకరు స్వాగతించాలి. ముస్లిం సమాజం కూడా ఇలాంటి వైఖరికి దూరంగా ఉండాలి" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల తేడా ఎంత? అది ఫలితాలను ఎలా మార్చేసింది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














