అల్కా యాజ్ఞిక్: ఈ సింగర్‌కు హఠాత్తుగా వినికిడి లోపం ఎందుకు వచ్చింది, అసలు ఈ సమస్య ఎలా వస్తుంది?

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రముఖ నేపథ్య గాయని అల్కా యాజ్ఞిక్ తన ఆరోగ్యం గురించి ఇన్‌స్టా పోస్టులో కీలకమైన విషయం వెల్లడించారు. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా తాను వినికిడి శక్తిని కోల్పోయినట్టు చెప్పారు.
‘‘కొన్ని వారాల కిందట, నేను విమానం దిగి బయటకు రాగానే హఠాత్తుగా నాకు ఏమీ వినపడటం లేదన్న విషయం అర్ధమైంది. ఈ సంఘటన జరిగిన అనేక వారాల తర్వాత కూడా నా క్షేమసమాచారాల గురించి అడుగుతున్న నా మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ దీనికి కారణాలను వివరించాలనుకుంటున్నాను.’’ అంటూ తన అభిమానులు, ఫాలోయర్స్, స్నేహితులనుద్దేశించి సింగర్ అల్కా యాజ్ఞిక్ ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు.
ఆ పోస్టులో అల్కా మరింతగా వివరణ ఇస్తూ ‘‘నాకు చాలా అరుదైన సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ (వినికిడి లోపం) ఏర్పడిందని మా డాక్టర్ నిర్ధరించారు. ఇది వైరల్ అటాక్ వల్ల వచ్చింది. ఇది నాకు ఊహించని షాక్. నేను ఇప్పటికీ ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఎక్కువ శబ్దంతో సంగీతాన్ని వినడం, హెడ్‌ఫోన్‌లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి జాగ్రత్తగా ఉండమని నా అభిమానులను హెచ్చరిస్తున్నాను. నా వృత్తిలో ఉన్న ఇలాంటి ప్రమాదాల గురించి ఏదో ఒక రోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీ ప్రేమాభిమానాలతో నేను ఈ సమస్య నుంచి బయటపడి మళ్లీ మీకు చేరువకాగలనని ఆశిస్తున్నాను. ఈ కష్ట సమయంలో మీ సహకారం చాలా కీలకమైంది.’’ అని రాశారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటే..
చెవి లోపలి భాగానికి గాయం కావడం, లేదంటే దెబ్బతినడం వల్ల ఈ విధమైన వినికిడి లోపం తలెత్తుతుందని అమెరికన్ స్పీచ్ లాంగ్వేజ్ హియరింగ్ అసోసియేషన్ వెబ్‌సైట్ తెలిపింది.
చెవి లోపలి భాగంలోని నరాలకు ఏదైనా అడ్డు రావడం వల్ల మెదడుతో కమ్యూనికేషన్‌లో అవరోధాలు ఏర్పడతాయి. కొందరికి దీని వల్ల చిన్నచిన్న శబ్దాలను వినడం కష్టమవుతుంది. పెద్ద శబ్దాలూ కొన్నిసార్లు అస్పష్టంగా వినిపిస్తాయి.
ఈ రకమైన లోపం చాలాసార్లు శాశ్వతంగా ఉంటుంది. ఇది మందులకు గానీ, శస్త్ర చికిత్సకు గానీ లొంగదు.
ఇలాంటి వినికిడి లోపాలకు హియరింగ్ ఎయిడ్ లాంటి సాధానాలు అవసరమవుతాయి.
అనారోగ్యం, వంశపారంపర్యం, వృద్ధాప్యం, తలకు దెబ్బతగడం, చెవి అంతర్ నిర్మాణంలో లోపాలు, పేలుళ్ళు, భారీ శబ్దాలు వినడం లాంటి కారణాల వల్ల ఈ రకమైన వినికిడి లోపం తలెత్తుతుంది.

కారణమేంటి?
వినికిడి లోపం గురించి అర్థం కావాలంటే ముందుగా చెవినిర్మాణాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని ఈఎన్‌టీ స్పెషలిస్ట్ డాక్టర్ నీతా ఘాటే తెలిపారు.
చెవిలో బయటి చెవి, మధ్య చెవి, అంతర్ చెవి అని మూడుభాగాలు ఉంటాయి.
బయటి చెవిలో చెవిడొప్ప, శ్రవణ మార్గం, కర్ణభేరీ ఉంటాయి.
మధ్య చెవిలో మూడు ఎముకలు ఒక దానితో ఒకటి కలిసి గొలుసులా అమరి ఉంటాయి.
అంతర్ చెవిలో సెన్సరీ హెయిర్ సెల్స్, మెదడుకు ప్రయాణించే శ్రవణ నాడి ఉంటాయి.
‘‘శబ్దం ఏర్పడినప్పుడు ధ్వనితరంగాలు ఏర్పడతాయి. వాటికి బాహ్య చెవిలోని కర్ణభేరి కంపించి మధ్య చెవిలోని ఎముకల గొలుసుకు చేరి అక్కడి నుంచి అంతర్ చెవికి చేరి మెదడుకు చేరుకునే విద్యుత్ సంకేతాలుగా మారడం వల్ల ఆ శబ్దాన్ని మనం వినగలుగుతాం.’’ అని నీతా ఘాటే వివరించారు.
లోపలి చెవి కణాలు, లేదా నరాలు దెబ్బతిన్నప్పుడు ఏర్పడే వినికిడి లోపాన్ని సెన్సరి న్యూరల్ హియరింగ్ లాస్ అంటారని ఆమె తెలిపారు.
వినికిడి లోపానికి వివిధ కారణాలున్నాయన్న డాక్టర్ నీతా, అవేంటో వివరించారు.
- కొన్నిసార్లు చెవుడు జన్యుపరంగా వస్తుంది
- వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా ఆకస్మిక చెవుడు ( సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ ) వస్తుంది
- గర్భధారణ సమయంలో తల్లికి అధిక రక్తపోటు ఉంటే, కొన్ని అంటువ్యాధులు (ఉదాహరణకు-తట్టు, ఆటలమ్మ) లేదా ప్రసవ సమయంలో సమస్యలు ఉంటే, నవజాత శిశువుకు చెవుడు రావచ్చు
- ఎక్కువ శబ్దం వచ్చే ప్రదేశాలలో పనిచేసే వ్యక్తులకు సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ రావచ్చు
- వయసు పెరిగే కొద్దీ వినికిడి నరాలు బలహీనపడటం వల్ల కూడా చెవుడు రావచ్చు
- ఇన్ఫెక్షన్, ప్రమాదాల వల్ల చెవుడు రావచ్చు
దీనితో పాటు కొన్ని సంవత్సరాల పాటు ఈ క్రింది పరిస్థితులను ఎదుర్కోవడం వల్ల సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ సంభవించవచ్చు.
- శబ్ద కాలుష్యం
- బిగ్గరగా పాడడం
- నిరంతరం ఇయర్‌ఫోన్‌లతో వినడం
రైలులోనో, బస్సులోనో, వీధిలోనో నడిచేటప్పుడు ఇయర్‌ఫోన్‌లు పెట్టుకుంటే చుట్టూ అప్పటికే పెద్ద శబ్దాలు ఉంటాయి. దాంతో సౌండును మరింత పెద్దగా పెట్టుకుని వింటుంటాం. ఇది వినికిడి సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
‘‘మనకు ఒక చెవిలో వినికిడి లోపం ఉన్నా చాలాసార్లు దాన్ని గుర్తించలేం. ఎందుకంటే మరొక చెవి బాగానే వినిపిస్తుంది కాబట్టి."అని నీతా చెప్పారు.
‘‘అందుకే చెవిలో ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. వినికిడి శక్తిని కొలిచేందుకు కొన్ని వినికిడి పరీక్షలు చేసి, ఎంత వినికిడి లోపం ఉందనే దానిని బట్టి చికిత్స ఉంటుంది.’’ అని ఆమె తెలిపారు.
వినికిడి లోపం లక్షణాలను విస్మరించకూడదని ఆమె నొక్కి చెప్పారు. ఇంట్లోని వారు ఎవరైనా ఎప్పడూ టీవీ సౌండ్ పెద్దగా పెట్టుకుని చూస్తున్నారంటే వారికి వినికిడి సమస్య పరీక్ష చేయించడం ఉత్తమం.
వినికిడి లోపం ఉన్న వాళ్లలో మరొక సంకేతం ఏమిటంటే, అలాంటి వ్యక్తులు శబ్దాలను వినగలరు, కానీ పదాలను అర్థం చేసుకోలేరు.
ఈ లక్షణాలన్నింటినీ గమనిస్తూ, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ నీతా ఘాటే అన్నారు. వినికిడి సమస్యలకు సకాలంలో గుర్తించగలిగితేనే ఎలాంటి చికిత్స చేయాలో నిర్థరించవచ్చంటారు డాక్టర్ నీతా.
ఇవి కూడా చదవండి:
- ఎన్విడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎలా మారింది, మైక్రోసాఫ్ట్, యాపిల్ కంపెనీలను అధిగమించడానికి కారణమేంటి?
- మెదక్: బక్రీద్ సందర్భంగా ఇక్కడ జరిగిన గొడవేంటి? ఎందుకు జరిగింది?
- రుషికొండ ‘రహస్య’ భవనాల్లో ఏముందంటే?
- పుతిన్‌కు ఘనస్వాగతం పలికిన కిమ్ జోంగ్ ఉన్.. అసలు ఉత్తర కొరియాకు పుతిన్ ఎందుకు వెళ్లారు? 3 ప్రశ్నలు, సమాధానాలు
- టీ20 వరల్డ్‌కప్: సూపర్-8 రౌండ్ పోటీలు ఎలా నిర్ణయించారు? సెమీస్, ఫైనల్లో వర్షం పడితే విజేతను ఎలా నిర్ణయిస్తారు?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















