‘క్యాండీ’ కోసం యుక్రెయిన్ సైనికులు ఆన్‌లైన్‌లో ఎందుకు సెర్చ్ చేస్తున్నారు?

ఫొటో సోర్స్, SERGEY FLASH
- రచయిత, ఒలేగ్ చార్నిష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
యుద్ధానికి వెళ్లే ముందు ఏ యుక్రెయిన్ సైనికుడినైనా ఏం కావాలని అడిగితే, వారి నుంచి ఎక్కువగా 'క్యాండీ' అని సమాధానం వస్తుంది. అయితే, ఇక్కడ క్యాండీ అంటే స్వీట్ కాదు. అది చేతిలో సులభంగా ఇమిడిపోయే ఒక చిన్న ప్లాస్టిక్ పెట్టె. దీనిలో ఒక స్క్రీన్, యాంటెన్నా ఉంటాయి.
ఈ పరికరం పేరు వింతగా అనిపించొచ్చు కానీ దాని పనితీరు యుక్రెయిన్ సైన్యం నుంచి ఎన్నో ప్రశంసలందుకుంది. యుక్రెయిన్ సైనికులు యుద్దానికి వెళ్లే ముందు ఎంత ధరైనా చెల్లించి, దానిని కొనడానికి ప్రయత్నిస్తారు.
ఇంతకీ క్యాండీ అంటే ఏంటి? డ్రోన్ డిటెక్టర్.
ఈ ‘క్యాండీ' ఎక్కడ దొరుకుతుందో చెప్పాలంటూ...యుక్రెయిన్ సైనికుల నుంచి ప్రతిరోజూ సోషల్ మీడియాలో వందలాది అభ్యర్థనలు వస్తున్నాయి. యుక్రెయిన్‌లో దీని పేరు సుకోరోక్.
యుక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా నిఘా డ్రోన్‌ల వినియోగం కారణంగా రోజురోజుకు ఈ పరికరానికి ప్రాధాన్యత పెరుగుతోంది. విమానాలు, వాయు రక్షణ వ్యవస్థలు, బాలిస్టిక్ క్షిపణులు వంటి వాటిని లక్ష్యంగా చేసుకోవడానికి రష్యా డ్రోన్లను ఉపయోగిస్తుంది.
అటువంటి పరిస్థితిలో, యుక్రెయిన్ సాయుధ దళాల సైనికులు తమ పైన ఎగురుతున్నది రష్యన్ డ్రోనా, కాదా? అని గుర్తించడం చాలా ముఖ్యం.


ఫొటో సోర్స్, GENERAL STAFF OF UKRAINE
డ్రోన్ డిటెక్టర్ ప్రయోజనం ఏమిటి?
యుద్ధంలో పోరాడుతున్న సైనికులకు డ్రోన్ డిటెక్టర్ (క్యాండీ) అనేది చావు, బతుకుల మధ్య వ్యత్యాసంగా ఉంటుంది. ఈ పరికరం డ్రోన్ ఉనికిని పసిగడుతుంది. సైన్యం తన స్థానాన్ని మార్చుకోవడానికి లేదా డ్రోన్ లక్ష్యంగా చేసుకున్న వాహనంలో కూర్చున్న వ్యక్తులు దాని నుంచి తప్పించుకునేలా ఇది సమాచారం అందిస్తుంది.
యుక్రెయిన్ సైన్యం బెటాలియన్ కమాండర్ నికోలాయ్ కొలెస్నిక్‌కు ఒకసారి ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
వాహనంలో ఉంచిన 'క్యాండీ' సిగ్నల్స్ ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు నికోలాయ్, ఆయన బృందం యుద్ధ క్షేత్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు.
వాహనాన్ని రష్యన్ లాన్సెట్ డ్రోన్ తనను ఢీకొట్టడానికి కొన్ని సెకన్ల ముందు కారు నుంచి బయటకు దూకగలిగానని నికోలాయ్ గుర్తుచేసుకున్నారు.
‘’మేం కారు నుంచి బయటకు దూకిన వెంటనే డ్రోన్ దాడి జరిగింది. కాసేపటికే మరో డ్రోన్ దాడి చేసింది. ఇది మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. అదృష్టం ఏంటంటే మేం ప్రాణాలతో బయటపడ్డాం." అని నికోలాయ్ తెలిపారు.
ఇలాంటి పరికరం ప్రతి సైనికుడి వద్ద, ప్రతి వాహనంలో ఉండాలని, ఇది నిజంగా ప్రాణాలను కాపాడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
క్యాండీ అనేది నూటికి నూరు శాతం సరైన పరికరం కాకపోవచ్చు. కానీ, యుక్రెయిన్ సైన్యానికి ఇది సులువైన పరిష్కారమని మిలిటరీ రేడియో టెక్నాలజీ రంగంలో నిపుణులు, కన్సల్టెంట్ అయిన సెర్గీ బెస్క్‌స్టోనోవ్ చెప్పారు.
బీబీసీ యుక్రెయిన్ సర్వీస్‌తో సెర్గీ మాట్లాడుతూ...సైన్యానికి డ్రోన్ డిటెక్టర్ల సరఫరా చాలాకాలంగా పెండింగ్‌లో ఉందని, సరిహద్దులోని యుక్రెయిన్ సాయుధ దళాలను రష్యా డ్రోన్‌లు తరచుగా వెంటాడుతున్నాయని అన్నారు.
"మనపై చాలాసేపు ఒక 'వింగ్' (విమానం లాంటి డ్రోన్) తిరుగుతున్నట్లు కనిపిస్తే, దాడి జరగబోతోంది అని అర్ధం చేసుకోవాలి. జాపోరోజీలోని ఒక గ్రామంలో 128వ బ్రిగేడ్ సైనికులపైనా, హెలీకాప్టర్లపైనా రష్యా ఇలాగే దాడి చేసింది." అని సెర్గీ అన్నారు.

ఫొటో సోర్స్, BBC/LEE DURANT
'క్యాండీ మోగితే ప్రమాదమున్నట్లే'
సెర్గీ చెప్పినదాని ప్రకారం గూఢచారి డ్రోన్ కనిపిస్తే ఏం చేయాలనేదానికి కొన్ని నియమాలు ఉన్నాయి.
ఉదాహరణకు, యుద్ధక్షేత్రంలో ఉన్న పదాతి దళ సైనికుడు డ్రోన్‌ను చూడగానే కదలకుండా ఉండిపోవాలి. అదేవిధంగా సైనిక సామగ్రిని తీసుకువెళ్ళే వాహనమైతే డ్రైవర్ వేగాన్ని పెంచాలి. తద్వారా క్షిపణి వారిని టార్గెట్ చేసుకోలేదు. లాన్సెట్ డ్రోన్ ఉన్నట్లు క్యాండీ సిగ్నలిస్తే, సైనికులు తమ వాహనాన్ని వదిలి పారిపోవాలి. చిన్న డ్రోన్ కనిపిస్తే, సైనికుడు దాక్కోవాలి లేదా డ్రోన్‌ను పేల్చడానికి ప్రయత్నించాలి.
అయితే, సంక్లిష్టమైన స్పెక్ట్రమ్ మానిటర్లు సాధారణ సైనికులకు తగినవి కావని సెర్గీ అభిప్రాయపడ్డారు. శత్రువు డ్రోన్ దగ్గరికి వచ్చినప్పుడు 'క్యాండీ' వంటి సాాదాసీదా పరికరం వారికి అవసరన్నారు.
"సైనికులకు సులువుగా ఉండాలి: ఆ 'క్యాండీ' మోగితే ప్రమాదం పొంచి ఉందని అర్థం; అది మోగకపోతే, అంతా బాగానే ఉందని అర్థం." అని సెర్గీ అన్నారు.

ఫొటో సోర్స్, UNIT.CITY
సైన్యం నుంచి భారీగా ఆర్డర్లు
దిమిత్రి సెలన్ అనే యుక్రెయిన్ ప్రోగ్రామర్ 'క్యాండీ'ని కనిపెట్టారు. ఆయన చాలాకాలంగా లండన్‌లో నివసిస్తున్నారు.
యుద్ధ పరికరాలలో డ్రోన్ డిటెక్టర్లు ఇప్పుడు చాలా కామన్. సాధారణంగా ఇది ఫ్రీక్వెన్సీని విశ్లేషించడం ద్వారా డ్రోన్ ఉనికిని గుర్తించే పెద్ద, ఖరీదైన స్పెక్ట్రోమీటర్. అయితే యుద్ధ సమయంలో దీనిని ఉపయోగించడం మామూలు సైనికుడికి అంత సులభం కాదు.
డ్రోన్ డిటెక్టర్ అనేది ప్రతి సైనికుడు తనతో తీసుకెళ్లగల, సులభంగా ఉపయోగించగల, చవకైన పరికరం అయి ఉండాలని దిమిత్రి సెలన్ సూచిస్తున్నారు.
'క్యాండీ' మొదటి మోడల్ 2022లో తయారైంది.
కొత్త పరికరానికి 'క్యాండీ' అనే పేరు ఎలా పెట్టారో దిమిత్రి వివరిస్తూ.. "నేను మొదటి నమూనా సాధారణ కంటైనర్ మాదిరిగా వస్తుందని ఎదురుచూశా. కానీ, ప్లాస్టిక్ షుగర్ కంటైనర్ నమూనా కనిపించింది" అని అన్నారు. ఈ పరికరానికి పేరు రావడానికి కారణమదేనని తెలిపారు దిమిత్రి.
యుక్రెయిన్ సైనికులలో డిటెక్టర్ త్వరగా ప్రాచుర్యం పొందిందని, దాని కోసం పెద్ద సంఖ్యలో ఆర్డర్లు రావడం ప్రారంభమైందని దిమిత్రి చెప్పారు.
'క్యాండీ' అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది తేలికైనది, చౌకగానూ ఉంటుంది. ప్రస్తుతం, డ్రోన్ డిటెక్టర్ ధర 2,400 రవెన్నాలు అంటే దాదాపు 5,000 రూపాయలకు సమానం.

ఫొటో సోర్స్, FACEBOOK MYKOLA KOLESNYK
'క్యాండీ' ఎలా పని చేస్తుంది?
'క్యాండీ' పని చేసే విధానం చాలా సులభం. ప్రతి డ్రోన్, ఆపరేటర్ కన్సోల్‌లు రేడియో తరంగాల ద్వారా అనుసంధానమై ఉంటాయి.
వీడియో, టెలిమెట్రీ సిగ్నల్‌ల ద్వారా డ్రోన్ స్థితికి సంబంధించిన సమాచారాన్ని దాని ఆపరేటర్‌కు అందించేటప్పుడు డ్రోన్‌కు ఏ దిశలో కదలాలనే సూచనలను రిమోట్ కంట్రోల్ అందిస్తుంది.
దిమిత్రి సెలిన్ ప్రకారం, సిగ్నల్ అన్ని దిశలలో ప్రయాణిస్తున్నందున వీడియో, టెలిమెట్రీ స్ట్రీమ్‌లు లేదా వాటిలో కనీసం ఒకదానిని గుర్తిస్తాయి.
"మేం ఆపరేటర్ కన్సోల్‌లో ఉన్న అదే రిసీవర్‌ని ఉపయోగిస్తాం, సిగ్నల్ పారామీటర్లను సరిగ్గా ఎంచుకుంటే, మనం దానిని సులభంగా సంగ్రహించగలం" అని దిమిత్రి చెప్పారు.
ఆ పారామీటర్ల ఆధారంగా అది ఎలాంటి డ్రోన్ అని తెలుసుకోవచ్చని దిమిత్రి చెబుతున్నారు.
నిర్దిష్ట పారామీటర్లపై యుక్రెనియన్ సైన్యం దగ్గరున్న సమాచారం ఆధారంగా దూసుకువచ్చే ఓర్లాన్, ఎలెరాన్, జాలా, సూపర్‌క్యామ్ వంటి రష్యన్ గూఢచారి డ్రోన్‌లను గుర్తించొచ్చు.

ఫొటో సోర్స్, FACEBOOK YURI BIRIUKOV
సమస్య అదే..
ఈ డేటాబేస్ ఆధారంగా లాన్సెట్ కమికేజ్ డ్రోన్‌లు, చిన్న చైనీస్ మావెక్స్ డ్రోన్ల మధ్య తేడాను కూడా క్యాండీ గుర్తించగలదు. అయితే, ఎఫ్‌పీవో డ్రోన్‌లను గుర్తించడంలో 'క్యాండీ' ఇబ్బందిని ఎదుర్కొంటుందని దిమిత్రి అంగీకరించారు. 'క్యాండీ' ఆ డ్రోన్‌లను సరిగ్గా గుర్తించలేకపోయింది.
ఇదికాకుండా, మరొక సమస్య ఉంది. ఇప్పుడు అలాంటి డ్రోన్‌లు తక్కువ ఫ్రీక్వెన్సీకి మారుతున్నాయి. అంటే డ్రోన్‌ను గుర్తించడానికి వాటికి ప్రత్యేక యాంటెన్నా అవసరం.
అనుభవజ్ఞులైన డ్రోన్ ఆపరేటర్లు తమ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు టెలిమెట్రీ సిగ్నల్‌లను ఆపివేస్తారని, దీంతో డిటెక్టర్ డ్రోన్ ఉనికిని గుర్తించలేకపోతోందని దిమిత్రి చెప్పారు. అయితే ఈ అడ్డంకులను పరిష్కరించడానికి యుక్రేనియన్ ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు
అదే సమయంలో దిమిత్రి సెలన్ తాను కనుగొన్న పరికరం అన్ని విధాలా మెరుగైనది కాదని ఒప్పుకున్నారు. కానీ, ఇది ప్రతి సైనికుడి జేబులో ఉండాలని దిమిత్రి నిజంగా అనుకుంటున్నారా? దీనికి ఆయన స్పందిస్తూ.. "ప్రతి ఒక్కరికీ పాకెట్-సైజ్ ఆల్ ఇన్ వన్ డిటెక్టర్ అవసరం" అని బదులిచ్చారు.
"మీరు గుర్రం, బండి ఉదాహరణను వాడొచ్చు. ప్రస్తుతం 'క్యాండీ' ఒక గుర్రం, కానీ దానిని కార్ట్ (గుర్రపు బండి)గా మార్చినట్లయితే బాగా ఉపయోగపడుతుంది. 'క్యాండీ'ని కార్ట్‌గా మార్చడానికి ఇంకా రెండు మార్పులు అవసరం. ఆ తర్వాత కార్ట్ ఎలాంటి చాలెంజ్‌కైనా స్పందించగలదు" అని దిమిత్రి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- బీరు టబ్బులో స్నానం చేస్తే ఆరోగ్యం బాగుపడుతుందా? ఈ ట్రెండ్ ఎందుకు విస్తరిస్తోంది...
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














