పుతిన్‌కు ఘనస్వాగతం పలికిన కిమ్ జోంగ్ ఉన్.. అసలు ఉత్తర కొరియాకు పుతిన్ ఎందుకు వెళ్లారు? 3 ప్రశ్నలు, సమాధానాలు

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జునా మూన్
- హోదా, బీబీసీ కొరియన్
ఉత్తర కొరియాకు చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఘనస్వాగతం లభించింది. ప్యాంగ్యాంగ్‌కు చేరుకున్న పుతిన్‌కు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికిన కిమ్ జోంగ్ ఉన్, ఆయనను ఆలింగనం చేసుకున్నారు.
ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటన 9 గంటలపాటు సాగనుంది. ఈ షెడ్యూల్‌లో పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ మధ్య 90 నిమిషాలపాటు చర్చలతోపాటు ఫోటోషూట్, టీ పార్టీ కూడా ఉన్నాయి.
ఇరువురు నేతలు గతేడాది సెప్టెంబర్‌లో రష్యాలోని వోస్టోచ్నీ కాస్మోడ్రోమ్‌లో సమావేశమయ్యారు.
కానీ, పుతిన్ ఉత్తర కొరియాలో కాలుమోపడం 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
ఆహారం, సైనిక సాయానికి బదులుగా రష్యాకు ఉత్తర కొరియా ఫిరంగులు, ఇతర సామాగ్రిని సరఫరా చేస్తోందని అమెరికా, దక్షిణ కొరియాలు ఆరోపిస్తున్నాయి.
అయితే, ఆయుధ ఒప్పంద విషయాన్ని ఉత్తరకొరియా, రష్యా ఖండించాయి. కానీ, నిరుడు సైనిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని చెప్పాయి.
ఉత్తర కొరియాలో పర్యటన ముగిసిన తరువాత పుతిన్ వియత్నాంకు వెళ్తారు.
ఇప్పుడు పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ మధ్య జరిగే చర్చలలో సైనిక సహకార ఒప్పందాలపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి.
ఈ రెండు దేశాల మధ్యన సాంస్కృతిక, ఆర్థిక, పర్యాటక రంగాలలో బంధం బలపడుతుందని భావిస్తున్నారు.
అలాగే నార్త్ కొరియాతో ఆధునిక ఆయుధాల మార్పిడి, అణుకార్యక్రమాల గురించి మాట్లాడటానికి పుతిన్ ఎలాంటి పథకంతో ఉన్నారనేది కూడా మరో ముఖ్యమైన అంశం.
ఈ సమావేశం లోతైన చర్చల కంటే నిజమైన ఫలితాలు రాబట్టే వేదిక అవుతుందని దక్షిణ కొరియాలోని నార్త్ కొరియన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కిమ్ డాంగ్ – యుప్ చెప్పారు.
దక్షిణ కొరియాతో సంబంధాల పునరుద్దరణపై రష్యాకు అవగాహన ఉన్నందున, నార్త్ కొరియాతో సంబంధాలు రెచ్చగొట్టే ధోరణిలో ఉండకుండా రష్యా జాగ్రత్తపడే అవకాశం ఉంది.


మిలటరీ: వీరికి ఆయుధాలు, వారికి టెక్నాలజీ
రష్యా భూభాగంలో తాము తయారుచేసిన ఆయుధాల వినియోగానికి యుక్రెయిన్‌కు ఇటీవల అమెరికా అధికారమిచ్చింది.
యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర రెండున్నరేళ్ళుగా కొనసాగుతుండటంతో సరఫరాల విషయంలో నార్త్ కొరియా, రష్యా పరస్పరం ఆధారపడటం ఎక్కువైపోయింది.
‘‘రష్యాకు సరఫరా చేయడానికి నార్త్ కొరియా ఎంత ఎక్కువ మొత్తంలో ఆయుధాలు తయారు చేయగలదు’’ అనే విషయమే ఇరువురి నేతల చర్చలలో కీలక అజెండా అవుతుందని కొరియా యూనివర్సిటీలో యూనిఫికేషన్ అండ్ డిప్లొమసీ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నామ్ సంగ్-వుక్ చెప్పారు.
సంప్రదాయ ఆయుధాలతో కూడిన స్వల్పకాలిక ఒప్పందాలకు మించి చర్చలు విస్తరించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయుధ వ్యవస్థలను సంయుక్తంగా అభివృద్ధి చేయడం సహా సన్నిహిత సైనిక సహకారాన్ని ఇరు దేశాలు అంగీకరించవ్చని తెలిపారు.
రష్యాకు ఆయుధాలను ఇచ్చి, ప్రతిఫలంగా నార్త్ కొరియా కేవలం ఆహారం, ఇంధనం మాత్రమే కాకుండా మరిన్ని కోరాలని భావిస్తోంది.
ముఖ్యంగా మేలో సైనిక నిఘా ఉపగ్రహం విఫలమైన తరువాత అంతరిక్ష సాంకేతిక రంగంలో రష్యా సహకారాన్ని నార్త్ కొరియా అభ్యర్థించవచ్చని డాక్టర్ నామ్ ఊహిస్తున్నారు.
నార్త్ కొరియా ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించడానికి అంతరిక్షరంగంలో శక్తిమంతంగా ఉన్న రష్యా సాయం కీలకమవుతుంది.
నార్త్ కొరియా నిఘా ఉపగ్రహాలను మెరుగుపరిచేందుకు న్యూక్లియర్ జలాంతర్గాముల అభివృద్ధికి నార్త్ కొరియా రష్యా మద్దతును కోరే అవకాశం ఉంది.
అయితే అణ్వాయుధాలపై జరిగే చర్చల వివరాలు బయటకు వచ్చే అవకాశం లేదని డాక్టర్ నామ్ విశ్వసిస్తున్నారు.
యుక్రెయిన్ చేతికి పాశ్చాత్య ఆయుధాలు అందడం, తద్వారా రష్యాను బెదిరించే ధోరణి కనిపించడంతో పుతిన్ కూడా అణ్వాయుధాల ప్రయోగిస్తామనే సంకేతాలు ఇచ్చారు.
అయితే కొరియా ద్వీపకల్పం, ఈశాన్య ఆసియాలో అణు సంబంధిత సహకారం, అణ్వాయుధాల భాగస్వామ్యంపై పొరుగుదేశాలు, అమెరికా నుంచి తీవ్ర ప్రతిఘటన వచ్చే అవకాశం ఉందని, అందుకే ఆ అంశాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉండకపోవచ్చని డాక్టర్ నామ్ చెప్పారు.

ఆర్థికం: వీరికి కార్మికులు, వారికి ఫారిన్ కరెన్సీ...
ఆర్థిక సహకార విస్తరణపై కూడా రష్యా, నార్త్ కొరియా చర్చించవచ్చు.
నార్త్ కొరియాకు రష్యానుంచి అత్యవసరంగా కావాల్సింది ‘‘ విదేశీ కరెన్సీ’’
అందుకే నార్త్ కొరియా రష్యాకు ఎక్కువమంది కార్మికులను పంపే అవకాశం కనిపిస్తోందని డాంగ్ – ఏ -యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అండ్ డిప్లోమసీ ప్రొఫెసర్ డాక్టర్ కాంగ్ డాంగ్ – వాన్ చెప్పారు.
రష్యాకేమో యుద్దం కారణంగా దెబ్బతిన్న భవనాలు, మౌలిక సదుపాయాలను పునర్ నిర్మించి, ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప చేయడానికి కార్మికుల అవసరం ఉంది.
యుక్రెయిన్‌పై యుద్ధం తరువాత, యువత రష్యాను విడిచి పారిపోవడం, దళాల సమీకరణ కారణంగా రష్యా తీవ్రమైన కార్మిక కొరతను ఎదుర్కొంటోంది.
దీంతో నార్త్ కొరియా నుంచి వలస కార్మికులను రష్యాకు పంపే విషయమై ఇరువురు నాయకులు చర్చించవచ్చని డాక్టర్ కాంగ్ చెప్పారు.
అయితే నార్త్ కొరియాపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షలు ఆ దేశ కార్మికులు విదేశాలలో పనిచేయకుండా నిషేధం విధించాయి.
2019 డిసెంబర్ 22లోగా విదేశాలలోని నార్త్ కొరియా కార్మికులందరినీ వెనక్కి తిరిగి తీసుకురావాలని ఆదేశించింది.
ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న రష్యా, నార్త్ కొరియా కార్మికుల సేవలను ఉపయోగించుకోవడానికి అధికారికంగా ముందడుగువేస్తే అంతర్జాతీయ సమాజంలో అదో పెద్ద ప్రకంపనకు దారితీయవచ్చు.
అంతర్జాతీయంగా ఎదురుదెబ్బలు, దౌత్యపరమైన ఒత్తిళ్ళ నడుమ ఈ ఇరుదేశాలు ఆర్ధిక సహకారాన్ని ఎలా ముందుకు తీసుకువెళతాయనే విషయంపైనే అందరి దృష్టి ఉంది.

సాంస్కృతికం: నార్త్ కొరియా పర్యాటకం పెరుగుతుందా?
కోవిడ్ 19 కారణంగా ఫిబ్రవరి 2020 నుంచి నార్త్ కొరియాకు నిలిచిపోయిన గ్రూప్‌టూర్స్‌ను రష్యా పునరుద్దరించవచ్చు.
నాలుగేళ్ళ తరువాత జూన్ 6న రష్యా, నార్త్ కొరియా మధ్య రైళ్ళ రాకపోకలు కూడా మొదలయ్యాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి, మే మధ్యన 400మంది రష్యన్ పర్యాటకులు నార్త్ కొరియాకు ప్రయాణించారని రష్యా ప్రాంతీయ ప్రభుత్వమైన ప్రీమోర్స్సీ క్రాయ్ ప్రభుత్వం తెలిపింది.
రష్యాకు చెందిన వోస్టోక్ ఇంటూర్ అనే ట్రావెల్ ఏజెన్సీ తన వెబ్‌సైట్‌లో 750 డాలర్లకు నార్త్ కొరియాకు నాలుగు నుంచి ఐదు రోజుల టూర్ ప్యాకేజ్‌లను అందిస్తోంది.
సెప్టెంబర్ వరకు అందుబాటులో ఉన్న ఈ పర్యటనలో మౌంట్ పేక్ట్, నార్త్ కొరియాలోని చారిత్రక ప్రదేశాలు, కొరియా యుద్ద వార్షికోత్సవ వేడుకలను చూడొచ్చు.
‘‘పర్యాటకమనేది కేవలం విదేశీ మారకాన్ని సంపాదించేదే కాదు, ప్రజల మధ్య సంబంధాలను నేరుగా మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కొరియన్ స్టడీస్ లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కిమ్ డాంగ్ -యుప్ చెప్పారు.
రష్యన్లు నార్త్ కొరియాను సందర్శించడం ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను వృద్ధి పొందడానికి సహాయకారిగా మారుతుందని డాక్టర్ డాంగ్ -యుప్ అభిప్రాయం. సందర్శనలు పెరగడం వల్ల ప్రజలు పరస్పర ఆధారితంగా మారడమే కాదు, సైనిక ఉద్రిక్తతలను తగ్గించడానికీ దోహదపడుతుందంటారు ఆయన.
నార్త్ కొరియాకు విదేశీ పర్యాటకుల రాక కారణంగా, ఆ దేశానికి అంతర్జాతీయ సమాజం దృష్టిలో ఉన్న ప్రమాదకర దేశం అనే ముద్ర తొలగడానికి కారణమవుతుందని డాంగ్ -యుప్ వాదన.
నార్త్ కొరియా పర్యాటక రంగాన్ని సామాజిక, సాంస్కృతిక మార్పిడి, దాని ఆర్థిక ప్రయోజనాలకు మించి, నార్త్ కొరియా అంతర్జాతీయ ముఖచిత్రాన్ని మెరుగుపరిచే ఓ ముఖ్యమైన సాధనంగా చూస్తున్నారు.
అయితే కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ఆందోళన చెందిన కొన్ని గ్రూప్‌లు తమ నార్త్ కొరియా పర్యటనను రద్దు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
మే 31న ప్రారంభం కావాల్సిన నాలుగురోజుల గ్రూప్ టూర్, ప్రయాణికులు లేక రద్దయినట్టు రష్యా ట్రావెల్ ఏజెన్సీ వోస్టోక్ ఇంతూర్ ఇటీవల తెలిపింది.
నార్త్ కొరియాలో పరిమితమైన పర్యాటక సదుపాయాలు, విదేశీ పర్యాటకుల కదలికలపై ఆంక్షలు ఆదేశ పర్యాటక రంగ విస్తరణకు సవాలుగా మారాయి.
నార్త్ కొరియా-రష్యా సమావేశం పర్యాటక సహకారంపై చర్చించడానికి అవకాశం కల్పించవచ్చని ప్రొఫెసర్ కాంగ్ అభిప్రాయపడుతున్నారు.

24 ఏళ్ళ తరువాత... ఏంటి వ్యత్యాసం?
ప్రచ్ఛన్న యుద్దం ముగిసిన తరువాత రష్యా, నార్త్ కొరియా మధ్యన తొలి సమావేశం 2000లో జరిగింది. అప్పట్లో అధ్యక్షుడు పుతిన్ ప్యాంగ్యాంగ్‌ను సందర్శించి నార్త్ కొరియా నేత కిమ్ జాంగ్ ఇల్‌తో సమావేశమయ్యారు.
ఆ సమయంలో అంతర్జాతీయ వేదికపై తిరిగి నిలదొక్కుకోవాలని రష్యా ప్రయత్నిస్తుండగా, 1990 నాటి దుర్భిక్షం తరువాత, బయటి ప్రపంచంతో సంబంధాలు పెంచుకోవడానికి నార్త్ కొరియా ప్రయత్నిస్తోంది.
నార్త్ కొరియా కరువు కోరల్లో చిక్కుకోవడాన్ని అర్డ్యూస్ మార్చ్ గా పిలిచేవారు.
ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సహకారం, పరస్పర సహాయాన్ని వివరించే రుస్సో-కొరియా జాయింట్ డిక్లరేషన్ ను ఆమోదించారు.
దురాక్రమణ, లేదా ప్రమాదం సంభవించినప్పుడు ఇరుదేశాలు తక్షణమే పరస్పరం సంప్రదించుకోవాలని సైనిక సహకారం ఒప్పందం షరతు విధించింది.
నార్త్ కొరియా, రష్యా మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాబోయే సమావేశంలో ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించి, లాంఛనప్రాయంగా కాకుండా మరింత శక్తిమంతమైన కూటమిగా ఎదిగేందుకు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
‘‘నార్త్ కొరియా రెచ్చగొట్టే చర్యలు పరిమితంగా ఉన్నప్పుడు పుతిన్ అక్కడ పర్యటించారు. కానీ ఇప్పుడు యుక్రెయిన్ యుద్దం నేపథ్యంలో నార్త్ కొరియా, రష్యా సైనిక సంబంధాలు మరింత ధృడమయ్యాయి’’ అని డాక్టర్ నామ్ వివరించారు. ‘‘గతంలో లానే ఓ కూటమిలా మరింత సన్నిహిత సహకారం అందించేందుకు ఈ సమావేశం దారితీయవచ్చని’’ ఆయన చెప్పారు.
గతంలో పుతిన్ పర్యటనకు, ఇప్పటికి కీలకమైన తేడా ఏమిటంటే ఇప్పుడు నార్త్ కొరియా వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి.
‘‘అమెరికా కేంద్రంగా ఏకధ్రువ ప్రపంచం బలహీనపడటంతో అంతర్జాతీయ వ్యవస్థ కొత్త రూపు పొందుతున్న వేళ రష్యా, నార్త్ కొరియా తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి , సహకరించుకోవడానికి సరికొత్త మార్గాలను కనుగొంటాయి’’ అని డాక్టర్ కిమ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- రుషికొండ ‘రహస్య’ భవనాల్లో ఏముందంటే?
- మెదక్‌లో ఉద్రిక్తత: ‘మేం ఏం తప్పు చేశామని మా హాస్పిటల్‌పై దాడి చేశారు?’
- ‘స్త్రీ తన వస్త్రాలతో పాటు సిగ్గును కూడా విడిచేయాలి’ - సెక్స్ గురించి ప్రాచీన కాలంలో మహిళలు ఎలా చర్చించుకునేవారు?
- అపాయంలో ఉపాయం: ఎడారిలో సింహాలబారి నుంచి తప్పించుకున్న ఇద్దరు స్నేహితురాళ్ళ కథ...
- సన్‌స్క్రీన్ లోషన్లు వాడుతున్నారా, ఈ ఎనిమిది విషయాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















