ఒకే ఐఎంఈఐ నంబర్‌తో 1.5 లక్షల ఫోన్‌లు, ఈ మోసం ఎలా చేశారు?

ఫొటో సోర్స్, Getty Images
మొబైల్ టెక్నాలజీపై ప్రాథమిక పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా ఏ రెండు మొబైల్ ఫోన్లకు ఒకే ఐఎంఈఐ (IMEI) నంబర్ ఉండదని తెలుసు.
ఫోన్ పోయినప్పుడు, లేదంటే దాన్ని ఎవరైనా దొంగిలించినప్పుడు ఈ నంబర్ సహాయంతోనే వెతుకుతారు. దాని సాయంతో చాలాసార్లు పోలీసులు దొంగలను పట్టుకున్న సందర్భాలున్నాయి.
ప్రతి మొబైల్ ఫోన్‌కు ప్రత్యేక ఐఎంఈఐ సంఖ్య ఉన్నప్పటికీ ఈ సంఖ్యను క్లోన్ చేయడం, మార్చడం వంటివి అప్పుడప్పుడు వింటుంటాం.
ఇటీవల బంగ్లాదేశ్ మొబైల్ ఫోన్ ఆపరేటర్ ‘రోబీ’ చీఫ్ కార్పొరేట్ అండ్ రెగ్యులేటరీ ఆఫీసర్ షాహిద్ ఆలం చేసిన ఒక ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది.
గత గురువారం, ఆయన ఆ దేశ రాజధాని ఢాకాలో నిర్వహించిన సెమినార్‌లో మాట్లాడుతూ, ‘‘బంగ్లాదేశ్‌లో ఒకే ఐఎంఈఐ నంబర్‌తో 1.5 లక్షలకు పైగా మొబైల్ ఫోన్లు వాడుతున్నారు, ఈ ఫోన్లు అన్నీ నకిలీవి’’ అన్నారు.
అయితే నకిలీ మొబైల్ ఫోన్ల సంఖ్య 1.5 లక్షల లోపే ఉండవచ్చని కంపెనీ మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఏకేఎం ముర్షీద్ బీబీసీతో చెప్పారు.
"కొన్ని సంవత్సరాలుగా, ఒక ఆపరేటర్ నెట్‌వర్క్‌లోని ఎనిమిది లక్షల మొబైల్ ఫోన్‌లు ఒకే ఐఎంఈఐ కోడ్‌తో పని చేస్తున్నాయి" అని ఆయన వివరించారు.
కానీ ఒకే ఐఎంఈఐ గుర్తింపు ఉన్న ఇన్ని ఫోన్‌లు ఒకేసారి ఎలా పని చేస్తున్నాయి?


ఫొటో సోర్స్, Getty Images
ఐఎంఈఐ అంటే ఏమిటి?
IMEI.info ప్రకారం, ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (IMEI) అనేది 15 అంకెల సంఖ్య. మొబైల్ హ్యాండ్‌సెట్‌ను తయారు చేస్తున్నప్పుడు ఈ నంబర్ ప్రోగ్రామ్ అవుతుంది.
కొన్ని సందర్భాల్లో ఈ సంఖ్యలో 17 అంకెలు కూడా ఉండవచ్చు. ఈ నంబర్ మొబైల్ హ్యాండ్‌సెట్‌కు గుర్తింపు సంఖ్య అని చెప్పాలి.
ఒక హ్యాండ్‌సెట్‌ను ఏ ఫ్యాక్టరీలో తయారు చేశారు, అది ఏ ప్రాంతంలో ఉపయోగిస్తున్నారు అన్న వివరాలు ఈ నంబర్ తెలుపుతుంది.
ఐఎంఈఐ నెంబర్‌లో ఫోన్‌కు చెందిన ప్రత్యేక సీరియల్ నంబర్ కూడా ఉంటుంది.
ముర్షీద్ మాట్లాడుతూ, "మొబైల్ నంబర్‌కు ఒకే ఐఎంఈఐ నెంబర్ ఉండేలా, సులభంగా గుర్తించగలిగే విధంగా గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ (GSM)ను రూపొందించారు" అని తెలిపారు.
ఫోన్ పోయినా లేదా ఎవరైనా దొంగిలించినా, దాన్ని కనుగొనడానికి ఐఎంఈఐ నంబర్‌ను ఉపయోగిస్తారు.
ఇది కాకుండా, మీరు కొత్త ఫోన్ కొనుగోలు చేసినప్పుడు, ఆ మొబైల్ ఫోన్ ఇంతకు ముందు ఎవరూ ఉపయోగించలేదని ఐఎంఈఐ నంబర్ సహాయంతో తెలుసుకోవచ్చు.
మీరు మీ ఫోన్‌లో *#06# డయల్ చేస్తే, మీ మొబైల్ ఫోన్ ఐఎంఈఐ ఈ నంబర్ మీకు తెలుస్తుంది.
మీరు IMEI.info వెబ్‌సైట్‌కి వెళ్లి, మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేస్తే ఫోన్‌కు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఐఎంఈఐ మోసం ఎలా జరుగుతుంది?
ఐఎంఈఐ నంబర్‌ను మార్చడంలో, సాధారణంగా చెల్లుబాటు అయ్యే నంబర్‌ను క్లోనింగ్ చేస్తారు.
మొబైల్ ఫోన్ల విషయంలో తరచుగా రెండు రకాల క్లోనింగ్‌లు జరుగుతాయని ఐటీ నిపుణుడు బీఎం మొయినుల్ తెలిపారు. ఒకటి సిమ్ క్లోనింగ్, మరొకటి ఐఎంఈఐ క్లోనింగ్.
ఫోన్ ఐడెంటిటీని కాపీ చేయవచ్చని ఢాకా యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ మైనుల్ హుస్సేన్ తెలిపారు. సాధారణ ప్రజలు ఈ పని చేయలేరు. ఇందులో అనేక సాంకేతిక దశలు ఉన్నాయి.
కొన్నేళ్ల క్రితం నకిలీ హ్యాండ్‌సెట్‌లను తయారు చేసిన కొన్ని అక్రమ ఫ్యాక్టరీలపై ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు(DMP) దాడి చేశారు.
"సామ్‌సంగ్, నోకియా ఫోన్‌లను కాపీ చేసి, నకిలీ హ్యాండ్‌సెట్‌లను తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై మేము దాడి చేశాం" అని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసు సైబర్ అండ్ స్పెషల్ క్రైమ్స్ డిపార్ట్‌మెంట్ అదనపు డిప్యూటీ కమిషనర్ మహ్మద్ జునైద్ ఆలం సర్కార్ తెలిపారు.
దీని తరువాత, తాము ఇలాంటి అనేక దాడులు చేసిననట్లు ఆయన తెలిపారు.
"హ్యాండ్‌సెట్‌ల భాగాలను విదేశాల నుంచి కొనుగోలు చేసి అసెంబుల్ చేస్తున్నారు" అని ఆయన వివరించారు.
"ఐఎంఈఐ స్పూఫింగ్ అనేది బటన్ లేదా ఫీచర్ ఫోన్‌లలో చాలా సాధారణం. ఇది స్మార్ట్ ఫోన్‌లలో చాలా తక్కువగా ఉంటుంది. పెద్ద సంఖ్యలో ఫోన్ ఐడెంటిఫికేషన్ నంబర్‌లను సరిపోల్చడానికి ఇతర మార్గాలు ఉన్నాయని నిపుణులు అంటారు" అని ఆయన చెప్పారు.
ప్రొఫెసర్ మైనుల్ హుస్సేన్ మాట్లాడుతూ, "బయటి నుంచి అక్రమంగా వచ్చే గుర్తు తెలియని లేదా అనామక బ్రాండ్‌ల హ్యాండ్‌సెట్‌లను ఈ విధంగా తయారు చేయవచ్చు. వాళ్లు డిఫాల్ట్‌గా అదే ఐఎంఈఐ నంబర్ ఉపయోగిస్తారు’’ అని తెలిపారు.
"విదేశీ కంపెనీ నుంచి విడిభాగాలను కొనుగోలు చేసి ఉంటే, వాళ్లే అలాంటి సాఫ్ట్‌వేర్ లేదా అవసరమైన పరికరాలను అందించి ఉండవచ్చు" అని ఆయన అన్నారు.
"ఒకసారి సమాచారాన్ని శాశ్వతంగా నమోదు చేస్తే, దానిని మార్చలేం" అని ముర్షీద్ చెప్పారు.
‘‘కానీ దాన్ని కాన్ఫిగర్ చేస్తే, నకిలీ హ్యాండ్‌సెట్‌లు మార్కెట్ చేయొచ్చు"

ఫొటో సోర్స్, Getty Images
ఇది ఎందుకు జరిగింది?
ప్రస్తుతం నేరస్తులను గుర్తించేందుకు సర్వసాధారణంగా మొబైల్ ఫోన్ ట్రాకింగ్‌ను ఉపయోగిస్తున్నారు.
ప్రొఫెసర్ మైనుల్ హుస్సేన్ మాట్లాడుతూ, ఆపరేటర్ కంపెనీ ఏదైనా ఆపరేటర్ టవర్‌తో కనెక్ట్ చేసిన మొబైల్ ఫోన్ ఐఎంఈఐని తెలుసుకునే వీలుందని తెలిపారు.
కానీ ఒకే ఐఎంఈఐ నంబర్‌తో చాలా హ్యాండ్‌సెట్‌లు ఉంటే, నిర్దిష్ట హ్యాండ్‌సెట్‌ను గుర్తించడం కష్టం అవుతుంది.
"అప్పుడు అసలు నేరస్తుడిని గుర్తించడం మాకు చాలా కష్టంగా మారుతుంది. ఫలితంగా, మేం ఫోన్ ట్రాకింగ్‌కు బదులుగా ఇతర వ్యూహాలను ఆశ్రయించవలసి ఉంటుంది" అని పోలీసు అధికారి జునైద్ ఆలం అన్నారు.
"ఈ కారణంగా, కొంతమంది నేరస్తులు ఇలాంటి హ్యాండ్‌సెట్‌లనే ఉపయోగిస్తున్నారు," అని ఆయన చెప్పారు.
అయితే, ఇలాంటి ఐఎంఈఐ మోసాలు పెద్ద ఎత్తున జరగడం వెనుక ఆర్థికపరమైన కారణాలు ఉన్నాయని ముర్షీద్ అన్నారు.
ప్రతి ఐఎంఈఐకి, జీఎస్‌ఎమ్ అసోసియేషన్ రాయల్టీ చెల్లించాలి.
"ఆ రాయల్టీని నివారించడానికి, ఒక దేశంలోని తయారీదారులు ఒకే ఐఎంఈఐ నంబర్‌తో మిలియన్ల కొద్దీ హ్యాండ్‌సెట్‌లను ఉత్పత్తి చేస్తారు" అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
పరిష్కారం ఏమిటి?
ఐఎంఈఐ డేటాబేస్ నుంచి అసలు ఫోన్‌కు చెందిన అదే ఐఎంఈఐ నంబర్‌తో క్లోన్ చేస్తే, హ్యాండ్‌సెట్ సమాచారం డేటాబేస్‌లో అందుబాటులో ఉంటుంది.
"ఫలితంగా, సగటు వినియోగదారుడు దానిని అర్థం చేసుకునే దారి ఉండదు" అని ప్రొఫెసర్ మైనుల్ హుస్సేన్ చెప్పారు.
వీటిని అరికట్టేందుకు ఆయన రెండు రకాల చర్యలను సూచించారు. మొదటి, చట్టపరమైన చర్యలు. రెండోది, సాంకేతిక చర్యలు.
ఫోన్ వినియోగదారుడి చేతికి వచ్చిన తర్వాత, సాంకేతిక చర్యలు పెద్దగా ఉపయోగపడవని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అప్పుడే 1.5 లక్షల ఐఎంఈఐ నంబర్లను క్లోనింగ్ చేయడం వెనుక ఎవరున్నారో తెలుసుకునే అవకాశం ఉంది.
జునైద్ ఆలం మాట్లాడుతూ, "దొంగలు తాము దొంగిలించిన ఫోన్‌ను విక్రయించే ముందు ఐఎంఈఐని తొలగిస్తారు" అని తెలిపారు.
అయితే ఐఎంఈఐని తొలగించడం, మార్చడం చట్టరీత్యా నేరం.
ఇవి కూడా చదవండి:
- బీరు టబ్బులో స్నానం చేస్తే ఆరోగ్యం బాగుపడుతుందా? ఈ ట్రెండ్ ఎందుకు విస్తరిస్తోంది...
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














