మానవ మలంతో విమానాలు నడిపిస్తారా, ఎలా సాధ్యం?

విజ్ ఎయిర్ విమానం

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, 2030 నాటికి ప్రధాన విమాన కార్యకలాపాల్లో బయోఫ్యూయల్ వాడాలనుకుంటున్నట్లు చెప్పిన విజ్ ఎయిర్
    • రచయిత, రాచెల్ మెక్‌మెనెమీ, పీఏ మీడియా
    • హోదా, బీబీసీ న్యూస్, ఎసెక్స్

ప్రపంచంలోనే తొలిసారిగా మానవ మలంతో విమాన ఇంధనాన్ని(సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్(ఎస్‌ఏఎఫ్) తయారు చేయనున్నట్లు ఒక వాణిజ్య సంస్థ ప్రకటించింది.

ఎసెక్స్‌లోని హార్విచ్‌లో ఉన్న తన ప్లాంట్‌లో ఈ ఇంధనాన్ని అభివృద్ధి చేయలనుకుంటున్నట్లు బయోఫ్యూయల్ కంపెనీ ఫైర్‌ఫ్లై తెలిపింది. 2028 నాటికి ఈ ఇంధనాన్నిఅందించాలని ఆ సంస్థ భావిస్తోంది.

15 ఏళ్ల పాటు 5,25,000 టన్నుల ఎస్‌ఏఎఫ్‌ను అందించేందుకు విజ్ ఎయిర్ సంస్థతో ఈ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది.

‘బయోసాలిడ్స్ అనేవి వ్యర్థ పదార్థాలు. కానీ, ఇవి అద్భుతమైన శక్తి వనరులు’ అని ఫైర్‌ఫ్లై చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ హైగేట్ తెలిపారు.

ఈ వ్యర్థాలను మేం విమాన ఇంధనంగా మార్చాలనుకుంటున్నామని హైగేట్ చెప్పారు.

ఎస్‌ఏఎఫ్ ఉత్పత్తిలో సంప్రదాయ విమాన ఇంధనంతో పోలిస్తే 70 శాతం తక్కువ కర్బన్‌ వాడకం ఉంటుందని చెప్పారు. కానీ, చాలాసార్లు దీన్ని ఉత్పత్తి చేయడం అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని తెలిపారు.

తొలుత పైలట్ దశలో ఈ ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు ఫైర్‌ఫ్లైకు బయోసాలిడ్స్‌ను అందించేందుకు యుటిలిటీ కంపెనీ ఆంగ్లియన్ వాటర్ సహకరించనుంది.

2030 నాటికి ఎస్ఏఎఫ్ డిమాండ్‌లో సగం మేర అందుకునేందుకు బ్రిటన్‌లో సరిపడా బయోసాలిడ్స్ ఉన్నాయని ఫైర్‌ఫ్లై చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పాల్ హిల్డిచ్ చెప్పారు.

‘‘ఇది బ్రిటన్‌‌లో మాత్రమే తయారు చేయగలిగింది కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలున్న ఏ ప్రాంతంలోనైనా మల వ్యర్థాలు ఉంటాయి’’ అని హిల్డిచ్ చెప్పారు.

బయోసాలిడ్స్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, ఫైర్‌ఫ్లైకు బయోసాలిడ్స్‌ అందించనున్న ఆంగ్లియన్ వాటర్

విమానం కోసం తమ ఇంధనాన్ని వాడేందుకు చట్టపరమైన అనుమతులు పొందే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫైర్‌ఫ్లై తెలిపింది.

2030 నాటికి తమ విమానాల్లో 10 శాతం ఎస్ఏఎఫ్‌తో నడుస్తాయని భావిస్తున్నట్లు విజ్ ఎయిర్ కూడా ప్రకటించింది.

విమానయాన పరిశ్రమ నుంచి కర్బన్ ఉద్గరాలను తగ్గించేందుకు సుస్థిరమైన ఇంధనాన్ని కనుగొనడం అత్యంత కీలకమని విజ్ ఎయిర్ కార్పొరేట్, ఈఎస్‌జీ(ఎన్విరాన్‌మెంటల్, సోషల్, గవర్నెన్స్) అధికారి ఇవాన్ మోయినిహాన్ తెలిపారు.

ఎస్ఏఎఫ్ ఉత్పత్తిని పెంచడం అవసరమని చెప్పారు. పెట్టుబడులకు చట్టసభ్యులు మద్దతు ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు.

2030 నాటికి బ్రిటన్‌లో కనీసం 10 శాతం విమానయాన సంస్థ ఇంధనాన్ని సుస్థిరమైన ఫీడ్‌స్టాక్స్ నుంచి తయారు చేయాలని ప్రభుత్వం చూస్తోంది.

జేమ్స్ హైగేట్
ఫొటో క్యాప్షన్, జేమ్స్ హైగేట్

యూకేలోని గ్లాస్టర్‌షైర్‌లోని ఒక ప్రయోగశాలకు చెందిన రసాయన శాస్త్రవేత్తలు ఈ కొత్త ఇంధనాన్ని తయారు చేశారు. మానవ వ్యర్థాలను వారు కిరోసిన్‌గా మార్చగలిగారు.

''తక్కువ ధరకు దొరికే ఇంధనాన్ని కనుక్కోవాలని అనుకున్నాం. ఇది అదే. మానవ వ్యర్థాలు పుష్కలంగా లభిస్తాయి కాబట్టి దాంతో తయారు చేయాలనుకున్నాం'' అని జేమ్స్ హైగేట్ అన్నారు.

అంతర్జాతీయ విమానయాన నియంత్రణ సంస్థలు (ఇంటర్నేషనల్ ఏవియేషన్ రెగ్యులేటర్స్) పలు దఫాలుగా నిర్వహించిన పరీక్షల్లో ఇప్పటి శిలాజ ఇంధనాలకు ఇది ఏమాత్రం తీసిపోదని తేలింది.

ఇంధన వినియోగం వల్ల విడుదలయ్యే కర్బన ఉద్గారాల ప్రభావాన్ని పరిశీలించేందుకు ఫైర్‌ఫ్లై బృందం క్రాన్‌ఫీల్డ్ యూనివర్సిటీతో కలిసి పనిచేసింది.

తక్కువ కర్బనం విడుదల చేసే ఇంధనాల ఉత్పత్తిపై హైగేట్ 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఈ కిరోసిన్ రసాయన పరంగా సాధారణ కిరోసిన్‌లాగే ఉందని ఆయన అన్నారు. ''ఇందులో శిలాజ ఇంధనాల్లో ఉండే కర్బన ఉద్గారాలు లేవు. ఇది శిలాజ రహిత ఇంధనం'' అన్నారు.

''కర్బన ఉద్గారాలూ తక్కువగా ఉండడం మామూలు విషయం కాదు. ఇలాంటి ఇంధనాలు మనకు అవసరం. కానీ, శిలాజ ఇంధనాలతో పోలిస్తే ఇలాంటి ఇంధనాల ఉత్పత్తి చాలా తక్కువ'' అన్నారాయన.

ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న కర్బన ఉద్గారాల్లో ఏవియేషన్ వాటా 2 శాతం. వాతావరణ మార్పు (క్లైమేట్ చేంజ్‌)లోనూ దాని ప్రభావం ఉంటుంది.

ఇది చాలా తక్కువ పరిమాణమే అయినప్పటికీ, క్రమంగా పెరుగుతోంది. కర్బన ఉద్గారాలు విడుదల చేయని విమానయానం అనేది ప్రధాన సవాళ్లలో ఒకటి.

విమాన ఇంధనం

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, విమానం

ప్రస్తుతం విద్యుత్‌తో నడిచే ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల‌ తయారుచేసే దిశగా పనులు జరుగుతున్నాయి.

ఎలాగైనా 2026 నాటికి డజను మంది ప్రయాణికులను తీసుకెళ్లగలిగేలా ఎలక్ట్రిక్ హైడ్రోజన్‌తో నడిచే విమానాలను తయారు చేస్తామని యూకేలోని కాట్స్‌వాల్డ్స్‌కి చెందిన ఒక కంపెనీ ప్రకటించింది.

ఒక వ్యక్తి ఏడాది వ్యర్థాలతో సుమారు 4 నుంచి 5 లీటర్ల విమాన ఇంధనం 'బయోఫ్యూయెల్' తయారు చేయొచ్చని హైగేట్ అంచనా వేశారు.

ఒక విమానం ప్రయాణికులతో లండన్ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు పది వేల మంది ఏడాది వ్యర్థాలు అవసరమవుతాయి.

తిరిగి వచ్చేందుకు మరో 10 వేల మంది వ్యర్థాలు అవసరమవుతాయి.

యూకేలో ఉత్పత్తవుతున్న మురుగు నీటితో దేశంలో ప్రస్తుతమున్న విమాన ఇంధన డిమాండ్‌లో 5 శాతాన్ని ఉత్పత్తి చేయొచ్చు.

చమురు వ్యర్థాలు, మొక్కజొన్న నూనెలు, శిలాజాలు కాని వాటి నుంచి తయారు చేసిన ఇంధనాలను సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయెల్‌గా వ్యవహరిస్తారు.

''మురుగునీటితో ఉత్పత్తి చేసే ఇంధనాన్ని పర్యావరణ వేత్తలు ఇష్టపడతారు. ఎందుకంటే, ఈ సమాజం నివారించలేని చెత్త ఏదైనా ఉందంటే అవి మానవ వ్యర్థాలే'' అని ఏవియేషన్ ఎన్విరాన్‌మెంట్ ఫెడరేషన్ పాలసీ డైరెక్టర్ కెయిట్ హెవిట్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం వినియోగిస్తున్న ఏవియేషన్ ఫ్యూయెల్‌లో సస్టైనబుల్ ఫ్యూయెల్ కేవలం 0.1 శాతం మాత్రమే. దీని ప్రకారం చూస్తే, హైగేట్ పెట్టుకున్న 5 శాతం లక్ష్యం అర్థవంతంగానే కనిపిస్తోంది.

ఇంకా చెప్పాలంటే, ఈ ఇంధనం వినియోగానికి వాడే ముడిపదార్థం ఎవరికీ అవసరం లేనిది. ప్రపంచమంతా దొరికేది.

''దీనిని యూకేలో కనిపెట్టినా, ఇది ప్రపంచానికి దొరికిన మంచి అవకాశం'' అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)