పాకిస్తాన్‌ కంటే భారత్‌లోనే అణ్వాయుధాలు ఎక్కువ, మరి చైనాలో..?

అణ్వాయుధం, క్షిపణి ప్రయోగం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

పాకిస్తాన్ కంటే భారత్ దగ్గర ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయి.

ఈ రెండు దేశాల కంటే ఎక్కువ అణ్వాయుధాలు చైనా దగ్గర ఉన్నాయి.

భారత్‌లో 172 న్యూక్లియర్ వార్‌హెడ్‌లు ఉన్నాయని, పాకిస్తాన్‌లో 170 ఉన్నాయని స్వీడిష్ థింక్ ట్యాంక్ స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) సోమవారం విడుదల చేసిన రిపోర్టులో పేర్కొంది. చైనాలో సుమారు 500 అణ్వాయుధ వార్‌హెడ్‌ల వరకు ఉన్నాయని అది చెబుతోంది.

అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్‌లు తమ ఆయుధ నిల్వలను నిరంతరం ఆధునీకరించుకుంటున్నాయని ఇయర్‌బుక్ 2024లో సిప్రీ పేర్కొంది.

కొన్ని దేశాలు గత సంవత్సరం అణ్వాయుధాలను తీసుకువెళ్లడానికి కొత్త వ్యవస్థలను ఎంచుకున్నాయి.

ఆ రిపోర్టు ప్రకారం 2024 జనవరి నాటికి ప్రపంచంలో సుమారు 12,221 వార్‌హెడ్‌లు ఉన్నాయి. వీటిలో 9,585 ఆయుధాలను అవసరమైతే వాడటానికి నిల్వ చేశారు.

వాట్సాప్
అణ్వాయుధాలు

ఫొటో సోర్స్, Getty Images

అణ్వాయుధాల పోటీ

అణ్వాయుధాల విషయంలో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య పోటీ ఉన్నట్లు నివేదికలోని డేటాను బట్టి తెలుస్తోంది.

2024 జనవరి నాటికి, భారత్ వద్ద న్యూక్లియర్ వార్‌హెడ్‌ల సంఖ్య 172కి పెరిగింది, అదే సమయంలో పాకిస్తాన్‌లో వీటి సంఖ్య 170కి చేరింది.

సిప్రీ నివేదిక ప్రకారం, భారత్‌ను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తుండగా, సుదూర ప్రాంతాలను చేరగల ఆయుధాల మోహరింపుపై భారత్ దృష్టి సారిస్తోంది.

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్

చైనాతో పెరుగుతున్న ఆందోళన

2023 జనవరిలో చైనాలో 410 వార్‌హెడ్‌లు ఉన్నాయని, ఏడాదిలో అంటే 2024 జనవరి నాటికి వాటి సంఖ్య 500కి పెరిగిందని.. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సిప్రీ తెలిపింది.

సిప్రీ రిపోర్టు ప్రకారం, చైనా క్షిపణులలో కొన్నింటికి అణు వార్‌హెడ్‌లు కూడా అమర్చి ఉండవచ్చు. రాబోయే రోజుల్లో చైనా సైన్య నిర్మాణం ఆసక్తికరంగా ఉండనుంది. బహుశా అది అమెరికా, రష్యా వంటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ఎక్కువగా మోహరించవచ్చు. కాగా, ఈ రెండు దేశాలతో పోలిస్తే చైనా ఆయుధాల నిల్వ చాలా తక్కువ.

భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియాలు తమ క్షిపణులను న్యూక్లియర్ వార్‌హెడ్‌లతో సన్నద్ధం చేసే దిశగా కదులుతున్నాయి. ఇప్పటికే రష్యా, ఫ్రాన్స్, అమెరికా ఈ పని చేస్తుండగా తాజాగా చైనా కూడా అదే దారిలో ఉంది. ఇది వార్‌హెడ్‌ల విస్తరణను మరింత వేగవంతం చేస్తుంది.

సిప్రి నివేదికపై డిఫెన్స్ విశ్లేషకులు, జేన్స్ డిఫెన్స్ వీక్లీ దక్షిణాసియా మాజీ కరస్పాండెంట్ రాహుల్ బేడీ, బీబీసీ ప్రతినిధి ఇక్బాల్ అహ్మద్‌తో మాట్లాడారు.

“ఈ రిపోర్టులో అతిపెద్ద విషయం ఏమిటంటే, చైనా అణ్వాయుధాల నిల్వ పెరుగుతోంది. ఈ రోజు 500 వార్ హెడ్‌లున్నాయి, 2030 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అవుతుందనేది ఆందోళన కలిగిస్తుంది’’ అని అన్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

రష్యా , అమెరికాలో ఎన్ని అణ్వాయుధాలున్నాయి?

సిప్రీ నివేదిక ప్రకారం ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాలలో అమెరికా, రష్యాలలోనే 90 శాతం ఉన్నాయి. 2023లో రెండు దేశాల అణ్వాయుధాల నిల్వలలో పెరుగుదల లేదు.

రష్యా 2023 జనవరిలో 36 న్యూక్లియర్ వార్‌హెడ్‌లను బలగాలతో మోహరించినట్లు అంచనా. బెలారసియన్ గడ్డపై రష్యా అణ్వాయుధాలను మోహరించినట్లు వార్తలు వచ్చినప్పటికీ, వాటి ఆధారాలు దొరకలేదు.

అయితే, రష్యా, అమెరికా రెండూ తమ నిల్వల నుంచి 1,200 అణ్వాయుధాలను తొలగించాయి. ఇవి క్రమంగా పాడైపోతున్నాయి.

పాశ్చాత్య దేశాలలో అణ్వాయుధాల నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటితో పోలిస్తే చైనాలో అణ్వాయుధ నిల్వలు తక్కువ.

అయినా కూడా చైనాను నిలవరించడంపై చాలా మంది మాట్లాడుతున్నారు.

ఇదే విషయంపై రాహుల్ బేడీని ప్రశ్నించగా.. ‘’అణ్వాయుధాల విషయంలో దేశంలో ఎన్ని ఆయుధాలు ఉన్నాయనేది ముఖ్యం కాదు, అవి ఎంత విధ్వంసకరమన్నదే ముఖ్యం’’ అని ఆయన అన్నారు.

ఉత్తరకొరియా

ఫొటో సోర్స్, Getty Images

అలర్ట్ మోడ్‌లో ఎన్ని వార్‌హెడ్‌లు ఉన్నాయి?

సిప్రి నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలిస్టిక్ క్షిపణులపై 2,100 వార్‌హెడ్‌లు అమర్చి ఉన్నాయి. ఇవన్నీ దాదాపు అమెరికా, రష్యాలకు చెందినవి. అయితే, తొలిసారిగా చైనా కూడా ఇదే పద్దతిని అవలంభించింది.

మరోవైపు, ఉత్తరకొరియా వద్ద 50 న్యూక్లియర్ వార్‌హెడ్‌లు ఉన్నాయి. అయితే, మరిన్ని అణ్వాయుధాల తయారీ దిశగా ఆ దేశం వేగంగా అడుగులు వేస్తోంది.

అణ్వాయుధాలను అభివృద్ధి చేయడం ఆ దేశ జాతీయ భద్రతా వ్యూహంలో ముఖ్యమైన భాగంగా మారిందని సిప్రి తెలిపింది. ఉత్తర కొరియా వద్ద 90 అణు వార్‌హెడ్‌లను తయారు చేసేందుకు సరిపడా అణు పదార్థాలు ఉన్నాయని సిప్రి అంచనా వేసింది.

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

ఇజ్రాయెల్ వద్ద ఎన్ని అణ్వాయుధాలున్నాయి?

తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ బహిరంగంగా అంగీకరించడం లేదని సిప్రి చెబుతోంది. అదేసమయంలో ప్లూటోనియం ఉత్పత్తి రియాక్టర్ సైట్‌ను ఇజ్రాయెల్ అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది.

అణ్వాయుధాల సంఖ్య పెరుగుతుండటంపై సిప్రి డైరెక్టర్ డాన్ స్మిత్ ఆందోళన వ్యక్తం చేశారు.

"ప్రచ్ఛన్న యుద్ధ యుగంలో ఆయుధాలు నాశనమవుతున్నందున, మొత్తం అణు వార్‌హెడ్‌ల సంఖ్య తగ్గుతోంది, అయితే ఆపరేషనల్ న్యూక్లియర్ వార్‌హెడ్‌ల సంఖ్య ఏడాదికేడాది పెరగడం దురదృష్టకరం" అని అన్నారు.

‘’రాబోయే రోజుల్లో ఇలాంటి వార్‌హెడ్‌ల సంఖ్య తగ్గబోదని తెలుస్తోంది. ఈ ఆయుధాల సంఖ్య మరింత పెరగనుంది. ఇది చాలా ఆందోళనకరం. ఈ సమయంలో ప్రపంచ అస్థిరతకు అనేక కారణాలు ఉన్నాయి. ఇవి రాజకీయ శత్రుత్వం, ఆర్థిక అసమానతలు, పర్యావరణ రంగంలో అస్థిరత పెరగడం, ఆయుధాల పోటీ కారణాలు కావొచ్చు. ప్రపంచంలోని ప్రధాన శక్తులు ఆయుధాల పోటీ నుంచి వైదొలగాల్సిన సమయం ఆసన్నమైంది" అని స్మిత్ అభిప్రాయపడ్డారు.

ఇది ప్రమాదకర సమయమని రాహుల్ బేడీ కూడా అంగీకరిస్తున్నారు.

"యుక్రెయిన్‌తో యుద్ధ సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అణ్వాయుధాలతో దాడి చేస్తామని బెదిరించారు. ఇరాన్ కూడా అణ్వాయుధాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇజ్రాయెల్ వద్ద కూడా ఉన్నాయి, కొత్త ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది. ప్రపంచ ఉనికికి ఇది నిజంగా ఆందోళనకరం" అని రాహుల్ బేడీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)