‘5 నెలల నా బిడ్డకు ఆహారం అందించి బతికించండి’ - ఓ కన్నతల్లి వేడుకోలు

- రచయిత, అద్నాన్ ఎల్ బర్ష్
- హోదా, బీబీసీ అరబిక్, గాజా కరస్పాండెంట్
ఐదు నెలల అబ్దుల్ అజీజ్ అల్-హౌరానీ ఉత్తర గాజాలోని అల్-అహ్లీ ఆసుపత్రిలో మంచంపై పడుకుని ఉన్నాడు. ఆ చిన్నారి పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు అతని చిక్కిపోయిన శరీరం చూస్తే అర్థమవుతుంది.
కేవలం 3 కేజీల బరువు మాత్రమే ఉన్న అబ్దుల్ అజీజ్‌ను తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు చికిత్స అందించే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి కొద్దిరోజుల ముందే బయటికి తెచ్చారు.
తన బిడ్డకు అవసరమైన ఆహారం గాజాలో దొరకడం లేదని అబ్దుల్ తల్లి చెప్పారు.
''నా ఒక్కగానొక్క బిడ్డ. ఐదు కేజీలు బరువు ఉండేవాడు. బిడ్డ ఆరోగ్యం గురించి చాలా ఆందోళనగా ఉంది'' అని ఆమె అన్నారు.
"బోర్డర్లు మూసివేయడం వల్ల విదేశాలకు తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు" అన్నారు.
ఇది అబ్దుల్ అజీజ్ ఒక్కడి కథ మాత్రమే కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న 8,000 వేల మంది చిన్నారులు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వారిలో 1,600 మందిలో పోషకాహార లోపం తీవ్రంగా ఉంది.
గత వారం డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రెయేసస్ మాట్లాడుతూ, ''పోషకాహార లోపం కారణంగా ఇప్పటికే 32 మంది చనిపోయారు. వారిలో 28 మంది ఐదేళ్లలోపు చిన్నారులు" అన్నారు.
గాజాలోని ప్రతి 10 మంది చిన్నారుల్లో 9 మంది తీవ్రమైన ఆహార పేదరికం అనుభవిస్తున్నారని, రోజుకు రెండు లేదా అంతకంటే తక్కువ సార్లు మాత్రమే ఆహారం తీసుకుంటున్నారని ఐక్యరాజ్యసమితి బాలల ఏజెన్సీ యూనిసెఫ్ జూన్ నెల ప్రారంభంలో నివేదించింది.
''నెలల తరబడి యుద్ధం, మానవతా సాయంపై ఆంక్షలు ఆహారం, ఆరోగ్య వ్యవస్థలను కుప్పకూల్చాయి. ఫలితంగా ఇలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి. పోషకాహార లోపంతో చిన్నారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది''అని పేర్కొంది.


ఖాళీగా మార్కెట్లు
నేను గాజాలోనే పుట్టాను. కుటుంబంతో కలిసి అక్కడే జీవించాను. నేను ఫిబ్రవరి వరకు అక్కడి నుంచి రిపోర్ట్ చేశాను.
యుద్ధానికి ముందు, ఉత్తర గాజాలోని అల్ తుఫా డిస్ట్రిక్ట్ వేలాది మంది కొనుగోలుదారులతో సందడిగా ఉండేది. కానీ, ఇఫ్పుడు అక్కడ పరిస్థితేంటని అడిగేందుకు ఎవరికైనా ఫోన్ చేస్తే, ఎడారిలా కనిపించే ఫోటోలను వారు నాకు పంపుతారు.
''టమోటాలు లేవు, దోసకాయలు లేవు, పండ్లు లేవు, బ్రెడ్ లేదు'' అని మార్కెట్‌లో ఉన్న పెద్దాయన సలీం షబాకా చెబుతున్నారు. వాడేసిన దుస్తులు, కొన్ని ప్యాక్ చేసిన ఆహార పదార్ధాలు మాత్రమే కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు.
''జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. కొనడానికి, అమ్మడానికి ఏమీ లేదు'' అని మరో చిరువ్యాపారి తెలిపారు.
''నాకు ఏడుగురు పిల్లలు. మాకు ఎలాంటి సాయం అందలేదు'' అన్నారు.
ప్రతిరోజూ టిక్కేయాస్ (ఉచితంగా ఆహారం అందించే చిన్న దుకాణాలు) ముందు భారీ క్యూ లైన్లు ఉంటాయి. ఉత్తర గాజాకు చెందిన కొందరు చాలా మంది ఆహారానికి అవసరమైన నిధులు సమకూర్చారు. కానీ, అందుకు అవసరమైన సరుకుల కొరతతో భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది.
ప్రస్తుతానికి కొందరు చిన్నారులు తాజా ఆహారం కోసం, మరికొందరు నీళ్లు తీసుకురావడానికి చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది.

ఆకలి, అనారోగ్యం
దాదాపు ప్రతిరోజూ నేను గాజాలోని బంధువులు, స్నేహితులతో మాట్లాడతా. వాళ్లు పంపించిన ఫోటోలు చూస్తే వారు బరువు తగ్గినట్లు, వారి ముఖాల్లో మార్పులు అర్థమవుతాయి.
''ఆహార సరఫరా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నా, అవసరమైన వారికి తగినంత పరిమాణంలో, నాణ్యమైన ఆహారం అందుతున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు'' అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ హెచ్చరించారు.
భద్రత లేకపోవడం, ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోవడం వల్ల తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న రోగుల కోసం కేవలం రెండు స్టెబిలైజేషన్ సెంటర్లు మాత్రమే పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. వైద్య సేవలు అందకపోవడం, స్వచ్ఛమైన నీరు, పారిశుధ్యం లేకపోవడం వంటివి పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల్లో ముప్పును మరింత పెంచుతుందని ఆయన హెచ్చరించారు.
అంటే, హెపటైటిస్ వంటి అంటువ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. చాలా వరకూ ఆస్పత్రులు, క్లినిక్‌లు మూతపడ్డాయి. పనిచేస్తున్న ఆస్పత్రులు కూడా దెబ్బతిన్నాయి. అవి కూడా రోగులతో చాలా రద్దీగా ఉన్నాయి.
ఉత్తర గాజాలోని జబాలియాకు చెందిన ఉమ్ ఫౌద్ జాబెర్ అనే పెద్దావిడ మాట్లాడుతూ, "మేం చిక్కిపోయాం. శక్తివిహీనంగా తయారయ్యాం. ఇప్పటికే చాలాసార్లు అక్కడికీ ఇక్కడికీ మారాల్సి వచ్చింది. మనుషులు రోజూ చచ్చిపోతూనే ఉన్నారు."
''జంతువులు తినే తిండి తిన్నాం. సరైన ఆహారం అందక పిల్లలు, మహిళలు చనిపోతున్నారు. రోగాలు మా శరీరాలను తినేశాయి.''
నిత్యం డజన్ల కొద్దీ పోషకాహార లోపం కేసులు నమోదవుతున్నాయని, ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, బాలింతల్లో ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయని హమాస్ ఆరోగ్య శాఖ అత్యవసర కమిటీ సభ్యులు, పాలస్తీనియన్ డాక్టర్ మోటాసెమ్ సయీద్ సలా ధ్రువీకరిస్తున్నారు.
ఇప్పటికే చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని, ఇప్పుడు ఇతర ఆరోగ్య సమస్యలతో కూడా సతమతమవుతున్నారని ఆయన చెప్పారు.

మానవతా సాయం అందించడంలో సవాళ్లు
అక్టోబరు 7న హమాస్ ఇజ్రాయెల్‌పై జరిపిన దాడిలో సుమారు 1,200 మందిని మరణించడం, 251 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లడంతో యుద్ధం మొదలైంది.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 37,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని, లక్షల మంది గాయపడ్డారు లేదా నిరాశ్రయులయ్యారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
గాజా ప్రజలు మానవతా సాయం కోసం చూశారు, కానీ తగినంత సామగ్రి అందడం లేదు.
ఒకానొక సమయంలో, గాజాకు దక్షిణాన ఈజిప్ట్ బోర్డర్‌లో ఉన్న రఫా క్రాసింగ్ మానవతా సాయం వచ్చేందుకు ప్రధాన ప్రవేశ ద్వారంగా ఉండేది. కానీ, ఇప్పుడు గాజా వైపు సరిహద్దును ఇజ్రాయెల్ నియంత్రణలోకి తీసుకోవడంతో అది మూతపడింది.
దక్షిణాన ఇజ్రాయెల్ వైపు కెరెమ్ షాలోమ్ గేట్‌వే కూడా ఉంది. ఇది తెరిచి ఉన్నప్పటికీ, యుద్ధం కారణంగా ఈ మార్గంలో మానవతా సాయం అంతంతమాత్రంగానే అందుతోంది.
కొత్త క్రాసింగ్ పాయింట్ల ద్వారా కొన్ని ఆహార పదార్థాలు ఉత్తర గాజాకి కూడా సరఫరా అవుతున్నాయి. అయితే, ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం, మే 7 నుంచి మానవతా సాయం మూడింట రెండొంతులు తగ్గిపోయింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రకారం, దక్షిణాదిలో కూడా ఆహార సరఫరాలు తగ్గిపోతున్నాయి.
మానవతా సాయం సరఫరా కోసం అమెరికా నిర్మించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా ప్రతికూల వాతావరణం కారణంగా దెబ్బతిని చాలా రోజులుగా పనిచేయడం లేదు. సముద్ర ఆటుపోట్ల కారణంగా తాత్కాలికంగా దానిని తరలించారు.
గాజాకు 35 లారీలకు మించి రావడం లేదని, ఉత్తర గాజాలోని 7,00,000 మంది ప్రజల ఆహార అవసరాలకు, ఔషధాలకు ఇవే ఏకైక మార్గమని గాజలోని హమాస్ ప్రభుత్వం తెలిపింది.
అయితే, మానవతా సాయం సమన్వయ పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న ఇజ్రాయెలీ సంస్థ కోగాట్ ''యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి గాజాకు ఒక బిలియన్ పౌండ్ల ఆహారం సరఫరా అయింది'' అని జూన్ 13న ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
''గాజాలోకి ఔషధాలతో పాటు, మానవతాసాయానికి సంబంధించి ఎలాంటి పరిమితీ లేదు'' అని పేర్కొంది.
అదే రోజు 220 లారీలు గాజాలోకి ప్రవేశించాయని మరోపోస్టులో కోగాట్ తెలిపింది. ఆహారం, ఇతర సామగ్రి పంపిణీలో ఏజెన్సీలు వైఫల్యం చెందాయని నిందించింది. మరో 1300 కంటే ఎక్కువ లారీలు వేచివున్నాయని తెలిపింది.
యుద్ధం, శాంతిభద్రతలు క్షీణించడం, ఇజ్రాయెల్ ఇతర ఆంక్షల కారణంగా మానవతా సాయం పంపిణీపై తీవ్ర ప్రభావం పడుతోందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- రుషికొండ ‘రహస్య’ భవనాల్లో ఏముందంటే?
- మెదక్‌లో ఉద్రిక్తత: ‘మేం ఏం తప్పు చేశామని మా హాస్పిటల్‌పై దాడి చేశారు?’
- ‘స్త్రీ తన వస్త్రాలతో పాటు సిగ్గును కూడా విడిచేయాలి’ - సెక్స్ గురించి ప్రాచీన కాలంలో మహిళలు ఎలా చర్చించుకునేవారు?
- అపాయంలో ఉపాయం: ఎడారిలో సింహాలబారి నుంచి తప్పించుకున్న ఇద్దరు స్నేహితురాళ్ళ కథ...
- సన్‌స్క్రీన్ లోషన్లు వాడుతున్నారా, ఈ ఎనిమిది విషయాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














