తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీ కార్యాలయం కూల్చివేత - కక్షసాధింపు రాజకీయమా? నిబంధనల అమలా?

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
గుంటూరు జిల్లాలోని మంగళగిరి-తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 202/A1లోని రెండు ఎకరాల భూమిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ) కార్యాలయాన్ని అనుమతులు లేవంటూ అధికారులు కూల్చివేశారు.
భూమిని అప్పగించకముందే నిర్మాణాలు ప్రారంభించడాన్ని చట్ట ఉల్లంఘనగా పేర్కొంటూ నోటీసులు ఇచ్చి, చర్యలు తీసుకున్నట్టు మంగళగిరి - తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు.
పూర్తికావస్తున్న దశలో తమ కార్యాలయం నిర్మాణాన్ని కూల్చివేయడం ద్వారా టీడీపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్‌ఆర్‌సీపీ ఆరోపించింది.
దీనిని ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలంటూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు.


ఆ స్థలం ఎవరిది?
గుంటూరు జిల్లాలోని మంగళగిరి- తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 202/A1లోని 2 ఎకరాల భూమిని వైఎస్ఆర్‌సీపీ కార్యాలయ నిర్మాణానికి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేటాయించింది. ఆ భూమి ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉంది.
మొత్తం 9 ఎకరాల విస్తీర్ణం ఉన్న ప్రాంతంలో 2 ఎకరాలను ఏడాదికి రూ. వెయ్యి ధరకు 33 ఏళ్లకు లీజు విధానంలో వైఎస్‌ఆర్‌సీపీకి కేటాయించారు.
రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు ప్రభుత్వ స్థలాలను కేటాయించడం, అందులో పార్టీ కార్యాలయాల నిర్మాణం ఆనవాయితీగా వస్తోంది.
ప్రస్తుత టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కూడా ఆత్మకూరులోని ప్రభుత్వ స్థలంలోనే నిర్మించారు.
అప్పట్లో టీడీపీకి ఆ స్థలం కేటాయించడంపై వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అభ్యంతరం తెలిపారు. కోర్టులో కేసులు కూడా వేశారు.
వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ కార్యాలయం నిర్మాణానికి నీటిపారుదల శాఖకు చెందిన బోట్ యార్డ్ స్థలంలో కొంత భాగాన్ని కేటాయించడం వివాదాస్పదమైంది.
ఆ చర్యను అప్పటి విపక్ష టీడీపీ విమర్శించింది.
విలువైన స్థలాన్ని నామమాత్రపు లీజు పేరుతో వైఎస్ఆర్‌సీపీ కాజేస్తోందని విమర్శించింది.
మొన్నటి సాధారణ ఎన్నికల ఫలితాల తరువాత అధికారం మారి కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి ముందు జూన్ 10న సీఆర్‌డీఏ వైఎస్ఆర్‌సీపీకి నోటీసులు ఇచ్చింది.
వైఎస్ఆర్‌సీపీ కార్యాలయం పేరుతో అనుమతులు లేకుండా సాగుతున్న నిర్మాణాల
గురించి వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

నోటీసులపై కోర్టుకి..
2023 ఫిబ్రవరి 23న జారీ చేసిన జీఓ నంబర్ 52 ప్రకారం తాడేపల్లి బోట్ యార్డు స్థలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు. అదే సమయంలో ఇరిగేషన్ అనుమతులు తీసుకోవాల్సి ఉందని ప్రస్తావించారు.
ఆ సర్వే నంబర్‌లోని 19 ఎకరాల్లో 9 ఎకరాలు కాలువ కాగా, మరో 5 ఎకరాలు సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం రెవెన్యూ శాఖ కోరింది. మిగిలిన స్థలంలో 2 ఎకరాలు వైఎస్ఆర్‌సీపీ కార్యాలయానికి కేటాయించారు. ఇరిగేషన్ శాఖ అనుమతి లేకుండానే సీసీఎల్ఏ, కలెక్టర్ కూడా ఆమోదంతో భవన నిర్మాణం మొదలైందని సీఆర్‌డీఏ పేర్కొంది.
ఇరిగేషన్ శాఖ అనుమతి లేకుండా స్థలం తీసుకుని, భవన నిర్మాణానికి సీఆర్‌డీఏ పర్మిషన్ కోరకుండా పనులు చేపట్టినట్టు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో సీఆర్‌డీఏ తెలిపింది.
ఎన్నికల ఫలితాలకు ముందే మే 20, జూన్ 1 తేదీలలో రెండు నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించింది. జూన్ 10న నిర్మాణం కూల్చివేత నోటిసులు ఇచ్చినా వైఎస్ఆర్‌సీపీ స్పందించలేదని సీఆర్‌డీఏ పేర్కొంది.
సీఆర్‌డీఏ చట్టం సెక్షన్ 115 ప్రకారం అక్రమ నిర్మాణాలు కూల్చేసే హక్కు ఉందని, దాని ప్రకారమే చర్యలు తీసుకున్నట్టు తెలిపింది.
వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయం పేరుతో మొత్తం 15 ఎకరాల స్థలాన్ని కాజేసేందుకు ఆ పార్టీ కుట్రపన్నుతోంది అంటూ టీడీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు.
సీఆర్‌డీఏ, మంగళగిరి-తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాంటూ ఆయన చేసిన ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ అయ్యాయి.
ఆ నోటీసులను నిలిపివేసి, భవనాల కూల్చివేతను ఆపాలంటూ వైఎస్‌ఆర్‌సీపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై కోర్టు జూన్ 21న ఉత్తర్వులు ఇచ్చింది.
కోర్టు ఉత్తర్వులను తాము సీఆర్డీయేతో పాటుగా మంగళగిరి-తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ అధికారులకు కూడా అందించినట్టు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు.
చట్టం ప్రకారం వ్యవహరించాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
నీటిపారుదల శాఖ అధీనంలోని భూమిని వైఎస్‌ఆర్‌సీపీకి రికార్డుల ప్రకారం అప్పగించలేదని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు.
అంతేగాకుండా అక్కడ భవన నిర్మాణం కోసం ఎటువంటి అనుమతులు కోరలేదని అంటున్నారు.
తమ పరిధిలో లేని భూమిలో నిర్మాణాలు చేపట్టడం చట్టవిరుద్ధ చర్య కాబట్టి దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వైఎస్ఆర్‌సీపీ ఏమంటోంది
అధికారుల వాదనను వైఎస్‌ఆర్‌సీపీ ఖండిస్తోంది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వాదిస్తోంది.
సీఆర్‌డీఏ తీరుపై న్యాయపోరాటం చేస్తామని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు.
"మా పార్టీకి నోటీసులు ఇచ్చారు. అవి చెల్లవంటూ మేం హైకోర్టుకి వెళ్లాం. చట్టం పరిధిలో వ్యవహరించాల్సిన అధికారులు తెల్లవారుజామున దాడికి దిగారు. శ్లాబ్ వేసేందుకు అంతా సిద్ధం చేసి ఉండగా నిర్మాణాన్ని నేల కూల్చారు. దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోర్టుని కోరుతాం. టీడీపీ కార్యాలయాల కోసం నామమాత్రపు లీజుతో స్థలాలు తీసుకోగా లేనిది, వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయం నిర్మిస్తే నేరమా.. భూమి కేటాయిస్తూ రెండేళ్ల క్రితమే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా అనుమతులు లేవంటూ వేధింపులకు దిగుతున్నారు" అని లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు.
సూపర్- 6 అమలు చేయకుండా పార్టీ కార్యాలయం కూల్చడానికి బుల్డోజర్లు పంపించిన చంద్రబాబు ప్రజాస్వామ్యవాదా? విధ్వంసకారుడా? అంటూ మాజీ నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.
వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కార్యాలయ కూల్చివేత మీద స్పందించారు. ఈ చర్యలు అందరూ ఖండించాలంటూ ఆయన ఎక్స్‌లో(ట్విటర్) కోరారు.

ఫొటో సోర్స్, GVMC

ఫొటో సోర్స్, GVMC
విశాఖ, అనకాపల్లిలోనూ నోటీసులు
తాడేపల్లి కార్యాలయంతో పాటుగా విశాఖపట్నంలోని ఎండాడలో నిర్మించిన వైఎస్‌ఆర్‌సీపీ
కార్యాలయానికి కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. అనకాపల్లి జిల్లా కార్యాలయ నిర్మాణంపైనా వివాదం సాగుతోంది.

అప్పుడు ప్రజావేదిక..
గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అప్పట్లో ప్రభుత్వ నిధులతో చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన ప్రజా వేదిక కూల్చివేతను పలువురు గుర్తు చేస్తున్నారు.
అప్పట్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ ప్రజావేదికను కూల్చివేశారు.
ఈసారి నిబంధనలు పాటించలేదంటూ వైఎస్ఆర్‌సీపీ కార్యాలయం కూల్చివేశారు.
టీడీపీ ఏమంటోంది
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ భూముల ఆక్రమణల దందాను అడ్డుకుంటామని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర రావు అన్నారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆక్రమణలకు ఆస్కారం లేకుండా చేస్తామనడానికి తాజా చర్యలు ఉదాహరణగా నిలుస్తాయని అన్నారాయన.
‘నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీ కార్యాలయం పనులు అనుమతులు తీసుకోకుండానే సాగుతున్నాయి. మత్స్యకారుల బోట్ యార్డు స్థలాన్ని కాజేసే కుట్ర ఇది. గతంలో మత్య్సకారులు బోట్లు తయారు చేసుకునేందుకు స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. జగన్ ప్రభుత్వం దాన్ని తరలించేసింది. ఈ విలువైన భూమిపై కన్నేసి సొంతం చేసుకోవాలని చూస్తోంది. అందుకే నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న చర్యలను సీఆర్‌డీఏ అడ్డుకుంది. ఈ కూల్చివేతను టీడీపీ సమర్థిస్తోంది’ అని ఆయన మీడియాతో అన్నారు.
జగన్ పాలనలో సాగిన అక్రమాలపై పలు ఫిర్యాదులు వస్తున్నాయని, అన్నింటిపైనా చర్యలు ఉంటాయని ఉమామహేశ్వరరావు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మెదక్: బక్రీద్ సందర్భంగా ఇక్కడ జరిగిన గొడవేంటి? ఎందుకు జరిగింది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















