ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం: తాగేందుకు నీళ్లు దొరక్క 'ఎముకల గూళ్ళు'గా మారిపోతున్న గాజా పిల్లలు

గాజాకు చెందిన యూనిస్ జుమా
    • రచయిత, జోన్ డోనిసన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఎనిమిది నెలల యుద్ధం తొమ్మిదేళ్ల యునిస్ జుమాను 'ఎముకలు' కనిపించేలా చాలా సన్నగా మార్చేసింది.

దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఆసుపత్రి బెడ్‌పై దాదాపు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు యునిస్. స్వచ్ఛమైన నీళ్లు లేక 'ఎముకల గూడులా కనిపిస్తున్న అతని బలహీనమైన శరీరం' చూడటం కష్టం.

ఆ చిన్నారి చేతులు, కాళ్ళు అగ్గిపుల్లల మాదిరి సన్నగా ఉన్నాయి. మోకాళ్ళు ఉబ్బి పోయాయి. అతని ఛాతీ ప్రతి శ్వాసకు కదులుతూ పక్కటెముకలను స్పష్టంగా చూపిస్తోంది. బాలుడు పక్షవాతం (సెరెబ్రల్ పాల్సీ) తో బాధపడుతున్నాడు.

"నా కొడుకు ఇంతకు ముందు ఆరోగ్యంగా ఉండేవాడు." అని బాలుడి తల్లి ఘనిమా జుమా చెప్పారు. పోషకాహార లోపం, డీహైడ్రేషన్ కారణంగా ఇలా మారాడని ఆమె అన్నారు.

“ఒక బాటిల్ నీళ్లు కూడా లేవు. పిల్లలు చాలా దూరం నడుస్తారు. కలుషితమై నీరే మాకు దొరుకుతుంది.” అని ఘనిమా చెప్పారు.

వాట్సాప్
యూనిస్ తల్లి ఘనిమా
ఫొటో క్యాప్షన్, యూనిస్ తల్లి ఘనిమా అతన్ని ఆసుపత్రికి తీసుకొచ్చారు.

‘పరిస్థితి దిగజారుతోంది’

నాజర్ హాస్పిటల్ వద్ద కారిడార్ వెంబడి ఐదేళ్ల బాలిక, తాలా ఇబ్రహీం ముహమ్మద్ అల్-జలాత్ ఉన్నారు. ఆమె కేవలం మేల్కొని ఉంది, కానీ కదలడం లేదు, ఆమె పాల కళ్లు లోపలికి వెళ్లిపోయాయి. తాలా కూడా తీవ్రంగా డీహైడ్రేషన్, పోషకాహార లోపంతో ఉంది.

తాలా తండ్రి ఇబ్రహీం ముహమ్మద్ అల్-జలత్, ఆమె చేతిని పట్టుకొని, బెడ్ పక్కనే కూర్చున్నారు.

మండే ఎండలు, 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు, స్వచ్ఛమైన నీరు లేకపోవడం తన కూతురిని మరణానికి చేరువ చేశాయని ఆయనకు తెలుసు.

తాలా, ఆమె తండ్రి ఇబ్రహీం ముహమ్మద్ అల్-జలత్
ఫొటో క్యాప్షన్, తాలా తండ్రి ఇబ్రహీం ముహమ్మద్ అల్-జలత్, ఆమె చేతిని పట్టుకొని, బెడ్ పక్కనే కూర్చున్నారు.

"పరిస్థితి మరింత దిగజారుతోంది" అని ముహమ్మద్ అంటున్నారు.

"మా టెంట్‌లో చాలా వేడిగా ఉంటోంది. మేం తాగే నీరు ఖచ్చితంగా కలుషితం. ఎందుకంటే చిన్నవాళ్లు, పెద్దలు అందరూ అనారోగ్యం బారిన పడుతున్నారు." అని అన్నారు.

ఇళ్లు ధ్వంసమవడంతో వందల వేలమంది గాజన్లు ఇప్పుడు నిరాశ్రయులయ్యారు. మండుతున్న ఎండ నుంచి తక్కువ రక్షణతో తాత్కాలిక శిబిరాల్లో నివసిస్తున్నారు. శుభ్రంగా ఉన్నా, లేకున్నా ఆ నీటిని పొందడమూ కష్టంగానే ఉంది. పంపిణీ కేంద్రాల వద్ద పొడవైన లైన్లు ఉంటున్నాయి.

మరుగుదొడ్లు కొన్నే ఉండటంతో డ్రైనేజీ వ్యవస్థ బాగా దెబ్బతింది. అందుబాటులో ఉన్న నీరు కలుషితమవుతోంది.

డాక్టర్ అహ్మద్ అల్ ఫారీ
ఫొటో క్యాప్షన్, పేగు ఇన్ఫెక్షన్‌లతో బాధపడుతున్న పిల్లలకు డాక్టర్ అహ్మద్ ఫారీ చికిత్స చేస్తున్నారు.

వైద్యులు ఏమంటున్నారు?

"ప్రస్తుతం గాజాలో పేగు ఇన్ఫెక్షన్‌లకు అతిపెద్ద కారణం ఈ పిల్లలకు సరఫరా అయిన కలుషితమైన నీరే." అని నాజర్ హాస్పిటల్‌లోని చిల్డ్రన్ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ అహ్మద్ అల్-ఫారీ చెప్పారు.

"పేగు ఇన్ఫెక్షన్‌తో తలెత్తే మొదటి సమస్య వాంతులు, విరేచనాలతో డీహైడ్రేషన్‌కు గురవడం. రెండోది హెపటైటిస్ సీ లేదా ఏ" అని ఆయన చెప్పారు.

ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ ప్రకారం గాజాలో 67 శాతం నీరు, పారిశుద్ధ్య వ్యవస్థ ఇంతకుముందే సరిగా లేదు. ఇప్పుడు నాశనం చేశారు.

"నీరు, డ్రైనేజీ నెట్‌వర్క్‌లను పునర్నిర్మించడానికి అంతర్జాతీయ ప్రయత్నం అవసరం" అని ఖాన్ యూనిస్ మునిసిపాలిటీలో వాటర్ ఇంజనీర్ సలామ్ షరాబ్ చెప్పారు.

"ఖాన్ యూనిస్‌లో మేం 170 నుంచి 200 కి.మీల మేర పైపులను కోల్పోయాం. బావులు, నీటి ట్యాంకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి" అని అన్నారు.

గాజా
ఫొటో క్యాప్షన్, యుద్ధంలో గాజా నీటి మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ప్రతిరోజు కెరెమ్ షాలోమ్ క్రాసింగ్ ద్వారా దాదాపు మానవతా సహాయ సరుకులతో వచ్చే 200 ట్రక్కులను గాజాలోకి అనుమతిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. సహాయ సంస్థలు వాటిని పంపిణీ చేయకపోవడం లేదని సైన్యం ఆరోపిస్తోంది.

మరోవైపు, దక్షిణ గాజాలోని రఫా చుట్టూ కొనసాగుతున్న పోరాటాలతో తమ కార్యకలాపాల నిర్వహణ ప్రమాదకరంగా ఉన్నాయని సహాయ సంస్థలు వాదిస్తున్నాయి. అవసరమైన దానికంటే చాలా తక్కువ మొత్తంలో అనుమతిస్తున్నట్లు ఆ సంస్థలు చెబుతున్నాయి.

నీరు, ఆహారం కోసం గాజన్లలో పెరుగుతున్న నిరాశ కూడా దోపిడీల ప్రమాదాన్ని పెంచుతోంది. సహాయక ట్రక్కులను పౌరులతో సహా ముష్కరులు దోచుకున్నట్లు రిపోర్టులూ ఉన్నాయి.

అదే సమయంలో గాజా ప్రజల ఆకలిని ఇజ్రాయెల్ ఆయుధంగా ఉపయోగిస్తోందని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ప్రాసిక్యూటర్ ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌లను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

గాజా
ఫొటో క్యాప్షన్, నీరు శుభ్రంగా ఉన్నా, లేకున్నా వాటిని పొందడమూ కష్టంగానే ఉంది. పంపిణీ కేంద్రాల వద్ద పొడవైన లైన్లు ఉంటున్నాయి.

ఆకలితో 10 లక్షల మంది

అంతర్జాతీయ కోర్టులో లేవనెత్తిన ఈ డిమాండ్‌పై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గాజాలో కరువుకు కారణమవుతున్నామన్న సహాయ సంస్థల ఆరోపణలు నిరాధారమని ప్రకటించింది. హమాస్ యుద్ధాన్ని ప్రారంభించి పాలస్తీనియన్లకు కష్టాలు, నిస్సహాయతను తెచ్చిపెట్టిందని ఆరోపించింది.

జులై నెలలో గాజాలో పదిలక్షల మందికి పైగా ప్రజలు ఆకలితో బాధపడుతున్నారని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. మరోవైపు, గాజాలో ఎలాంటి మానవతా సంక్షోభం లేదని ఇజ్రాయెల్ మంత్రులు అంటున్నారు.

కానీ పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న కొడుకుని ఒడిలో పెట్టుకుని నాజర్ హాస్పిటల్ కారిడార్‌లో నిలబడిన ఘనిమా జుమా మాత్రం అలా అనుకోవడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)