హజ్ యాత్ర: ఫారాల్లో కోళ్లలా, జంతువుల్లా చూశారంటున్న యాత్రికులు.. నీడ, నీళ్లు లేక వందల మంది మృతి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మునజ్జా అన్వర్
- హోదా, బీబీసీ ఉర్దూ
సౌదీ అరేబియాలోని మక్కాకు హజ్ యాత్ర కోసం వెళ్లిన వారిలో వందలాది మంది విపరీతమైన వేడి, కనీస సౌకర్యాల లేమి కారణంగా మృతి చెందడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
562 మందికి పైగా యాత్రికులు మృతి చెంది ఉంటారని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.
ఏఎఫ్‌పీ వార్తాసంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సంఖ్య దాదాపు వెయ్యి వరకు ఉండొచ్చు. మృతుల్లో అత్యధికులు ఈజిప్టు పౌరులు.
పాకిస్తాన్‌కు చెందిన 35 మందికి పైగా యాత్రికులు చనిపోయారని పాక్ హజ్ మిషన్ డైరెక్టర్ అబ్దుల్ వహాబ్ సూమ్రో వెల్లడించారు.
వీరిలో 26 మంది కాబా చేరుకోకముందే మక్కాలో చనిపోయారని, మిగతావారు హజ్ ఆచారాలను పూర్తి చేస్తుండగా మృతి చెందినట్లు బీబీసీకి ఆయన చెప్పారు.
అయితే, ఈ మరణాలకు కారణాలను ఆయన వెల్లడించలేదు.
సరైన సౌకర్యాలు కల్పించలేదని, హజ్ యాత్ర నిర్వహణ సరిగ్గా లేదంటూ పాకిస్తాన్‌కు చెందిన హజ్ యాత్రికులు ఆరోపించారు.
ఈ ఫిర్యాదులపై పాకిస్తాన్ హజ్ మిషన్‌ను బీబీసీ సంప్రదించింది. కానీ, ఇప్పటివరకు వారినుంచి ఎలాంటి స్పందన రాలేదు.
మృతుల సంఖ్యను సౌదీ అరేబియా ఇంకా విడుదల చేయలేదు.
గత 30 ఏళ్లలో హజ్ యాత్ర సందర్భంగా తొక్కిసలాట, టెంట్‌లకు మంటలంటుకోవడం, ఇతర ప్రమాదాల కారణంగా వందలాది మంది మరణించారు.
సౌదీ అరేబియా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది దాదాపు 18 లక్షల మంది హజ్ యాత్ర చేశారు. వీరిలో 16 లక్షల మంది విదేశీయులు.


ఫొటో సోర్స్, Getty Images
హజ్ యాత్రలో విపరీతమైన వేడి కారణంగా మరణించిన వారిలో ఎక్కువ మంది ఈజిప్టుకు చెందినవారని ఇద్దరు అరబ్ దౌత్యవేత్తలను ఉటంకిస్తూ వార్తాసంస్థ ఏఎఫ్‌పీ వెల్లడించింది.
విపరీతమైన వేడి వల్లే ఎక్కువ మంది మరణించారని.. అందులో 323 మంది ఈజిప్టు పౌరులు కాగా, 60 మంది జోర్డాన్‌కు చెందినవారు ఉన్నట్లు ఏఎఫ్‌పీ పేర్కొంది.
ఈజిప్టు వైద్య బృందం చెప్తున్న ప్రకారం బాధితులలో చాలామంది వివరాలు ఈజిప్ట్ ప్రభుత్వం వద్ద రికార్డ్ కాలేదు, ఆ కారణంగా వారు సరైన వసతి లేక వీధుల్లోనే ఉండాల్సి వచ్చిందని రాయిటర్స్ నివేదించింది.
హజ్ యాత్రలో వడదెబ్బ కారణంగా ఒమన్ చెందిన 41 మంది, ట్యునీషియాకు చెందిన 25 మంది, ఆరుగురు జోర్డాన్ పౌరులు చనిపోయినట్లు ఆయా దేశాలు ధ్రువీకరించాయి.
హజ్ యాత్రలో చనిపోయిన 41 మంది జోర్డాన్ యాత్రికులను వారి కుటుంబసభ్యులు కోరినట్లుగా మక్కాలోనే ఖననం చేసేందుకు జోర్డాన్ విదేశీ వ్యవహారాల శాఖ అనుమతించింది.
జోర్డాన్ ప్రభుత్వం పంపిన హజ్ బృందంలో ఈ 41 మంది సభ్యులు కాదని తెలిసింది. అలాగే జోర్డాన్ నుంచి హజ్‌కు వెళ్లిన 106 మందిలో 84 మంది ఆచూకీ తెలియట్లేదని జోర్డాన్ రాయబార కార్యాలయం వెల్లడించింది.
హజ్ యాత్రలో 136 మంది ఇండోనేసియా పౌరులు చనిపోయారని, వీరిలో ముగ్గురు వడదెబ్బతో చనిపోయారని జూన్ 19న ఫ్రాన్స్‌కు చెందిన ‘లె మోండే’ వార్తా పత్రిక పేర్కొంది.
వేడి, ఇతర ఇబ్బందుల కారణంగా 2,764 మంది అనారోగ్యానికి గురయ్యారని ఆదివారం సౌదీ అరేబియా తెలిపింది.
సోమవారం మక్కాలో 51.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని సౌదీ అరేబియా ప్రభుత్వ టీవీ చానెల్ పేర్కొంది.
తప్పిపోయిన తమవారి కోసం వారి కుటుంబ సభ్యులు సౌదీలోని ఆసుపత్రుల్లో వెతుకుతున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.

ఫొటో సోర్స్, REUTERS
‘జంతువుల్లా చూశారు’
పాకిస్తాన్ ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికులతో మాట్లాడి అక్కడి పరిస్థితులు, ఏర్పాట్ల గురించి తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.
ఇస్లామాబాద్‌కు చెందిన 38 ఏళ్ల అమ్నా (పేరు మార్చాం), తన భర్తతో కలిసి హజ్ యాత్రకు వెళ్లారు. ప్రభుత్వం పంపిన హజ్ బృందంలో వీరిద్దరూ ఉన్నారు. అయితే, హజ్ ఏర్పాట్లపై ఆమె అసంతృప్తిగా ఉన్నారు. మక్కానుంచి ఆమె బీబీసీతో మాట్లాడారు.
‘‘నాకు చాలా నిరాశగా ఉంది. తినడానికి తిండి, రవాణా సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ, మేం ఇక్కడికి వీటి కోసం రాలేదు. హజ్‌కు సంబంధించిన ముఖ్యమైన ఆచారాలను నిర్వహించడానికి మేం ఇక్కడికి వచ్చాం. కానీ, ఈ ఆచారాలు నిర్వహించే రోజుల్లోనే మమ్మల్ని జంతువుల్లా చూశారు’’ అని ఆమె అన్నారు.
అక్కడికి వెళ్లాక మే నెల చాలా దారుణంగా గడిచిందని ఆమె చెప్పారు. ‘‘అప్పుడు దాదాపు 800 మందిని ఒకే టెంట్‌లో ఉంచారు. వారందరికి సరిపడా వాష్‌రూమ్‌లు లేవు’’ అని ఆమె తెలిపారు.
టెంట్ లోపలి పరిస్థితుల గురించి మాట్లాడుతూ, ‘‘మక్కాలోని ఎండలకు తగినట్లుగా అక్కడ ఏసీ వ్యవస్థ లేదు. అక్కడ పెట్టిన కూలర్లలో నీళ్లు కూడా లేవు. బాగా ఉక్కపోతతో పాటు ఊపిరాడకుండా ఉంది. చాలా ఇబ్బందులు పడ్డాం’’ అని ఆమె అన్నారు.
యాత్రికులకు సరిపడా ఏర్పాట్లను చేయలేదని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆమె చెప్పారు.
‘‘వారితో మాట్లాడటం ఎలాంటిదంటే తలను గోడకేసి బాదుకోవడం లాంటిది’’ అని ఆమె అన్నారు.
హజ్ సందర్భంగా ఎదుర్కొన్న అవస్థల గురించి మాట్లాడుతూ, ముజ్దల్ఫాలో నీరు, విద్యుత్ లేని చీకటి గదిలో పడిన ఇబ్బందుల గురించి ఆమె తెలిపారు.
‘అక్కడంతా గందరగోళమే. వాళ్లు తమకు నచ్చినప్పుడు డోర్లు మూసేస్తారు. ఇష్టమున్నప్పుడు డోర్లు తెరుస్తారు. బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్‌ల నుంచి వచ్చిన యాత్రికుల కోసం కేటాయించిన స్థలం పర్వతాల మధ్య ఉంది. అక్కడ ప్రజలంతా ఊపిరాడక సతమతం అయ్యారు. ముజ్దల్ఫాలో నాకు ఊపిరాడలేదు. నా పరిస్థితి దారుణంగా మారింది. ఆ రోజు రాత్రి నేను ఎలా బతికానో నాకు, ఆ దేవుడికి మాత్రమే తెలుసు. నా భర్త రాత్రంతా నాకు సేవ చేస్తూనే ఉన్నారు. రాత్రంతా దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నా’’ అని ఆమె చెప్పారు.

సౌదీ అధికారులు ఏమన్నారు?
మినా నుంచి మక్కాకు వెళ్లడానికి ఒక్కో కిలోమీటర్‌కు ట్యాక్సీ చార్జి అధికంగా ఉంటుందని ఆమె చెప్పారు.
మినా నుంచి మక్కాకు ట్యాక్సీ డ్రైవర్లు 2,000 రియాళ్లు (సుమారు రూ. 44,560) డిమాండ్ చేశారని చెప్పారు.
ప్రథమ చికిత్స అందించే వాహనాలు చుట్టు పక్కలే తిరుగుతుంటాయని, కానీ వారికి డ్రిప్ పెట్టడం కూడా తెలియదని ఆమె అన్నారు.
సౌదీ అధికారులు యాత్రికులను అర్థం చేసుకోలేరని, వారికి సహాయం చేయరని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
పాకిస్తానీలకు ఎక్కడో అరాఫత్ చివరన టెంట్లను కేటాయించారని, అక్కడి నుంచి నడవాల్సిన దూరం చాలా ఉంటుందని ఆమె తెలిపారు. అక్కడ కూడా ఏర్పాట్లు బాగా లేవని అన్నారు.
‘‘నేను 25 రోజుల కోసం 11.5 లక్షలు చెల్లించాను. ఇది చిన్నమొత్తమేమీ కాదు. నాలాంటి యాత్రికులు వలంటీర్ల కోసం కూడా డబ్బులు చెల్లిస్తారు. కానీ, వారి నుంచి మాకు ఎలాంటి సాయం అందలేదు. హజ్ ఆచారాలు ప్రారంభమయ్యాక మాకు ఒక్కరు కూడా సాయపడలేదు. అంతా సౌదీ ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పేవారు. నేను ఎదుర్కొన్న అవస్థల తర్వాత, అక్కడ పాకిస్థానీలతో ప్రవర్తిస్తున్న తీరును చూశాక అధికారిక మార్గాల ద్వారా హజ్ యాత్రకు వెళ్లాలని నేను ఎవరికీ సలహా ఇవ్వను’’ అని ఆమె అన్నారు.

7 కిలోమీటర్ల దూరం నీడ లేదు, నీళ్లూ లేవు
ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లిన వారిలో హమీర కన్వల్ కూడా ఉన్నారు. తనకు ఎదురైన అనుభవాల్ని ఆమె బీబీసీకి చెప్పారు.
‘‘మమ్మల్ని మినా నుంచి అరాఫత్‌కు తీసుకెళ్తున్నప్పుడే అక్కడ యాత్రికుల మరణాల వార్తలు రావడం మొదలైంది. వేడి కారణంగా ఆ మరణాలు సంభవించినట్లు మాకు తెలిసింది. అక్కడ ఏర్పాటు చేసిన గుడారాల్లో సరిపడా స్థలమే లేదు. హజ్ ఖుత్బా (ప్రవచనం) వినేందుకు కూడా ఎలాంటి ఏర్పాట్లు లేవు. మండే ఎండలో ప్రజలు బయట కూర్చోవాలి, లేదా గుడారాల్లో చోటు కోసం గొడవపడాలి’’ అని ఆమె వివరించారు.
మక్కా నుంచి ఆమె బీబీసీతో మాట్లాడారు.
‘‘మమ్మల్ని ఏడు కిలోమీటర్ల దూరం నడిపించారు. ఆ మార్గంలో నీడ లేదు, నీళ్లు కూడా లేవు. చాలామంది యాత్రికులు అక్కడే అనారోగ్యం పాలయ్యారు’’ అని ఆమె చెప్పారు.
ప్రభుత్వ వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ, వేడి కారణంగా ఇబ్బందులు పడినవారి కోసం వాటిని ఉపయోగించలేదని ఆమె తెలిపారు.
‘‘ఫారంలలో కోళ్లను, జంతువులను ఉంచినట్లుగా క్యాంపుల్లో ప్రజలను ఉంచారు. పడకల మధ్య ఖాళీ లేదు. అందరికీ సరిపడా వాష్‌రూమ్‌లు లేవు. కానీ, అక్కడ మనం ఎవరికీ ఫిర్యాదు చేయలేం. ఎవరూ మనకు సహాయపడరు. ఆ దారిలో అంబులెన్స్‌లు లేవు. సహాయం చేసే ఎవరూ కనిపించరు. కనిపించేదల్లా ఇంగ్లిష్ రాని పోలీసులే’’ అని ఆమె చెప్పారు.
త్వరగా చేరుకునే మార్గాన్ని పోలీసులు బ్లాక్ చేయడంతో మినా నుంచి జమారత్‌కు తాను 26 కి.మీ. నడవాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. మామూలుగా అయితే 15 నిమిషాల్లో అక్కడికి చేరుకోవచ్చని అన్నారు.
ఇక్కడి పోలీసు అధికారులు ఆడ, మగ అని చూడకుండా చేతులెత్తేందుకు వెనుకాడరని ఆమె చెప్పారు.

చెత్త కుప్పలో జీవిస్తున్నట్లుగా ఉంది
హజ్ యాత్రలో అనేక దేశాల యాత్రికుల ఉంటున్న శిబిరాల మీదుగా వెళ్లే అవకాశం తనకు వచ్చిందని హమీరా తెలిపారు. పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశీయుల శిబిరాలు అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉన్నాయని ఆమె అన్నారు.
‘‘చెత్త కుప్పల మీద కూర్చున్నట్లుగా ఉంది. హజ్ యాత్రలో పరిశుభ్రతను విస్మరించడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది’’ అన్నారామె.
‘‘మా దగ్గర ఉన్న సౌకర్యాలివే. వీటితోనే ముందుకు సాగాలి’’ అని సౌదీ క్యాంప్ మేనేజర్ అన్నారు.
మొహమ్మద్ ఆలా ఒక ప్రైవేట్ గ్రూప్ ఆర్గనైజర్. ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ఇది తనకు 18వ హజ్ యాత్ర అని చెప్పారు.
‘‘సౌదీ వాళ్లు మౌలిక సదుపాయాలు కల్పించరు’’ అని అన్నారు.
మొహమ్మద్ ఆలా చెప్పిన వివరాల ప్రకారం, ఒక సాధారణ యాత్రికుడు ప్రతిరోజు తవాఫ్-ఎ-జియారత్ (ప్రదక్షిణ) కాకుండా కనీసం 15 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. పైగా వేడి, అలసటతో పాటు వడదెబ్బను ఎదుర్కోవాలి. ఈ ప్రాంతంలో నీళ్లు కూడా ఉండవు.
ఈ మార్గంలో ఎవరైనా అనారోగ్యానికి గురై ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తితే, 30 నిమిషాల వరకు ఎవరూ చేరుకోలేరని.. ప్రాణాలు కాపాడే వ్యవస్థ లేదని మొహమ్మద్ ఆలా చెబుతున్నారు.

హజ్ యాత్రలో మరణించిన వారిని ఎలా ఖననం చేస్తారు?
సౌదీ అరేబియాలో ఏటా హజ్ యాత్రికులు విపరీతమైన వేడి, తొక్కిసలాట, రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యం వంటి తదితర కారణాలతో తమ ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో మరణించిన వారిని గుర్తించడం, ఖననం చేయడం వంటి వాటికి సౌదీ ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది.
ఒకవేళ హజ్ సందర్భంగా ఎవరైనా చనిపోతే, వారి మృతదేహాలను స్వదేశాలకు పంపకుండా, సౌదీ అరేబియాలోని ఖననం చేస్తారని సౌదీలోని హజ్ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు.
హజ్ యాత్ర చేసే వారు తమ దరఖాస్తు ఫారంలో ఈ నిబంధనకు అంగీకరిస్తూ సంతకం చేస్తారు. దీనికి సంబంధించి కుటుంబంలోని ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినా పరిగణలోకి తీసుకోరు.
హజ్ యాత్రకు వెళ్లిన ఎవరైనా తమ క్యాంపు వద్ద లేదా రోడ్డుపై ఏదైనా ప్రమాదంలో మరణిస్తే ముందుగా ఈ వార్తను సౌదీలోని సంబంధిత హజ్ మిషన్‌కు అందిస్తారు.
చాలాసార్లు ఆసుపత్రి వర్గాలు, లేదా సాధారణ పౌరులే నేరుగా హజ్ మిషన్‌కు ఈ సమాచారాన్ని అందిస్తారు.

మృతులకు సంబంధించిన వివరాలు అంటే.. పేరు, ఏజెన్సీ, దేశం, గుర్తింపు వంటి వాటితో కూడిన బ్యాండ్‌ను హజ్ యాత్రికులు చేతికి ధరిస్తారు.
ఈ కీలక సమాచారం ఆధారంగా మృతదేహాన్ని గుర్తిస్తారు. మరణించిన యాత్రికులకు సంబంధించిన బంధువులు ఎవరైనా ఉంటే వారు కూడా మృతదేహాన్ని గుర్తిస్తారు.
మృతుల కుటుంబసభ్యులు సౌదీ అరేబియాకు వెళ్లి మృతుడిని చివరిసారిగా చూడాలనుకున్నా అది కుదరదు. కానీ, వారి బంధువులు మక్కాలోనే ఉంటే, అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది.
మృతదేహాన్ని గుర్తించి, మరణ ధ్రువీకరణ పత్రం అందించిన తర్వాత అంత్యక్రియల తంతు మొదలవుతుంది.
ఒకవేళ మక్కా, మినా, ముజ్దల్ఫాలో ఉండగా యాత్రికుడు మరణిస్తే వారి అంత్యక్రియల ప్రార్థనలు మస్జీద్ అల్ హరమ్ (కాబా షరీఫ్)లో జరుగుతాయి.
మదీనాలో మృతి చెందితే ‘మసీద్ ఎ నబావి’లో నమాజ్ చదువుతారు. ఎవరైనా హాజీ జిద్దా లేదా ఇతర ప్రాంతాల్లో చనిపోతే స్థానిక మసీదులో నమాజ్ ఎ జనాజా చదువుతారు.
ఇవి కూడా చదవండి:
- మెదక్: బక్రీద్ సందర్భంగా ఇక్కడ జరిగిన గొడవేంటి? ఎందుకు జరిగింది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















