ఆంధ్రప్రదేశ్: పల్నాడులోని కొన్ని గ్రామాల్లో జనం ఇళ్లు వదిలి ఎందుకు వెళ్లిపోతున్నారు? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

పల్నాడు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా పేరు మార్మోగింది. పోలింగ్ ముందూ, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలతో ఈ ప్రాంతం పేరు దేశమంతా చర్చనీయాంశమైంది.

ఫలితాల తర్వాత అంతా ప్రశాంతంగా ఉన్నట్టు పైకి కనిపిస్తున్నప్పటికీ, మాచర్ల, గురజాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కొన్ని గ్రామాల్లో వందలాది ఇళ్లు తాళాలు వేసి కనిపిస్తున్నాయి.

కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున తమ ఇళ్లను వదిలేసి తలోదిక్కుకు వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు.

గురజాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో బీబీసీ పర్యటించింది. ఆ ఒక్క గ్రామం నుంచే సుమారు వెయ్యి మంది ఊరు వదిలిపోయారని స్థానికులు చెప్పారు. సుమారు 150 వరకూ ఇళ్లు తాళాలు వేసి కనిపించాయి. కొన్ని ఇళ్లలో మగవాళ్లంతా ఇంటి నుంచి వెళ్లిపోగా, వృద్ధులు, చిన్నపిల్లలు మిగిలారు. మరికొన్ని ఇళ్లలో మొత్తం పిల్లలతో సహా అంతా వెళ్లిపోయారు.

తాళం వేసి ఉన్న ఇళ్లను చిత్రీకరించేందుకు బీబీసీ ప్రయత్నించగా కొందరు దాన్ని వ్యతిరేకించారు. వైసీపీ హయాంలో తమపై జరిగిన దాడులకు సమాధానం చెప్పాలని వారు అడుగుతున్నారు.

పోలీసులు మాత్రం పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు. శాంతి కమిటీల ద్వారా అందరికీ సర్దిచెప్పి, ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నం జరుగుతోందని చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు
పల్నాడు

దాడుల భయం

రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తావులేకుండా, అభివృద్ధి మీద దృష్టి పెడతామని కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహా నాయకులు ఇప్పటికే ప్రకటించారు.

అయితే, పల్నాడు జిల్లాలో కొన్ని గ్రామాల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆయా గ్రామాల్లో పర్యటించినప్పుడు కొందరు స్థానికులు బీబీసీతో చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే, గతంలో ఆ పార్టీ స్థానిక నాయకులతో వివాదాలు, విభేదాలు ఉన్న వాళ్లు కొందరు ఊరు వదిలిపోయారని, మరికొందరు రాష్ట్రం దాటి కూడా పోయారని స్థానికులు చెబుతున్నారు.

ఒక్క పిన్నెల్లి అనే గ్రామంలోనే ముస్లిం, ఎస్సీ, రెడ్డి సహా వివిధ కులాలకు చెందిన దాదాపు 150 కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేశాయి. వారి గుమ్మాలకు ప్రస్తుతం తాళం వేసి కనిపిస్తోంది.

పల్నాడు

ఇలా ఇళ్లు ఖాళీ చేసిన వారిలో పిన్నెల్లి గ్రామ సర్పంచ్, ఆ గ్రామానికి చెందిన ముగ్గురు ఎంపీటీసీలు కూడా ఉన్నారు. వారంతా వైఎస్సార్సీపీ మద్దతుదారులు.

"మాది ఎస్సీ కాలనీ. గ్రామంలోని ముస్లింల మధ్య కొంత రాజకీయ వివాదం ఉంది. వారి ఆధిపత్య పోరుతో ఈసారి మేం కూడా ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. వెళ్లిపోవాల్సిందేనంటూ ఇంటిపై దాడికి వచ్చారు" అని కొమ్ము మోషే అన్నారు. ఆయన పిన్నెల్లి ఎంపీటీసీ కొమ్ము షిపోరా భర్త.

దాడులకు భయపడి ఊరు వదిలి వచ్చామని, ప్రస్తుతం తెలంగాణాలో తన భార్య ఒకచోట, తానొకచోట ఉంటున్నామని ఆయన తెలిపారు.

తాను ఇల్లు ఖాళీ చేసిన తర్వాత తన అన్నను కూడా ఖాళీ చేసి పోవాలని పోలీసులు బెదిరించడంతో ఆయన కూడా ఇల్లు వదిలి వెళ్లిపోయారని మోషే బీబీసీకి తెలిపారు.

అయితే, ఊరు వదిలి వెళ్లిపోవాలని తాము ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదని పోలీసులు చెప్పారు.

పల్నాడు

ఎన్నికల సమయం నుంచి ఉద్రిక్తత

పిన్నెల్లి మేజర్ పంచాయతీ. సుమారుగా 9 వేల మంది ఓటర్లు ఉంటారు. వారిలో అత్యధికులు ముస్లింలు. ఈ వర్గంలో రాజకీయ ఆధిపత్యం కోసం మొదలైన పోరు కారణంగా 2014 తర్వాత ఘర్షణల వాతావరణం ఏర్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు.

అధికారంలో ఉన్నపార్టీ మద్ధతుదారులు ప్రత్యర్థుల మీద దాడులు చేయడం, తప్పుడు కేసులతో వేధించడం ఇక్కడ సాధారణంగా మారిందని స్థానికులు అంటున్నారు.

ఆ క్రమంలోనే 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి చెందిన 20 కుటుంబాలు గ్రామం వదిలి వెళ్లిపోయాయి. వారిలో కొందరు మధ్యలో తిరిగి గ్రామానికి రాగా, కీలక నేతలు మాత్రం అయిదేళ్లు ఊరికి దూరంగానే ఉండిపోయారు.

2024 సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే వారు గ్రామంలో అడుగుపెట్టారు.

దానికి ప్రతీకారంగా ప్రస్తుతం టీడీపీ శ్రేణులు కూడా ప్రత్యర్థులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని కొందరు స్థానికులు చెబుతున్నారు.

ఎన్నికల ఫలితాలు రాగానే భయపడి కొందరు వెళ్లిపోగా, ఆ తర్వాత దాడులతో మరికొందరు ఊరు వదిలిపోయారని, ఇప్పటికీ గ్రామంలో ఉంటున్న వారిని ఖాళీ చేయాలంటూ ఇళ్లపై రాళ్ల దాడులు చేస్తున్నారని కొందరు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

పల్నాడు

ఇళ్లు ఖాళీ చేసే ముందు తమ సామాన్లు తరలించడానికి కూడా అవకాశం లేకుండా సామాన్ల కోసం వెళ్లిన వాహనాలపై కూడా దాడులు చేస్తున్నారని బాధితులు అంటున్నారు.

"పాతకక్షలతో దాడులు చేస్తున్నారు. పోలీసులు ఏమీ చేయడం లేదు. పాత పిన్నెల్లి, కొత్త పిన్నెల్లి నుంచి కలిపి వెయ్యి మంది బయటకు వచ్చేశాం. మాకు ఎలా గడపాలో అర్థం కావడం లేదు. బంధువుల ఇళ్లల్లో తలదాచుకున్నాం. పనులకు పోవడానికి లేదు. ఎక్కడో చోట వండుకుని తిందామంటే సామాన్లు తెచ్చుకోవడానికి కూడా అనుమతించడం లేదు" అని గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చింతపల్లి చిన మస్తాన్ వలీ అన్నారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు.

గతంలో టీడీపీ ఓటమితో ఊరు వదిలిపోయిన వాళ్లే ఇప్పుడు తమ వాళ్లను గ్రామం నుంచి తరిమేస్తున్నారని ఆయన ఆరోపించారు.

పల్నాడు

ఇళ్లు ఖాళీ

పిన్నెల్లి గ్రామంలో అనేక ఇళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. కొన్ని ఇళ్లలో కేవలం వృద్ధులు మాత్రమే మిగిలారు. ముఖ్యంగా మగవాళ్లు ఇళ్ల నుంచి వెళ్లిపోవడంతో వారి పొలాలు కూడా చేసేవారు కనిపించడం లేదు.

గ్రామంలో అత్యధికులు తమ పొలాలను పంట వేసేందుకు సిద్ధం చేసుకోగా ఊరు వదిలిపోయిన వారి భూములన్నీ పడావుగా కనిపిస్తున్నాయి.

సాగు కోసం మేపుతున్న ఎడ్లు, ఇతర పశువులను చూసుకోవడం కూడా భారంగా మారిందని ఇంటి దగ్గర ఉంటున్నవారు అంటున్నారు.

పిన్నెల్లి గ్రామానికే చెందిన సాధిమా అనే మహిళ ఇంట్లో ఒక్కరే ఉంటున్నారు. ఆమె నలుగురు కొడుకుల్లో ఒకరు గుంటూరులో ఉద్యోగం చేస్తుండగా, మిగిలిన ముగ్గురు కొడుకులతో కలిసి, ఆమె భర్త ఊరు నుంచి వెళ్లిపోయారు. ఇల్లు వదిలిపోవాలంటూ తన ఇంటిపైనా రాళ్లు వేశారని సాధిమా తెలిపారు.

పల్నాడు

సాధిమా ఇంటి దగ్గర పశువులను చూసుకుంటున్నారు. ఆమెకు తోడుగా ఉండేందుకు దూర ప్రాంతాల నుంచి బంధువులు వచ్చి ఉంటున్నారు.

"ఊళ్లో తగాదా పెట్టుకుంటున్నారు. ఎవరూ లేక వదిన ఒక్కరే ఉందని సాయంగా వచ్చాను. పిల్లలంతా పోయారు. వైఎస్సార్సీపీ వాళ్లు ఇక్కడ ఉండకూడదని బెదిరించడంతో భయపడి, కొడతారని పోయారు. వాళ్లంతా ఊరికి రానిస్తే వస్తారు. ఇల్లు వదిలేసి ఎన్నాళ్లుండాలి పొరుగూళ్లో. ఇంకా విత్తనాలు వేయలేదు. అందరూ తగాదాలు లేకుండా ఊరికి రానిస్తే బాగుండేది. ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇలా ఊరు వదిలేసి వెళ్లిపోవాల్సి వస్తుందని అనుకోలేదు" అని కరీమా అనే మహిళ అన్నారు.

పొలం పనులు సాగక, పశువులు చూసుకునే అవకాశం లేక, ఇంట్లో మగవాళ్లు కూడా లేకపోవడంతో బక్రీద్ నాడు ఏడుస్తూ కూర్చున్నామని ఆమె వాపోయారు.

పల్నాడు

‘మాకూ అలానే జరిగింది..’

అయితే, తెలుగుదేశం పార్టీ వర్గీయులు మాత్రం ఈ పరిస్థితులకు వాళ్లే (వైసీపీ కార్యకర్తలు, నేతలు ) కారణమని అంటున్నారు. వాళ్ల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమను కూడా అలాగే ఇబ్బంది పెట్టారని వారు వాదించారు.

రాజకీయ ఘర్షణలతో ఇళ్ళు ఖాళీ అయిన దృశ్యాలను చిత్రీకరించడానికి వెళ్లిన బీబీసీ ప్రతినిధులను కొందరు టీడీపీ కార్యకర్తలుగా చెప్పుకుంటున్నవారు అడ్డుకున్నారు. ఇక్కడ వీడియోలు తీయవద్దంటూ బీబీసీ ప్రతినిధిపై దాడికి ప్రయత్నించారు.

"మేం అయిదేళ్లపాటు కష్టపడ్డాం. ఎప్పుడూ, ఎవరూ రాలేదు. ఇంటికి, ఊరికి దూరంగా గడిపాం. ఇప్పుడు వాళ్లకు కూడా అదే జరుగుతుంది" అని టీడీపీ కార్యకర్త జాన్ బాషా అన్నారు.

గ్రామానికి చెందిన టీడీపీ నేత నన్నే ఆధ్వర్యంలో ఇప్పటికే సచివాలయానికి పసుపు రంగు పూశారు. గ్రామంలో ఎవరూ తమ ఆదేశాలను బేఖాతరు చేయడానికి వీల్లేదని హెచ్చరిస్తున్నారు. మీడియా కూడా తమ అనుమతి లేకుండా ఊరిలోకి వస్తే అనుమతించబోమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఇప్పటికే గ్రామంలో పోలీసు పహారా కొనసాగుతోంది. అయినప్పటికీ అక్కడ తమ ప్రత్యర్ధి పార్టీల కార్యకర్తలు ఉండటానికి కూడా వీలు లేదంటూ కొందరు టీడీపీ కార్యకర్తలు బహిరంగంగానే చెబుతున్నారు.

పల్నాడు

చక్కదిద్దుతున్నాం: పోలీసులు

పిన్నెల్లి వంటి గ్రామాల్లో దాడులకు ఆస్కారం లేకుండా గ్రామం ఖాళీ చేసి వెళ్లిపోవాలని విపక్ష కార్యకర్తలను ఒత్తిడి చేస్తున్నారన్న ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు.

"పల్నాడులో ప్రత్యేక పరిస్థితులున్నాయి. దానిని నియంత్రించడానికి వీలైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ప్రతీ గ్రామంలోనూ పరిస్థితిని చక్కదిద్దుతూ వస్తున్నాం. ఇప్పటికే కొంత వివాదం తగ్గుముఖం పట్టింది. దూరంగా వెళ్లిన వారిని కూడా గ్రామాలకు రప్పించాం. పిన్నెల్లిలో పరిస్థితి కొంత తీవ్రంగా ఉంది. శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించాం. త్వరలోనే సమస్య అంతా పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం" అని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ బీబీసీతో చెప్పారు.

గ్రామాలు వదిలి దూరంగా పోయిన వారి సమస్యలు తెలుసుకుని, ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నందున పిన్నెల్లి కూడా సాధారణ స్థితికి వస్తుందని ఆమె అన్నారు.

పల్నాడు
ఫొటో క్యాప్షన్, పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్

కఠిన చర్యలు తీసుకోవాల్సిందే..

అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యర్థి పార్టీకి చెందిన వారిని ఊరి నుంచి తరిమేసే సంస్కృతి పెరుగుతోందని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దానిని నియంత్రించాలంటే కఠిన చర్యలు అవసరమని సంఘం ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

"టీడీపీ అధికారం కోల్పోగానే ఆత్మకూరు వంటి గ్రామాల్లో ఆ పార్టీ వారిని ఇదే రీతిలో తరిమేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా రంగంలో దిగింది. ఊరు వదిలి ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్న వారిలో ఎస్సీ, బీసీలే ఎక్కువ. వారికి రక్షణ అవసరం. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. లేదంటే మేమే ఎన్‌హెచ్‌ఆర్‌సీ‌కి ఫిర్యాదు చేస్తాం" అని పౌరహక్కుల సంఘం కార్యనిర్వాహక సభ్యుడు ఆర్.రమేశ్ అన్నారు.

పోలీసులు కఠిన చర్యలు చేపట్టి, ఖాళీ చేసిన ఇళ్లకు బాధితులంతా తిరిగి చేరేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

పల్నాడు

ప్రచారంలో వాస్తవం లేదు: ఎమ్మెల్యే యరపతినేని

తెలుగుదేశం పార్టీ శ్రేణుల వేధింపులతోనే ప్రతిపక్ష వైసీపీ కార్యకర్తలు గ్రామం విడిచిపోయారంటూ సాగుతున్న ప్రచారం వాస్తవం కాదని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బీబీసీతో అన్నారు.

‘‘గడిచిన అయిదేళ్లలో వైసీపీ కార్యకర్తలు అనేక అరాచకాలు చేశారు. మా పార్టీ శ్రేణులను వేధించారు. దాడులు చేశారు. మా కార్యకర్తలే అనేకమంది గ్రామం విడిచి పోయారు. ఇప్పుడు ఎవరైనా ప్రతీకార చర్యలకు దిగుతుంటే నేను వారిస్తున్నాను. అందర్నీ అదుపు చేస్తున్నాను. ఎవరూ గ్రామం విడిచి వెళ్లాల్సిన అవసరం లేకుండా చేశాం" అని ఎమ్మెల్యే యరపతినేని వివరించారు.

పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించాల్సిందిగా కోరేందుకు వైసీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డిని సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయన స్పందిస్తే ఈ కథనంలో ప్రచురిస్తాం.

వీడియో క్యాప్షన్, పల్నాడులోని కొన్ని గ్రామాల్లో జనం ఇళ్లు వదిలి ఎందుకు వెళ్లిపోతున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)