బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ మధ్య దూరం పెరిగిందా? నిజమో కాదో తెలిసేది ఆ నిర్ణయంతోనే

మోహన్ భగవత్, అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా
    • రచయిత, భాగ్యశ్రీ రౌత్
    • హోదా, బీబీసీ కోసం

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ నాయకుడు ఇంద్రేష్ కుమార్ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ఇందులో అధికార బీజేపీని 'అహంకారి'గా, ప్రతిపక్ష ఇండియా కూటమిని 'రామ వ్యతిరేకి'గా అభివర్ణించారు.

‘’రాముడిపై భక్తి ఉన్నవారిలో అహంకారం కారణంగా 240 సీట్లకు పరిమితమయ్యారు. రాముడిపై నమ్మకం లేనివారికి అధికారం ఇవ్వలేదు" అని ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రేష్ కుమార్ అన్నారు.

కొద్దిరోజుల క్రితం, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ చీఫ్ మోహన్ భగవత్ కూడా లోక్‌సభ ఫలితాల కారణాలను విశ్లేషిస్తూ ఒక ప్రకటన ఇచ్చారు.

"గౌరవంగా పని చేసేవాడు, గర్వం లేనివాడు, అహంకారం లేనివాడు మాత్రమే నిజమైన సేవకుడిగా పిలవడానికి అర్హులు" అని మోహన్ భగవత్ పేర్కొన్నారు.

భాజపాను దృష్టిలో ఉంచుకొనే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. ఇదొక్కటే కాదు, పలు విషయాలపై అధికార బీజేపీ ప్రభుత్వానికి ఆయన సలహాలు కూడా ఇచ్చారు. ఇక్కడితో ఆగలేదు. మణిపుర్‌లో జరుగుతున్న హింసను కూడా ఆయన ప్రస్తావించారు, ఆ హింసను ఆపడం మన కర్తవ్యం అని పిలుపునిచ్చారు.

ఈ నెలలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు. దీంతో పలువురు మిత్రపక్షాలు, మద్దతుదారులు, ప్రత్యర్థులు బీజేపీపై విమర్శలు సంధిస్తున్నారు. అయితే వీటన్నింటి మధ్య రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత ప్రకటన బీజేపీకి ఎదురుదెబ్బగా పరిగణిస్తున్నారు.

ఎన్నికల ఫలితాల తర్వాత మోహన్ భగవత్ ప్రసంగం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే సంఘ్ నుంచి బీజేపీ మీదకు విమర్శలు ఇక్కడితో ఆగలేదు. ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్ అయిన ‘ఆర్గనైజర్’ మ్యాగజీన్ కూడా బీజేపీని, పార్టీ సీనియర్ నేతలను విమర్శించింది.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ నాయకులకు, కార్యకర్తల అహంకారానికి అద్దం పట్టాయని, ప్రజల గొంతు ఎవరూ వినలేదంటూ ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడు రతన్ శారదా ఆర్గనైజర్‌లో ఒక కథనం రాశారు.

దీంతో సంఘ్, బీజేపీల మధ్య అంతా బాగానే ఉందా? అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. ఎందుకంటే.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'బీజేపీకి ఇకపై సంఘ్ అవసరం లేదు' అని వ్యాఖ్యానించడం తెలిసిందే.

దేశమంతటా విస్తరించిన సంఘ్ నెట్‌వర్క్, కుటుంబ సంస్థలు, వారితో సంబంధం ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో బీజేపీకి ఎలా సహాయం చేస్తారో అందరికీ తెలుసు, మరి లోక్‌సభ ఎన్నికల సమయంలో నడ్డా ఎందుకు ఈ ప్రకటన చేశారు?

ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మోహన్ భగవత్ మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేయగా, మరుసటి రోజు ‘ఆర్గనైజర్’‌లో కథనం బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించింది.

bbc news telugu whatsapp channel
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఎన్డీయే సమావేశం అనంతరం నరేంద్ర మోదీని పూలమాలతో సత్కరించారు.

మోహన్ భగవత్ ఏం మాట్లాడారు?

మోహన్ భగవత్ సాధారణంగా ఏటా రెండుసార్లు కార్యకర్తలను ఉద్దేశించి బహిరంగంగా మాట్లాడతారు, ఒకసారి విజయదశమి రోజున, మరొకటి సంఘ్ వర్కర్ డెవలప్‌మెంట్ తరగతుల తర్వాత. ఈ తరగతులలో ఆయన ఎప్పుడూ రాజకీయ సలహాలు లేదా ప్రకటనలు ఇవ్వరు.

అయితే ఈసారి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన ఎగ్జిక్యూటివ్ డెవలప్‌మెంట్ క్లాస్-2 ముగింపులో ఆయన పరోక్షంగా బీజేపీ సీనియర్ నేతలకు సలహా ఇచ్చారు.

ఆయన ప్రసంగం కాస్త దూకుడుగా సాగింది, అందులో ప్రధానంగా నాలుగు విషయాలు చెప్పారు.

మొదటిది మణిపుర్‌పై ఆయన చేసిన ప్రకటన. దేశంలో అభివృద్ధి జరగాలంటే శాంతిభద్రతలు అవసరమన్నారు. ‘’దేశంలో అశాంతి నెలకొని పనులు ముందుకు కదలడం లేదు. మణిపుర్ ఏడాదిగా మండుతోంది. మణిపుర్‌లో విద్వేషపు అరాచకాలు విస్తరించాయి'’ అని మోహన్ భగవత్ అన్నారు.

అక్కడ హింసను అరికట్టడం ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉండాలని ఆయన ఎన్డీయే ప్రభుత్వానికి సూచించారు.

రెండోది, ప్రధాని మోదీ ఎప్పుడూ తనను తాను ప్రధాన్ సేవక్ అని పిలుచుకుంటారు. అయితే, మోహన్ భగవత్ తన ప్రసంగంలో సేవక్ అనే పదాన్ని ప్రస్తావించారు.

‘’నిజమైన 'సేవక్' అహంకారంతో ఉండడు, తన గౌరవాన్ని కాపాడుకుంటూ ప్రజలకు సేవ చేస్తాడు’’ అని సూచించారు.

దీనిని పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీకి సూచించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మూడోది, ప్రతిపక్ష పార్టీ గురించి..

‘’అధికార, ప్రతిపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రాథమికంగా మనం ప్రతిపక్షం అనే పదాన్ని ఉపయోగించాలి, నిరసనగా కాదు. వాళ్లు అభిప్రాయాలను పార్లమెంటు ముందుంచుతారు. దాన్ని గౌరవించాలి. ఎన్నికల్లో ఒక పరిధి ఉండాలి. కానీ, ఈసారి అది కనిపించలేదు" అని ఆర్ఎస్ఎస్ ఛీఫ్ అన్నారు.

నాలుగోది, ఎన్నికల ప్రచారంపై..

‘’ఎన్నికలంటే యుద్ధం కాదు ఒక పోటీ, దానికి హద్దులు ఉండాలి. అబద్ధాలు సరికాదు. ప్రచారంలో విద్వేషాలు సృష్టించే ప్రయత్నం జరిగింది, సంఘ్ వంటి సంస్థలను దానిలోకి లాగే ప్రయత్నం చేశారు" అని అన్నారు మోహన్ భగవత్.

‘’టెక్నాలజీ సాయంతో అబద్ధాలు ప్రచారం చేయడం సరికాదని, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చినా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు ఇంకా ఉన్నాయి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

జూన్ 10 రాత్రి మోహన్ భగవత్ ఈ ప్రసంగం చేసి మరుసటి రోజు జూన్ 11న ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ పత్రిక 'ఆర్గనైజర్' బీజేపీ సీనియర్ నేతలను విమర్శించింది.

ఆర్గనైజర్‌లో ఏం రాశారు?

ఆర్గనైజర్‌లో ప్రచురితమైన కథనంలో.. "ఆర్‌ఎస్‌ఎస్ పనిని బీజేపీ చేయలేదు. బీజేపీ పెద్ద పార్టీ, దానికి సొంత కార్యకర్తలున్నారు. వారు పార్టీ కార్యాచరణ వ్యవస్థను, దాని సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేయగలరు. ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అవగాహన కల్పించే పనిని సంఘ్ చేస్తోంది. కానీ, బీజేపీ కార్యకర్తలు తమ సందేశాన్ని సంఘ్‌కు తెలియజేయలేదు. ఎన్నికల్లో సహకరించాలంటూ కనీసం వలంటీర్లను కూడా అడగలేదు. ఎందుకు ఇలా?" అని ప్రశ్నించింది.

మహారాష్ట్రలో రాజకీయ మార్పులకు బీజేపీ కారణమైందని, అక్కడ వాటిని నివారించాల్సిందని పేర్కొంది. 'మోదీ కీ గ్యారంటీ, అబ్‌కీ బార్ 400 పార్' అనే అతి విశ్వాసంలో బీజేపీ కార్యకర్తలు నిమగ్నమయ్యారని కూడా ఆర్గనైజర్ విమర్శించింది.

ఆ కథనం ప్రకారం.. బీజేపీ, శివసేనలకు మెజారిటీ ఉన్నా అజిత్‌ పవార్‌ను ఎందుకు తీసుకొచ్చారు?. ఏళ్ల తరబడి ఎవరికి వ్యతిరేకంగా పోరాడారో వారితోనే కలిసి నడవడం బీజేపీ మద్దతుదారులను బాధిస్తోంది. ఇలా బ్రాండ్ వాల్యూని తగ్గించుకున్న బీజేపీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ప్రకటనలు, కథనాలకు ముందు, సంఘ్ యంత్రాంగం దాని వలంటీర్లు, ఆఫీస్ బేరర్ల నుంచి ఎన్నికల ఫలితాల గురించి 'ఫీడ్‌బ్యాక్' తీసుకుంది.

ఈ 'ఫీడ్‌బ్యాక్' తీసుకున్న.. ఈ ఎన్నికల రాజకీయ నిర్వహణలో వృత్తిపరంగా కూడా పాల్గొన్న ఒక సీనియర్ వలంటీర్ (పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు) బీబీసీ మరాఠీతో మాట్లాడుతూ "ఈ రకమైన ఫీడ్‌బ్యాక్ కొత్తేమీ కాదు’’ అన్నారు.

‘’ఓట్ల శాతం ఎందుకు తగ్గింది? సామాజిక ఐక్యతపై ఎలాంటి ప్రభావం చూపింది, ఎన్నికల్లో ఎలాంటి ప్రచారంతో వెళ్లారు, ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయి వంటి అంశాలపై 'ఫీడ్‌బ్యాక్' తీసుకున్నారు. ఇది బీజేపీకి, దానితో సంబంధం ఉన్న వ్యక్తులకు కూడా వర్తిస్తుంది’’ అని తెలిపారు.

ఫలితాల నేపథ్యంలో భగవత్ ప్రకటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే, ఆయన ఇలాంటి విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు. మోదీ ప్రభుత్వం గతంలో మౌనంగా ఉన్న పలు అంశాలపై ఆయన వ్యాఖ్యానించారు.

భగవత్ మాత్రమే కాదు, ఆయన కంటే ముందు ఆర్ఎస్ఎస్ చీఫ్‌లు‌గా పనిచేసిన వారిలో కొందరు కూడా ఇలా పలు విషయాలపై బహిరంగంగా మాట్లాడేవారు.

మోహన్ భగవత్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, మోహన్ భగవత్

మోహన్ భగవత్ ఏమన్నారు?

దేశంలో మణిపుర్ అంశం పతాకశీర్షికలో ఉండగా.. ప్రధాని మోదీ దీనిపై పెద్దగా స్పందించలేదు. ఈ అంశంపై ప్రధాని మాట్లాడాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు పార్లమెంటులో నిరసనలు చేశాయి, దీంతో స్పీకర్ కొందరు ఎంపీలను సస్పెండ్‌ చేశారు.

కానీ, మణిపుర్ గురించి అధికారికంగా మాట్లాడేందుకు ప్రభుత్వ పెద్దలు ఎక్కువగా ముందుకు రాలేదు. ఆ సమయంలో మోహన్ భగవత్ 2023 విజయదశమి ప్రసంగంలో మణిపుర్ గురించి మాట్లాడారు.

"మణిపుర్‌లో హింసను ఎవరు ప్రేరేపించారు? ఈ హింస దానికదే జరగలేదు, తీసుకొచ్చారు. ఇప్పటి వరకు మెయితెయ్, కుకీ వర్గాలు రెండూ బాగానే జీవించాయి" అని భగవత్ గుర్తుచేశారు.

అది సరిహద్దు రాష్ట్రమని, ఆ ప్రాంతంలో హింస జరిగితే ఎవరికి లాభం జరుగుతుందో ఆలోచించాలని భగవత్ సూచించారు.

అదే సమయంలో రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందనీ మోహన్ భగవత్ అన్నారు.

రిజర్వేషన్లపై యూటర్న్..

రిజర్వేషన్లపై ఒక కమిటీ వేయాలని మోహన్ భగవత్ ప్రతిపాదించారు. ఆ తర్వాత జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే అంశం ప్రచారాస్త్రంగా మారింది.

సంఘ్ రిజర్వేషన్‌ను అంతం చేయాలనుకుంటున్నట్లు బీజేపీ ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేశాయి. దీని ప్రభావం బీజేపీపైనా పడినట్లు కనిపించింది. ఆ తర్వాత రిజర్వేషన్‌కు మద్దతుగా మోహన్ భగవత్ ప్రకటన వచ్చింది, ఇది ఆయన మునుపటి ప్రకటనకు, కొంతమంది సంఘ్ నేతల వైఖరికి విరుద్ధంగా ఉంది.

సమాజంలో వివక్ష ఉన్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగాలని, రాజ్యాంగం ప్రకారం ఏ రిజర్వేషన్ ఉండాలన్నా సంఘ్ మద్దతు ఇస్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీల మధ్య విభేదాలు గతంలోనూ బయటపడ్డాయి. దీనికి ముఖ్యమైన ఉదాహరణ అటల్ బిహారీ వాజపేయీపై అప్పటి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ కె.ఎస్. సుదర్శన్ అసంతృప్తి వ్యక్తంచేయడం.

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి

వాజపేయీ ప్రభుత్వంతో సంఘ్ ఘర్షణ

2000లో అటల్ బిహారీ వాజపేయీ ప్రధానిగా ఉన్నారు. అయితే, 2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. అప్పుడు సంఘ్ అధినేత కె.ఎస్.సుదర్శన్ ఎన్‌డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అటల్ బిహారీ వాజపేయీ, లాల్ కృష్ణ అడ్వాణీలపై ఆయన విమర్శలు చేశారు.

ప్రధానిగా ఉన్న సమయంలో వాజపేయీ పెద్దగా పనులేం చేయలేదని, కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారన్నారు. అయితే, అందరితో కలుపుగోలుగా ఉండాల్సిందని, కానీ ఆయన అలా చేయలేదని సుదర్శన్ విమర్శించారు.

వీహెచ్‌పీ, బజరంగ్ దళ్, ఏబీవీపీ, భారతీయ మజ్దూర్ సంఘ్‌లతో మాట్లాడటం మానేశారని.. అది తమకు నచ్చలేదన్నారు. ఇక వాజపేయీ, అడ్వాణీలు రిటైర్‌మెంట్ తీసుకుని కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని సూచించారు. అంతేకాదు వాజపేయీ కుటుంబంపైనా సుదర్శన్ విమర్శలు గుప్పించారు.

ప్రభుత్వ పనుల్లో వాజపేయీ అల్లుడు(పెంపుడు కుమార్తె భర్త) రంజన్ భట్టాచార్య జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఆ సమయంలో బీజేపీ సీనియర్‌ నేతలకు, సంఘ్‌కు మధ్య సంబంధాలకు బీటలు వారాయి.

అయితే, ఇప్పుడు నాగ్‌పూర్‌లో సంఘ్ శిక్షా వర్గ్ ముగింపు సందర్భంగా మోహన్ భగవత్ చేసిన ప్రసంగం గత కొన్నేళ్ల ప్రకటనల కంటే దూకుడుగా ఉందని సంఘ్‌పై ఏళ్లుగా కథనాలు రాస్తున్న కొందరు జర్నలిస్టులు అంటున్నారు.

జేపీ నడ్డా

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, జేపీ నడ్డా

నడ్డా వ్యాఖ్యలే కారణమా?

ఎన్నికల ఫలితాలకు కొన్ని వారాల ముందు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ, "బీజేపీకి ఇకపై సంఘ్ అవసరం లేదు, రాజకీయ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పార్టీకి ఉంది" అని అన్నారు.

ఆయన వ్యాఖ్యలపై బీజేపీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు, ఆర్‌ఎస్‌ఎస్ నుంచి కూడా ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. కానీ, ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మోహన్ భగవత్ ప్రకటన వచ్చింది.

నడ్డా ప్రకటనపై అసంతృప్తి వల్లే భగవత్ ప్రకటన వచ్చిందా? ఆర్‌ఎస్‌ఎస్ ఇప్పుడు సమాధానం చెప్పిందా? అనే అనుమానం తలెత్తుతోంది.

నడ్డా ప్రకటనతో కలత..

నాగ్‌పూర్ లోక్‌సత్తా ఎడిటర్ దేవేంద్ర గవాండే మాట్లాడుతూ.. నడ్డా ప్రకటనతో చాలామంది ఆర్‌ఎస్‌ఎస్ వలంటీర్లు కలత చెందారని అన్నారు.

బీబీసీ మరాఠీతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు పని చేయబోరని ప్రచారం చేశారు. బీజేపీ వాళ్లు ఇలాంటివి ప్రైవేటుగా చేసి ఉండాల్సింది. ఎన్నికల సమయంలో పార్టీకి ఆర్ఎస్ఎస్ అవసరం లేదంటూ జాతీయ అధ్యక్షుడు చేసిన ప్రకటనను చాలామంది స్వాగతించలేదు’’ అని అన్నారు.

అయితే నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, రాజకీయాలపై రిపోర్టు చేసే జర్నలిస్టు వికాస్ వైద్య అభిప్రాయం మాత్రం మరోలా ఉంది.

జేపీ నడ్డా ఇచ్చిన ప్రకటన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల ఏకాభిప్రాయం. కాబట్టి సంఘ్‌కి కోపం వచ్చే ప్రసక్తే లేదు. సంఘ్‌కి ఏదైనా అభ్యంతరం ఉంటే అప్పటికప్పుడే చెప్పి ఉండేవారని లేదా తమ అసంతృప్తిని వ్యక్తం చేసేవారని, బీజేపీకి కూడా క్లారిటీ ఉండేదని అభిప్రాయపడ్డారు.

అసెంబ్లీ సమావేశాల సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలందరికీ ప్రత్యేక ఆదేశాలు జారీ అవుతాయి. రేషమ్ బాగ్‌లోని స్మారక స్థలంలో నివాళులర్పించాలని వారికి సూచిస్తారు. అయితే మోదీ ప్రభుత్వం గత పదేళ్లుగా అధికారంలో ఉంది. పలు కార్యక్రమాలను ప్రారంభించేందుకు మోదీ స్వయంగా నాగ్‌పూర్‌కు వచ్చారు.

కానీ, ఆయన ఎప్పుడూ ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయాన్ని గానీ, స్మారక స్థూపాన్ని గానీ సందర్శించలేదని నాగ్‌పూర్‌లో చర్చ జరుగుతుంటుంది.

అయితే, బీజేపీ, సంఘ్‌ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని రాజకీయ విశ్లేషకుడు సుహాస్ పల్షికర్ అభిప్రాయపడ్డారు.

"బీజేపీ, సంఘ్‌ల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని భావించడం లేదు. పని చేయాల్సిన అంశాలలో ఇద్దరూ ఏకీభవిస్తారు" అని ఆయన చెప్పారు.

పల్షికర్ ప్రకారం.. ప్రతి ఎన్నికల్లో సంఘ్‌, బీజేపీల మధ్య సమన్వయం ఉండేది.

మరోవైపు ఆర్ఎస్ఎస్ ఈ ఎన్నికల్లో భాగమవలేదని దేవేంద్ర గవాండే అభిప్రాయపడ్డారు.

ఆయన మాట్లాడుతూ.. ‘’బీజేపీపై ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి ఫిర్యాదు లేదు. కానీ మోదీ బీజేపీకి కోపంగా ఉంది. అయితే, పార్టీ ప్రతిష్టను దిగజార్చడాన్ని ఆర్‌ఎస్‌ఎస్ అంగీకరించదు. దీనర్థం ఆర్‌ఎస్‌ఎస్ బీజేపీల మధ్య విభేదాలు ఉన్నాయని కాదు’’ అని అన్నారు.

ఈ మ్యానిపులేట్ రాజకీయాలతో పార్టీ సంతృప్తి చెందదని వికాస్ వైద్య కూడా అంగీకరిస్తున్నారు. కానీ, సంఘ్‌, బీజేపీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన తేల్చి చెప్పారు.

మోహన్ భగవత్, బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మోహన్ భగవత్, బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్

ఆర్ఎస్ఎస్ బ్యాలెన్స్ చేస్తోందా?

"మోదీపై సంఘ్‌కి కోపం ఉంటే భగవత్‌ నేరుగా ఆయన పేరు చెప్పేవారు. సంఘ్‌ నుంచే బీజేపీ వచ్చింది. అందుకే దాని తిరోగమనం సంఘ్‌కి ఆమోదయోగ్యం కాదు. కాబట్టి మోహన్‌ భగవత్ ముందుకు వచ్చారు" అని వికాస్ వైద్య అన్నారు.

కానీ నాగ్‌పూర్ లోక్‌మత్ ఎడిటర్ శ్రీమంత్ మానే, బీజేపీకి సంఘ్ సలహా ఇవ్వడం, ప్రత్యర్థులను పోటీదారులుగా పరిగణించడం, వారి అభిప్రాయాలను గౌరవించడం వంటి ప్రకటనలపై సందేహం వ్యక్తంచేశారు.

ఇది బ్యాలెన్స్ చేసే ప్రయత్నమని ఆయన అభిప్రాయపడ్డారు.

బీజేపీ గెలిచిన సీట్లలో ఓటింగ్ శాతం తగ్గిపోయిందని, విపక్షాల బలం పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో మా మొగ్గు పూర్తిగా బీజేపీ వైపు లేదని చూపించేందుకు సంఘ్ చేస్తున్న ప్రయత్నం ఇది కావచ్చన్నారు.

‘‘గత పదేళ్లుగా బీజేపీ ఎజెండాకు మద్దతు తెలిపిన సంఘ్, ఇప్పుడు విపక్షాలకు టార్గెట్ కాకుండా సమతూకం పాటించాలని చూస్తోంది’’ అని శ్రీమంత్ అన్నారు.

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, సంఘ్, బీజేపీల మధ్య సరిగ్గా లేకుంటే? లేదా బీజేపీ వెంట సంఘ్‌ లేకపోతే భవిష్యత్తు రాజకీయ పరిణామాలు ఎలా ఉండనున్నాయి?

ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు బీజేపీకి సంఘ్ అవసరం కావచ్చు. మరో నాలుగు నెలల్లో మహారాష్ట్రతో పాటు మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నందున, ఈ సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో కూటమి అవసరం.

ఇలాంటి సమయంలో మోహన్ భగవత్ ప్రసంగం ఆధారంగా మోదీ, బీజేపీ ఎలాంటి అడుగులు వేస్తాయనే దానిపైనే అందరి దృష్టి ఉంటుంది.

ఇదే సమయంలో కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది.

సంఘ్, బీజేపీల మధ్య సంబంధం ఎలా ఉండబోతోందనేది ఆ ఎంపికతో అంచనా వేయవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)