ప్రియాంక గాంధీని కాంగ్రెస్, దక్షిణ భారతానికి ఎందుకు పంపుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుగల్ పురోహిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రియాంక గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ సోమవారం ప్రకటించడంతో ఎన్నికల రాజకీయాలలో ఆమె ప్రవేశం కోసం చూస్తున్న వారి నిరీక్షణకు తెరపడింది.
రాహుల్ గాంధీ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో యూపీలోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్‌ల నుంచి విజయం సాధించారు. అయితే, నిబంధనల ప్రకారం అందులో ఒక స్థానాన్ని ఆయన వదులుకోవాల్సి రాగా వయనాడును వదులుకున్నారు.
ఈ మేరకు రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగుతారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం చెప్పారు. అలాగే రాహుల్ ఖాళీ చేస్తున్న వయనాడ్ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనీ ఆయన ప్రకటించారు.
పార్టీ నిర్ణయాన్ని అంగీకరిస్తూ ప్రియాంక గాంధీ “నా సోదరుడి ప్రాతినిధ్యం లేని లోటును వయనాడ్ ప్రజలకు కనిపించనివ్వను” అని అన్నారు.
ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయాలన్న కాంగ్రెస్ నిర్ణయంపై రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు?
దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని పరిశీలిస్తున్న జర్నలిస్ట్ జావేద్ అన్సారీ, ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడం ఆశ్చర్యకరమైన విషయం కాదని అన్నారు.
"ఆమె ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేస్తారు? అని చాలామంది ఎదురుచూశారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా అనే ప్రశ్న రాలేదు. అన్నాచెల్లెళ్లు ఇద్దరూ అమేఠీ, రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే అది పెద్ద సంచలనం అయి ఉండేది. అయితే, ఎన్నికల్లో ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీలో రాహుల్‌గాంధీ తరపున ప్రచారం చేయడంతో, రాహుల్ దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి వీలైంది’’ అని అన్సారీ అన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
ప్రియాంక, రాయ్‌బరేలీని ఎందుకు ఎంపిక చేసుకోలేదు?
ప్రియాంక గాంధీకి అమేఠీ, రాయ్‌బరేలీలు రెండింటి గురించి బాగా తెలుసు. ఇలాంటి పరిస్థితిలో రాహుల్ వయనాడ్ స్థానంలో కొనసాగుతూ, ప్రియాంక రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయొచ్చు కదా? అలా ఎందుకు చేయలేదు?
జావేద్ అన్సారీ ఈ ప్రశ్నకు సమాధానం ఇలా చెప్పారు. “రాయ్‌బరేలీతో ప్రియాంకకు ఉన్న అనుబంధాన్ని పరిగణనలోకి తీసుకుంటే, రాహుల్ గాంధీ వయనాడ్‌ను అట్టిపెట్టుకొని, ప్రియాంకకు రాయ్‌బరేలీ స్థానాన్ని ఇవ్వాలని ఒకప్పుడు అనుకొని ఉండొచ్చు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖచిత్రమని, ఆయన ఉత్తరప్రదేశ్‌కు దూరం కాలేదనే సందేశం ఇవ్వడానికే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు రాబట్టిన నేపథ్యంలో రాహుల్, ఉత్తరప్రదేశ్‌కు దగ్గరగా ఉండాలని పార్టీ కోరుకుంటుందని నాకు అనిపిస్తుంది’’ అని ఆయన అన్నారు.
జావేద్ అన్సారీ మాటలతో రాజకీయ విశ్లేషకులు, రచయిత్రి నీరజ చౌధరి కూడా ఏకీభవించారు.
“ఇది కాంగ్రెస్ పార్టీ బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమని నేను భావిస్తున్నాను. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పనితీరు, బీజేపీకి జరిగిన నష్టాన్ని చూస్తుంటే, ఉత్తరప్రదేశ్‌కు తమ పార్టీ చాలా ప్రాధాన్యం ఇస్తుందనే సందేశాన్ని కాంగ్రెస్ ఈ నిర్ణయం ద్వారా వెలువరించింది’’ అని నీరజ అన్నారు.
“రాహుల్ వయనాడ్ స్థానానికే ప్రాతినిధ్యం వహిస్తారని ఇంతకుముందు అనిపించింది. ముఖ్యంగా రాయ్‌బరేలీలో ప్రియాంక గాంధీ చాలా చురుకుగా ఉన్నారు. అయితే, ఇప్పుడు అఖిలేశ్ యాదవ్, రాహుల్ గాంధీ మధ్య మంచి సమీకరణ ఉంది, దాని ప్రాధాన్యాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. రెండు పార్టీలు పరస్పర అవగాహనతో ఈ ఎన్నికల్లో లాభపడ్డాయి’’ అని నీర్జా వివరించారు.
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య పొత్తు కారణంగా కాంగ్రెస్ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. 2019లో యూపీలో సోనియా గాంధీ పోటీ చేసిన రాయ్‌బరేలీ స్థానం ఒక్కటే కాంగ్రెస్ గెలుచుకున్న స్థానం. 2014లో యూపీలో అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాలు రెండూ కాంగ్రెస్ వశమయ్యాయి.
ఈసారి రాహుల్ గాంధీ రాయ్‌బరేలీలో 3 లక్షల 90 వేలకు పైగా ఓట్లతో, వాయనాడ్‌లో 3 లక్షల 64 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. ఇప్పుడు వాయనాడ్ నుంచి ప్రియాంక పోటీ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? అక్కడ ప్రియాంక గెలవడం సులభమేనా?

ఫొటో సోర్స్, Getty Images
ప్రియాంకను వయనాడ్ ప్రజలు ఆదరిస్తారా?
నీరజ చౌదరి మాట్లాడుతూ, “ప్రియాంక విషయంలో వయనాడ్ ప్రజలు ఏం చేస్తారో చూడాలి. వయనాడ్‌లో ఓటింగ్ ముగిసిన చాలా రోజుల తర్వాత కానీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసే విషయాన్ని రాహుల్ చెప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ తీసుకున్న నిర్ణయాన్ని వయనాడ్ ప్రజలు ద్రోహంగా భావించి, అసంతృప్తిని వ్యక్తం చేస్తారా అనేది చూడాలి. అయితే ప్రియాంక అలా జరగనివ్వరని, పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఆమె విజయం సాధిస్తారని అనుకుంటున్నాను’’ అని అన్నారు.
ప్రియాంక గాంధీ వ్యక్తిత్వం గురించి కూడా నీరజ చౌధరీ మాట్లాడారు. "ప్రియాంక గాంధీ చేతల మనిషి. రాహుల్ గాంధీతో పోలిస్తే ప్రియాంక గాంధీ భాష సాధారణ ప్రజలకు దగ్గరగా ఉంటుంది. అయితే, రాహుల్‌కు ఇవి అయిదో లోక్‌సభ ఎన్నికలు, ప్రియాంక గాంధీకి మొదటిది అని మనం మర్చిపోకూడదు’’ అన్నారు.
‘‘రాహుల్ గాంధీ తమ భవిష్యత్ నాయకుడన్న విషయంలో కాంగ్రెస్‌కు చాలా స్పష్టత ఉంది. 18వ లోక్‌సభలోకి ప్రియాంక ప్రవేశిస్తే అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆమె తల్లి సోనియా గాంధీ రాజ్యసభలో ఉన్నప్పుడు. పార్లమెంటులో ప్రియాంక గాంధీని ప్రజలు చాలా నిశితంగా పరిశీలిస్తారు. మరి ఆమె పార్లమెంటులో తన సోదరుడి నీడలా ఉంటారా లేక స్వతంత్రంగా వ్యవహరిస్తారా అనేది ఆసక్తికరం’’ అని నీరజ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రాహుల్-అఖిలేశ్ జోడీ
రాహుల్ గాంధీ, రాయ్‌బరేలీకే ప్రాధాన్యమివ్వడానికి ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను పునరుద్ధరించాలన్న నిర్ణయమే కారణమని హిందూస్థాన్ టైమ్స్ ఆంగ్ల పత్రిక పొలిటికల్ ఎడిటర్ వినోద్ శర్మ అన్నారు.
“బీజేపీ 2014 తర్వాత నుంచి యూపీలో ఏం కావాలనుకుంటే అది చేసింది. ఇప్పుడు యూపీలో ఈ పరిస్థితి మారిపోయి కాంగ్రెస్ పునరాగమనం చేసింది. గతంలో యూపీలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు అగ్రవర్ణాలు, దళితులతో పాటు మైనారిటీల్లోనూ మంచి పట్టు ఉంది’’ అని వినోద్ శర్మ అన్నారు.
‘‘అయితే క్రమంగా కాంగ్రెస్ బలం తగ్గిపోతూ వచ్చింది. చివరకు యూపీలో కాంగ్రెస్ నామమాత్రపు ఉనికిని నిలబెట్టుకోగలిగింది. ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత, యూపీలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది.
కాంగ్రెస్ ఇప్పుడు తన ప్రభావాన్ని చూపాలి. ఇందుకోసం యూపీలో కాంగ్రెస్ సామాజిక సమీకరణాలను సిద్ధం చేసుకోవాలి. దీని ఆధారంగానే కాంగ్రెస్ అన్ని జిల్లాల్లోనూ, ఆ తర్వాత రాష్ట్రంలోనూ, ఆ తర్వాత దేశంలోనూ తన స్థానాన్ని బలోపేతం చేసుకోగలుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య ఉన్న అవగాహనను అగ్ర నాయకత్వం స్థాయిలోనే కాకుండా ఓటర్లూ అంగీకరించారు’’ అని ఆయన వివరించారు.
రాయ్‌బరేలీలో గాంధీ-నెహ్రూ కుటుంబ మూలాలను ప్రస్తావిస్తూ వినోద్ శర్మ ఇలా అన్నారు. "ఫిరోజ్ గాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు, గాంధీ కుటుంబానికి రాయ్‌బరేలీతో అనుబంధం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. కొంతమంది ఇక్కడ వారసత్వ రాజకీయాల ప్రస్తావన తెస్తారని నాకు తెలుసు. కానీ, ఇది ప్రజాస్వామ్య వారసత్వం. ఇక్కడ మీరు ప్రజల అంగీకారాన్ని పొందాలి. కాబట్టి ఇలాంటి విమర్శలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని ఆయన అన్నారు.
ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఒకానొక సమయంలో గాంధీ కుటుంబం దక్షిణ భారతదేశంలో సీటు కోసం రాయ్‌బరేలీ స్థానాన్ని వదులుకుంది. దీనిపై నీరజ చౌదరి మాట్లాడుతూ, "ఇందిరా గాంధీ ఒకప్పుడు మెదక్, రాయ్‌బరేలీ నుంచి గెలిచారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్ స్థానానికి ప్రాతినిధ్యం వహించి రాయ్‌బరేలీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత రాయ్‌బరేలీకి సోనియా గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చారు’’ అన్నారు.
మరి ఇప్పుడు రాబోయే దక్షిణ భారతదేశంలోని వయనాడ్ ఉపఎన్నికలో, అక్కడి ఓటర్లు ఎవరిని ఎంపీగా ఎన్నుకుంటారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
- టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల తేడా ఎంత? అది ఫలితాలను ఎలా మార్చేసింది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














