ప్రియాంక గాంధీ వాధ్రా: తొలిసారి బరిలోకి దిగనున్న కాంగ్రెస్ నేత, వయనాడ్‌ను రాహుల్ ఎందుకు వదులుకున్నారంటే...

ఫొటో సోర్స్, GETTY IMAGES
మొన్నటి ఎన్నికలలో వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభ సభ్యునిగా గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, వయనాడ్ స్థానాన్ని వదలుకోవాలని నిర్ణయించారు. ఆయన సోదరి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాధ్రా అక్కడి నుంచి పోటీ చేయనున్నారు.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి గెలిచారు.
నిబంధనల మేరకు ఆయన ఒక్క స్థానంలోనే కొనసాగాలి కాబట్టి రాయ్‌బరేలీ నుంచి మాత్రమే ప్రాతినిథ్యం వహించాలని నిర్ణయించుకున్నారు.
వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.
దీని తరువాత రాహుల్ గాంధీ విలేఖరులతో మాట్లాడుతూ వయనాడ్ సీటు వదులుకున్నాని, కానీ అక్కడకు తరచూ వెళుతుంటానని చెప్పారు.
అలాగే రాయ్‌బరేలీని కూడా ప్రియాంక వదలరని చెప్పారు. రాయ్‌బరేలీ, వయనాడ్‌కు ఇప్పుడు ఇద్దరు ఎంపీలు వస్తారని తెలిపారు.
సోమవారం జరిగిన కాంగ్రెస్ అగ్ర నేతల సమావేశంలో వయనాడ్ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ వాధ్రాను పోటీ చేయించాలని నిర్ణయించారు.
భారత ప్రజాప్రాతినిథ్య చట్టం ప్రకారం రెండు స్థానాలలో గెలిచిన ఎంపీలు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన 14 రోజులలోపు ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.
అంతకుముందు తాను ఏ సీటును వదులకోవాలనే అంశంపై మధనపడుతున్నట్టు చెప్పిన రాహుల్, రెండుచోట్లా ఓటర్లు సంతోషపడే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.


ఫొటో సోర్స్, GETTYIMAGES
ప్రియాంక గాంధీ వాధ్రా వయనాడ్ స్థానం నుంచి పోటీచేస్తారనే విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటిస్తూ ‘‘కాంగ్రెస్ పార్టీలోని అందరం రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ సీటు నుంచే ఎంపీగా ఉండాలని నిర్ణయించాం.ఆయన వయనాడ్‌లోనూ గెలిచారు. అక్కడి ప్రజల ప్రేమాభిమానాలూ పొందారు. అందుకే అక్కడి నుంచి ప్రియాంక గాంధీని పోటీచేయించాలని నిర్ణయించాం’’ అని తెలిపారు.
వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ లేని లోటు తెలియనివ్వనని ప్రియాంక వ్యాఖ్యానించారు. ‘‘వయనాడ్‌కు ప్రాతినిథ్యం వహించడానికి చాలా సంతోషిస్తా. రాహుల్ కూడా వయనాడ్‌కు వస్తుంటాననిచెప్పారు. ప్రజలందరూ సంతోషంగా ఉండేలా నేను కూడా కష్టపడి పనిచేస్తా’’ అని ప్రియాంక తెలిపారు.
‘‘నాకు రాయ్‌బరేలీతో ఎంతో అనుబంధం ఉంది. రాయ్‌బరేలీ, అమేఠీ కోసం 20 ఏళ్ళపాటు పనిచేశాను’’ అని ఆమె అన్నారు.
‘‘కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అనూహ్యమైనదేమీ కాదు. ఆ పార్టీ ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి అమలు చేసిన వ్యూహంలో ఇదో భాగం’’ అని సీనియర్ జర్నలిస్ట్ హేమంత్ అత్రి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని విశ్లేషించారు.
‘‘ప్రియాంక కోరుకుంటే అమేఠీ నుంచే పోటీ చేసి ఉండేవారు. కానీ స్మృతి ఇరానీకి బలమైన సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో కేఎల్ శర్మతో పోటీచేయించారు.’’ అని హేమంత్ తెలిపారు.
‘‘ప్రియాంకను ఎన్నికల బరిలోకి దింపి ఉంటే, పార్టీ ఓ స్టార్ కాంపెయినర్‌ను కోల్పోయేది. పైగా ప్రియాంక అమేఠీ పై ఎక్కువ దృష్ట సారించాల్సి వచ్చేది.’’ అని అత్రి వివరించారు.
‘‘రాయ్‌బరేలీ తమ కుటుంబ నియోజకవర్గమని సోనియా ఇప్పటికే చెప్పారు. తన కుమారుడిని అక్కడి ప్రజలకు అప్పగిస్తున్నానని చెప్పినట్టుగానే ఆమె తన మాట నిలుపుకున్నారు.’’ అని ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజయ్ రాయ్ చెప్పారు.
‘‘ఇప్పుడు పార్టీ కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు.’’ అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, @NALINSKOHLI
బీజేపీ అసంతృప్తి
వయనాడ్ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ వాధ్రాను రంగంలోకి దింపాలనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని బీజేపీ విమర్శించింది.
‘‘కాంగ్రెస్ ఓ పార్టీ కాదు. అదో కుటుంబ పార్టీ. ఇప్పడా విషయం రుజువైంది. వారి తల్లి సోనియా గాంధీ రాజ్యసభలో ఉంటారు. కుమారుడు లోక్‌సభలో ఉంటారు. ఇప్పుడు కుమార్తె కూడా. నియంతృత్వ రాజకీయ పోకడలకు ఇదో ఉదాహరణ.’’ అని బీజేపీ నేత షాజాద్ పూనావాలా విమర్శించారు.
‘‘కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో రెండు విషయాలు స్పష్టమయ్యాయి. మొదటిది వారు కుటుంబ రాజకీయాలను వయానాడ్ నుంచి రాయ్‌బరేలీ వరకు విస్తరించాలనుకుంటున్నారు. రెండోది తాను మరో సీటులో పోటీచేస్తున్నానని, వయనాడ్‌ను వదిలివేస్తానని, క్లిష్టపరిస్థితుల నడుమ కూడా రాహుల్‌ను రెండోసారి ఎన్నుకున్న వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ ఏనాడూ చెప్పలేదు.’’ అని బీజేపీ నేత నళిన్ కొహ్లీ విమర్శించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
నెహ్రూ-గాంధీ కుటుంబానికి రాయ్‌బరేలీతో ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. రాహుల్ తాత ఫిరోజ్ గాంధీ 1952 ఎన్నికలలో అక్కడి నుంచి పోటీచేశారు. ఇందిరాగాంధీ మొదటిసారిగా 1967లో ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు.
1971లోనూ ఆమె ఇక్కడ గెలిచారు. కానీ కోర్టు ఉత్తర్వుల కారణంగా ఆ ఎన్నిక 1975లో రద్దయింది.
అయితే 21 నెలల ఎమర్జెన్సీ తరువాత 1977లో ఇందిరాగాంధీ రాయ్‌బరేలీలో ఓడిపోయారు.
1980లో ఇందిరాగాంధీ రాయ్‌బరేలీలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెదక్ (ఇప్పుడు తెలంగాణ) నుంచి పోటీచేసి రెండు చోట్లా గెలుపొందారు.
తరువాత ఆమె రాయ్‌బరేలీ సీటు వదులుకున్నారు.
ఆపై అక్కడ జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి అరుణ్ నెహ్రూ గెలిచారు.
1989, 1991లో కాంగ్రెస్ నేత షీలా కౌల్ అక్కడి నుంచి గెలిచారు. 1996, 1998లో బీజేపీ నేత అశోక్ సింగ్ రాయ్‌బరేలీలో గెలిచారు.
1999లో రాయ్‌బరేలీ మరోసారి కాంగ్రెస్ చేతికి వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్ నేత సతీష్ శర్మ అక్కడి నుంచి గెలిచారు.
ఇక సోనియా గాంధీ 2004 నుంచి 2024 వరకు రాయ్‌బరేలీ ఎంపీగా ఉన్నారు.
ఇటీవలి ఎన్నికలలో రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీచేసి 4 లక్షల పై చిలుకు మెజార్టీతో గెలిచారు.
ఇవి కూడా చదవండి:
- రుషికొండ ‘రహస్య’ భవనాల్లో ఏముందంటే?
- మెదక్‌లో ఉద్రిక్తత: ‘మేం ఏం తప్పు చేశామని మా హాస్పిటల్‌పై దాడి చేశారు?’
- ‘స్త్రీ తన వస్త్రాలతో పాటు సిగ్గును కూడా విడిచేయాలి’ - సెక్స్ గురించి ప్రాచీన కాలంలో మహిళలు ఎలా చర్చించుకునేవారు?
- అపాయంలో ఉపాయం: ఎడారిలో సింహాలబారి నుంచి తప్పించుకున్న ఇద్దరు స్నేహితురాళ్ళ కథ...
- సన్‌స్క్రీన్ లోషన్లు వాడుతున్నారా, ఈ ఎనిమిది విషయాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














