కల్తీ మద్యం తాగడంతో 47 మంది మృతి, మిథనాల్ కలిపిన ఆల్కహాల్ శరీరంలోకి వెళ్తే ఏమవుతుంది?

తమిళనాడులోని కళ్లకురిచ్చిలో కల్తీ మద్యం తాగడంతో 47 మంది చనిపోయారు. కల్తీ మద్యం బాధితుల సంఖ్య పెరుగుతుండటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
కళ్లకురిచ్చి కల్తీ మద్యం మరణాలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఆల్కహాల్‌లో మిథనాల్ ఎంత ప్రమాదకరం? పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వినియోగించే ఈ ప్రాణాంతక మిథనాల్ అక్రమ మద్యం తయారీదారుల చేతికి ఎలా వస్తోంది?
తమిళనాడులో విషపదార్థాల కారణంగా మరణాలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు మూతపడినప్పుడు, ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చినప్పుడు కొందరు పెయింట్‌లో వాడే థిన్నర్స్‌ను డ్రగ్స్‌గా వాడుతున్నట్లు వార్తలొచ్చాయి. అలా డ్రగ్స్ కోసం వివిధ మార్గాలను ప్రయత్నించి అక్కడక్కడా కొందరు చనిపోయినట్లు కూడా వార్తలొచ్చాయి.
2023 మేలో మిథనాల్ కలిపిన మద్యం తాగి 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
నకిలీ మద్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
తమిళనాడులోనే కాకుండా గుజరాత్, బిహార్ వంటి రాష్ట్రాల్లోనూ కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోయిన ఘటనలు జరిగాయి.
కల్తీ మద్యం ప్రమాదకరమని తెలిసినా కొందరు ఎందుకు దానిని ఆశ్రయిస్తున్నారు? మిథనాల్ మనిషిని ఎలా చంపుతుంది? అది మానవ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఏం జరుగుతుంది?
ఇలాంటి ప్రశ్నలకు చెన్నైకి చెందిన పల్మనాలజిస్ట్, డాక్టర్ జయరామన్ నుంచి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం.


ఫొటో సోర్స్, Getty Images
మిథనాల్ తాగితే ఏమవుతుంది?
‘‘కల్తీ మద్యానికి, మత్తు కలిగించే మద్యానికి తేడా ఉంది. ప్రభుత్వ ప్రమాణాలను పాటించకుండా మద్యం తయారు చేసి వినియోగిస్తే అది కల్తీ అవుతుంది.
అందులో, మత్తు కోసం మిథనాల్ కలిపితే విషపూరిత ఆల్కహాల్‌గా మారుతుంది. ఆల్కహాల్‌లో ఇథనాల్‌గా పిలిచే ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది. మిథైల్ ఆల్కహాల్‌ను మిథనాల్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రాణాంతకమైన విషపదార్థం.
దీనిని పరిశ్రమల్లో కొన్ని రసాయనాల తయారీ కోసం వాడతారు. ఫ్యాక్టరీలకు సరఫరా అయ్యే మిథనాల్‌లో ఆల్కహాల్ 90 శాతం నుంచి 100 శాతం ఉంటుంది. ఆ మిథనాల్‌ను డైల్యూట్ చేయకుండా నేరుగా తాగితే నిముషాల వ్యవధిలో చనిపోతారు'' అని డాక్టర్ జయరామన్ చెప్పారు.
''మానవ శరీరంలోకి ప్రవేశించిన మిథనాల్ జీర్ణవ్యవస్థ, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. విషతుల్యమైన మద్యం కడుపులోకి ప్రవేశించగానే తొలుత కొద్దిసేపు ఆనందంగా అనిపించినా, కొద్ది సెకన్లలోనే పొట్టలో, పేగుల్లో మంట మొదలవుతుంది. మిథనాల్ కలిపిన మద్యం తాగిన వారికి నురగతో కూడిన వాంతులు అవుతాయి. ఆ వాంతి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఒక్కసారిగా ఊపిరాడకుండా చేస్తుంది.
అదే సమయంలో, మిథనాల్‌లోని విషపదార్థం నాడీ వ్యవస్థ ద్వారా మెదడుకు వ్యాపిస్తుంది. ఆ తర్వాత మెదడు కణాలు వెంటనే చనిపోతాయి. మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొద్దినిమిషాల్లోనే వారు అపస్మారక స్థితికి చేరుకుంటారు. కొంతమంది ఎక్కువ మత్తు కోసం తెలియక మిథనాల్ తీసుకుంటారు. ఎక్కువసేపు మత్తులో ఉంచుతుందని, స్వర్గానికి తీసుకెళ్తుందని భావిస్తారు. కానీ జరిగేది వేరే'' అని డాక్టర్ వివరించారు.

మద్యం వ్యాపారులకు మిథనాల్ ఎలా వస్తుంది?
ప్రాణాంతకమైన మిథనాల్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కఠిన నిబంధనలు ఉన్నాయి. కేవలం పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వినియోగించే మిథనాల్ కొనుగోలు నుంచి వినియోగం వరకూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అనేక వ్యవస్థలు కూడా ఉన్నాయి. వాటి వినియోగానికి సంబంధించి పరిశ్రమలు కూడా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇన్ని ఉన్నప్పటికీ మిథనాల్ అక్రమ మద్యం తయారీదారుల చేతికి ఎలా చేరుతోంది? అనే ప్రశ్నకు రిటైర్డ్ ఎస్పీ కరుణానిధి సమాధానమిచ్చారు.
''అక్రమ మద్యం వ్యాపారులకు ఏయే ఫ్యాక్టరీల్లో మిథనాల్ లభిస్తుందో తెలుసు. అలాగే, ఫ్యాక్టరీల యజమానులకు కూడా వారితో సంబంధాలుంటాయి. కల్తీ మద్యం వ్యాపారులకు మిథనాల్ విక్రయించి అదనంగా సొమ్ము చేసుకోవాలనుకోవడమే దానికి కారణం. ఇలా ప్రాణాంతక మిథనాల్ మానవ శరీరంలోకి ప్రవేశిస్తోంది'' అని ఆయన చెప్పారు.
''మిథనాల్ విక్రయాలపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. ఎందుకంటే, అది ప్రాణాంతకం. మిథనాల్ కొనుగోలు చేసేందుకు లైసెన్స్ తప్పనిసరి. కొనుగోలు చేసిన మిథనాల్‌ను ఎలా ఉపయోగించారు? ఎంత వినియోగించారు? ఇంకా ఎంత స్టాక్ ఉంది? వంటి వివరాలతో ఫ్యాక్టరీలు రికార్డులను పక్కాగా నిర్వహించాలి. ఇన్ని ఆంక్షలు, నిబంధనలు ఉన్నప్పటికీ ఫ్యాక్టరీ యాజమాన్యాలు డబ్బులకు కక్కుర్తి పడి మిథనాల్‌ను అక్రమార్కులకు విక్రయిస్తున్నారు'' ఆయన వివరించారు.
నిరుడు మరక్కాణంలో సంభవించిన కల్తీ మద్యం మరణాలకు కారణమైన మిథనాల్, చెన్నైలోని ఓ ఫ్యాక్టరీ నుంచి సరఫరా అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఫ్యాక్టరీని సీజ్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇద్దరు అరెస్ట్
కళ్లకురిచ్చి మరణాలకు మీథనాల్ కూడా ఒక కారణమని ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడించింది. కళ్లకురిచ్చిలో కల్తీ మద్యం విక్రయిస్తున్న కన్నుకుట్టి అలియాస్ గోవిందరాజ్, అతని తమ్ముడు దామోదరన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరినీ కళ్లకురిచ్చి పోలీసులు విచారిస్తున్నారు.
కల్తీ మద్యం కారణంగా ఆస్పత్రి పాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కలెక్టర్ బదిలీ, ఎస్పీ సస్పెండ్
కళ్లకురిచ్చి ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లా కలెక్టర్ శ్రావణ్ కుమార్‌ను బదిలీ చేశారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సమైసింగ్ మీనాను విధుల నుంచి సస్పెండ్ చేశారు. కొత్త ఎస్పీగా రజత్ చతుర్వేది నియమితులయ్యారు.
అధికారుల సస్పెన్షన్
కలెక్టర్ బదిలీ, ఎస్పీ సస్పెన్షన్‌తో పాటు మరో 9 మంది అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ప్రొహిబిషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డీఎస్పీ తమిళసెల్వన్, ఇన్‌స్పెక్టర్ కవిత, తిరుకోవిలూర్ ప్రొహిబిషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ పండిట్‌సెల్వి, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ భారతి, కళ్లకురిచ్చి పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఆనందన్, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ శివచంద్రన్, పోలీస్ స్టేషన్ క్లర్క్ భాస్కరన్, స్పెషల్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ మనోజ్‌లను సస్పెండ్ చేసింది.
ఇవి కూడా చదవండి:
- మెదక్: బక్రీద్ సందర్భంగా ఇక్కడ జరిగిన గొడవేంటి? ఎందుకు జరిగింది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














