రష్యా, ఉత్తర కొరియా మధ్యలో చైనా.. వీరి స్నేహం ఎంత దూరం వెళ్లనుంది?

పుతిన్, కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, లారా బికర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెల్లవారుజామున మూడు గంటలకు విమానాశ్రయంలో కౌగిలింతలు, అశ్వికదళ గౌరవ వందనాలు.. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసి కనిపిస్తున్న ఛాయాచిత్రాలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఇదంతా పశ్చిమ దేశాలను ఇబ్బంది పెట్టడానికే జరిగింది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా 2,000లో ఉత్తర కొరియాను సందర్శించారు. ఇంత సుదీర్ఘ కాలం తర్వాత జరిగిన తాజా పర్యటన రెండు దేశాల స్నేహాన్ని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం లాంటిది.

ఇది కేవలం బలప్రదర్శన మాత్రమే కాదు. యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. ఈ సమావేశాలు, ప్రకటనల్లో దక్షిణ కొరియా, అమెరికా, ఐరోపా దేశాలు భారీ ముప్పును చూస్తున్నాయి.

నిజానికి, ఇద్దరు నాయకులు తమకు ఒకరికొకరు అవసరమని భావిస్తున్నారు. యుద్ధం కొనసాగించడానికి పుతిన్‌కు మందుగుండు సామాగ్రి కావాలి, ఉత్తర కొరియాకు డబ్బు అవసరం.

అయితే ఈ బంధంలో ఉత్తర కొరియాకు అంత పట్టు లేదు. ఎందుకంటే పుతిన్, కిమ్ జోంగ్‌ ఉన్‌లు చైనా మద్దతుతో స్నేహం చేస్తున్నారు. ఈ రెండు దేశాలపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల నేపథ్యంలో వాణిజ్యాన్ని, ఆధిపత్యాన్ని కొనసాగించడానికి చైనా వారికి చాలా ముఖ్యం.

కిమ్‌తో స్నేహాన్ని పుతిన్ గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ, దానికి ఒక లిమిట్ ఉందని గుర్తుంచుకోవాలి. ఆ పరిమితి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తప్ప మరొకటి కాదు.

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్

పుతిన్, కిమ్ స్నేహం చైనాకు నచ్చడం లేదా?

మరోవైపు, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తన ఇద్దరు మిత్రదేశాలు సన్నిహితంగా ఉండటం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది.

2024 మేలో పుతిన్‌తో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశం తరువాత నేరుగా ఉత్తర కొరియాకు వెళ్లవద్దని పుతిన్‌కు జిన్‌పింగ్ సూచించారని కొన్ని కథనాలు పేర్కొన్నాయి.

తాజాగా పుతిన్ ఉత్తర కొరియాకు వెళ్లడం చైనాకు నచ్చలేదని తెలుస్తోంది.

రష్యాకు మద్దతివ్వడం మానేయాలని, యుక్రెయిన్‌తో యుద్ధానికి ఆజ్యం పోసే వస్తువులను విక్రయించవద్దని చైనా అధ్యక్షుడికి ఇప్పటికే అమెరికా, యూరప్‌ల నుంచి ఒత్తిడి ఉంది.

జిన్‌పింగ్‌ ఈ హెచ్చరికలను విస్మరించలేరు. ఎందుకంటే ప్రపంచానికి చైనా వస్తువులు అవసరమైనట్లే, ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగడానికి చైనాకు విదేశీ పర్యాటకులు, పెట్టుబడులు అంతే అవసరం.

అందుకే చైనా ఇప్పుడు కొన్ని యూరోపియన్ దేశాలతో పాటు థాయ్‌లాండ్, ఆస్ట్రేలియాల నుంచి వచ్చే వారికి వీసా రహిత ప్రయాణాన్ని అందిస్తోంది. పాండాలను మరోసారి విదేశీ జంతు ప్రదర్శనశాలలకు పంపుతున్నారు.

పుతిన్, జిన్ పింగ్

ఫొటో సోర్స్, Getty Images

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వైఖరి పరిశీలిస్తే.. ప్రపంచంలో ఆయన పెద్దన్న పాత్రను పోషించడానికి, అమెరికాతో నేరుగా పోటీపడటానికి ప్రయత్నిస్తున్నారు.

పాశ్చాత్య దేశాల బహిష్కృత దేశంగా లేదా వారి నుంచి ఒత్తిడిని ఎదుర్కోనే వ్యక్తిగా ఉండటానికి చైనా అధినేత ఇష్టపడరు.

ఇన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ రష్యాతో చైనా తన సంబంధాలను కొనసాగిస్తోంది. యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించలేదు. అదే సమయంలో రష్యాకు పెద్దగా సైనిక సహాయాన్ని కూడా చేయలేదు.

మేలో పుతిన్‌తో జరిగిన సమావేశంలో చైనా అధ్యక్షుడు చాలా జాగ్రత్తగా ప్రకటనలు చేశారు. అదే సమయంలో పుతిన్ కూడా జిన్‌పింగ్‌ను ప్రశంసించారు.

అణ్వాయుధాల పెంపుదలకు కిమ్ జోంగ్ ఉన్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా రాజకీయంగా మద్దతిస్తూ వస్తోంది. ఐక్యరాజ్య సమితిలో అమెరికా పెట్టిన ఆంక్షలను చైనా పదే పదే అడ్డుకుంది. అయితే, కిమ్ జోంగ్ ఉన్ వైఖరికి జిన్‌పింగ్ మద్దతుదారైతే కాదు.

ఉత్తర కొరియా పదే పదే ఆయుధ పరీక్షలు నిర్వహిస్తోంది. జపాన్, దక్షిణ కొరియాలు అమెరికాతో తమ ‘పాత జ్ఞాపకాల’ను మరిచిపోయి అదే దేశానికి చేరువ కావడానికి కారణాలలో ఇదొకటి.

ఉద్రిక్తతలు పెరిగితే పసిఫిక్ మహాసముద్రంలో మరిన్ని అమెరికన్ యుద్ధనౌకలు కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో 'తూర్పు ఆసియా నాటో’ ఏర్పడే అవకాశాలున్నాయని చైనా ఆందోళన పడుతోంది.

కిమ్, పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

రష్యా పునరాలోచించుకుంటుందా?

చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తే ఉత్తర కొరియాకు మరింత టెక్నాలజీని విక్రయించాలనే నిర్ణయాన్ని రష్యా పునఃపరిశీలించొచ్చు. ఇది అమెరికాకు కూడా పెద్ద ఆందోళన కలిగించేదే.

అయితే, ఉత్తర కొరియాకు రష్యా పెద్ద మొత్తంలో మిలటరీ టెక్నాలజీని అందిస్తుందని అనుకోవడం లేదని ఎన్‌కె న్యూస్ డైరెక్టర్ ఆండ్రీ లాంకోవ్ అంటున్నారు.

రష్యా ఒకవేళ అలా చేసినా, దానికి పెద్దగా లాభముండదని, భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. యుక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా ఫిరంగి పుతిన్‌కు అవసరమైనప్పటికీ, బదులుగా క్షిపణి సాంకేతికత విక్రయం అంత మంచి డీల్ కాకపోవచ్చు.

రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న చైనాకు కోపం తెప్పించే ఒప్పందం లాభదాయకం కాదని పుతిన్ గ్రహించవచ్చు. అంతేకాదు పశ్చిమ దేశాల ఆంక్షల మధ్య రష్యాకు మద్దతుగా నిలబడింది చైనా.

ఉత్తర కొరియాకు చైనా అవసరం మరింత ఎక్కువ. కిమ్ జోంగ్ ఉన్ సందర్శించే ఏకైక దేశం ఇది. ఉత్తర కొరియా చమురులో దాదాపు సగం రష్యా నుంచి వస్తుంది. కానీ, ఉత్తర కొరియా వాణిజ్యం 80 శాతం చైనాతోనే ఉంది.

చైనా-ఉత్తర కొరియాల మధ్య సంబంధాలపై ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానిస్తూ.. ఇది నిరంతరం వెలుగుతున్న నూనె దీపం లాంటిదని అన్నారు.

పుతిన్, కిమ్ జోంగ్ మిత్రలుగా కనిపించడానికి ప్రయత్నించినప్పటికీ, వారిద్దరికీ చైనా చాలా ముఖ్యమైనది.

కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్

ఉత్తర కొరియా నిలబడుతుందా?

'సామ్రాజ్యవాద పశ్చిమ'కు వ్యతిరేకంగా వారు ప్రకటించిన పోరాటం ఉన్నప్పటికీ, ఇది యుద్ధం లాంటి భాగస్వామ్యం. ఇది మరింత బలపడవచ్చు కూడా. అందరు తమ భాగస్వామ్యాన్ని కూటమి స్థాయికి తీసుకెళ్లినప్పటికీ, దానిలో తమ లాభనష్టాలను చూస్తున్నట్లు కనిపిస్తోంది.

రష్యా, ఉత్తర కొరియాల మధ్య 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' ఒప్పందం కుదిరింది. అయితే, కిమ్ మందుగుండు సామాగ్రి సరఫరాను కొనసాగిస్తారన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే కిమ్‌కు కూడా మందుగుండు అవసరం, అక్కడ దక్షిణ కొరియా ఎదురుగా కూర్చుంది. దాని నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఉత్తర కొరియాకు ఆయుధాలు అవసరం.

పశ్చిమ దేశాలతో రష్యాకు స్నేహపూర్వక సంబంధాలున్నప్పుడు పుతిన్.. ఉత్తర కొరియాపై రెండుసార్లు ఆంక్షలు విధించారు.

ఇది మాత్రమే కాదు, ఉత్తరకొరియా న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను వదిలేయాలంటూ అమెరికా, చైనా, దక్షిణ కొరియా, జపాన్‌లతో రష్యా చేతులు కలిపింది.

2018లో కిమ్ జోంగ్ ఉన్ దౌత్య చర్చలకు బయలుదేరినప్పుడు, ఒక్కసారి మాత్రమే అధ్యక్షుడు పుతిన్‌ను కలిశారు.

ఆ సమయంలో దక్షిణ కొరియా అధ్యక్షుడిని కిమ్ ఆప్యాయంగా పలకరించడం, స్నేహం ప్రదర్శించడం, చిరునవ్వులు చిందించడాలు చేశారు. అంతేకాదు కాదు అప్పటి అమెరికా ప్రెసిడెంట్ డోనల్డ్ ట్రంప్‌తో కూడా సన్నిహితంగా కనిపించారు కిమ్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)