దక్షిణ కొరియాతో సరిహద్దులో ఉత్తర కొరియా ఏం నిర్మిస్తోంది? ఉపగ్రహ చిత్రాలలో కనిపిస్తున్న ఆ నిర్మాణాలేమిటి

ఉత్తర కొరియా సరిహద్దుల్లో నిర్మాణాలు
    • రచయిత, జేక్ హార్టన్, యీ మా, డేనియెల్ పాలుంబో
    • హోదా, బీబీసీ వెరిఫై

దక్షిణ కొరియాతో సరిహద్దుకు సమీపంలోని కొన్ని ప్రదేశాల్లో ఉత్తర కొరియా నిర్మాణాలు చేపడుతోంది. గోడల్లా కనిపిస్తున్న ఆ నిర్మాణాలకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు వెల్లడయ్యాయి.

అవి డీమిలిటరైజ్డ్ జోన్ - డీఎంజడ్ లోపలే ఉన్నట్లు ‘బీబీసీ వెరిఫై’ విశ్లేషించిన చిత్రాలు కూడా చూపుతున్నాయి. ఇది దక్షిణ కొరియాతో దీర్ఘకాలంగా ఉన్న ఒప్పంద ఉల్లంఘనగా నిపుణులు భావిస్తున్నారు.

డీఎంజెడ్ అనేది ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య 4 కిలోమీటర్ల మేర ఉన్న బఫర్ జోన్. సాంకేతికంగా చూస్తే వారు ఇప్పటికీ యుద్ధంలోనే ఉన్నారు. ఎందుకంటే, ఇప్పటి వరకూ రెండు దేశాలూ శాంతి ఒప్పందంపై సంతకాలు చేయలేదు. ఈ 4 కిలోమీటర్ల వెడల్పు మేర ఉన్న డీఎంజెడ్‌ను రెండుగా విభజించారు. ఎవరి భూభాగం వైపు వారి నియంత్రణ కొనసాగుతోంది.

ఈ చర్యను 'అసాధారణమైనది'గా నిపుణులు భావిస్తున్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో ఈ విషయం కీలకంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.

''ఇప్పుడున్న దాని ప్రకారం, ఉత్తర కొరియా తన సైనిక సంపత్తిని, నిర్మాణాలతో సరిహద్దును బలోపేతం చేసుకునేందుకు చూస్తోందని భావిస్తున్నాం'' అని దక్షిణ కొరియాలో ఉంటున్న ‘ఎన్‌కే న్యూస్’ ప్రతినిధి శ్రేయాస్ రెడ్డి చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు
గ్రాఫిక్

రెండు దేశాల సరిహద్దులో 7 కిలోమీటర్ల విస్తీర్ణం మేర ఉత్తర కొరియా చేపట్టిన పనులను పరిశీలించే ప్రాజెక్టులో భాగంగా, బీబీసీ వెరిఫై హైరిజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్‌ను విశ్లేషించింది.

డీఎంజెడ్ సమీపంలో బోర్డర్‌కి తూర్పువైపు చివరన, కిలోమీటర్ వ్యవధిలో కనీసం మూడు చోట్ల నిర్మాణాలు జరిగినట్లు ఈ చిత్రాలు చూపుతున్నాయి.

సరిహద్దు వెంబడి ఇతర ప్రాంతాల్లోనూ బ్యారియర్స్ నిర్మాణం జరిగే అవకాశం ఉంది.

గత హై రిజల్యూషన్ చిత్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ ప్రాంతంలో నిర్మాణాలు ఏ తేదీన ప్రారంభమయ్యాయనేది కచ్చితంగా తెలియడం లేదు. అయితే, 2023 నవంబర్‌లో తీసిన చిత్రాల్లో ఈ నిర్మాణాలు కనిపించలేదు.

''రెండు ప్రాంతాలను వేరుచేసేలా నిర్మాణాలు చేపట్టడం ఇదే మొదటిసారి'' అని సియోల్‌లోని అసన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్‌లో డిఫెన్స్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ ఉక్ యాంగ్ బీబీసీతో చెప్పారు.

ఉత్తర కొరియా

''ఒకవేళ యుద్ధం జరిగితే యుద్ధ ట్యాంకులను నిలువరించేందుకు ఉత్తర కొరియా 1990లలో యాంటీ ట్యాంక్ వాల్స్‌ను నిర్మించింది. కానీ, ఇప్పుడు 2, 3 మీటర్ల ఎత్తు మేర నిర్మిస్తున్న గోడలు యాంటీ ట్యాంక్ వాల్స్‌లా కనిపించడం లేదు'' అని డాక్టర్ యాంగ్ అన్నారు.

''గోడల ఆకారం చూస్తే అవి కేవలం ట్యాంకులను నిలువరించే బ్యారియర్స్ కాదనిపిస్తోంది. కానీ, అవి ఒక ప్రాంతాన్ని విభజించేందుకు ఉద్దేశించినవి'' అని శాటిలైట్ ఇమేజెస్‌ను పరిశీలించిన డాక్టర్ యాంగ్ తెలిపారు.

దానితో పాటు డీఎంజెడ్‌లోని ఉత్తర కొరియా వైపు ఉన్న భూభాగంపై, ఖాళీ చేసినట్లు (దారి వేసేందుకు శుభ్రం చేసినట్లుగా) కనిపిస్తున్న ఆనవాళ్లు కూడా స్పష్టంగా ఉన్నాయి.

డీఎంజడ్‌లో నిర్మాణాలు

బోర్డర్‌‌కి ఆనుకుని తూర్పు వైపున, చివరి భాగంలో కొత్తగా రోడ్డు నిర్మించినట్లుగా తాజా ఉపగ్రహ చిత్రాలు చూపుతున్నాయి.

పైమ్యాప్‌లో డీఎంజెడ్ ఉత్తర సరిహద్దు కచ్చితంగా కనిపిస్తుండడంతో, సరిహద్దును స్పష్టంగా తెలుసుకునేందుకు బీబీసీ పరిశోధన చేపట్టింది.

ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న మ్యాప్‌లలో స్వల్ప వ్యత్యాసాలున్నాయి.

దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (జేసీఎస్)‌కి చెందిన ఒక అధికారి ఇటీవల మాట్లాడుతూ, ''వ్యూహాత్మక రహదారుల పటిష్టత, కందకాల తవ్వకం, అక్కడి బీడు భూములను సిద్ధం చేయడం'' వంటి కార్యకలాపాలను సైన్యం గుర్తించిందని చెప్పారు.

డీఎంజెడ్‌లో ఉత్తర కొరియా నియంత్రణలో ఉన్న అనేక ఇతర ప్రదేశాల్లోనూ భూమిని సిద్ధం చేస్తున్నట్లు గతంలో రిపోర్టులు వచ్చాయి.

''భూమిని సిద్ధం చేయడమనేది సైనిక కార్యకలాపాలకు లేదా ఇతర కార్యకలాపాలకు కూడా కావొచ్చు'' అని కొరియా యూనివర్సిటీలోని ఇల్మిన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ కిల్ జూ బాన్ చెప్పారు.

''దీనివల్ల దక్షిణ కొరియాలో జరిగే సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు, దక్షిణ కొరియా వైపుకి సరిహద్దు దాటి చొరబడేందుకు ప్రయత్నించే వారిని గుర్తించేందుకు అవసరమైన నిఘా పోస్టులను ఏర్పాటు చేసుకోవడం సులభతరమవుతుంది'' అని బాన్ చెబుతున్నారు.

కొరియా
ఫొటో క్యాప్షన్, 2018లో సమావేశమైన ఉత్తర కొరియా, దక్షిణ కొరియా అధ్యక్షులు

''డీఎంజెడ్‌లో నిర్మాణాలు చేపట్టడం సాధారణ అంశం కాదు. ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఇలాంటివి చేపట్టడం యుద్ధ విరమణ ఒప్పంద ఉల్లంఘన కిందకు రావొచ్చు'' అని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ఆసియా, కొరియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ విక్టర్ చా తెలిపారు.

1953లో యుద్ధ విరమణతో కొరియా యుద్ధం ముగిసింది. ''డీఎంజెడ్ లోపలి నుంచి కానీ, డీఎంజెడ్ ప్రాంతంలో కానీ ఎలాంటి సైనిక చర్యను చేపట్టబోం'' అని రెండు పక్షాలూ ప్రతిజ్ఞ చేశాయి. కానీ, రెండు వర్గాల మధ్య ఎలాంటి శాంతి ఒప్పందం జరగలేదు.

ఏళ్లుగా కొరియా పునరేకీకరణ అసంభవం అనిపించినప్పటికీ, 2024 ప్రారంభంలో ఇకపై తమ దేశం ఆ లక్ష్యాన్ని కొనసాగించదని ప్రకటించేంత వరకూ ఉత్తర కొరియా నాయకులకు అదే లక్ష్యం ఉండేది.

దక్షిణ కొరియాను 'ప్రధాన శత్రువు'గా కిమ్ పేర్కొన్నప్పుడు విధానాల్లో గణనీయమైన మార్పుగా చూశారు కొరియా వ్యవహారాల నిపుణులు.

అప్పటి నుంచి రెండు దేశాల ఏకీకరణను సూచించే చిహ్నాలను తొలగించడం మొదలైంది. స్మారకాలను ధ్వంసం చేయడం, ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో రెండు దేశాల పునరేకీకరణకు సంబంధించిన చిహ్నాలను తొలగించడం వంటివి జరిగాయి.

''దక్షిణ కొరియా నుంచి వ్యతిరేకతను నిరోధించేందుకు ఇలాంటి అడ్డంకులు నిజంగా అవసరం లేదు. కానీ, ఈ సరిహద్దు బ్యారియర్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఉత్తర కొరియా కూడా పునరేకీకరణను కోరుకోవడం లేదని సూచిస్తుంది'' అని లండన్ కింగ్స్ కాలేజ్‌లో యూరోపియన్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అధిపతి డాక్టర్ రామన్ పచెకో పార్డో చెప్పారు.

మరికొందరు నిపుణులు, ఇది కిమ్ చర్యలకు అనుగుణంగా ఉందని అభిప్రాయపడ్డారు.

''అమెరికా లేదా దక్షిణ కొరియాతో చర్చలు జరపాలని ఉత్తర కొరియా అనుకోవడం లేదు, చర్చల కోసం ఇటీవల జపాన్ చేసిన ప్రయత్నాలను కూడా ఉత్తర కొరియా తిప్పికొట్టింది'' అని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో కొరియన్ ద్వీపకల్పంపై పరిశోధన జరిపిన డాక్టర్ ఎడ్వర్డ్ హోవెల్ చెప్పారు.

''రష్యాతో సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో, ఈ ఏడాది ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య కవ్వింపు చర్యలు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు'' అన్నారు హోవెల్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)