లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదా రాహుల్ గాంధీకి ఎలా ఉపయోగపడుతుంది?

ఫొటో సోర్స్, @INC
లోక్‌సభలో రాహుల్‌గాంధీ ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తారని కాంగ్రెస్ పార్టీ మంగళవారం ప్రకటించింది.
2004 ఎన్నికలతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాహుల్ గాంధీ, ఇప్పటివరకు పదవులు స్వీకరించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. పార్టీ అధినేత పదవిని కూడా వదిలేశారు. అయితే ఇప్పుడు రాహుల్ తన ఇమేజ్‌ను మార్చుకున్నట్లు కనిపిస్తోంది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ‘ఇండియా’ కూటమి నేతలందరితో మంగళవారం జరిగిన సమావేశం తర్వాత ప్రతిపక్ష నేతను కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో పదేళ్ల తర్వాత లోక్‌సభకు ప్రతిపక్ష నేత లభించారు.
బుధవారం లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ తొలిసారి మాట్లాడారు.
లోక్‌సభ స్పీకర్‌గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ఓం బిర్లాకు రాహుల్ అభినందనలు తెలుపుతూ.. "ప్రభుత్వానికి రాజకీయ బలం ఉంది. అదే సమయంలో ప్రతిపక్షం కూడా భారత ప్రజల గొంతుకగా ఉంది. ఈసారి ప్రతిపక్షం మరింత శక్తివంతమైన విధానంలో ప్రజల గొంతుకకు ప్రాతినిధ్యం వహించనుంది" అని అన్నారు.
"పార్లమెంట్‌ను నడపడానికి ప్రతిపక్షం మీకు సహాయం చేస్తాం. సభలో ప్రతిపక్షాల వాణిని వినిపించడం చాలా ముఖ్యం. ప్రతిపక్షాల గొంతును అణచివేయబోరని ఆశిస్తున్నాం. పార్లమెంట్ శాంతియుతంగా నడిపించాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాల గొంతును అణచివేయడం సరికాదు. రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంది’’ అని రాహుల్ అన్నారు.


ఫొటో సోర్స్, ANI
పదేళ్ల తర్వాత..
గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ లోక్‌సభలో10 శాతం సీట్లు (54 సీట్లు) కూడా సాధించలేదు. దీంతో కాంగ్రెస్ సభలో ప్రతిపక్ష పార్టీ హోదాను పొందలేకపోయింది. 2014లో ఆ పార్టీకి 44 సీట్లు, 2019లో 52 సీట్లు వచ్చాయి. అయితే, ఈసారి 99 సీట్లు సాధించింది.
రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేత అవుతారని కాంగ్రెస్ క్యాడర్ ముందే ఊహించింది. జూన్ 4న ఎన్నికల ఫలితాల సమయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఉన్న అక్బర్ రోడ్‌లో పార్టీ మద్దతుదారులు కూడా 'ఈసారి రాహుల్ గాంధీ పార్లమెంటులో మొత్తం ప్రతిపక్షానికి గొంతుక అవుతారు' అని అన్నారు.
తొలిసారిగా రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టారు. లోక్‌సభలో ఆయన తల్లి సోనియా గాంధీ లేకపోవడం కూడా ఇదే తొలిసారి. సోనియా గాంధీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. రాహుల్ గాంధీ గతంలో సోనియా గాంధీ పోటీ చేసిన రాయ్ బరేలీ నుంచి ఎన్నికయ్యారు.
రాహుల్ కేరళలోని వయనాడ్ నుంచి కూడా గెలుపొందారు. అయితే ఆయన రాయ్ బరేలీ నుంచే ఎంపీగా కొనసాగుతున్నారు. ఈసారి ప్రియాంక గాంధీ వయనాడ్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున, ఒకవేళ గెలిస్తే లోక్‌సభలో ఆయన వెంటే ఉండే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
రాజీనామా ఎందుకు చేశారు?
2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి రాహుల్ గాంధీ బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో రాహుల్ గాంధీని అధ్యక్ష పదవి చేపట్టాలని నేతలు కోరిన సందర్భాలు చాలా ఉన్నాయి, అయితే ఆయన అంగీకరించలేదు. దీని తర్వాత, 2022లో మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు.
ఐదేళ్లుగా పదవులను చేపట్టడంపై మొండిగా ఉన్న రాహుల్, ఇన్నేళ్ల తర్వాత ఓ ముఖ్యమైన పదవిని చేపట్టేందుకు అంగీకరించారు.
కాంగ్రెస్ రాజకీయాలను నిశితంగా పరిశీలించే సీనియర్ జర్నలిస్ట్, రచయిత రషీద్ కిద్వాయ్ బీబీసీతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడి పదవి రాహుల్ గాంధీ బాధ్యతాయుతమైన ఇమేజ్‌ను పెంచుతుందని అభిప్రాయపడ్డారు.
‘’ప్రధానమంత్రి నీడ ప్రతిపక్ష నేత. ఆయన మొత్తం ప్రతిపక్షానికి నాయకత్వం వహించడమే కాకుండా ముఖ్యమైన నియామకాలలో ప్రధానమంత్రితో కలిసి కూర్చుంటారు. మోదీ, రాహుల్ గాంధీల మధ్య ఎన్నికల ప్రచార సరళి చూశాం, ఇద్దరూ ఒకరిపై ఒకరు పదునైన విమర్శలు చేసుకున్నారు. అటువంటి పరిస్థితిలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రితో కూర్చుని నిర్ణయాలు తీసుకోవడం సవాలుగా ఉంటుంది. అయితే ఆయన పరిణతి చెందిన నాయకుడిగా తనను తాను బలోపేతం చేసుకోవాలనుకుంటే, దీన్ని చేయాల్సి ఉంటుంది’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, TWITTER/INC
రాహుల్ గాంధీకి లభించే సౌకర్యాలేమిటి?
పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడి పాత్ర చాలా ముఖ్యమైనది. పార్లమెంటులో అన్ని ప్రతిపక్ష పార్టీల వాయిస్‌గా మారడమే కాకుండా, కొన్ని అధికారాలు కూడా ఉంటాయి. పబ్లిక్ అకౌంట్స్, పబ్లిక్ అండర్‌టేకింగ్స్ అండ్ ఎస్టిమేట్‌ల కమిటీ వంటి అనేక ముఖ్యమైన కమిటీలలో ప్రతిపక్ష నాయకుడు భాగం.
జాయింట్ పార్లమెంటరీ కమిటీలు, సెలెక్ట్ కమిటీలలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర అత్యంత ముఖ్యమైనది. ఈ ఎంపిక కమిటీలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, లోక్‌పాల్, అలాగే ఎన్నికల కమిషనర్లు, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) చైర్‌పర్సన్ వంటి కీలక పదవులకు నియామకాలు చేస్తాయి.
ప్రతిపక్ష నేత అంటే కేబినెట్ హోదా. ఈ పదవి గల వ్యక్తికి జీతం, అలవెన్సులు, పెన్షన్ చట్టం 1954లోని సెక్షన్ 3 ప్రకారం ప్రయోజనాలు అందుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
మంత్రి పదవికి దూరంగా..
రాహుల్ గాంధీ తొలిసారిగా 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు.
రాహుల్ గాంధీ పదేళ్లు అధికార పార్టీ ఎంపీగా, మరో పదేళ్లు ప్రతిపక్ష పార్టీ ఎంపీగా ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాహుల్‌గాంధీ మంత్రి పదవి కూడా చేపట్టలేదు.
గత పదేళ్లు కాంగ్రెస్ రాజకీయ చరిత్రలోనే అత్యంత క్లిష్ట దశను ఎదుర్కోంది. రాహుల్ 2022 సెప్టెంబర్ 7 నుంచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 'భారత్ జోడో యాత్ర' చేశారు. అంతేకాదు మణిపూర్ నుంచి ముంబైకీ యాత్ర చేపట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
'నేను ఒకప్పటి రాహుల్ గాంధీని కాదు'
2004లో సోనియాగాంధీని ప్రధాని కాకుండా అడ్డుకున్నది రాహుల్ గాంధీ అని మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ తన ఆత్మకథ 'వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్'లో పేర్కొన్నారు. తల్లి కూడా హత్యకు గురవుతుందేమోనని రాహుల్ భయపడ్డారని తెలిపారు.
2013 జనవరిలో ఉదయపూర్‌లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియమించారు.
ఉపాధ్యక్షుడైన తర్వాత రాహుల్ గాంధీ ఏఐసీసీ సమావేశంలో ప్రసంగిస్తూ.. నిన్న రాత్రి మీరంతా నన్ను అభినందించారు. కానీ మా అమ్మ నా గదిలోకి వచ్చి నా పక్కన కూర్చుని ఏడవడం మొదలుపెట్టారు. అధికారమనేది నిజానికి ఒక విషమని ఆమె అభిప్రాయం" అన్నారు.
“నేను స్నేహితులుగా భావించి, బ్యాడ్మింటన్ ఆడిన భద్రతా సిబ్బంది మా నానమ్మను చంపేశారు. ప్రజల జీవితాల్లో ఆశలు నింపిన నాన్న విషయంలో కూడా అదే జరిగింది’’ అని రాహుల్ అన్నారు.
55 ఏళ్ల రాహుల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ బాధ్యత నుంచి దూరంగా ఉంటున్నారు. చాలాకాలం తర్వాత పార్టీ పగ్గాలు గాంధీ-నెహ్రూయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి చేతిలో ఉన్నాయి.
'భారత్ జోడో యాత్ర' సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'నేను ఒకప్పటి రాహుల్ గాంధీని కాదు' అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చాంగ-6: చంద్రుని ఆవలి వైపు నుంచి అరుదైన శిలలను తీసుకొచ్చిన చైనా వ్యోమనౌక
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














