రేవణ్ణ: కర్ణాటక రాజకీయాలను శాసించిన ఆ కుటుంబం 60 రోజుల్లో ఎలా పతనావస్థకు చేరిందంటే...

ఫొటో సోర్స్, FB/PRAJWAL REVANNA
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు హెచ్‌డీ రేవణ్ణ కుటుంబం కేవలం రెండు నెలల్లో పతనావస్థను చవిచూస్తోంది.
గత 60 రోజుల్లో రేవణ్ణ కుటుంబ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణపై ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా ఆయన అన్న సూరజ్ రేవణ్ణపై కూడా అసహజ సెక్స్ ఆరోపణలతో కేసు నమోదైంది.
అంతేకాదు, ఒక మహిళను కిడ్నాప్ చేసినట్లు ప్రజ్వల్ రేవణ్ణ తల్లిదండ్రులపై కేసు నమోదైంది. రేవణ్ణ ఇద్దరు కుమారుల్లో ఒకరు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఈ మహిళ ఆరోపించారు.
కర్ణాటకలో గత 50 ఏళ్ల చరిత్రలో రాజకీయంగా పలుకుబడి ఉన్న మొత్తం కుటుంబంపై ‘సెక్స్ స్కాండల్’ ఆరోపణలు రావడం ఇదే ప్రథమం.


ఫొటో సోర్స్, Getty Images
తల్లి, తండ్రి, ఇద్దరు కొడుకులు
నిన్న మొన్నటి వరకు రేవణ్ణ కుటుంబంలోని ప్రతి ఒక్కరు ఏదో ఒక పదవిలో కొనసాగారు. హెచ్‌డీ రేవణ్ణ చిన్న కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ పార్లమెంట్ నియోజకవర్గానికి (2019 నుంచి 2024) ఎంపీగా పనిచేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో జనతాదళ్ (సెక్యులర్), బీజేపీ పార్టీల కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన ప్రజ్వల్ ఓడిపోయారు.
మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రజ్వల్‌పై ఆరోపణలు వచ్చాయి. ఆయన దేశం విడిచి వెళ్లారు. ఎన్నికల తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన ప్రజ్వల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కస్టడీలో ఉన్నారు.
సూరజ్ రేవణ్ణపై 2024 జూన్ 23న అసహజ సెక్స్, కిడ్నాప్ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం సూరజ్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ హోలే నరసీపుర ఎమ్మెల్యే. మంత్రిగానూ పనిచేశారు. హెచ్‌డీ రేవణ్ణ భార్య పేరు భవానీ. ఆమె హాసన్ జిల్లా పంచాయతీ అధ్యక్షురాలు.
ప్రజ్వల్ రేవణ్ణ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించిన మహిళను కిడ్నాప్ చేసినట్లు ఈ దంపతులపై ఆరోపణలు వచ్చాయి. హెచ్‌డీ రేవణ్ణ, ఆయన భార్య భవానీలపై కేసులు నమోదయ్యాయి. ఇరువురు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.

ఫొటో సోర్స్, @iPrajwalRevanna
'రేవణ్ణ రాజ్యం' ముగింపేనా?
అటు రాజకీయంగా హెచ్‌డీ రేవణ్ణ మద్దతుదారులు, ఇటు ప్రత్యర్థులు బహుశా కర్ణాటకలోని హాసన్ జిల్లాలో 'రేవణ్ణ రాజ్యం' ప్రాబల్యం తగ్గిపోనుందని అంచనా వేస్తున్నారు.
హాసన్‌లో 'రేవణ్ణ రాజ్యం' లేదా 'రిపబ్లిక్ ఆఫ్ రేవణ్ణ' వంటి పదాలు బాగా పాపులర్. ఎందుకంటే ఈ కుటుంబం హాసన్ ఏరియాను అనధికారికంగా నియంత్రిస్తుంటుందని చెబుతారు. ఆ జిల్లాలోని ప్రతి వ్యవహారం రేవణ్ణ కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉంటుందనే వాదన ఉంది.
తన పేరు బయటపెట్టవద్దన్న షరతుతో జనతాదళ్ (సెక్యులర్) సభ్యుడు ఒకరు బీబీసీ హిందీతో మాట్లాడుతూ "హెచ్‌డీ రేవణ్ణ అనుమతి లేకుండా జిల్లాలో ఏం జరగదు" అని అన్నారు.
పరిస్థితులన్నీ ఆ కుటుంబానికి ఎదురు తిరిగినట్లుగా అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు సందీప్ శాస్త్రి అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
1983 నుంచి దశ తిరిగింది.
జనతా, క్రాంతి-రంగ పార్టీల పొత్తుతో కర్ణాటక రాజకీయాల్లో హాసన్ జిల్లాకు ప్రాధాన్యత మొదలైంది. కర్ణాటకలో 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కాంగ్రెస్ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టాయి. ఎన్నికల తర్వాత ఇరు పార్టీలు కూడా ఆధిపత్యం చెలాయించాయి.
మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ హాసన్ జిల్లాలో ఆధిపత్యాన్ని సాధించారు. అనంతరం, దక్షిణ కర్ణాటకలో ప్రభావవంతమైన ఒక్కలిగ కులానికి తిరుగులేని నాయకుడిగా ఎదిగారు.
2019లో దేవెగౌడ తన హాసన్ లోక్‌సభ స్థానాన్ని ప్రజ్వల్ రేవణ్ణకు అప్పగించారు. అంతేకాదు, తన మరో మనవడు నిఖిల్ గౌడను మాండ్య స్థానం నుంచి పోటీకి దింపారు.
కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి కుమారుడే ఈ నిఖిల్ గౌడ. అంతేకాదు కుమారస్వామి భార్య అనితను ఎమ్మెల్యే చేశారు.
హాసన్ జిల్లా పంచాయతీ అధ్యక్ష బాధ్యతలు రేవణ్ణ భార్య భవానీకి అప్పగించారు. కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు రాకూడదని వారి వారి బలాన్ని బట్టి అధికారాలు అప్పగించారు దేవెగౌడ.
అయితే 2023లో హాసన్ అసెంబ్లీ స్థానం నుంచి భవానీకి టికెట్ ఇవ్వబోమని కుమారస్వామి తేల్చి చెప్పారు. వీటన్నింటి మధ్య, ఏప్రిల్ 21న ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అశ్లీల వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్‌లను బస్టాండ్‌లు, పార్కులు, బహిరంగ ప్రదేశాలలో దర్శనమివ్వడంతో రేవణ్ణ కుటుంబం కథ తారుమారైంది.
లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ఒక్కరోజు ముందు ఇదంతా జరిగింది. అయితే ఏప్రిల్ 27న ఓటింగ్ ముగిసిన వెంటనే ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచి వెళ్లిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
హెచ్‌డీ కుమారస్వామి ఎవరి వైపు?
ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘సిట్’ను ఏర్పాటు చేసింది.
అదే సమయంలో ఆయన బాబాయి, జనతాదళ్ (ఎస్) పార్టీ అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి ప్రజ్వల్ రేవణ్ణను గానీ, హెచ్‌డీ రేవణ్ణను గానీ సమర్థించలేదు.
చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇది ప్రజ్వల్ రేవణ్ణ వ్యక్తిగత విషయమన్నారు కుమారస్వామి. అయితే, ఇది సిగ్గుపడాల్సిన విషయమని, ఎవరినీ రక్షించడం లేదని బదులిచ్చారు. ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడున్నా దేశానికి తిరిగి వచ్చి చట్టాన్ని అనుగుణంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
ఈ కేసులో తాను నిర్దోషి అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రజ్వల్ పైనే ఉందన్నారు కుమార స్వామి. అయితే ఈ స్కామ్ ఏకైక ఉద్దేశం తన కుటుంబం పరువు తీయడం, జనతాదళ్ (సెక్యులర్)ని నాశనం చేయడమేనని కుమారస్వామి ఆరోపించారు. అదేసమయంలో ప్రజ్వల్ రేవణ్ణ వివాదం నుంచి పార్టీని దూరంగా పెట్టేందుకు ఆయన ప్రయత్నించారు.
రేవణ్ణ కుటుంబంపై పెట్టిన కేసులు ఆ కుటుంబానికి చాలా నష్టం కలిగించేవేనని సందీప్ శాస్త్రి అభిప్రాయపడ్డారు.
‘‘కుమారస్వామి అన్నీ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే అడుగులు ముందుకు వేస్తున్నారు. అంటే తమ్ముడితో దూరం పాటిస్తున్నారు. దీంతో పాటు తండ్రి వారసత్వం కూడా తన చేతుల్లోనే ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, @iPrajwalRevanna
పార్టీ కార్యకర్తలు ఏమంటున్నారు?
రేవణ్ణ కుటుంబంపై వచ్చిన ఆరోపణలతో దక్షిణ కర్ణాటకలో జనతాదళ్ (సెక్యులర్) ప్రాబల్యం ఉన్న జిల్లాల్లోని పలువురు పార్టీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతున్నారు.
హాసన్ జిల్లాకు చెందిన ఓ మహిళా పార్టీ కార్యకర్త మాట్లాడుతూ.. ‘‘ఏం చెప్పాలి సార్.. మమ్మల్ని ఎవరు కొట్టారో కూడా మాకు తెలియదు.’’ అన్నారు.
హాసన్ జిల్లాకు చెందిన మరో పార్టీ కార్యకర్త అక్మల్ అహ్మద్ బీబీసీ హిందీతో మాట్లాడుతూ "రేవణ్ణ కుటుంబంపై చేస్తున్నవి ఇప్పటికీ ఆరోపణలే. అవి రుజువు కాలేదు. వాటిని మేం నమ్మడం లేదు. అవి కుట్రగా కనిపిస్తున్నాయి.’’ అన్నారు. అయితే, దేవెగౌడ పట్ల ప్రజలకు సానుభూతి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అక్మల్ అహ్మద్ అభిప్రాయంతో హాసన్ జిల్లా మాదిగ దండోరా సంఘం అధ్యక్షుడు విజయ్ కుమార్ ఏకీభవించారు.
"నిజం చెప్పాలంటే నేను దేవెగౌడ, రేవణ్ణలకు ఒకే ఒక్కసారి ఓటు వేశాను. కానీ ఈ సంఘటన తర్వాత, దేవెగౌడ పట్ల ప్రజలకు చాలా సానుభూతి ఉందని తెలిసింది. ఆయనను చూస్తుంటే బాధగా ఉంది. ఇక్కడి నుంచి ఎదిగి ప్రధాని అయిన దేవేగౌడను బతికుండగానే చంపేస్తున్నారు.’’ అని విజయ్ కుమార్ బీబీసీ హిందీతో అన్నారు.
"రేవణ్ణ కుటుంబంపై ప్రజల్లో చాలా కోపం ఉంది. కేసు విషయంపై మాట్లాడటానికి కూడా జనం వెనకడుగు వేస్తున్నారు. మీడియాతో ఏదైనా మాట్లాడితే మళ్లీ ఏం చేస్తారేమోనని భయపడుతున్నారు. కానీ ఒక్కలిగ కమ్యూనిటీ పేరును ఇది దెబ్బతీస్తుంది, ఏం జరుగుతుందో చూడాలి." అని అన్నారు.
ఈ మొత్తం ఎపిసోడ్‌పై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బీఎల్ శంకర్ బీబీసీ హిందీతో మాట్లాడుతూ "ఇప్పుడు ఎవరైనా ముందుకొచ్చి హాసన్ జిల్లా నాయకత్వాన్ని చేపట్టాల్సి ఉంటుంది. ఎవరు దానికి సరైన వారో ప్రస్తుతం చెప్పడం కష్టం. అయితే ఎంతకాలం అలా? శ్రేయాస్ పటేల్ ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ. అంటే ఇప్పుడు రెండో తరం వస్తోంది.’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- బాలుడి పుర్రెలో మూర్ఛను తగ్గించే పరికరం అమర్చారు.. తర్వాత ఏమైందంటే?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














