ఆంధ్రప్రదేశ్: వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా, సచివాలయ సిబ్బందితో సరిపెడతారా?

ఆంధ్రప్రదేశ్ వలంటీర్లు

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్లకు పైగా అమలులో ఉన్న వలంటీర్ల వ్యవస్థ ఊగిసలాటలో పడింది. అధికారం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం వారి విషయంలో స్పష్టతనివ్వడం లేదు. దాంతో వలంటీర్లను కొనసాగిస్తారా లేదా అన్న విషయంపై పెద్ద చర్చ నడుస్తోంది.

ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయంలో సోమవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం జరిగింది. జూలై 1 నుంచి కొత్త పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తామని ప్రకటించింది.

వలంటీర్ల విధానం గురించి తామింకా పరిశీలన చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. దాంతో వలంటీర్లలో ఆందోళన కనిపిస్తోంది.

మొత్తం 2.65 లక్షల మంది వలంటీర్లు‌గా నియమితులు కాగా వారిలో ప్రస్తుతం 1.64 లక్షల మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. 1.03 లక్షల మంది రాజీనామా చేశారు. వీరి విషయంలో స్పష్టత ఎప్పటికొస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వాట్సాప్
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, FACEBOOK / CHANDRA BABU NAIDU

ఫొటో క్యాప్షన్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

వాస్తవానికి తొలుత వలంటీర్ల నియామకాన్ని టీడీపీ వ్యతిరేకించింది. వలంటీర్ల పనితీరు మీద జనసేన కూడా విమర్శలు చేసింది.

కానీ ఎన్నికల సమయంలో వలంటీర్లను కొనసాగిస్తామని, వేతనాలు కూడా రెట్టింపు చేస్తామని ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. దాంతో అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఢోకా ఉండదని వలంటీర్లు భావించారు.

కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇంకా పరిశీలనలో ఉందని చెబుతున్న తరుణంలో తమ వ్యవహారం ఎటు మళ్లుతుందన్నది వారికి అంతుబట్టని విషయంగా మారింది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

వలంటీర్ వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చారు?

ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పలు వ్యవస్థలు సృష్టించింది. గ్రామ, వార్డు స్థాయిల్లో ప్రతీ రెండు వేల జనాభాకి ఒకటి చొప్పున సచివాలయం ఏర్పాటు చేశారు. ఆయా సచివాలయాల్లో వివిధ విభాగాల్లో పనిచేసేందుకు ప్రభుత్వ సిబ్బందిని నియమించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు తోడుగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేసేందుకంటూ వలంటీర్లను నియమించారు. 2019 ఆగష్టు 15 నుంచి వారు విధులు నిర్వహిస్తున్నారు.

ఆరంభంలో నెలకు వారికి రూ. 5,000లు గౌరవవేతనం చెల్లించారు. ఆ తర్వాత వార్తా పత్రికల కోసమంటూ మరో రూ. 200 ప్రభుత్వం అందించింది.

దాంతో పాటుగా ఏటా వారి పనితీరు ఆధారంగా ప్రోత్సహకం కింద ఎంపిక చేసిన వారికి మరికొంత నగదు అందిస్తోంది.

వీరి విధుల్లో ప్రధానంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ప్రతీ నెలా సామాజిక ఫించన్లను అందించడం, రేషన్ బియ్యం పంపిణీ సహా వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో వారు కీలకంగా వ్యవహరించారు. దాంతో తమ వేతనాలు పెంచాలంటూ గతంలోనే ఆందోళనకు ప్రయత్నించారు.

అయితే వలంటీర్లంతా సేవాభావంతో పనిచేస్తున్న వారే తప్ప, ప్రభుత్వ సిబ్బంది కాదని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆందోళనకు దిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

కాగా, రాష్ట్రంలో వలంటీర్ల ద్వారా ఇంటింటికీ ఫించన్ల పంపిణీ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటివద్దనే పెన్షన్ అందుకొనే అవకాశం రావడం ఉపశమనంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ వలంటీర్లు

ఫొటో సోర్స్, UGC

ఆరంభం నుంచే విమర్శలు

వలంటీర్ల వ్యవస్థ మీద ఆరంభం నుంచి అనేక విమర్శలున్నాయి.

వాస్తవానికి అధికార పార్టీకి చెందిన కార్యకర్తలనే దాదాపుగా వలంటీర్లుగా నియమించారు. ఆ విషయాన్ని అప్పటి ఏపీ సీఎం జగన్, అధికార పార్టీ నేతలు కూడా బహిరంగంగానే చెప్పుకున్నారు. దాంతో వైఎస్సార్సీపీ కార్యకర్తల ద్వారా ప్రజలను నియంత్రించే ప్రమాదం ఉందనే ఆందోళన విపక్షాల నుంచి అప్పట్లోనే వచ్చింది.

దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో మహిళలు కొందరు అదృశ్యమయిన కేసుల్లో వలంటీర్ల పాత్ర ఉందంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ వంటి వారు విమర్శలు చేశారు. ఇది వివాదానికీ దారితీసింది.

వలంటీర్ల ద్వారా ప్రజల నుంచి సేకరించిన డేటాను ప్రభుత్వం దుర్వినియోగిం చేసిందన్న విమర్శలు కూడా వచ్చాయి.

కొందరు వలంటీర్లు అధికార పార్టీ కార్యక్రమాల్లోనూ, ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనడం విమర్శలకు ఊతమిచ్చింది.

పార్టీ క్యాడర్‌ను పక్కన పెట్టి మరీ వలంటీర్లకు ప్రాధాన్యతనిచ్చారనే విమర్శలు వైసీపీ పార్టీలోను వినిపించాయి.

స్థానిక సంస్థలకు ఎన్నికయిన ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టేసి, పూర్తిగా వలంటీర్లకు పెత్తనం ఇచ్చారన్న అభిప్రాయాలు వినిపించాయి.

ఎన్నికల ముంగిట తాము అధికారంలోకి వస్తేనే వలంటీర్ వ్యవస్థ ఉంటుందని అప్పటి అధికార పార్టీ వైఎస్సార్సీపీ చెప్పగా, తాము గెలిచినా కూడా కొనసాగిస్తామని అప్పటి ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ హామీ ఇచ్చింది.

పైగా వలంటీర్ల వేతనం రెట్టింపు చేసి రూ. 10 వేలకు పెంచుతామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ కూడా ప్రకటించారు.

చివరకు ఎన్నికల్లో తనకు అనుకూలంగా పనిచేసేలా వలంటీర్ల వ్యవస్థను జగన్ తెరమీదకు తెచ్చారంటూ ఆరోపణలు రావడం, వారి పనితీరు మీద ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈసీకి ఫిర్యాదులు వెళ్లడంతో వలంటీర్లను విధుల నుంచి పక్కన పెట్టారు.

ముఖ్యంగా వారు నిర్వహించే ప్రధాన బాధ్యత పెన్షన్ల పంపిణీకి గడిచిన మూడు నెలలుగా దూరంగా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ వలంటీర్లు

ఫొటో సోర్స్, UGC

అప్పుడు రాజీనామా.. ఇప్పుడు ఫిర్యాదులు

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వలంటీర్లను ఫించన్ల పంపిణీ బాధ్యత నుంచి తొలగించడంతో పాటుగా రాజకీయ ప్రచారాల్లో పాల్గొనడం మీద ఈసీ నియంత్రణ పెట్టింది. దాంతో అనేక చోట్ల అధికార పార్టీకి మద్ధతుగా వలంటీర్లు రాజీనామాలు చేశారు.

రాజీనామాలు చేసిన వలంటీర్లు ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్సీపీ మీద ఆరోపణలు చేశారు. ఆ పార్టీ నాయకులే తమను ఒత్తిడి చేసి రాజీనామాలు చేయించారంటూ ఫిర్యాదులు కూడా చేశారు.

వలంటీర్ల ఫిర్యాదుతో గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని సహా ఆ పార్టీ నాయకుల మీద కేసులు కూడా నమోదయ్యాయి.

తాజాగా రాజీనామాలకు దూరంగా ఉన్న వలంటీర్లు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అధికార ఎన్డీయే కూటమి నేతలను కలుస్తున్నారు.

ఎన్నికల కోడ్ ఉండగా మూడు నెలల పాటు తమకు బాధ్యతలు అప్పగించలేదని, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

"రాజీనామా చేసిన వారు వెళ్లిపోగా ఇంకా రెండు లక్షల మంది వరకూ విధుల్లో ఉన్నాం. 3 నెలలుగా మాకు ఎటువంటి బాధ్యతలు అప్పగించలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విధుల్లోకి తీసుకుంటారని ఆశిస్తున్నాం. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మాకు అనుమానాలు పెరుగుతున్నాయి. కేబి‌నెట్ భేటీలో స్పష్టత ఇస్తారని ఆశిస్తే ఇప్పుడు పెన్షన్లు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ అని ప్రకటించారు. దాంతో మమ్మల్ని కొనసాగిస్తారన్న నమ్మకం కనిపించడం లేదు." అంటూ ప్రకాశం జిల్లా అద్దంకిలో పనిచేస్తున్న వలంటీర్ ఆర్.అమర్నాథ్ అన్నారు.

ప్రభుత్వం జూలై నెల పెన్షన్ల పంపిణీ బాధ్యతను తమకే అప్పగించాలని ఆయన కోరారు. గతంలో మాదిరిగానే సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో తాము ఆ బాధ్యత నిర్వహిస్తామని అమర్నాథ్ బీబీసీతో అన్నారు.

ఆంధ్రప్రదేశ్ సచివాలయం

ఫొటో సోర్స్, UGC

ఇంకా నిర్ణయం తీసుకోలేదు..

వలంటీర్లను కొనసాగించాలా లేదా అన్న దానిపై ఏపీ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో వలంటీర్ల అవసరం ఉందా? అన్న ప్రశ్న కూడా ఉంది.

"వలంటీర్లను ఏం చేయాలన్నది ఇంకా పరిశీలనలో ఉంది. ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ చేయాలని ఎన్నికల ముందు చెప్పాం. కానీ అప్పుడా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. వృద్ధులతో రాజకీయం చేసింది. ఇప్పుడు మా ప్రభుత్వం చేసి చూపబోతోంది. పెన్షన్లన్నీ లబ్దిదారుల ఇంటివద్దనే అందిస్తాం. వలంటీర్ల విషయం మరింత లోతుగా చర్చించాల్సి ఉంది" అని ఏపీ సమాచార ప్రసారాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు.

అయితే, వలంటీర్లను పక్కన పెట్టలేదని, ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకున్న తర్వాత వెల్లడిస్తామని మంత్రి బీబీసీతో అన్నారు.

కొనసాగింపు అవకాశాలు తక్కువే..

2019 ఆగస్టు నుంచి 2024 మార్చి నెల వరకూ వలంటీర్లు నిర్వహించిన ప్రధాన బాధ్యత పెన్షన్ల పంపిణీ.

గడిచిన ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఎన్నికల కోడ్ కారణంగా వారు ఆ బాధ్యతలకు దూరంగా ఉన్నారు. చాలావరకు పెన్షన్లను వారివారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.

కానీ జూలై నుంచి పెన్షన్లను మళ్లీ ఇంటి వద్దనే అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయినప్పటికీ దానిని వలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ సిబ్బందితో అందిస్తామని స్పష్టం చేసింది.

"వలంటీర్ల నియమకాన్ని తొలినాళ్లలోనే చంద్రబాబు వ్యతిరేకించారు. గోనెలు మోసే ఉద్యోగం అంటూ ఎద్దేవా చేశారు. కాబట్టి ఇప్పుడు ఆ పేరు గానీ, అదే విధానం గానీ కొనసాగించే అవకాశాలు తక్కువే. సచివాలయ సిబ్బంది పెన్షన్లు అందించడం ఆరంభిస్తే ఇక వలంటీర్ బాధ్యత లేనట్లే. ఇప్పుడు ప్రతీ 50 కుటుంబాలకు ఒకరు చొప్పున ఉన్న విధానం తొలగించి వారి సంఖ్య కుదించాల్సి వస్తే, కొత్త పేరు, కొత్త రూపుతో పాటుగా కొత్త సిబ్బందిని నియమించే అవకాశమే ఉంది. జగన్ ప్రభుత్వంలో ఆయన పార్టీ సానుభూతిపరులకు అవకాశం ఇచ్చినందున వారిని కొనసాగించే అవకాశాలు లేనట్టేనని భావించాలి." అని రాజకీయ పరిశీలకులు ఎం.ఆంజనేయులు అన్నారు.

వలంటీర్ల మీద పవన్ కళ్యాణ్‌ కి కూడా సదాభిప్రాయం ఉన్నట్టు కనిపించడం లేదని, దాంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉండే ఈ వ్యవస్థకు మళ్లీ అవకాశం తక్కువగానే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)