బాలుడి పుర్రెలో మూర్ఛను తగ్గించే పరికరం అమర్చారు.. తర్వాత ఏమైందంటే?

ఒరాన్

ఫొటో సోర్స్, Justine Knowlson

ఫొటో క్యాప్షన్, వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ ద్వారా న్యూరోస్టిములేటర్‌ను రీచార్జ్ చేయవచ్చు
    • రచయిత, ఫెర్గూస్ వాల్ష్
    • హోదా, మెడికల్ ఎడిటర్

మూర్ఛతో బాధపడుతున్న ఒక బాలుడి పుర్రెలో వ్యాధిని నియంత్రించే ఒక కొత్త పరికరాన్ని అమర్చారు. ఆ పరికరాన్ని రోగికి అమర్చడం ప్రపంచంలో ఇదే తొలిసారి. ఓరాన్ నోల్సన్ అనే ఆ బాలుడు తీవ్రమైన మూర్ఛతో బాధపడుతున్నారు.

న్యూరోస్టిమ్యులేటర్ అయిన ఈ పరికరం అతని మెదడులోకి విద్యుత్ సంకేతాలను పంపుతుంది. దీనివల్ల అతనికి పగటి సమయంలో మూర్ఛ రావడం 80 శాతం తగ్గింది.

అతని పరిస్థితి చాలా మెరుగైందని, చాలా సంతోషంగా ఉన్నాడని బాలుడి తల్లి జస్టిన్ బీబీసీతో చెప్పారు.

ఒరాన్‌కు 12 ఏళ్ల వయస్సులో ఈ సర్జరీ చేశారు. ఇప్పుడు ఆయన వయస్సు 13 ఏళ్లు.

ఈ కొత్త పరికరాన్ని పరిశీలించడంలో భాగంగా లండన్‌లోని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ హాస్పిటల్‌లో 2023 అక్టోబర్‌లో ఒరాన్‌కు సర్జరీ చేసి పుర్రెలో న్యూరోస్టిమ్యులేటర్‌ను అమర్చారు.

సోమర్‌సెట్‌కు చెందిన ఒరాన్‌కు లెనాక్స్ గస్టాట్ సిండ్రోమ్ ఉంది. మూడేళ్ల వయస్సులో ఒరాన్ ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ రకమైన మూర్ఛ మామూలు చికిత్సతో నయం కాదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

అప్పటినుంచి ఒరాన్‌కు రోజులో ఒక్కోసారి వంద సార్లు కూడా మూర్ఛ వచ్చేది.

సర్జరీకి ముందు ఒరాన్‌ తల్లితో మేం మాట్లాడాం. ‘‘ఈ వ్యాధి ఒరాన్‌కు అందమైన బాల్యం లేకుండా చేసింది’’ అని అప్పుడు ఆమె అన్నారు.

మూర్ఛ వచ్చినప్పుడు ఒరాన్ నేలపై పడిపోయి, కాళ్లు చేతులు గట్టిగా కొట్టుకుంటూ స్పృహ కోల్పోయేవాడని ఆమె చెప్పారు.

ఇలా జరిగినప్పుడు అతనికి శ్వాస అందకపోయేదని, వెంటనే ఎమర్జెన్సీ మందులు ఇవ్వాల్సి వచ్చేదని తెలిపారు.

ఒరాన్‌కు ఆటిజం, ఏడీహెచ్‌డీ కూడా ఉంది. కానీ, మూర్ఛతో అతను చాలా ఇబ్బందిపడ్డాడని ఆమె అన్నారు.

‘‘మూడేళ్ల వరకు నా బిడ్డ చాలా బాగుండేవాడు. మూర్ఛ కారణంగా కొన్ని నెలల్లోనే అతని ఆరోగ్యం క్షీణించింది. నైపుణ్యాలను కోల్పోయాడు’’ అని జస్టిన్ గుర్తు చేసుకున్నారు.

తీవ్రమైన మూర్ఛ ఉన్న వారిలో మెదడు పనితీరు, సామర్థ్యాలను అంచనా వేసే ‘‘క్యాడెట్ ప్రాజెక్ట్’’లో భాగంగా ఒరాన్‌కు ఈ సర్జరీ చేశారు.

గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ హాస్పిటల్, లండన్ యూనివర్సిటీ కాలేజ్, కింగ్స్ కాలేజ్ హాస్పిటల్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నాయి.

ఇందులో భాగంగా పికోస్టిమ్ న్యూరోట్రాన్స్‌మీటర్ అనే పరికరాన్ని యూకేకు చెందిన అంబర్ థెరపియూటిక్స్ అనే కంపెనీ తయారు చేసింది.

న్యూరోస్టిమ్యులేటర్‌
ఫొటో క్యాప్షన్, న్యూరోస్టిమ్యులేటర్‌

న్యూరోట్రాన్స్‌మీటర్ ఎలా పనిచేస్తుంది?

మెదడులో ఎలక్ట్రికల్ యాక్టివిటీలో అసాధారణ మార్పుల వల్ల మూర్ఛ వస్తుంది.

న్యూరోట్రాన్స్‌మీటర్ ఈ అసాధారణ సంకేతాలను అడ్డుకుంటుంది. ఈ పరికరం నుంచి స్థిరంగా విద్యుత్ ప్రకంపనలు వెలువడుతుంటాయి.

2023 అక్టోబర్‌లో దాదాపు 8 గంటల పాటు శస్త్రచికిత్స చేసి ఒరాన్ తలలో ఇది అమర్చారు.

కన్సల్టెంట్ పీడియాట్రిక్ న్యూరోసర్జన్ మార్టిన్ టిస్డాల్ నేతృత్వంలోని వైద్య బృందం, ఒరాన్ మెదడులోని థాలమస్‌ వరకు చేరుకునేలా రెండు ఎలక్ట్రోడ్‌లను అమర్చారు. థాలమస్ అనేది మెదడులోని ముఖ్యమైన నాడీ సమాచార కేంద్రం.

ఈ లెడ్ ఎలక్ట్రోడ్‌ల అమరికలో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఒక మిల్లీ మీటర్ కంటే తక్కువ.

ఈ లెడ్ ఎలక్ట్రోడ్‌ల చివర్లను న్యూరోస్టిమ్యులేటర్‌తో అనుసంధానిస్తారు. 3.5 చదరపు సెంటీమీటర్లు, 0.6 సెంటీ మీటర్ల మందం గల ఈ పరికరాన్ని ఒరాన్ పుర్రెలో అమర్చారు. పుర్రె భాగంలోని ఎముకను తొలగించి అక్కడ ఈ న్యూరోస్టిమ్యులేటర్‌ను ఉంచారు.

బాల్యంలో వచ్చే మూర్ఛకు సంబంధించి గతంలోనూ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్‌ను వైద్యులు ప్రయత్నించారు. కానీ, ఇప్పటివరకు ఈ న్యూరోస్టిమ్యులేటర్లను ఛాతీ భాగంలో అమర్చేవారు. పుర్రెలో ఈ పరికరాన్ని అమర్చడం ఇదే తొలిసారి.

ఒరాన్ కుటుంబం
ఫొటో క్యాప్షన్, తల్లి, సోదరుడు, సోదరితో ఒరాన్ (కుడి)

శస్త్రచికిత్స అనంతరం ఒరాన్‌ ఒక నెల రోజుల్లో కోలుకున్న తరువాతే న్యూరో స్టిమ్యులేటర్‌ను ఆన్ చేశారు.

న్యూరోస్టిమ్యులేటర్‌ ఆన్ అయినప్పుడు ఆయనకు ఎలాంటి నొప్పి తెలియదు. వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ సహాయంతో ఒరాన్ ఈ న్యూరోస్టిమ్యులేటర్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు.

సర్జరీ అయిన ఏడు నెలల తర్వాత మేం ఒరాన్, ఆయన కుటుంబాన్ని కలిశాం. ఒరాన్‌ మూర్ఛ రావడం చాలావరకు తగ్గిపోయిందని జస్టిన్ చెప్పారు.

‘‘అతను చాలా బాగున్నాడు. ఇప్పుడు పగటి సమయంలో ఒక్కసారి కూడా మూర్ఛ రావట్లేదు. రాత్రిపూట మూర్ఛ వస్తున్నా మునుపటిలా తీవ్రంగా ఉండడం లేదు. నెమ్మదిగా అతను మామూలు మనిషి అవుతాడని నాకనిపిస్తుంది’’ అని జస్టిన్ అన్నారు.

‘‘ఈ చికిత్సతో ఒరాన్‌కు అతని కుటుంబానికి ఇంత పెద్ద ప్రయోజనం కలగడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది’’ అని మార్టిన్ టిస్డాల్ అన్నారు.

ఒరాన్ ఇప్పుడు రైడింగ్ పాఠాలు నేర్చుకుంటున్నారు.

క్యాడెట్ ట్రయల్‌లో భాగంగా లెనాక్స్ గస్టాట్ సిండ్రోమ్ ఉన్న మరో ముగ్గురు పిల్లలకు కూడా ఈ డీప్ బ్రెయిన్ న్యూరోస్టిములేటర్లను అమర్చనున్నారు.

ప్రస్తుతం, ఒరాన్ తనకు అమర్చిన పరికరం నుంచి స్థిరమైన ఎలక్ట్రికల్ స్టిమ్యులస్‌ను పొందుతున్నాడు.

Device

భవిష్యత్‌పై ఆశలు

భవిష్యత్‌లో ఒరాన్ మెదడులో స్పందనలకు అనుగుణంగా రియల్ టైమ్‌లో న్యూరోస్టిమ్యులేటర్ స్పందించేలా మార్పులు చేయాలని వైద్య బృందం అనుకుంటోంది. మెదడులో అసాధారణ ప్రకంపనలు వచ్చే సమయంలోనే వాటిని అడ్డుకునేలా పరికరంలో మార్పులు చేయాలని అనుకుంటున్నారు.

తదుపరి ట్రయల్ కోసం ఎదురుచూస్తున్నానని జస్టిన్ అన్నారు. ‘‘గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ హాస్పిటల్ వైద్య బృందం మా ఆశలకు మళ్లీ ప్రాణం పోసింది. భవిష్యత్‌పై ఆశలు కలుగుతున్నాయి’’ అని జస్టిన్ చెప్పారు.

ఈ చికిత్స అనేది ఒరాన్ మూర్ఛకు నివారణ కాదనే విషయం వారి కుటుంబానికి తెలుసు.

అంబర్ థెరాపియుటిక్స్‌కు చెందిన పికోస్టిమ్ న్యూరోస్టిములేటర్‌ను పార్కిన్సన్ రోగుల చికిత్సకు ఉపయోగించారు.

పుర్రెలో అమర్చే మరో రకం న్యూరోస్టిమ్యులేటర్‌ను అమెరికాలో మూర్ఛ వ్యాధి చికిత్సకు వాడారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)