జనం చూస్తుండగానే హత్య.. అంతమందిలో కాపాడడానికి వచ్చింది ఒక్కరే - ఎక్కువ మంది ఉన్నప్పుడు సాయం దొరికే అవకాశం తక్కువవుతుందా?

నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బీబీసీ
    • హోదా, మరాఠీ టీమ్

గత వారం మహారాష్ట్రలోని వసాయిలో నడిరోడ్డుపై ఓ యువతిని పొడిచి చంపేశారు.

దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దారుణ ఘటనలో దుండగుడు బాధితురాలి తల, ఛాతీపై పొడిచాడు.

ఆ దారుణ ఘటనను అక్కడ చుట్టూ గుంపుగా ఉన్న ప్రజలు చూస్తూనే ఉన్నారు. అందులో ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే ఆమెకు సాయం చేయడానికి ముందుకొచ్చారు.

కానీ, దుండగుడిని అడ్డుకోవడం ఆయన ఒక్కరి వల్ల కాలేదు. చుట్టూ ఉన్న జనం నుంచి మరొకరి సాయం అంది ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని స్థానికులు అంటున్నారు.

ఈ కేసులో నిందితుడు రోహిత్ యాదవ్‌ను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.

ఈ సంఘటన జరిగిన సమయంలో రోడ్డుమీద చాలా మంది ఉన్నారు. కానీ, హత్య జరుగుతున్నప్పుడు వారిలో చాలా మంది వీడియో షూట్ చేస్తూ కనిపించగా, కొందరు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు.

రక్తమోడుతూ రోడ్డుపై పడివున్న బాధితురాలికి సాయం చేసేందుకు ఒక్కరు మినహా మరెవరూ ముందుకు రాలేదు.

అన్నిచోట్లా ఇలాగే జరుగుతుందని చెప్పడం సరికాదు. ఎందుకంటే, కొద్దిరోజుల కిందట పుణెలోని సదాశివపేటలో ఇలాంటి ఘటనే జరిగింది. యువతిపై ఓ యువకుడు కత్తితో దాడి చేసినప్పుడు మరో యువకుడు ఆమె ప్రాణాలు కాపాడాడు.

ప్రాణాలు కాపాడుకోవడానికి యువతి పరిగెత్తుకుంటూ వచ్చి కిందపడిపోయింది. నిందితుడు ఆమెపై కత్తితో దాడి చేయబోతుండగా, ఓ యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి నిందితుడి చేతిలో నుంచి కత్తిని లాక్కొని ఆమెను రక్షించాడు. ఆ యువకుడు ధైర్యం చేసి ఉండకపోతే ఆ యువతి ప్రాణాలు కోల్పోయేది.

కానీ, తరచూ ఇలాంటి సంఘటనల్లో చుట్టూ ఉన్నవారు చూస్తూ ఎందుకు ఉండిపోతారు?

మేం ఈ విషయాన్ని మానసికంగా, చట్టపరంగా, సామాజిక కోణం నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం.

బీబీసీ న్యూస్ తెలుగు
మొబైల్ ఫోన్

ఫొటో సోర్స్, Getty Images

స్క్రీన్‌ చూసిచూసి..

ఛత్రపతి శంభాజీ నగర్‌కి చెందిన మానసిక వైద్యుడు డాక్టర్ సందీప్ సిసోడె .. బహిరంగంగా నేరం జరిగేటప్పుడు చూస్తూ ఉండిపోయే గుంపు మనస్తత్వం గురించి మాట్లాడుతూ ఈ పరిస్థితికి, కోవిడ్ తర్వాత స్క్రీన్ చూసే సమయం పెరిగిపోవడానికీ సంబంధం ఉందన్నారు.

''కోవిడ్‌ ముందు వరకూ, మన కళ్లముందు ఏం జరుగుతుందో, దాని తీవ్రత ఏంటో మన మెదడుకి, తెలివికి కచ్చితంగా తెలుసు. కానీ కోవిడ్ తర్వాత క్రమంగా ఇంటర్నెట్, సోషల్ మీడియా అంటూ స్క్రీన్‌ల వైపు మళ్లడంతో పరిస్థితి మారిపోయింది'' అన్నారు.

సోషల్ మీడియాలో ఒకరితో మరొకరు మాట్లాడుకుంటారు, కానీ ఎదురుపడినప్పుడు ఒకరిని చూసి మరొకరికి కనీసం చిరునవ్వు కూడా ఉండదు. అంటే, సోషల్ మీడియా లేదా స్క్రీన్ అనేది వారి సొసైటీ అయిపోయిందని డాక్టర్ అన్నారు.

ఇలాంటి ఘటనల గురించి ఆయన మాట్లాడుతూ, ''అప్పటికే ఇలాంటి దృశ్యాలను స్క్రీన్‌పై చాలాసార్లు చూసి ఉంటారు. అందువల్ల ఆ సమయంలో వారికి, అది అంత దారుణంగా జరుగుతుందని కానీ, క్షణాల్లో అది జరిగిపోతుందని కానీ అనిపించదు'' అన్నారు.

''నిజంగా కళ్లముందు ఏం జరుగుతుందనే విషయం వెంటనే వారి మెదడుకి చేరదు, దానికి కొంత ఆలస్యం జరుగుతుంది. అంటే, నేను సాయం చేసి ఉంటే, ఆ తరువాత పరిస్థితి బాగుండేది అనిపిస్తుంది. కానీ, నిజంగా అవసరమైనప్పుడు అలా జరగదు.'' అన్నారు సిసోడె.

అలాగే, ఇంకెవరైనా సాయం చేస్తారులే అనుకుంటూ ఎవరూ ముందుకు వెళ్లరని డాక్టర్ సందీప్ సిసోడె చెప్పారు.

ఊచల నుంచి చూస్తున్న యువకులు

ఫొటో సోర్స్, Getty Images

బైస్టాండర్ ఎఫెక్ట్

అలాంటి సందర్భాల్లో చుట్టూ గుంపులుగా ఉన్న ప్రజలు ప్రేక్షక పాత్ర ఎందుకు పోషిస్తారు? అనే ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది.

సోషల్ థింకర్ మెలిస్సా బర్క్‌లీ 'సైకాలజీ టుడే' వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించి కొన్ని అంశాలను పొందుపరిచారు. ఈ వెబ్‌సైట్ మానసికపరమైన విషయాల గురించి చర్చిస్తుంది.

బర్క్‌లీ విశ్లేషణ ప్రకారం ఇలాంటిది బైస్టాండర్ ఎఫెక్ట్ అనే భావన వల్ల కావొచ్చు.

బైస్టాండర్ ఎఫెక్ట్ అనే భావన ప్రకారం, ఒక సంఘటన జరిగినప్పుడు అక్కడ ఎక్కువ మంది ఉంటే సాయం కోసం ముందుకొచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ఎక్కువ మంది గుంపు ఉన్నప్పుడు, సాయం అందే అవకాశం తక్కువ. కొద్దిమంది లేదా ఒక్కరే ఉంటే సాయానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.

గుంపులో ఉన్నవారు సాయం చేసేందుకు ఎందుకు ముందుకు రావడం లేదు? ఈ విషయాన్ని శోధించేందుకు జాన్ డర్లీ, బిబ్ లాటేన్ కొన్ని ప్రయోగాలు చేశారు. అందులో వారు కొన్ని కీలక విషయాలను గుర్తించినట్లు బర్క్‌లీ చెప్పారు.

గుంపు

ఫొటో సోర్స్, Getty Images

గుంపుగా ఉంటే సహాయం అందే అవకాశాలు తక్కువ

సాధారణంగా ఇలాంటి ఘటనను చూసినప్పుడు, అది దారుణ ఘటన లేదా వారు నేరాన్ని చూస్తున్నట్లు ప్రజలు మొదట గ్రహించలేరు.

అలాంటి ఘటనను చూడటం షాకింగ్‌గా ఉంటుంది. కళ్లముందు జరుగుతున్నది అత్యవసరంగా కల్పించుకోవాల్సిన విషయమా? కాదా? అని తెలుసుకోవడంలో చాలా ఆలస్యం జరుగుతుంది.

ఇలాంటి ఘటన జరిగినప్పుడు చుట్టూ చాలామంది వ్యక్తులు కనుక ఉంటే, వాళ్లందరూ ఆ ఘటనకు ఎలా స్పందిస్తున్నారనే విషయం అంచనా వేయడానికి ప్రయత్నిస్తుంటారు. జనం ఏదో ఒకటి చేస్తారు, ఎలా స్పందించాలనేది బహుశా తమ కంటే ఇతరులకు ఎక్కువగా తెలిసి ఉండొచ్చు అని అనుకుంటారు.

కొన్నిసార్లు నేరం జరుగుతోందని తెలిసిన తర్వాత కూడా సాయం చేయడానికి ముందుకురారు. సాయం చేయడం తమ వ్యక్తిగత బాధ్యత కాదని భావించడమే అందుకు కారణం.

దీనికి కారణం ఏంటంటే, ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒక్కొక్కరి బాధ్యత తగ్గుతుంది. అంటే, మీరు ఒంటరిగా ఉంటే 100 శాతం బాధ్యత ఆటోమేటిక్‌గా మీపై పడుతుంది. కానీ 10 మంది ఉంటే ఆ బాధ్యత ఒక్కొక్కరికి 10 శాతంగా విభజితమవుతుంది.

సాధారణంగా ఎక్కువ మంది గుంపు ఉంటే, ఎక్కువ మంది సహాయకులు ఉన్నట్లుగా అనుకుంటాం. కానీ, జనం గుంపుగా ఉన్నప్పుడు అది నిజం కాదు.

అందువల్ల, అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు బాధ్యతాయుతంగా స్పందించడం ద్వారా ఒకరి జీవితాన్ని కాపాడే అవకాశం ఉంటుంది.

నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

భయపడకూడదు..

ఎదుటి వ్యక్తికి సాయం చేయాలని చాలా మంది అనుకుంటారు, కానీ భయంతో ముందుకు రారు. ఇలాంటి ప్రవర్తనలో, చట్టం ముందు నిలబడాల్సి వస్తుందేమో, విచారణ పేరుతో రోజూ పిలుస్తారేమోనన్న భయం కూడా ఉంటుంది.

ఈ భయం కారణంగానే చాలామంది ప్రమాదం జరిగినప్పుడు, లేదా ఇతర అత్యవసర సమయాల్లో సాయం చేసేందుకు ముందుకు రారు. కానీ, పౌరులు సామాజిక బాధ్యత కలిగిన వారిగా ఎలా ఉండాలనే విషయమై ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. అందుకోసం ప్రత్యేక చట్టం కూడా చేసింది. అదే 'గుడ్ సమారిటన్ లా'.

ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడం మన కర్తవ్యమని సుప్రీంకోర్టు కూడా ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తోంది. అందువల్ల అలాంటి విపత్కర సందర్భాల్లో సాయం చేస్తే ఎవరూ ఇబ్బందిపెట్టలేరు.

ప్రమాదంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో గాయపడిన వ్యక్తికి తక్షణ సహాయం అందించేందుకు డబ్బు లేదా ప్రతిఫలాన్ని ఆశించకుండా, ఎలాంటి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చే వ్యక్తిని 'ఆదర్శ పౌరుడు'గా చట్టం వివరిస్తుంది.

ఈ విధంగా, ఒక వ్యక్తికి సాయం చేసేందుకు చట్టం అనుమతిస్తుంది. 'గుడ్ సమారిటన్ చట్టం' బాధితుల ప్రాణాలను కాపాడే విషయంలో పౌరులకు చట్టపరమైన రక్షణ కల్పిస్తుంది.

సాయం చేసేవారిని గౌరవించాలి

ఈ విషయంపై న్యాయవాది రామ సరోదె బీబీసీతో మాట్లాడారు. మహిళలు, చిన్నారుల సమస్యలపై ఆమె పనిచేస్తున్నారు.

''ఎవరు ఎవరినైనా కొడుతుంటే, లేదా మహిళ చనిపోయే పరిస్థితిలో ఉంటే చుట్టూ ఉన్న పౌరులు జోక్యం చేసుకోవాలని చెబుతా. వసాయ్ విషయంలో ఒక వ్యక్తి అడ్డుకునే ప్రయత్నం చేశాడు, కానీ అతని బలం సరిపోలేదు'' అని సరోదె అన్నారు.

''ఈ భయానికి కారణమేంటి? ఈ ప్రశ్నకు కూడా మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పోలీసులు, లేదా ఈ వ్యవస్థ సాక్షులను, లేదా పౌరులను నిందితులుగా పరిగణిస్తుందేమో అని వారు భయపడుతున్నారు. కాబట్టి, అడ్డుకోవడానికి వారు ఇష్టపడడం లేదు. ఇది మంచిది కాదు.

అలాంటి అత్యవసర పరిస్థితుల్లో సాయానికి ముందుకొచ్చే వ్యక్తులను గౌరవంగా చూసుకుంటే సమాజంలో మంచి ఉదాహరణగా నిలుస్తుంది. అలాంటి వ్యక్తులు, న్యాయం జరిగేలా వ్యవస్థకు సహకరిస్తారు. అలాంటి వ్యక్తులు ముందుకు రాకపోతే ఈ వ్యవస్థ ఎలా బలోపేతం అవుతుంది'' అని న్యాయవాది రామ సరోదె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)