దక్షిణ కొరియా: అధ్యక్షుడి భార్య ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్ దేశ రాజకీయాలను ఊపేసింది, అసలేం జరిగింది?

దక్షిణ కొరియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణ కొరియా అధ్యక్షుడి భార్య కిమ్ క్యోన్-హ్యూంగ్

గంట నిడివి ఉన్న వీడియో ఒకటి దక్షిణ కొరియా రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. రహస్యంగా రికార్డ్ చేసిన ఈ వీడియో స్పష్టంగా లేకపోవడంతో అక్కడ ఏం జరుగుతుందో కచ్చితంగా తెలియడం లేదు. కానీ, రాజకీయాలపై మాత్రం ప్రభావం చూపింది.

వీడియోలో ఓ వ్యక్తి, ఎదుటి మహిళకు ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ ఇస్తూ కనిపించారు. మామూలుగా చూస్తే ఈ వీడియోలో ప్రత్యేకత ఏమీ లేదు. కానీ, దక్షిణ కొరియా రాజధాని సోల్ లో సీక్రెట్‌గా తీసిన ఈ వీడియో ఆ దేశంలో పెనుదుమారం రేపింది.

దాని ప్రభావం దేశ పార్లమెంట్ ఎన్నికలపై కూడా పడిందని కొందరు అంటున్నారు. ఎందుకంటే, ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ సాధారణ మహిళ కాదు. ఆ దేశాధ్యక్షుడి భార్య. అంటే, ఆ దేశ ప్రథమ మహిళ. ఆమె పేరు కిమ్ క్యోన్.

ఫ్యాషనబుల్‌గా కనిపించే 51 ఏళ్ల కిమ్ క్యోన్‌‌కు అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు
దక్షిణ కొరియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డియోర్ కంపెనీ డిజైనర్ హ్యాండ్‌బ్యాగ్స్

2000 డాలర్ల డిజైనర్ హ్యాండ్‌బ్యాగ్‌

క్రిస్టియన్ పాస్టర్ చోయ్ జే యుంగ్ 2022 సెప్టెంబర్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడి భార్య కిమ్ క్యోన్‌ను ఆమె ప్రైవేట్ నివాసంలో కలిశారు.

ఆయన ఒక ప్రముఖ చర్చిని నిర్వహిస్తున్నారు. పాస్టర్‌తో కిమ్‌ క్యోన్‌కు పరిచయముంది. చోయ్ జే యుంగ్ ఒక మత నాయకుడని, దక్షిణ కొరియా రాజకీయాల్లో మత ప్రభావం ఉంటుందని రాజధాని సోల్‌‌లో పని చేసే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రాఫేల్ రషీద్ అభిప్రాయపడ్డారు.

దక్షిణ కొరియా క్రిస్టియన్ దేశం కానప్పటికీ, దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో క్రిస్టియన్ నాయకులు ఉన్నారు. ఓ మెసేజింగ్ సర్వీస్ ద్వారా పాస్టర్‌కి అధ్యక్షుడి భార్యతో పరిచయం ఏర్పడింది.

ఇద్దరి మధ్యా స్నేహం ఉంది. చాలా నెలల పాటు ఒకరికొకరు మెసేజ్‌లు పంపుకున్నారు.

అధ్యక్షుడి భార్యను పాస్టర్ కలవడం అదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన పలుమార్లు ఆమెను కలిశారు.

అలా ఒకసారి ఆమెను కలిసినప్పుడు ఉన్నత స్థాయి ప్రభుత్వ పదవుల నియామకాల గురించి అధ్యక్షుడి భార్య మాట్లాడడం తాను విన్నానని పాస్టర్ చెప్పారు.

అధ్యక్షుడి భార్యకు ప్రభుత్వంలో అధికారికంగా ఎలాంటి పాత్ర ఉండదు. కాబట్టి ఆమె వ్యాఖ్యలు సరికాదని ఆయన భావించారు.

దేశ ప్రథమ మహిళ ప్రభుత్వ నియామకాల గురించి మాట్లాడడం పాస్టర్ విన్నప్పుడు, లేదా చూసినప్పుడు ప్రభుత్వంలో అనవసర జోక్యంగా ఆయన భావించారని రాఫేల్ రషీద్ అన్నారు.ప్రజాప్రయోజనాల రీత్యా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని ఆయన అనుకున్నారని రషీద్ పేర్కొన్నారు.

అందుకే, ఆ తర్వాత అధ్యక్షుడి భార్యను కలిసేందుకు వెళ్లినప్పుడు ఆయన రహస్య కెమెరాతో అక్కడికి వెళ్లారని రషీద్ చెప్పారు.

రహస్య కెమెరా పాస్టర్ చేతి గడియారంలో ఉంది. ప్రభుత్వ నియామకాల్లో జోక్యం చేసుకుంటున్నారని నిరూపించేలా అధ్యక్షుడి భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడమే ఆయన లక్ష్యం.

దక్షిణ కొరియా

ఫొటో సోర్స్, Getty Images

దక్షిణ కొరియాలో రాజకీయ దుమారం

అయితే, ఏడాది తర్వాత ఆ వీడియో బయటికి వచ్చినప్పుడు, ప్రభుత్వ నియామకాల్లో అధ్యక్షుడి భార్య జోక్యం గురించి కాకుండా, 2000 డాలర్ల ( సుమారు రూ.1.6 లక్షలు ) విలువైన హ్యాండ్‌బ్యాగ్ చర్చనీయాంశంగా మారింది.

మర్యాదపూర్వకంగానే అధ్యక్షుడి భార్యకు ఆ హ్యాండ్‌బ్యాగ్‌ను బహుమతిగా ఇవ్వాలనుకున్నట్లు పాస్టర్ చెప్పారని రాఫేల్ రషీద్ తెలిపారు. ఆయన ఉద్దేశం ఆమెకు లంచం ఇవ్వడమో, లేక లంచం తీసుకుంటున్నట్లు చూపించడమో కాదని రషీద్ అన్నారు.

ప్రభుత్వ నియామకాల్లో ఆమె జోక్యాన్నిఆయన వెలుగులోకి తీసుకురావాలనుకున్నారు. అయితే, ఈ వీడియోలో హ్యాండ్‌బ్యాగ్‌ని తీసుకునేందుకు అధ్యక్షుడి భార్య అంగీకరించినట్లుగా లేకపోవడం గమనార్హం.

'హ్యాండ్‌బ్యాగ్ ఇవ్వాలనుకుంటున్నా' అని చెబుతున్నట్లు వీడియోలో ఉందని, కానీ ఆమెకు ఇవ్వడం కనిపించడం లేదని రాఫేల్ రషీద్ తెలిపారు.

వీడియోలో 'ఎందుకు ఎప్పుడూ ఖరీదైన బహుమతులు తెస్తారు, అలా చేయకూడదు' అని అధ్యక్షుడి భార్య అంటున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి.

ఆ తర్వాత, వారి ముందున్న టేబుల్‌పై హ్యాండ్‌బ్యాగ్ (బహుశా డియోర్ కంపెనీకి చెందిన బ్యాగ్) కనిపిస్తుంది. కానీ, అధ్యక్షుడి భార్య చేతిలో ఆ హ్యాండ్‌బ్యాగ్ కనిపించలేదు. ఇంటికి తీసుకెళ్లడం కూడా ఆ వీడియోలో కనిపించలేదు.

ఆమె ఆ బహుమతిని తీసుకున్నారా లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొన్నప్పటికీ దీనిపై వివాదం మొదలైంది. ఆ వీడియో రికార్డ్ అయిన ఏడాది తర్వాత, 2023 నవంబర్‌లో 'మీడియా వాయిస్ ఆఫ్ సోల్' అనే సంస్థ విదేశీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. రికార్డింగ్ కోసం పాస్టర్‌కి రహస్య కెమెరా ఇచ్చింది కూడా ఇదే సంస్థ.

అప్పటికి కొద్ది నెలల తర్వాత దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ మీడియా సమావేశంలో రాఫేల్ రషీద్ పాల్గొన్నారు. మీడియా సమావేశానికి పాస్టర్ కూడా వచ్చారని రాఫేల్ రషీద్ చెప్పారు.

ఆ తర్వాత ప్రపంచ మీడియాలో ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో దక్షిణ కొరియాలో రాజకీయ దుమారం రేగింది.

దక్షిణ కొరియా

ఫొటో సోర్స్, Getty Images

బహుమతి ఎప్పుడు లంచం అవుతుంది?

బ్రిటన్‌లోని షెఫీల్డ్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ సౌత్ కొరియన్ స్టడీస్ డైరెక్టర్ సారా సోన్ మాట్లాడుతూ, ''మామూలుగా బతకడానికి కూడా తాము ఇబ్బందులు పడుతుంటే, రాజకీయ నాయకులు మాత్రం తమ పదవులను అడ్డుపెట్టుకుని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని దక్షిణ కొరియా ప్రజలు బలంగా నమ్ముతున్నారు.'' అన్నారు.

దక్షిణ కొరియా సంప్రదాయంలో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఒక భాగమని కూడా ఆమె చెప్పారు.

''పెద్దవారి నుంచి వచ్చిన బహుమతిని తిరస్కరించడం చాలా కష్టం. కానీ, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడమనేది అవినీతికి ద్వారాలు తెరుస్తుంది. ఎందుకంటే, బహుమతి కేవలం బహుమతిగా కాకుండా లంచంగా కూడా మారొచ్చు.'' అని ఆమె అన్నారు.

ఇలాంటి వాటిని నివారించేందుకు, 2016లో దక్షిణ కొరియా ‘లంచం నిరోధక చట్టం’ను తీసుకొచ్చింది.

ఈ చట్టం ప్రభుత్వ అధికారి లేదా ఆయన భార్య తీసుకోదగిన బహుమతుల విలువను పరిమితం చేసింది. అంటే, నిర్దేశిత విలువ లోపే బహుమతులను తీసుకోవాలి. ఇక్కడ, అధ్యక్షుడి భార్యకు ఇచ్చిన హ్యాండ్‌బ్యాగ్ విలువ నిర్దేశించిన పరిమితి కంటే చాలా ఎక్కువ.

అయితే, ప్రభుత్వ అధికారుల విలాసాలు, పొందుతున్న ప్రయోజనాల గురించి ఈ చట్టంలో లేదు.

దీంతో తమ జీవితాలకు, ప్రభుత్వ అధికారుల జీవితాలకు మధ్య వ్యత్యాసంపై సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వివాదం సామాన్యుల్లో ఉన్న ఆగ్రహానికి ఆజ్యం పోసింది. దక్షిణ కొరియాలోని ఈ అసమానతలపై 'పారాసైట్' అనే సినిమా, స్క్విడ్ గేమ్ అనే టీవీ సిరీస్ కూడా వచ్చింది. పారాసైట్ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది.

''సమాజంలోని అసమానతలపై పారాసైట్, స్క్విడ్ గేమ్ సిరీస్ ఒక విమర్శ. ఉన్నత వ్యక్తులు విలాసవంతమైన జీవితం గడుపుతుంటే, సాధారణ ప్రజలు తమ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో, మంచి జీవితం కోసం వారు తమ ప్రాణాలను ఎలా పణంగా పెడుతున్నారో చూస్తున్నాం.'' అని సారా సోన్ అన్నారు.

దక్షిణ కొరియా

ఫొటో సోర్స్, Getty Images

అధ్యక్షుడికి తగ్గిన ఆదరణ

ఈ వివాదాస్పద వీడియోలో, అధ్యక్షుడి భార్య ఖరీదైన ఫ్యాషన్ దుస్తులు వేసుకుని ఉన్నారు. వీడియోలో ఉన్నట్లుగా కనిపించడం ఇదే మొదటిసారి కాదన్నది కూడా ఇది చెబుతోంది.

దీని కారణంగా, అధికారంలో ఉన్నవారు సామాజిక అసమానతలను తొలగించేందుకు ఏమీ చేయరని, నిబంధనలను యథేచ్చగా ఉల్లంఘిస్తూనే ఉంటారని ప్రజలు భావించారని సారా సోన్ అభిప్రాయపడ్డారు.

బ్యాగ్ వ్యవహారం భారీ ప్రభావం చూపింది. ఎందుకంటే, అధ్యక్షుడి భార్యపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి.

అయితే, ఈ ఆరోపణలు రుజువు కాలేదని, అలాగే ఆమె షేర్ ధరలను ప్రభావితం చేశారన్న ఆరోపణలపై కూడా దర్యాప్తు చేయలేమని సారా సోన్ చెప్పారు.

ఆమె భర్త, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సిక్-కియోల్ కొన్ని కేసుల దర్యాప్తును నిలిపివేశారని, దాని ఫలితంగా ఆయనకు ఆదరణ తగ్గిందని సారా చెప్పారు.

రెండేళ్ల పదవీ కాలం తర్వాత, పార్లమెంటరీ ఎన్నికల్లో తమ పార్టీ మెజార్టీ సీట్లు గెలుస్తుందని అధ్యక్షుడు యూన్ అనుకున్నారు. కానీ, ప్రజలు తమ ఆగ్రహాన్ని స్పష్టంగా వెలిబుచ్చారు. దీంతో ఎన్నికల్లో అధ్యక్షుడి పీపుల్స్ పవర్ పార్టీ భారీ నష్టాన్ని చవిచూసింది.

అధ్యక్షుడు యూన్ పదవీకాలం 2027 మార్చితో ముగుస్తుంది. దక్షిణ కొరియా చట్టాల ప్రకారం, ఆయన మరోసారి అధ్యక్షుడు కాలేరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)