బోధిచిట్టా చెట్టు: అర్ధరాత్రి తుపాకులు, బాంబులతో వచ్చి నరికేసిన దుండగులు, ఇప్పుడు స్థానికుల ఆందోళన ఏంటి?

- రచయిత, సంజయ్ దాకల్
- హోదా, బీబీసీ న్యూస్ నేపాలీ
లక్షల రూపాయల విలువ చేసే ఓ చెట్టును రెండు నెలల కిందట కొందరు దుండగులు ధ్వంసం చేయడం నేపాల్‌లోని ఓ చిన్న కమ్యూనిటీలో ఆందోళనకు కారణమైంది.
ఆ ప్రాంతంలో విలువైన బోధిచిట్టా (బోధి) చెట్ల నుంచి వచ్చే ఆదాయం అక్కడి ఎంతోమంది జీవితాలను మార్చివేసింది. శారీరక శ్రమ నుంచి వారికి విముక్తి కల్పించింది.
నేపాల్‌లోని కవ్రేపాలంచోక్ జిల్లాలో పెరిగే బోధిచిట్టాకు బౌద్ధంలో ఎంతో ప్రాముఖ్యం ఉంది. దానిని బంగారంకంటే విలువైనదిగా భావిస్తారు.
కావ్రేలోని రోషి రూరల్ మున్సిపాలిటీ పరిధిలో ఓ చెట్టును దుండగులు నరికేశారు. దీంతో ఇలాంటి ఘటనలు తమకు కూడా జరుగుతాయేమోనని, అదే జరిగితే సర్వం కోల్పోతామని ఈ చెట్లను పెంచుతున్న మిగిలిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు.


ఫొటో సోర్స్, CAM01
బంగారు గనుల్లా చెట్లు
‘‘వారికి ఏదైనా సమస్య ఉంటే నాతో చర్చించి ఉండొచ్చు. కానీ వారు ఆ చెట్టును కొట్టేయడం ఎందుకు ?’’ అని బోధి చెట్టును గుర్తుచేసుకుంటున్నప్పుడు దిల్ బహదూర్ తమాంగ్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో కొందరు దుండగులు ఆయన ఇంట్లో ఉన్న బోధి చెట్టును నరికేశారు.
రోషి రూరల్ మున్సిపాల్టీ పరిధిలోని నాగ్బెలీ ప్రాంతంలో దిల్ బహదూర్ పుట్టారు. తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న మనిషి ఆయన.
ఉమ్మడి కుటుంబంలోని తన ముగ్గురు పిల్లలు, సోదరుడు, తల్లిదండ్రులను పోషించడానికి ఖతార్‌లో ఎండల్లో నిర్మాణ కార్మికుడిగా సహా ఎన్నో శారీరకశ్రమతో కూడిన పనులు చేశారు.
కానీ, గతంలో పెద్దగా విలువలేని బోధి చెట్లు గత 15 ఏళ్లుగా విలువైనవిగా మారుతూ రావడంతో దిల్ బహుదూర్ అదృష్టం మారింది.
బోధిచెట్ల విత్తనాలను బౌద్ధులు జపమాలగా వాడతారు.

నేపాల్‌లోని ఈ ప్రాంతంలోని బోధి చెట్లను అత్యంత నాణ్యమైనవి, విలువైనవిగా పరిగణిస్తారు. వీటి విత్తనాల విలువ పెరగడం వెనుక చైనా వ్యాపారులే కారణమని నిపుణులు చెబుతున్నారు.
గతంలో ఈ చెట్లను, వాటి గింజలను పెద్దగా విక్రయించేవారు కాదు.
కొన్నేళ్ళుగా చైనా వ్యాపారులు తమ గ్రామాలకు వచ్చి బేరం కుదర్చుకుంటున్నారని స్థానిక రైతులు చెబుతున్నారు.
దిల్ బహదూర్‌కు పెద్దగా చదువు లేకపోయినా తన తమ్ముడు షేర్ బహదూర్ తమాంగ్, ఇతర కుటుంబ సభ్యుల సహాయంతో తమ బోధి చెట్టు నుంచి లక్షల రూపాయలు సంపాదించగలిగారు.
గత ఐదేళ్ళుగా తాము అదే చెట్టు నుంచి విత్తనాలను అమ్ముతున్నామని, 90 లక్షల నేపాలీ రూపాయలు ( సుమారు రూ. 56 లక్షలు) సంపాదించామని షేర్ బహదూర్ తమాంగ్ చెప్పారు.
‘‘మా కుటుంబంలో 20-22 మంది సభ్యులు ఉన్నారు’’ అని షేర్ బహదూర్ తమాంగ్ చెప్పారు. ‘‘ చెట్టు నుంచి వచ్చే ఆదాయం మొత్తం కుటుంబాన్ని పోషించేది. ఆ చెట్టును నరికేయకుండా ఉంటే మేం ఇంకా చాలా సంవత్సరాలు లక్షల రూపాయల ఆదాయం సంపాదించుకునేవారం’’ అని తెలిపారు.
వచ్చే ఐదు నుంచి ఏడేళ్ళ పాటు ఆ చెట్టు నుంచి విత్తనాలు కొనేందుకు తమాంగ్ కుటుంబంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వ్యాపారి సామిప్ త్రిపాఠి చెప్పారు.
ఆయన తమాంగ్ కుటుంబం నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు.
ఆ ఒక్క చెట్టు విత్తనాల కోసమే ఆయన ఏటా 90 లక్షల నేపాలీ రూపాయలు చెల్లించేవారు. ఆ తరువాత వాటిని ప్రాసెస్ చేసి చైనా వ్యాపారులకు 30 మిలియన్ నేపాలీ రూపాయల( సుమారు రూ. 1 కోటీ 87 లక్షలు) కు పైగా అమ్మేవారు.
తమాంగ్ కుటుంబానికి చెందిన ఆ చెట్టు కావ్రె జిల్లాలోనే ‘‘బహుశా అత్యంత విలువైనది’’ అని ఆ వ్యాపారి చెప్పారు.

చెట్టును నరికేశారు
కానీ ఏప్రిల్ 11న జరిగిన ఘటన తమాంగ్ కుటుంబ ఆశలను భగ్నం చేసింది. ఆ రోజు రాత్రి 10, 15 మంది సాయుధులు తమ కుటుంబంపై దాడిచేసి కాల్పులు జరిపారని, బాంబులు విసిరారని దిల్ బహదూర్ చెప్పారు.
గతంలోనే తమ బోధి చెట్టు లక్ష్యంగా మారిందనే విషయం తెలుసుకున్న తమాంగ్ కుటుంబం సీసీటీవీ ఏర్పాటుచేసి, చెట్టు చుట్టూ ముళ్ళ కంచె వేసి, ఓ ఇనుప తలుపు పెట్టారు. ఆ తలుపు ద్వారా మాత్రమే చెట్టువద్దకు వెళ్ళగలిగే ఏర్పాటు చేసుకున్నారు.
షేర్ బహదూర్ బీబీసీకి ఇచ్చిన సీసీటీవీ ఫుటేజీలో గన్స్ పట్టుకున్న వ్యక్తులు కనిపిస్తున్నారు.
కాల్పుల నుంచి తప్పించుకోవడానికి తామందరం ఇంట్లోనే తలదాచుకున్నామని దిల్ బహదూర్ చెప్పారు. కానీ సాయుధులు చెట్టువద్ద ఉన్న ఇనుప తలుపును బద్దలు కొట్టారు. అక్కడ వారు చేసిన పని బహదూర్ కుటుంబాన్ని షాక్‌కు గురిచేసింది.
‘‘గంట తరువాత వారు తాళం పగులకొట్టి, ప్రధాన చెట్టును నరికేశారు’’ అని బహుదూర్ చెప్పారు.
‘‘వారు ఇలా ఎందుకు చేశారో మాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదు’’ అన్నారాయన.
అయితే దుండగులకు తాము ఆ చెట్టును తీసుకువెళ్ళలేమని, తిరిగి నాటలేమని అర్ధం చేసుకుని ఆ చెట్టు నుంచి తమాంగ్ కుటుంబం ఇక ఎంతమాత్రం లాభం పొందకుండా ధ్వంసం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు స్థానికులు.
బహుశా వ్యాపార కక్షల కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని బీబీసీతో మాట్లాడిన మరికొంతమంది గ్రామస్తులు చెప్పారు.
దుండగులు ఆ చెట్టు విత్తనాల కొనుగోలుకు ప్రయత్నించి ఉంటారని, కానీ ఆ చెట్టు యజమానులు తిరస్కరించడం వలన అలా చేసి ఉంటారని ఇంకొందరు అనుమానం వ్యక్తం చేశారు.
ఈ సంఘటనపై ఇంకా పోలీసు విచారణ కొనసాగుతోంది.

పోలీసుల పహారా
నేపాల్‌లోని టెమాల్ రూరల్ మున్సిపాలిటీ, రోషి రూరల్ మున్సిపాలిటీ పరిధిలో ఈ బోధి చెట్లు కనిపిస్తాయి.
ఆ చెట్ల గింజల విక్రయంపై అనేక వివాదాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
‘‘మా రూరల్ మున్సిపాల్టీలోని జ్యుడీషియల్ కమిటీలో మూడింట ఒక వంతు వివాదాలు ఈ బోధిచిట్టా గురించే.’’ అని రోషి మున్సిపాల్టీ వైస్ చైర్‌పర్సన్ మిమ్ బహదూర్ వాయిబా చెప్పారు.
తమాంగ్ ఇంట్లో జరిగిన ఘటన పరిసర గ్రామాలలో ఆందోళనకు కారణమైంది.
తమాంగ్ కుటుంబానికి కొన్ని మీటర్ల దూరంలో నివసిస్తున్న నారాయణ్ హుమాగై ఇంకా భయపడుతూనే ఉంది.
‘‘మా ఇంట్లో ఆ చెట్టును నాటింది దిల్ బహదూర్ తమాంగే’’ అని ఆయన చెప్పారు. ‘‘జరిగిన ఘటన వల్ల మేం చాలా భయపడిపోయాం.’’ అని నారాయణ్ హుమాగై చెప్పారు.
తమాంగ్ ఇంట్లో సంఘటన తరువాత, నారాయణ్ తన ఇంట్లోని చెట్టును రక్షించుకోవడానికి దాని చుట్టూ ఇనుప కంచె వేసి, ఇంటి చుట్టూ 8 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు.
‘‘పొరుగున చెట్లను నరికిపడేయడం చూసిన తరువాత మాక్కూడా అలాంటిదే జరుగుతుందని భయపడుతున్నాం. కొందరు అసూయతో ఉంటారు.’’ అని ఆయన చెప్పారు.
విలువైన చెట్లను రక్షించేందుకు స్థానిక అధికారులు కూడా పోలీసు గస్తీని ఏర్పాటు చేశారు.
సంఘటన జరిగిన గ్రామంలో వారానికి రెండు మూడురోజులుపాటు పోలీసుల గస్తీ ఉంటోందని టెమాల్ మున్సిపాల్టీ వైస్ చైర్‌పర్సన్ దాల్మన్ థోకర్ చెప్పారు.
గతంలో వ్యాపారులు ఈ విత్తనాలను సురక్షితంగా తీసుకువెళ్ళడానికి హెలికాప్టర్స్ తెచ్చేవారని గ్రామస్తులు చెప్పారు.
కావ్రే జిల్లా పోలీసు అధికార ప్రతినిధి, డిఎస్సీ రాజ్‌కుమార్ శ్రేష్ఠ మాట్లాడుతూ అవసరమైతే చెట్టును కాపాడేందుకు పంటకాలంలో పోలీసులను నియమిస్తామని తెలిపారు.
కానీ, ఇటువంటి ఏర్పాట్లు ఆయుధాలతో తమను దోచుకోవడానికి వచ్చేవారిని ఆపలేవని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- బొడ్డులో దూదిలాంటి వ్యర్థాలు ఎలా చేరతాయి, అక్కడ ఇంకా బతికే జీవులు ఏంటి, వాటితో ప్రమాదమెంత?
- ఇల్లు కిరాయికి ఇస్తే నట్టింట్లో 3 అడుగుల మట్టిపోసి గంజాయి సాగు చేశారు
- పదేళ్ల పాత బియ్యం తినొచ్చా? బియ్యం ఎంతకాలం పాడవకుండా ఉంటుంది
- క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ: ‘నేను గర్భవతినని బిడ్డను కనడానికి నెల రోజుల ముందు వరకు నాకు తెలియలేదు’
- టీ20 వరల్డ్‌కప్: సూపర్-8 రౌండ్ పోటీలు ఎలా నిర్ణయించారు? సెమీస్, ఫైనల్లో వర్షం పడితే విజేతను ఎలా నిర్ణయిస్తారు?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














