Hajj: ఈ యాత్రకు అనధికారికంగా ఎందుకు వెళుతున్నారు, 1301 మంది ఎందుకు చనిపోయారు?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, థామస్ స్పెండర్
- హోదా, బీబీసీ న్యూస్
ఈ ఏడాది హజ్ యాత్రలో కనీసం 1,301 మంది యాత్రికులు మరణించారని సౌదీ అరేబియా తెలిపింది. విపరీతమైన వేడిలో ఎక్కువ దూరం నడిచిన కారణంగా వీరు మరణించారని, వీరిలో ఎక్కువమంది అనధికారికంగా అక్కడికి వచ్చినవారేనని పేర్కొంది.
ఈ ఏడాది హజ్ యాత్ర 50 డిగ్రీలు దాటిన ఎండలు, వడగాడ్పుల మధ్య జరిగింది.
చనిపోయినవారిలో మూడొంతుల మంది అధికారికంగా అనుమతులు లేకుండా వచ్చినవారేనని, వారికి తగినంత ఆశ్రయం లేక, నేరుగా ఎండలో నడిచారని సౌదీ అధికారిక న్యూస్ ఏజెన్సీ ఎస్‌పీఏ తెలిపింది.
తీవ్ర అస్వస్థత కారణంగా కొందరు, వృద్ధాప్యం కారణంగా మరికొందరు చనిపోయారని ఏజెన్సీ వెల్లడించింది.
వడదెబ్బ ఎంత ప్రమాదకరమో, వాటిని ఎలా ఎదుర్కోవాలో యాత్రికులకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేసినట్టు ఆరోగ్యశాఖామంత్రి ఫహద్ అల్ జలాజెల్ చెప్పారు.
అనుమతులు లేకుండా వచ్చిన 1 లక్షా 40 వేలమంది యాత్రికుల సహా దాదాపు 5 లక్షల మందికి ఆరోగ్య కేంద్రాలు చికిత్స అందించాయని, ఇంకా మరికొంతమంది ఆస్పత్రులలోనే ఉన్నారని తెలిపారు.
‘‘మృతులను అల్లా కరుణించి, క్షమించాలి. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి’’ అని ఆయన అన్నారు.


ఫొటో సోర్స్, REUTERS
సౌదీ అరేబియాపై విమర్శలు
హజ్ యాత్రను సురక్షితంగా మలచలేకపోవడంపై సౌదీ అరేబియా విమర్శలకు గురవుతోంది.
ప్రత్యేకించి నమోదు చేసుకోని యాత్రికులకు ఎయిర్ కండీషన్డ్ టెంట్స్, అధికారిక హజ్ రవాణా సదుపాయాలలోకి అనుమతి లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
మక్కాలో ఉష్ణోగ్రతలు 51.8 డిగ్రీలకు చేరినట్టు సౌదీ అరేబియా వాతావరణ కేంద్రం తెలిపింది.
హజ్ యాత్రకు వెళ్ళి తమ పౌరులు ఎంతమంది చనిపోయారనే సంఖ్యను ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలు అందిస్తున్నాయి. కానీ ఆదివారం వరకు సౌదీ అరేబియా మృతుల విషయం గురించి కానీ, మృతులు ఎంతమంది అనే సంఖ్యపై కానీ పెదవి విప్పలేదు.
ఓ అరబ్ రాయబారిని ఉటంకిస్తూ ఏఎఫ్‌పి న్యూస్ ఏజెన్సీ సంస్థ 658 మంది ఈజిప్షియన్లు చనిపోయారని తెలపగా, తమ పౌరులు 200మంది చనిపోయారని ఇండోనేషియా చెప్పింది, తమ దేశానికి చెందినవారు 98మంది మరణించారని భారత్ తెలిపింది.
పాకిస్తాన్, మలేసియా, జోర్డాన్, ఇరాన్, సెనెగల్, సూడాన్, ఇరాక్ అటానమస్ కుర్దిస్తాన్ ప్రాంతాలు కూడా మరణాలను ధృవీకరించాయి.

అనధికారిక యాత్ర ఎందుకు?
హజ్ అనేది ముస్లింలు పవిత్రంగా భావించే మక్కాకు ఏటా చేసే యాత్ర. ఆర్థికంగానూ, ఆరోగ్యకరంగానూ ఉన్న ముస్లింలందరూ తమ జీవితకాలంలో ఒక్కసారైనా తప్పనిసరిగా ఈయాత్రను పూర్తి చేయాలి.
ఈ ఏడాది 18 లక్షలమంది మంది హజ్‌యాత్రలో పాల్గొన్నారని సౌదీ అరేబియా వెల్లడిచింది.
అనధికారిక యాత్రికుల సహా మృతుల సంఖ్య పెరుగుతోంది.
మక్కాకు అక్రమంగా యాత్రికులను పంపిన 16 పర్యాటక కంపెనీల లైసెన్సులను ఈజిప్ట్ ప్రధాని ముస్తాఫా మద్బౌలీ శనివారంనాడు రద్దుచేశారు. వాటి నిర్వాహకులపై విచారణకు ఆదేశించారు.
మక్కాకు అనధికారికంగా ముస్లిం యాత్రికులను పంపిన అనేకమంది ట్రావెల్ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నట్టు జోర్డాన్ తెలిపింది. మరోపక్క ట్యూనిషియా అధ్యక్షుడు కైస్ సయీద్ మత వ్యవహారాల మంత్రిని తొలగించారు.
హజ్ అనుమతులను ఆయా దేశాలకు కోటా పద్ధతిలో కేటాయిస్తారు. ఆ కోటా ప్రకారం లాటరీ తీసి యాత్రికులకు అవకాశం కల్పిస్తారు.
అరెస్ట్ అయ్యే ముప్పు, పట్టుబడితే బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉన్నా చాలామంది యాత్రికులు అనధికారిక యాత్రకు సిద్ధపడటానికి కారణం యాత్రకు అయ్యే ఖర్చే.
హజ్ యాత్రకు ముందు మక్కానుంచి లక్షలాదిమంది అనధికారిక యాత్రికులను తిప్పి పంపినట్లు సౌదీ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- బొడ్డులో దూదిలాంటి వ్యర్థాలు ఎలా చేరతాయి, అక్కడ ఇంకా బతికే జీవులు ఏంటి, వాటితో ప్రమాదమెంత?
- ఇల్లు కిరాయికి ఇస్తే నట్టింట్లో 3 అడుగుల మట్టిపోసి గంజాయి సాగు చేశారు
- పదేళ్ల పాత బియ్యం తినొచ్చా? బియ్యం ఎంతకాలం పాడవకుండా ఉంటుంది
- క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ: ‘నేను గర్భవతినని బిడ్డను కనడానికి నెల రోజుల ముందు వరకు నాకు తెలియలేదు’
- టీ20 వరల్డ్‌కప్: సూపర్-8 రౌండ్ పోటీలు ఎలా నిర్ణయించారు? సెమీస్, ఫైనల్లో వర్షం పడితే విజేతను ఎలా నిర్ణయిస్తారు?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














