పాకిస్తాన్: దైవదూషణకు పాల్పడ్డారంటూ పోలీస్ స్టేషన్‌ నుంచి లాక్కొచ్చి చంపారు

కాలిపోయిన కార్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మలు కర్సినో
    • హోదా, బీబీసీ న్యూస్

దైవదూషణ ఆరోపణలతో పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఒక టూరిస్టును ఒక మూక బయటకు ఈడ్చుకెళ్లి కొట్టి చంపింది. పాకిస్తాన్‌లో ఈ ఘటన జరిగింది.

స్వాత్ జిల్లాలోని మద్యాన్ పట్టణంలో జరిగిన ఈ ఘటనలో పెద్ద మూక నుంచి ఆ వ్యక్తిని రక్షించడానికి పోలీసులు ప్రయత్నించారు.

ఖురాన్‌ను ఆ వ్యక్తి అపవిత్రం చేశారని గురువారం ఆరోపణలు రావడంతో స్థానికులు దాడికి దిగారు.

పాకిస్తాన్‌లో దైవదూషణ ఆరోపణలతో మూకదాడులు తరచూ జరుగుతుంటాయి. దైవదూషణకు ఆ దేశంలో మరణశిక్ష విధిస్తారు.

గత మే నెలలో ఇలాగే ఓ వ్యక్తిపై దాడి జరగడంతో ఆయన మరణించారు. ఖురాన్ పేజీలను తగులబెట్టారనే ఆరోపణలతో క్రైస్తవ మతానికి చెందిన ఆయనపై దాడి చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో, పాకిస్తాన్‌లోని సోషల్ మీడియాలో దుమారం రేపింది. వ్యక్తి మృతదేహాన్ని వీధుల్లో ఊరేగించి, ఆతర్వాత తగులబెట్టినట్లు వీడియో ఫుటేజీలో కనిపిస్తుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
పాక్‌లో దైవదూషణ నేరం

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

తాజా ఘటనలో టూరిస్టును చిత్రహింసలు పెట్టారని, మొత్తం 11 మంది గాయపడ్డారని పోలీసులు ధ్రువీకరించారు.

మొదట ఆ వ్యక్తిని పోలీసులు రక్షించిన తర్వాత జనం గుమిగూడేలా స్థానిక మసీదు పెద్దలు ప్రేరేపించారని మలన్‌కండ్ డివిజన్ రీజినల్ పోలీస్ చీఫ్ మొహమ్మద్ అలీ ఆరోపించారు.

వేసవి విడిది అయిన స్వాత్ లోయ పర్యటన కోసం ఆ టూరిస్ట్ వచ్చారని ఆయన వెల్లడించారు.

గాయపడిన వారిలో ఎనిమిది మంది పోలీస్ అధికారులు ఉన్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్‌తో ఆయన చెప్పారు.

గురువారం రాత్రిపూట కోపోద్రిక్తులై రోడ్లను అడ్డగించిన మూకను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారని స్వాత్ రీజియన్ పోలీస్ అధికారి జహీదుల్లా బీబీసీతో చెప్పారు.

పాక్‌లో దైవదూషణ

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

ఈ ఘటనతో ప్రమేయం ఉన్న వందలాది మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. స్థానిక అధికార యంత్రాంగం ఆ రీజియన్‌లో అదనపు భద్రతా బలగాలను మోహరించింది.

పట్టణంలోని హోటళ్లన్నీ నిండిపోయాయి. కానీ, ఇప్పుడు టూరిస్టులు అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు వెనకాడుతున్నారు.

1980లలో దైవదూషణకు మరణశిక్ష విధించాలనే చట్టాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి పాకిస్తాన్‌లో మతపరమైన హింస పెరిగింది.

అక్కడ ఆరోపణలను నిరూపించే ఆధారాలు లేనప్పటికీ నిందను ఎదుర్కొంటున్నవారికి వ్యతిరేకంగా నిరసనలు, హింస జరగొచ్చు.

మైనారిటీలే దీనికి లక్ష్యంగా మారుతున్నారని చాలా కాలంగా మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

పాకిస్తాన్‌లో 96 శాతం జనాభా ముస్లింలు.

ఇరాన్, బ్రూనై వంటి కొన్ని ఇతర దేశాలు కూడా దైవ దూషణను నేరంగా పరిగణించి మరణశిక్ష విధిస్తాయి.

పాక్‌లో దైవ దూషణ నేరం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫైల్ ఫోటో

ఏం జరిగింది?

ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.

విచారణ అనంతరం ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.

జూన్ 18న ఒక వ్యక్తి స్థానిక హోటల్‌కు వచ్చారు. హోటల్‌లో బస చేసిన ఆయన దైవదూషణకు పాల్పడ్డారని, అనంతరం తన లగేజ్ తీసుకుని రిక్షాలో ఎక్కడికో వెళ్తున్నారంటూ గురువారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందింది. వెంటనే సంఘటనా స్థలానికి ఎస్‌హెచ్‌ఓ చేరుకునే సమయానికే అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ టూరిస్ట్‌ను చుట్టుముట్టారు.

ఆగ్రహావేశాలతో ఉన్న ఆ గుంపు నుంచి నిందితుడిని రక్షించడానికి పోలీసులు ప్రయత్నించారని, చట్ట ప్రకారం నిందితుడిపై చర్య తీసుకుంటామని పోలీసులు ఆ మూకకు వివరించారని జిల్లా పోలీసు అధికారి వెల్లడించారు.

కానీ, ఆ గుంపులో ఉన్న కొందరు వ్యక్తులు ఆ వ్యక్తిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారని తెలిపారు.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, MEHBOOB UL HAQ/AFP VIA GETTY IMAGES

పోలీసు అధికారి చెప్పిన వివరాల ప్రకారం, “కోపోద్రిక్తులైన ఆ గుంపు, పోలీసులను అనుసరిస్తూ పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. నిందితుడి ప్రాణాలు కాపాడటానికి స్టేషన్ గేట్‌ను పోలీసులు మూసేశారు. నిందితుడిని సమీపంలోని క్వార్టర్‌కు తరలించారు. కాసేటికే అక్కడికి కూడా జనం చేరుకున్నారు.

స్థానిక మసీదుల నుంచి ఈ ఘటనకు సంబంధించి ప్రకటనలు వచ్చాయని, ఆ తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి టూరిస్టును తమకు అప్పగించాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారని అధికారులు చెబుతున్నారు.

ఆ తర్వాత గుంపులో ఉన్నవారు ముందుగా పోలీస్ స్టేషన్‌పై రాళ్లు రువ్వి, గోడలు ఎక్కి స్టేషన్‌ లోపలికి ప్రవేశించారు.

పోలీసు స్టేషన్ భవనాన్ని, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో కొందరు పోలీసులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో, పోలీస్ స్టేషన్‌పై ఒక గుంపు దాడి చేయడం, పోలీస్ స్టేషన్ ఆస్తులను తగలబెట్టడం చూడవచ్చు.

పాక్‌లో దైవదూషణ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫైల్ ఫోటో

ఖైబర్ పంఖ్తున్‌ఖ్వా ప్రభుత్వ ప్రతినిధి బారిస్టర్ ముహమ్మద్ అలీ సైఫ్ ఈ ఘటన గురించి మాట్లాడారు.

‘‘నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆగ్రహించిన గుంపు పోలీసు స్టేషన్‌పై దాడి చేసి, అతన్ని చిత్రహింసలకు గురి చేసింది. పోలీసు స్టేషన్ నుంచి బయటకు తీసుకువచ్చి తర్వాత చంపేశారు’’ అని చెప్పారు.

సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలలో, కాలిపోతున్న మృతదేహం చుట్టూ ప్రజలు గుమిగూడి మతపరమైన నినాదాలు చేయడం చూడవచ్చు.

స్వాత్‌లోని బహ్రీన్ తహసీల్‌ మదీనా ప్రాంతంలోని డీఆర్‌సీ కమిటీ ఉపాధ్యక్షుడు ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ, వ్యక్తి బస చేసిన హోటల్‌లో ఈ సంఘటన జరిగిందని అన్నారు.

ఘటనా స్థలంలో కొందరు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారని తెలిపారు. హోటల్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించినప్పటికీ, పోలీసులు అక్కడికి చేరుకునేలోపే వార్త వ్యాపించిందని చెప్పారు.

“ఈ సందర్భంగా, అల్లర్లను ఎలాగైనా నియంత్రించాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ, ప్రజలు చాలా మంది ఉండటం, వారు చాలా కోపంగా ఉన్నందున అది సాధ్యం కాలేదు. కొద్ది క్షణాల్లోనే పరిస్థితి మరింత దిగజారింది’’ అని ఆయన తెలిపారు.

కోపోద్రిక్తులైన మూక, పర్యాటకుడిని హత్య చేసిన ఘటన జరిగిన రోజున మదీనా వ్యాపారి మియాన్ అల్తాఫ్ హుస్సేన్ అక్కడే ఉన్న తన దుకాణంలో ఉన్నారు. హోటల్‌కు సమీపంలోనే ఆయన దుకాణం ఉంటుంది.

“సాయంత్రం 6.30 గంటలకు, ఒక పర్యాటకుడు ఖురాన్‌ను అవమానించాడంటూ మార్కెట్‌లో కలకలం మొదలైంది. ఆ తర్వాత జనం గుమిగూడారు. మసీదుల నుంచి ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆగ్రహించిన ప్రజలు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు’’ అని అల్తాఫ్ హుస్సేన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)