భారత్‌లో నెట్‌ఫ్లిక్స్, ఇతర స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు సెల్ఫ్ సెన్సార్ చేసుకుంటున్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నేయాజ్ ఫరూఖీ
- హోదా, బీబీసీ ఉర్దూ ప్రతినిధి
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు కొన్ని రైట్ వింగ్ సమూహాల నుంచి ఒత్తిడి కారణంగా చిత్రనిర్మాతలను స్క్రిప్ట్‌లను మార్చి, సెన్సార్ చేయమని, ప్రాజెక్ట్‌లను రద్దు చేయమని కోరుతున్నాయి అన్న ఆరోపణలను బీబీసీ పరిశోధించింది.
బాలీవుడ్ దర్శకుడు దిబాకర్ బెనర్జీ తన తాజా చిత్రాన్ని 2022 మే నెలలో నెట్‌ఫ్లిక్స్‌కు సమర్పించారు. అయితే నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆయనకు చాలా రోజుల వరకు సమాధానం రాలేదు.
తీస్ (ముప్పై) పేరుతో నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన ఈ చిత్రం భారత దేశంలోని పలువురు మైనారిటీలు ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ సవాళ్లను చర్చిస్తుంది. దీని కథ 1989 - 2042 మధ్యకాలంలో పలు భారతీయ నగరాలలో నివసిస్తున్న ముస్లిం కుటుంబంలోని మూడు తరాల చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది.
బెనర్జీ సమాధానం కోసం ఒత్తిడి చేసినప్పుడు, నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు, "దీనిని విడుదల చేయడానికి ఇది సరైన సమయం కాదని మేము భావిస్తున్నాం" అని అన్నట్లు ఆయన చెప్పారు.
ముంబయిలోని వినోద పరిశ్రమలో, మరీ ముఖ్యంగా గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలోని సృజనాత్మక వర్గాలలో నెలకొన్న భయం గురించి వారు ప్రస్తావించారని బెనర్జీ చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
హిందూ జాతీయవాద సమూహాలు, ప్రభుత్వ ఆగ్రహానికి గురి కావచ్చనే భయంతో ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు రాజకీయ, సామాజిక అంశాల విషయంలో ఇప్పుడు మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
"నా చిత్రం పూర్తయ్యాక నిలిచిపోయింది. కానీ, చాలామంది తమ ప్రాజెక్ట్‌లను కనీసం ప్రారంభించలేకపోయారు" అని ఆయన చెప్పారు.
ఆయన మాట్లాడుతున్న ప్రాజెక్ట్‌లకు భారత్‌లోని చాలా పెద్ద దర్శకులు దర్శకత్వం వహించారు. వాటిలో సమకాలీన అంశాలను ప్రస్తావించారు.
వాటిలో ఒకటి పులిట్జర్ ప్రైజ్-ఫైనలిస్ట్ పుస్తకం ఆధారంగా, ముంబయిలో జరిగిన మతపరమైన హింసను పరిశోధించే చిత్రం; మరొకటి, 1970లలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పౌరహక్కులపై ఉక్కుపాదం మోపడం గురించి ప్రస్తావించే డాక్యుమెంటరీ; మరొకటి ‘ఈ ప్రభుత్వం అమ్ముడు పోయింది’ అంటూ రూపొందించిన వ్యంగ్య ధారావాహిక.

ఫొటో సోర్స్, Getty Images
ఈ అంశంపై భయాన్ని వ్యక్తం చేస్తూ, చాలామంది చిత్రనిర్మాతలు దీని గురించి బహిరంగంగా చర్చించడానికి ఇష్టపడలేదు. తమ పేర్లను వెల్లడించరాదు అన్న నియమం మీద, బీబీసీ సుమారు మూడు డజన్ల మంది బాలీవుడ్ లోపలి వ్యక్తులతో మాట్లాడింది. వాళ్లు తాము స్వీయ-సెన్సార్ చేసుకుంటున్నామని, కొన్నిసార్లు సామాజిక, రాజకీయ, మతపరమైన అంశాలను చర్చించే ప్రాజెక్టులను నిలిపేశామని తెలిపారు.
అయితే బాలీవుడ్‌లోని కొందరు మాత్రం, కంటెంట్ సృష్టికర్తలు తమ కథనంలో మరింత సున్నిత విధానాన్ని అవలంబించాలి అంటూ దీనితో ఏకీభవించలేదు.
బీజేపీయేతర పాలకులు కూడా తమకు అసౌకర్యంగా అనిపించే అంశాల విషయంలో అసహనాన్ని కనపరుస్తున్నారని విమర్శకులు గుర్తు చేశారు. (నిజానికి ఇలాంటి మొదటి న్యాయపరమైన సవాలు, ఒక పెద్ద ప్రాజెక్టుకు, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకుడి నుంచి ఎదురైంది.)

ఫొటో సోర్స్, Getty Images
హిందూ రైట్ వింగ్ సమూహాలతో జతకట్టిన వ్యక్తులు ఇప్పుడు "తమ కథనానికి" సరిపోయే అంశాలపై సినిమాలు లేదా సిరీస్‌లను రూపొందించడానికి సినీ పరిశ్రమలోని వ్యక్తులను సంప్రదిస్తున్నారని చిత్రనిర్మాతలు తెలిపారు.
సెన్సార్‌షిప్ భారత దేశానికి కొత్త కాదని, అయితే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు, చిత్రనిర్మాతలపై జరుగుతున్న ఎదురుదాడి "సంస్థాపరంగా, స్థాయిపరంగా, హింసపరంగా, పౌరులపై సంపూర్ణ నియంత్రణ పరంగా" ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో ఉందని వాళ్లు అంటున్నారు.
"మీరు మీ ఆలోచనలను పక్కన పెట్టండి లేదా స్వీయ సెన్సార్ చేసుకోండి లేదా విషయం హిందూ మితవాదులకు అనుకూలంగా ఉండేట్లు చూసుకోండి" అని బాలీవుడ్ అగ్రనటులు, దర్శకులు, నిర్మాతలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో కలిసి పనిచేసిన ఒక చిత్రనిర్మాత అన్నారు.
అయితే, నిర్దిష్టమైన చిత్రాల గురించి చర్చించడానికి నెట్‌ఫ్లిక్స్ నిరాకరించింది. కానీ దాని ప్రతినిధి ఒకరు.. “మా వద్ద విస్తృత శ్రేణి కలిగిన భారతీయ చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ సృజనాత్మక వ్యక్తీకరణకు మేము ఇచ్చే విలువను తెలియజేస్తాయి. ఈ వైవిధ్యం మా సభ్యుల విభిన్న అభిరుచులను ప్రతిబింబించడమే కాకుండా, అదే మిగతా పోటీదారుల నుంచి మమ్మల్ని వేరు చేస్తుంది’’ అన్నారు.
కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తూ, రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటూ, బాలీవుడ్ స్టార్-ఆధారిత ఫార్ములా సినిమాలకు వ్యతిరేకంగా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ప్రధాన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు 2010ల మధ్యకాలంలో భారతదేశంలోకి వచ్చాయి. అయితే ఒక కొత్త మార్పును తీసుకువస్తామని అవి చేసిన వాగ్దానానికి ప్రస్తుత పరిణామాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, SOPA IMAGES
అనేక సినిమాలు, సిరీస్‌ల నిర్మాణంలో పాలు పంచుకునే ఒక వ్యక్తి చెప్పినట్లు, సినిమాలో కథే రాజుగా ఉండాలి తప్ప స్టార్ కాదు.
ఆనాడు ఆ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు చేసిన వాగ్దానం వినోద పరిశ్రమలో చాలా మందికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది, ఎందుకంటే సెన్సార్ నైతిక నిబంధనలకు అనుగుణంగా ఉంటూ థియేటర్‌లో విడుదల చేసే చిత్రాల మాదిరి కాకుండా – ఈ నూతన మాధ్యమానికి అలాంటి పరిమితులు లేవు (భారత ప్రభుత్వం ఇటీవల స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను నియంత్రించడానికి ఒక బిల్లును ప్రతిపాదించింది).
కొందరు దీనిని మతం, రాజకీయాల కంటికి కనిపించని సరిహద్దులను బద్దలు కొట్టడంగా భావిస్తే, మరికొందరు దీనిని అవాంఛనీయమైన అతిక్రమణగా భావించారు, హిందూ జాతీయవాద బృందాలు తరచుగా నిరసనలను చేపట్టడం, తమకు ఇష్టం లేని చిత్రాలకు వ్యతిరేకంగా వాటిని బహిష్కరించాలని పిలుపునివ్వడం లాంటివి చేశాయి.
ముస్లింలను కొట్టడం, మతాంతర ప్రేమ, కులమత వివక్షను చూపించే సిరీస్‌లు, ఇలా ప్రారంభంలో అనేక ప్రాజెక్టులపై మొదట అసహనం వ్యక్తం అయింది.
దీనిపై ప్రతిస్పందన తెలియజేయాలని బీబీసీ చేసిన అభ్యర్థనకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పందించలేదు. ఈ అంశంపై చర్చించేందుకు ఒక బీజేపీ అధికార ప్రతినిధి నిరాకరించగా, మరొకరు స్పందించలేదు.
అయితే, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫిబ్రవరిలో జరిగిన ఒక కార్యక్రమంలో తన మంత్రిత్వ శాఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో చర్చిస్తోందని తెలిపారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో ప్రభుత్వం సఖ్యంగా ఉంటుందని అన్నారు. అయితే "స్వేచ్ఛ ముసుగులో అశ్లీలతను లేదా మన సంస్కృతిని అవమానించడాన్ని మేము సహించలేము" అని ఆయన నొక్కి చెప్పారు.

ఫొటో సోర్స్, AMAZON
"కళాత్మక స్వేచ్ఛ అంటే మీరు మీ సామాజిక మూలాలను త్రవ్వడం కాదు లేదా మీ కథాంశం వాస్తవికతను కప్పిపుచ్చి తప్పుడు కథనాలను సృష్టించడం, మతపరమైన మనోభావాలను దెబ్బ తీయడం కాదు," అని ఆయన అన్నారు.
దిబాకర్ బెనర్జీ చెప్పినట్లు, 2021లో అమెజాన్ ప్రైమ్‌లో తాండవ్ సిరీస్ విడుదలైన తర్వాత విషయాలు "టాప్ గేర్"లోకి మారాయి.
దాని నిర్మాతల ప్రకారం, ఇది "అధికారం కోసం ఆకలితో ఉన్న రాజకీయవేత్తలోని దుర్మార్గపూరిత కోణాన్ని" చూపించింది. అయితే చాలామంది, ఇతర అంశాలతోపాటు, ఒక ముస్లిం నటుడు పోషించిన శివుని వర్ణన అభ్యంతరకరంగా ఉందని అన్నారు.
ఆ తర్వాత, అధికార బీజేపీ నాయకులు దీనిని నిషేధించాలని డిమాండ్ చేశారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ సిరీస్‌ను నిర్మించిన వారిని పిలిపించింది. దాని నిర్మాతలు బేషరతుగా క్షమాపణలు చెప్పి, "అభ్యంతరకరమైన" భాగాలను తొలగించారు, కానీ మనస్తాపం చెందిన వారిని శాంతింపజేయడంలో విఫలమయ్యారు.
ఈ సిరీస్‌పై భారతదేశం అంతటా దాదాపు డజను ఎఫ్‌ఐఆర్‌లు, పోలీసు ఫిర్యాదులు నమోదు అయ్యాయి. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కోసం ఆ సిరీస్ సిబ్బంది చేసుకున్న దరఖాస్తును కోర్టు తిరస్కరించింది. ప్రైమ్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా చాలా మంది సిబ్బంది తమ ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేసి, రోజుల తరబడి అండర్‌గ్రౌండ్‌కు వెళ్లారని ఈ వ్యవహారం గురించి తెలిసిన ముగ్గురు వ్యక్తులు చెప్పారు.
ఈ సిరీస్ వివాదాస్పదమైన వెంటనే తనను కనీసం మూడు ప్రాజెక్ట్‌ల నుంచి తొలగించారని ఈ సిరీస్‌లో పాలు పంచుకున్న సిబ్బందిలో ఒకరు బీబీసీకి చెప్పారు, దీంతో ఆరు నెలలపాటు నిరుద్యోగిగా ఉన్న ఆయన, చివరికి పని కోసం ఇతరులను అడుక్కోవాల్సి వచ్చింది.
ఇటువంటి పరిణామాలను తెలుసుకున్న నిర్మాతలు, ప్లాట్‌ఫామ్‌లు నాటి నుంచి తీవ్రమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాయని సృజనాత్మక రంగంలోని అనేకమంది తెలిపారు.

ఫొటో సోర్స్, SOPA IMAGES
షేక్‌స్పియర్ కథలను భారతీయ ప్రేక్షకులకు అద్భుతంగా అందించడంలో పేరుగాంచిన దర్శకుడు విశాల్ భరద్వాజ్, 1999లో ఒక విమానాన్ని హైజాక్ చేసి, అందులోని 191 మంది ప్రయాణికులను విడుదల చేయాలంటే అరెస్టయిన ముగ్గురు మిలిటెంట్‌లను తాలిబాన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్‌కు తరలించాలని నాటి బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అంశంపై సినిమా తీయాలనుకున్నారు,
కానీ తాండవ్ ఎపిసోడ్ తర్వాత అలాంటి రిస్కును తీసుకోవడానికి ఇష్టపడని ప్రైమ్ ఆ ప్రాజెక్ట్‌ను ఉపసంహరించుకుంది, "వాళ్లు ఏ రాజకీయ అంశాన్నీ తాకొద్దని చెప్పారు." అని ఆయన మిడ్-డే వార్తాపత్రికతో చెప్పారు.
అమెజాన్ ప్రైమ్ నిర్దిష్ట ప్రశ్నలకు ప్రతిస్పందించలేదు కానీ "భారతదేశపు వైవిధ్యతను ప్రతిబింబించే అనేక భాషలు, సంస్కృతులను గౌరవిస్తూ, ప్రామాణికమైన, ప్రత్యేకమైన స్థానిక కథనాలను చెప్పడం" తమ లక్ష్యం అని చెప్పింది.
"మేము మా బాధ్యతలను సీరియస్‌గా తీసుకుంటాము, మా ప్రోగ్రామింగ్ నిర్ణయాలను ఆలోచించి తీసుకుంటాము" అని ప్రైమ్ వీడియో ప్రతినిధి చెప్పారు.
సృజనాత్మక వ్యక్తులను ఈ సంఘటనలు నిరుత్సాహానికి గురి చేశాయి. దాంతో ఒక అగ్ర దర్శకుడు చెప్పినట్లు, నిర్మాణ ప్రక్రియలోనే వాళ్లు ‘‘ముందస్తు సెన్సార్‌షిప్" చేసుకుంటున్నారు.
మాటలు, విజువల్స్, నటీనటుల ఎంపిక విషయంలో ప్రొడక్షన్ హౌస్‌లు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు తమ లీగల్ టీమ్‌లను బలోపేతం చేసుకున్నాయి. దీంతో సృజనాత్మక కంటే కంటెంట్‌పై నియంత్రణ పెరిగిపోయింది.
ఒక స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇటీవల విడుదలైన ఒక సామాజిక-రాజకీయ సిరీస్‌కు జారీ చేసిన మార్గదర్శకాలలో: “కులవివక్ష లేదా కుల వ్యవస్థ గురించి వర్ణిస్తున్నప్పుడు, ఏ నిర్దిష్ట కులానికి (లేదా ఉపకులం లేదా తెగ లేదా వర్గం), లేదా ఎవరైనా నాయకులు లేదా ప్రముఖ సభ్యులకు సంబంధించిన ప్రస్తావన ఉండరాదు,’’ అని ఉందని, పేరు వెల్లడించడానికి ఇష్టపడని వ్యక్తి ఒకరు బీబీసీకి తెలిపారు.
"ఇటువంటి కథాంశాలు ఆ కులానికి చెందిన మనిషి వ్యక్తిగత అనుభవంగా చిత్రీకరించాలి తప్ప కులం/మతంలోని సభ్యులందరి తరపున సాధారణ ప్రకటనగా కాదు" అని దానిలో నొక్కి చెప్పారు.
ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా చిత్రనిర్మాతలు, తాము భయపడే రాజకీయ వర్గాలకు చెందిన ర్యాలీలలో చూపించే జెండాల రంగును ముందుగానే మార్చేశారని, ఒక పరిశ్రమ సంస్థ అధిపతి చెప్పారు. అలాగే ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులకు సంబంధించిన ప్రతీకాత్మక వర్ణనలను తొలగించారు. దేశంలో కోవిడ్-19కు సంబంధించిన వలసలు, ఆ సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత, నరేంద్ర మోదీ నేతృత్వంలోని చట్టాలకు వ్యతిరేకంగా నెలల తరబడి రైతుల నిరసనలు వంటి, రాజకీయంగా వివాదాస్పద అంశాల జోలికి వెళ్లడం మానేశారు.
అనేక నిర్మాణ సంస్థలు ఇప్పుడు స్క్రీన్ రైటర్‌లను, భవిష్యత్‌లో ఏదైనా జరిగితే నష్టపరిహారం ఇచ్చే ఒప్పందాలపై సంతకం చేయమని అడుగుతున్నాయి, కొందరు క్యాస్టింగ్ డైరెక్టర్‌లు నటులను తీసుకునే ముందు వారి సోషల్ మీడియా ఖాతాలను చూపించాలని కోరుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో నష్టాన్ని ఎదుర్కొంటున్నా, ప్రపంచంలోని అతిపెద్ద వీక్షకుల మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు - బయటి సినిమాలను కొనుగోలు చేసే ముందు వాటిని తమ ప్రధాన పోటీదారులైన థియేటర్లలో విడుదల చేయమని చిత్రనిర్మాతలను అడుగుతున్నాయి. దీనికి కారణం థియేటర్లలో విడుదల చేయడానికి సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ అవసరం. దాని వల్ల ప్లాట్‌ఫామ్‌ల బాధ్యత తగ్గుతుంది. థియేటర్లలో విడుదలకు అవసరమైన ఖర్చు, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు దారిలోకి వస్తారనేది వాటి అభిప్రాయం అని, దీని గురించి తెలిసిన దర్శకుడు చెప్పారు.
చాలా మంది లోపలి వ్యక్తులు, ఈ భయం చిత్రనిర్మాతలను ఇతర మార్గాలలోనూ హిందూ మితవాదులకు వ్యతిరేకంగా గళం విప్పేలా ప్రభావితం చేస్తుందని అన్నారు.
అనేక సామాజిక-రాజకీయ చిత్రాలపై పనిచేసిన దర్శకుడు ఒకరు, బీజేపీ, ఇతర మితవాద బృందాలను విమర్శిస్తూ ట్వీట్లు చేయడం పట్ల హెచ్చరికను విస్మరించినందుకు ఒక ప్రధాన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ తనను తొలగించిందని తెలిపారు.
"వాళ్ల రైటప్, వాళ్ల కథ, ఆరు నెలల జీతంతో కూడిన పని, ప్రతిదీ సిద్ధంగా ఉంది. ఆ తర్వాత వాళ్లు ఆ ప్రాజెక్ట్ నుంచి విరమించుకున్నారు," అని ఆయన చెప్పారు.
మరొక సందర్భంలో, ఒక సిరీస్‌కి దర్శకత్వం వహించమని ఆయనను సంప్రదించిన ఒక మహిళా నిర్మాత వారం తర్వాత తిరిగి వచ్చి, ఆయనకు క్షమాపణలు చెప్పి వెళ్లారు. దీనికి కారణం ఆమెతో కలిసి లావాదేవీలు నిర్వహిసున్న స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్, ఆయనతో కలిసి పని చేయడానికి నిరాకరించడం.
ప్లాట్‌ఫామ్‌లు, నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటుండడంతో, ఇప్పుడు కొన్ని చిత్రాలను నిర్మించడమే కష్టంగా ఉందని డజనుకు పైగా చిత్రనిర్మాతలు చెప్పారు.
''ముస్లిం పాత్రలు రాయడం పెద్ద సవాలుగా మారింది. వాటిని పాజిటివ్‌గా చూపించడం ఇప్పుడు కష్టం. వారిని విలన్‌గా చూపిస్తే ఫరవాలేదు,” అని ఎ-లిస్ట్ ప్రొడక్షన్ హౌస్‌లతో కలిసి పనిచేసిన ఒక వ్యక్తి చెప్పారు. “సుమారు అరడజను ఇస్లామోఫోబిక్ చిత్రాలలో” రచన చేయాలంటూ ఆయనకు ఆహ్వానాలు అందాయి.
మరో చిత్రనిర్మాత తన చిత్రానికి నిధులు సమకూర్చడానికి రెండేళ్లు కష్టపడిన తర్వాత, చివరకు మంచి నిర్మాణ సంస్థ దృష్టిని ఆకర్షించగలిగారు, "వాళ్లు నిజంగా కథను ఇష్టపడ్డారు" అని ఆమె చెప్పారు, కానీ "ముస్లిం కథానాయకుని పేరు మార్చాలి" అని వారు ఆమెతో అన్నారు. ముస్లిం కథానాయకుడి ప్రాజెక్ట్‌కు నిధులు రావడం కష్టమని వాళ్లు భయపడ్డారు.
ఇటువంటి సవాళ్లు అనేక "కనిపించని మార్గాలలో" వ్యక్తమవుతాయని, సమాజంలోని లైంగిక ప్రమాణాలను సవాలు చేసే చిత్రాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన దర్శకుడు ఒనిర్ అన్నారు.
తన ఇటీవలి అనుభవాన్ని పంచుకుంటూ ఆయన, తన నమ్మకానికి విరుద్ధమైన చిత్రాలను నిర్మిస్తే, "నా జీవితంలో నేను సంపాదించిన దానికంటే చాలా ఎక్కువ డబ్బును ఇస్తా’’మని ఆఫర్ చేసినట్లు తెలిపారు. కానీ ఆయన వాటిని తిరస్కరించారు.
సినిమారంగంలోని అనేకమంది హిందూ మితవాదులు మాట్లాడే అంశాలకు సంబంధించిన కథలకు సులభంగా అనుమతి లభిస్తుందని, వాటికి ప్రభుత్వ మద్దతు లభిస్తుందని తెలిపారు.
హిందూ, క్రిస్టియన్ మహిళలను ఇస్లాం మతంలోకి మారాలని. ఐఎస్‌ఐఎస్‌లో చేరాలని బలవంతం చేశారంటూ అతిశయోక్తులతో తీసిన ‘ది కేరళ స్టోరీ’, 80వ దశకంలో కశ్మీర్ లోయ నుంచి హిందువుల వలసలను చూపించిన ‘కశ్మీర్ ఫైల్స్’ను కొంతమంది విమర్శకులు "దురుద్దేశం"తో తీశారని భావిస్తే, ప్రధాని మోదీతో సహా బీజేపీ నాయకులు దానిని బహిరంగంగా ఆమోదించారు, మితవాద మద్దతుదారులు వాటిని ఆన్‌లైన్‌లో తీవ్రంగా ప్రచారం చేసారు, వాటికి పన్ను మినహాయింపులు ఇచ్చారు.
చిత్రం విడుదలకు కొన్ని రోజుల ముందు, కేరళ స్టోరీ నిర్మాత విపుల్ షా మీడియాతో మాట్లాడుతూ, “ఇది మన దేశంలోని మహిళలు ఎదుర్కొంటున్న ప్రమాదకరమైన రాడికలైజేషన్ ముప్పును వెల్లడిస్తుంది, భారతదేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర గురించి అవగాహన కల్పిస్తుంది." అన్నారు.
దీనిపై వ్యాఖ్యానించాలంటూ చేసిన అభ్యర్థనకు ప్రతిస్పందనగా, ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి హిందూ మితవాద వర్గం వంటివి లేవు అన్నారు. మా ప్రశ్నలు "బాలీవుడ్‌లో రెండు వర్గాలు ఉన్నాయని సూచిస్తున్నాయి" అన్నారు.
“మీ తర్కం ప్రకారం, మరొక వైపు ఇస్లామిక్ వామపక్షం ఉండాలి? అది నిజమేనా?" అని ఆయన ప్రశ్నించారు.
“మీరు చెప్పినట్లుగా, ఈ పేర్లను మీరు ఎవరితో మాట్లాడారో ఆ వ్యక్తులు ఉపయోగించారు. మరి ఇప్పుడు చాలా మంది ప్రజలు బాలీవుడ్‌ను- ఉర్దూవుడ్ అని పిలుస్తారు, మీరు దానిని ప్రచురిస్తారా? చాలామంది దీనిని దావూద్‌వుడ్ అని కూడా పిలుస్తారు, దానినీ ప్రచురించండి. చాలా మంది ప్రజలు ఇస్లామిక్ వామపక్షవాదులు అని పిలుస్తారు, దానినీ ప్రచురించండి.’’
తరచుగా భారతీయ సంస్కృతిపై బాలీవుడ్ "అవినీతి ప్రభావం" చూపుతుందని భావించే హిందూ మితవాద వర్గం, "ఇప్పుడు ఆ ప్రభావాన్ని తమ స్వంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి చురుకుగా ప్రయత్నిస్తున్నాయి" అని పరిశ్రమ లాబీయింగ్‌కు నాయకత్వం వహించే ఒక ప్రొడక్షన్ సంస్థ అధిపతి చెప్పారు.

ఫొటో సోర్స్, facebook/Vivekagnihotri
ఇటీవల చిత్రాలలో ఉండాల్సిన విషయాలను సూచించడానికి హిందూ మితవాద సంస్థలు, ప్రభుత్వాలు రెండూ ప్రసారసంస్థలు, నిర్మాతలు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు, ప్రొడక్షన్ సంస్థల ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదిస్తున్నారని ఆయనతో పాటు పరిశ్రమలలోని అనేక మంది లోపలి వ్యక్తులు తెలిపారు.
వారికి సూచించిన అంశాలలో మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే జీవిత చరిత్రా ఉంది. బాలీవుడ్ నిర్లక్ష్యం చేస్తున్న ఇలాంటి నాయకుల చిత్రానికి అవసరమైన కంటెంట్‌ను అందజేస్తామని ఆ మితవాద సంస్థలు వాగ్దానం చేశాయి. దానితో పాటు ప్రభుత్వ ప్రధాన ప్రాజెక్టులు, విజయాలపై చిత్రాలు తీయాలనీ అభ్యర్థనలు అందాయి.
బాలీవుడ్‌లోని ప్రముఖులను తరచుగా కలుస్తుంటారనే పేరు ఉన్న ఇద్దరు ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులను బీబీసీ సంప్రదించగా, వారు వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.
దిల్లీలోని ఆర్‌ఎస్‌ఎస్ సంస్థ మీడియా యూనిట్‌కి చెందిన ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ, ఆర్‌ఎస్‌ఎస్ చిత్ర పరిశ్రమకు చెందిన వారితో నిరంతరం చర్చిస్తూ ఉంటుందని, అయితే అది నిర్దిష్ట అంశాలను లేదా చిత్రాలను నిర్ణయించదని చెప్పారు.
“మేము నిర్ధిష్ట అంశాలపై మాట్లాడము. సినిమాలు సమాజ ఆసక్తిని ప్రతిబింబించేలా ఉండాలనేదే మా ఏకైక అభ్యర్థన’’ అన్నారు. చిత్రనిర్మాతలు చేస్తున్న వాదనలను ప్రస్తావిస్తూ, “ఇవి ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేక కథనాలు. ఆర్‌ఎస్‌ఎస్ చలనచిత్ర నిర్మాతలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించలేదు, అలాంటి కోరికా లేదు,” అన్నారు.
కానీ బాలీవుడ్‌లో చాలామంది దీనికి ఒప్పుకోరు.
మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే దర్శకుడు అవినాష్ దాస్, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని పాత్రలతో కశ్మీర్‌పై సినిమా తీయడానికి 2023లో సీనియర్ కేంద్ర మంత్రి వద్ద పని చేసే అధికారి తనను సంప్రదించారని పేర్కొన్నారు.
బీజేపీ ప్రభుత్వం ఇటీవల భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసింది, ఈ నిబంధన భారత-పరిపాలనా ప్రాంతానికి పరిమిత స్వయంప్రతిపత్తిని అనుమతించేది. 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాదం ఎలా అంతరించిందో చూపించడమే ఈ సినిమా సంక్షిప్త కథనం అని దాస్ తెలిపారు.
"వాళ్లు దానిని ఎన్నికలకు ముందు విడుదల చేయాలనుకున్నారు, అంటే వారికి నిర్దిష్ట ఉద్దేశాలు ఉన్నాయి," అని దాస్ బీబీసీకి చెప్పారు. ఇది "ప్రచార చిత్రం" కావడంతో తాను నిరాకరించానని అన్నారు.
ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమ, అధికార పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా అనేక సినిమాలను నిర్మించిందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
అయితే చాలామంది పరిశ్రమ లోపలి వ్యక్తులు తమపై ఒత్తిడి ఉందన్న మాటలతో విభేదిస్తూ, దానికి ఉదాహరణగా 2023 బ్లాక్‌బస్టర్ జవాన్ వంటి చిత్రాలను చూపిస్తున్నారు. దీనిలో షారుక్ ఖాన్ రాజకీయ నాయకులపై పోరాడతారు, దీనిలో నిజ జీవితంలోని రాజకీయ సంఘటనలకు పోలికలు కనిపిస్తాయని వారు అంటున్నారు.
"ఇదంతా మీరు కథను ఎలా చెబుతారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది" అని పెద్ద ప్రాజెక్ట్‌లలో అనేక మంది చిత్రనిర్మాతలు, ప్లాట్‌ఫామ్‌లతో కలిసి పనిచేసిన నిర్మాణ సంస్థ అధిపతి అన్నారు.
16వ శతాబ్దపు ఇటాలియన్ పునరుజ్జీవనోద్యమ చిత్రకారుడు మైఖెలాంజిలోను ప్రస్తావిస్తూ, ఆ సంస్థ అధిపతి, “ఆయన పోప్ డేగ కళ్ల క్రింద పని చేసేవాడు. అయినప్పటికీ మైఖెలాంజిలో సంప్రదాయానికి భిన్నమైన గొప్ప కళను సృష్టించాడు,’’ అన్నారు.
చాలా మంది చిత్రనిర్మాతలు ఇరానియన్ సినిమాను అనుకరించాలని సూచిస్తారు, అక్కడ చిత్రనిర్మాతలు లోతైన రాజకీయ, సామాజిక అంశాలను చర్చించడానికి సున్నితమైన మార్గాలను కనుగొన్నారు.
కానీ "సున్నితమైన" మార్గాలలో ప్రయత్నించిన వాళ్లూ తరచుగా కష్టాలను ఎదుర్కొన్నారు.
ఉదాహరణకు, ఇటీవల ఒక పెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్, కుల వివక్ష, ముస్లిం యువకులు హిందూ యువతులను పెళ్లి పేరుతో మోసగించి వారిని ఇస్లాం మతంలోకి మారుస్తున్నారనే "లవ్ జిహాద్" ఆరోపణలను లేవనెత్తే సిరీస్‌ను విడుదల చేయడానికి ఇష్టపడలేదు.
కానీ ప్రొడక్షన్ హౌస్ వెనక్కి తగ్గలేదు. ఆ ప్లాట్‌ఫామ్ కాకపోతే, తాము వేరే ప్లాట్‌ఫామ్‌ను సంప్రదిస్తాము అని స్పష్టం చేసిందని, ఈ విషయం గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు చెప్పారు.
పరిశ్రమలో ప్రముఖుల నుంచి దీనికి మద్దతు లభించడంతో, ఈ ప్లాట్‌ఫామ్ దీనికి అంగీకరించాల్సి వచ్చింది, అయితే కొన్ని మార్పులు చేయాలని కోరింది.
“ఉదాహరణకు, సినిమాలో: “హిందూ కి బేటీ హిందూ రహేగీ. లోగో కి సాజిష్ నహీ చలేగి’’. (హిందువు కుమార్తె హిందువుగానే ఉంటుంది. వాళ్ల కుట్రలు ఫలించవు) అనే మాటలు ఉన్నాయి. ‘‘కానీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఒత్తిడితో, వాళ్లు దానిని మార్చవలసి వచ్చింది,” అని ఈ సినిమా నిర్మాణంలో పాల్గొన్న ఒక వ్యక్తి గుర్తు చేసుకున్నారు.
అయితే బెనర్జీ విషయంలో, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌కు మొదటి నుంచి సినిమా రాజకీయ స్వభావం గురించి తెలుసు. తను దీని గురించి ముందుగానే హెచ్చరించానని, కొన్ని మార్పులు కూడా సూచించానని ఆయన తెలిపారు.
అయితే "మీరు ధైర్యంగా పనిచేయండి. మీ సృజనాత్మకతను అడ్డుకోవద్దు,” అని వాళ్లు ఆయనకు అభయం ఇచ్చారు.
కానీ ఆయన సినిమాను సమర్పించే నాటికి పరిస్థితులు మారిపోయాయి.
నెట్‌ఫ్లిక్స్ కొత్త బయ్యర్‌లను వెతుక్కోమని బెనర్జీకి చెప్పింది. కానీ ఆయన ఇంకా వేరొక దాని కోసం వెదుకుతూనే ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- పవన్ కల్యాణ్: ‘డిప్యూటీ సీఎం’ అని ఎందుకు ప్రమాణం చేయలేదు, ఈ పదవి గురించి రాజ్యాంగంలో ఏముంది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














