కల్కి 2898 ఏడీ ఓటీటీలోకి వచ్చేసింది.. ప్రభాస్, అమితాబ్ నటన ఎలా ఉందంటే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శృంగవరపు రచన
- హోదా, బీబీసీ కోసం
ప్రభాస్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ నటుల కాంబినేషన్‌తో తెరకెక్కిన సినిమా కల్కి 2898 ఏడీ 2024 జూన్‌లో విడుదలైంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురువారం(22.08.2024) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైంది.
ఈ నేపథ్యంలో జూన్‌లో ప్రచురితమైన ‘కల్కి 2898 ఏడీ’ రివ్యూ మరోసారి పాఠకుల కోసం..


ఫొటో సోర్స్, X/Kalki2898AD
ద్వాపర యుగాంతంలో మొదలై..
ద్వాపర యుగాంతంతో మొదలైన కథ నుంచి భవిష్యత్తులో ఏర్పడే డిస్టోపియన్ సొసైటీ కేంద్రంగా తీసిన సినిమా ఇది.
కల్కి అవతారానికి ముందు జరిగే కథ ఇది. ఇందులో పాత్రలు భవిష్యత్తులోనివే అయినా, మహాభారతంలోని అశ్వత్థామ పాత్రను ఈ కాలంలో చిత్రించడం కత్తి మీద సామే.
అయినా, కాలానికి చెందిన గందరగోళం ఆ పాత్రలో ఎక్కడా లేకుండా దర్శకుడు ఆ పాత్ర చిత్రణలో ఎంత జాగ్రత్త తీసుకున్నారో అనేక సన్నివేశాల్లో కనిపిస్తుంది.
ఇక భవిష్యత్తు కథకు వస్తే కొంత హాలీవుడ్ ఛాయలు ఉన్న కథ ఇది.
ఇప్పటికే ఈ అంశంతో అనేక కథలు అంతర్జాతీయంగా వచ్చినా మహా భారత నేపథ్యం తీసుకోవడంతో ఇందులో భారతీయత కనిపించి కథ రక్తి కట్టింది.
శంభల, కాశీ, కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలకు చెందిన కథ ఇది. ఈ మూడు ప్రాంతాలు సోషల్ ఆర్డర్ తప్పడం వల్ల ఏర్పడిన విభిన్న సమాజాలు.
దాదాపు కథ అంతా కాశీ ప్రాంతంలోనే సాగుతుంది. పేదరికం, ఆకలి తీవ్రంగా ఉంటూ కనీస వసతులు లేని సమాజం ఇది.
కాంప్లెక్స్ దీనికి విరుద్ధం. మిలియన్ల యూనిట్స్ ఉంటే ఎవరైనా ఈ కాంప్లెక్స్‌కు వెళ్లొచ్చు. ఇక్కడ రెండు రకాల మనుషులు ఈ కథలో మనకు కనిపిస్తారు. తప్పు, ఒప్పులతో సంబంధం లేకుండా ఎలాగోలా కాంప్లెక్స్‌కు వెళ్తే చాలనుకునేవారు. వీరు కాశీ ప్రాంతంలో కనిపిస్తారు.
ఈ పరిస్థితులు మార్చడానికి దేవుడు (కల్కి) పుడతాడని, ఆయన ఏ తల్లి కడుపులో జన్మిస్తాడో అని ఆమె కోసం ఎదురు చూసేవారు. వీరు శంభలలో ఉంటారు. వీరే రెబల్స్.
కాంప్లెక్స్ ఈ ప్రపంచాన్ని ఏలడానికి పన్నే పన్నాగాలు ఒక వైపు, ఈ పరిస్థితి మారడం కోసం దేవుడి పుట్టుక కోసం చూసే సందర్భం ఇంకో వైపు. ఈ రెండింటి మధ్య జరిగే యుద్ధమే ఈ కథ.
అమితాబ్, కమల్
యుగాల దూరంలో ఉన్న ఈ అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ చాలా గొప్పగా ఇమిడిపోయారు.
ఈ పాత్ర అప్పటి నుండి బతికే ఉన్నా, ఈ భవిష్యత్తు కాలంలోకి హఠాత్తుగా ప్రవేశించడం వల్ల, నాటి పాత్రగా ఉంటూనే, ఈ కాలంలో తన విధిని నిర్వహించాలి.
అమితాబ్ పాత్ర ఎక్కువగా సెకండ్ హాఫ్‌లో ఉన్నా ఆయన స్క్రీన్ స్పేస్‌లో ప్రేక్షకులు ఆయనతో పాటే అక్కడికి వెళ్లిపోతున్న భావన కలిగించేంతగా నటించారు.
భైరవ పాత్రలో ప్రభాస్ కాంప్లెక్స్‌కు వెళ్లాలనే ఆశయంతో ఉంటాడు.ఈ పాత్రకు ఉన్న హీరోయిక్ ఎలిమెంట్స్ మాత్రం కథకు బలంగా మారలేదు.
బాధ, దుఃఖం ఉన్న కథలో కామెడీ అన్నది కొంత ఆ పాత్రకు నప్పలేదు.
యాక్షన్ సీక్వెన్స్‌లలో మాత్రం ప్రభాస్ నటన కళ్లు తిప్పుకోలేనట్లుగా ఉంది. ఈ పాత్రకు విడిగా కన్నా కూడా అశ్వత్థామ పాత్రతో ఉండే కాంబినేషన్ సన్నివేశాల్లో నటనకు స్కోప్ ఉండటం వల్ల, విడిగా చూసినప్పుడు ఈ పాత్ర ఎమోషన్స్‌ను బలంగా చిత్రీకరించలేదనే అనిపిస్తుంది.
అది పక్కన పెడితే ప్రభాస్ తన స్టయిల్ మానరిజంతో , డైలాగ్స్ తో మెప్పించాడు. బ్రహ్మానందానికి ఉన్న కామెడీ మానరిజం బలంగా కనిపించే సినిమా ఇది.
దీపికా పదుకొణె పాత్ర కథకు ఆత్మను పరిచయం చేసే పాత్ర. ఈ పాత్రలో ఆ ఎమోషనల్ స్పేస్ ప్రేక్షకులకు కలిగేలా చేయడంలో విజయం సాధించారు.
కమల్ హాసన్ ఇందులో విలన్ పాత్రలో కనిపిస్తారు. చూడగానే కాస్త భయంగొలిపేలా కనిపించే పాత్ర ఇది. పాత్ర పరిధి తక్కువే అయినా కమల్ తన స్థాయిలో నటించారు.
ప్రముఖ దర్శకులు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి పాత్రలు ఈ సినిమా కథకు బలం కాకపోయినా కమర్షియల్ ఆకర్షణగా మాత్రం నిలిచాయి.
భారీ బడ్జెట్ అంచనాలకు తగ్గట్టు ఉందా?
భారీ బడ్జెట్ తో పాటు భారీ అంచనాలను కూడా పెంచిన సినిమా ఇది.
ఆ బడ్జెట్ కు తగ్గ స్థాయిని ప్రేక్షకులు తప్పక ఆశిస్తారు.
ఆ అంచనాలను అందుకుందా అంటే మాత్రం కొన్ని చోట్ల కల్కి చతికిలపడిందనే చెప్పాలి.
సినిమాలో భావోద్వేగాలను గొప్పగా చెప్పేవి కలర్స్. బాధ, దుఃఖం లాంటి వాటికి కొంత డార్క్ బ్యాక్ కలర్స్ వాడితే; సంతోషం లాంటి మూమెంట్స్‌కు బ్రైట్ కలర్స్ వాడటం సాధారణంగా జరిగేదే.
ఈ సినిమాలో ఈ రెండింటి కాంబినేషన్ ఉంది. పాత్రల ఫీలింగ్స్ ను కథ ద్వారా దర్శకుడు ప్రేక్షకుడు ఎటువంటి ఎమోషన్ కు గురి కావాలని అన్నది ఎక్కువ శాతం ఈ కలర్ థియరీ మీదే ఆధారపడి ఉంటుంది.
ఈ సినిమాలో ‘మోనోటోనస్ కలర్ స్కీమ్’ వాడిన భావన కలుగుతుంది . కాంప్లెక్స్‌లో ఉన్న బ్రైట్ కలర్స్ ఆ బ్యాక్ గ్రౌండ్ ఎఫెక్ట్‌ను అంతగా ఉండేలా చేయలేకపోయాయి.
కెమెరా మ్యాజిక్ కొన్ని సార్లు తప్పడం వల్ల పాత్రల ఎమోషన్స్ సరిగ్గా పండలేదు.
వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్స్ కూడా కథను పరిచయం చేసే ఫస్ట్ హాఫ్ లో మామూలుగా ఉన్నాయి తప్ప గొప్పగా లేవు.
సెకండ్ హాఫ్ లో మాత్రం ఈ ఫిల్మ్ టోన్ మారిపోతుంది. అద్భుతమైన విజువల్ ఫీస్ట్ ఫీలింగ్ కలుగుతుంది. పూర్తి స్థాయిలో కాకపోయినా ఓ మేరకు అంచనాలను అందుకున్న సినిమా ఇది.
పాటలు ప్లస్సా? మైనస్సా?
మహాభారత నేపథ్యం కొంత ఫిక్షన్ కలిసిన ఈ కథలోని పాటలు చాలా సాధారణంగా మామూలు మనుషుల కథ చెప్పేలా ఉన్నాయే తప్ప.. భిన్న కాలంలో జరిగిన కథకు తగ్గట్టుగా అనిపించలేదు.
ఈ సినిమాకు పాటలు ఏమంత ప్లస్ పాయింట్ కాలేదు.
మహాభారతాన్ని కేంద్రంగా తీసుకున్న కథలో ఆ కాలపు దేవుళ్ల లోకాన్ని సృష్టించకుండా, ఆ పాత్రలను మానవులను పోలి ఉంటూ, ఆ పాత్రల ఆత్మ కోల్పోకుండా పాత్ర చిత్రీకరణ చేయడం సులభం కాదు.
అశ్వత్థామ పాత్రను అంత బలంగా చిత్రీకరించడం వల్లే ఈ పాత్ర ముందు ఈ సినిమాకు నాయకుడు అయిన భైరవ పాత్ర కూడా కొన్ని సన్నివేశాల్లో తేలిపోయినట్టు ఉంటుంది.
ఈ కథకు బలం కూడా అదే. ఇతిహాసానికి,నిజానికి మధ్య ఉండే నమ్మకం కలిగించే కథగా ఈ సినిమా గొప్ప విజయం సాధించినట్టే. కానీ అంత గొప్ప కథకు కలర్ థియరీ తగిన స్థాయిలో లేదు.
అంతర్జాతీయ స్థాయికి ముఖ్య ప్రమాణాలు అయినా విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలో అనేక సార్లు తేలిపోయాయి.
అలాగే హీరో పాత్ర ఇంకాస్త బలంగా చిత్రించి ఉంటే బావుండేది అనిపిస్తుంది.
ఫిల్మ్ టోన్ దాదాపు సగం సినిమా వరకు ఊహించిన స్థాయిలో లేదు.
ఆరంభం నుంచి హైప్ కొనసాగనప్పటికీ ఆ తరువాత పుంజుకొని సినిమా ముగింపు వచ్చేసరికి ఉత్కంఠ కలిగిస్తూ హైప్‌కు తగిన అంచనాలను చేరుకుని చూడాల్సిన సినిమా అనిపించింది.
(అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)















