అనకాపల్లి జిల్లాలో ముగ్గురు ఆదివాసీ విద్యార్థుల మరణానికి కారణమేంటి?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో అస్వస్థతకు గురై ముగ్గురు విద్యార్థులు మరణించారు. ఈ ముగ్గురూ కోటవురట్ల మండలం, కైలాసపట్నం గ్రామంలోని ఒక క్రిస్టియన్ ట్రస్ట్ హాస్టల్ విద్యార్థులు.
‘‘కొందరు దాతలు బిర్యానీ, సమోసాలు, చాక్లెట్లు పిల్లల కోసం ఇచ్చారు. వాటిని తిన్న 74 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు’’ అని అక్కడి అధికారులు తెలిపారు.
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలోని కైలాసపట్నం గ్రామంలో ‘పాష’ (పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన మందిరం) పేరుతో ఒక హాస్టల్ ఉంది.
అదొక రేకుల షెడ్డు, అక్కడ సరైన వసతులు కూడా లేవు. నిర్వాహకులు చెబుతున్న దాని ప్రకారం ఇందులో 92 మంది విద్యార్థులు ఉంటున్నారు.
ఈ హాస్టల్‌లో స్థానిక పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే ఆదివాసీ విద్యార్థులు ఉంటున్నారు.
వీరంతా నర్సీపట్నం ఎగువన ఉండే ఏజెన్సీ ప్రాంతాలైన కొయ్యూరు, లంబసింగి, చింతపల్లి, కేడిపేట తదితర ప్రాంతాలకు చెందినవారు.
స్థానికంగా ఏవైనా పండుగలు, శుభకార్యాలు, పుట్టిన రోజులు, ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు దాతలు ఈ హాస్టల్‌కు ఆహారాన్ని ఇస్తుంటారని హాస్టల్ నిర్వాహకుడు కిరణ్ కుమార్ బీబీసీతో చెప్పారు.

ఆ రోజు ఏం జరిగింది?
కొందరు దాతలు హాస్టల్‌కు శనివారం (ఆగస్టు 17) రాత్రి బిర్యానీ, సమోసాలు, చాకెట్లు పంపించారని కిరణ్ కుమార్ తెలిపారు.
‘‘హాస్టల్‌లో పిల్లలు ఆ ఆహారం తిన్నారు. అందులో జాషువా అనే విద్యార్థి తొలుత అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా విద్యార్థులు వాంతులు, కడుపు మంటతో బాధపడ్డారు’’ అని కిరణ్ కుమార్ భార్య రమ చెప్పారు.
ఈ హాస్టల్లో మొత్తం 92 మంది ఉండగా వారిలో 74 మంది అస్వస్థతకు గురయ్యారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రిలో చేర్చకుండా హాస్టల్ నిర్వాహకులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి పిల్లలను తీసుకుని వెళ్లాల్సిందిగా సూచించారు.
దీంతో ఆదివారం ఉదయం తల్లిదండ్రులు వచ్చి వారి పిల్లల్ని స్వగ్రామాలకు తీసుకుని వెళ్లిపోయారు. అలా వెళ్లిన వారిలో జాషువా, భవాని, శారద అనే ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. వీరంతా పదేళ్లలోపు పిల్లలే.
మిగతా వారు కూడా అనారోగ్యానికి గురయ్యారు. వారిలో నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో 17 మందిని, అనకాపల్లిలో 5, విశాఖ కేజీహెచ్‌లో 16, పాడేరులో 36 మందిని చేర్చినట్లు అనకాపల్లి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి ఎంఎస్వీకే బాలాజీ చెప్పారు.
బాధితుల్లో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, వారికి మెరుగైన సేవలు అందించేందుకు నగరంలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు.
ఈ ముగ్గురిలో జాహ్నవి అనే ఏడేళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉందని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద బీబీసీతో చెప్పారు.
“నాకు చదువు లేదు, నా కూతురైనా బాగా చదువుకుంటుందని హాస్టల్‌కు పంపించాను. నాలుగో తరగతి చదువుతోంది. చదువు, తిండి, బట్టలు, వసతి అన్నీ చూసుకుంటారని పంపిస్తే శవాన్ని అప్పగించారు” అని చనిపోయిన 9 ఏళ్ల గెమ్మిలి భవాని తండ్రి సత్యారావు అన్నారు.

మిగిలిపోయిన ఆహారం ఇచ్చారు: ఫుడ్ ఇన్‌స్పెక్టర్
చింతపల్లి మండలం నిమ్మలపాలేనికి చెందిన జాషువా, జంగచెట్లు గ్రామానికి చెందిన శారద, కొయ్యూరు మండలం రేళ్లపాలేనికి చెందిన భవాని హాస్టల్‌లో ఆహారం తిని అస్వస్థతకు గురై ఆదివారం మరణించారు.
వీరు ముగ్గురు హాస్టల్‌లో సమోసాలు, బిర్యాని తిన్న తర్వాతే అస్వస్థతకు గురైనట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని అనకాపల్లి జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రవి కుమార్ బీబీసీతో చెప్పారు.
“ఈ హాస్టల్ విద్యార్థులు తిన్న ఆహారాన్ని పోలీసులు ల్యాబ్‌కు పంపించారు. దాని ఫలితాలు వచ్చిన తర్వాత మరణాలకు కారణాలు తెలుస్తాయి. ఇక్కడ హాస్టల్ నిర్వాహకులు చెప్పిన దాని ప్రకారం దాతలు ఇచ్చినది మిగిలిపోయిన ఆహారమేనని తేలింది” అని రవి కుమార్ తెలిపారు.
ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని, హాస్టల్‌లో సరైన ఆహారం వీరికి అందడం లేదని వైద్యులు అనుమానాలు వ్యక్తం చేశారని రవికుమార్ చెప్పారు.
పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయి ఉండొచ్చని రవికుమార్ అన్నారు.

అందరూ ఆదివాసీలే
మైదాన ప్రాంతమైన కోటవురట్లలో ఉన్న ‘పాష’ హాస్టల్ లో అంతా ఆదివాసీలే ఉన్నారు.
తూర్పు కనుమల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎక్కువ మంది ఆదివాసీలే ఉంటారు. వీరిలో ఎక్కువ మంది పేదరికం అనుభవిస్తున్న వారే. ఆదివాసీ ప్రాంతంలో ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్నప్పటికీ చాలామంది మైదాన ప్రాంతాల్లోని పాఠశాలల్లో చదువుకుంటూ హాస్టల్స్‌లో ఉంటున్నారు.
“ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులు విధులకు హాజరు కావడం తక్కువ. ఎవరైనా వలంటీర్లే పాఠాలు చెప్తుంటారు. స్కూల్ పరిసరాలు కూడా బాగుండవు. ఈ కారణాలన్నీ చూపించి మంచి విద్య, ఇతర సౌకర్యాలను అందిస్తామని చెప్పి కొన్ని మత ప్రచార సంస్థలు వారిని తమ వైపు తిప్పుకుంటున్నాయి. ఇందులో భాగమే ఇటువంటి హాస్టల్స్ నిర్వహణ కూడా” అని గిరిజన సంఘం నాయకుడు కె. గోవిందరావు ఆరోపించారు.
కొయ్యూరు మండలం, రేళ్లపాలేనికి చెందిన 16 మంది విద్యార్థులు ఈ విధంగానే పాష హాస్టల్‌లో ప్రవేశం పొందారు.
‘‘గతంలో నేను ఏజెన్సీ ఏరియాలో పాస్టర్‌గా పని చేశా. ఆ పరిచయాలతోనే ఆదివాసీలు తమ పిల్లలను మా హాస్టల్‌లో ఉంచారు’’ అని కిరణ్ కుమార్ బీబీసీతో చెప్పారు.

అనుమతులు లేవు
‘పాష’ హాస్టల్‌కు ప్రభుత్వపరంగా ఎటువంటి అనుమతులు తీసుకోలేదని కిరణ్ కుమార్ అంగీకరించారు. దీనిని ఒకసారి హాస్టల్ అని, మరోసారి అనాథాశ్రమం అని ఆయన అంటున్నారు.
‘‘13 ఏళ్లుగా ఈ హస్టల్‌ను నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదు. 2019లో స్థానిక క్రిస్టియన్ చర్చిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం’’ అని రమ బీబీసీతో చెప్పారు.
హాస్టల్ నిర్వహకుడు కిరణ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.
“అనాథాశ్రమమైనా, హాస్టలైనా ప్రారంభించాలంటే ముందుగా జిల్లా ప్రొహిబిషన్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తులో హాస్టలా, అనాథ ఆశ్రమమా అనేది స్పష్టంగా రాయాలి. ఆ తర్వాత వారు సమర్పించిన వివరాలు ఆధారంగా (భవనం, భూమి, వసతి సౌకర్యాలు, సిబ్బంది) రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. ఇదంతా కూడా జిల్లా సాంఘిక సంక్షేమ కార్యాలయం ద్వారా జరుగుతుంది” అని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సభ్యుడైన గుండు సీతారాం చెప్పారు.
హాస్టల్ నిర్వహకుడిపై కేసు : హోం మంత్రి
ముగ్గురు బాలల ప్రాణాలు పోవడానికి కారణమైన కైలాసపట్నం అనాథ ఆశ్రమాన్ని కోటవురట్ల డిప్యూటీ తహసిల్దార్ జగదీష్ ఆధ్వర్యంలో అధికారులు సీజ్ చేశారు.
హోంమంత్రి అనిత ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
“మృతి చెందిన పిల్లల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాం. బయట ఫంక్షన్ నుంచి వచ్చిన పుడ్ తిని అస్వస్థతకు గురయ్యారు. అసలు ఫుడ్ ఎవరు పంపారు? బిర్యాని, సమోసాలు ఎవరు తెచ్చారు? అనే దానిపై విచారణ చేస్తున్నాం. ఈ హాస్టల్ నిర్వహణపైనా దర్యాప్తు జరుపుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి హాస్టల్స్ ఎక్కడ ఉన్నా వాటిని వెంటనే మూసివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం” అని మంత్రి చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














