విశాఖపట్నం: ఎర్రమట్టి దిబ్బలు కనుమరుగవుతున్నాయా, పర్యావరణ వేత్తల ఆందోళన ఏంటి?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
కొన్నేళ్ల కిందట విశాఖ-భీమిలి బీచ్ రోడ్‌లో వెళుతుంటే భీమిలి సమీపిస్తుందనగా ఎడమ వైపు ఎర్రని మట్టి దిబ్బలు స్పష్టంగా కనిపిస్తుండేవి.
ఇప్పుడు అటువైపు వెళ్తుంటే ఎర్రదిబ్బలు కనిపించడం లేదు. వాటిని చూడాలంటే లోపలికు కొంత దూరం వెళ్లాలి.
విశాఖపట్నంలో ఉంటూ తరచూ ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉండే నాలాంటి వాళ్లకు ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అందులోనూ గతంతో పోలిస్తే తక్కువ విస్తీర్ణంలోనే ఇవి కనిపిస్తున్నాయి.
ఎర్రమట్టి దిబ్బల కోసం కొత్తగా వచ్చే పర్యాటకులు రోడ్డుకు ఒకవైపు చూసుకుంటూ భీమిలి వరకు వెళ్లిపోతున్నారు. అక్కడికి వెళ్లిన తరువాత ఎర్రమట్టి దిబ్బలు ఎక్కడని స్థానికులను అడుగుతున్నారు.
ఎర్రమట్టి దిబ్బలు కనుమరుగవుతున్నాయనే పర్యావరణవేత్తల ఆందోళనకు ఇదొక ఉదాహరణ.
ప్రకృతి విధ్వంసాలతో పాటు వివిధ కారణాలతో ఎర్రమట్టి దిబ్బల విస్తీర్ణం తగ్గిందనేది వాస్తవం. గత 20 ఏళ్లుగా ఎర్రమట్టి దిబ్బలను గమనిస్తున్న వారేవరైనా ఇది చెప్పగలరు.


ఒకప్పుడు షూటింగ్‌లకు కేరాఫ్
1980, 1990లలో ఎర్రమట్టి దిబ్బలు సినిమా షూటింగులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవి.
క్రమంగా మట్టిదిబ్బలు తరిగిపోతుండటంతో షూటింగులకు కావలసిన పరిస్థితులు ఇక్కడ లేకుండా పోయాయి. ఇప్పుడు సినిమా వాళ్లు ఇటువైపు రావడం లేదు.
ఎర్రమట్టి దిబ్బలకు సంరక్షణ లేకపోవడంతో ఇంటి నిర్మాణాలతో పాటు ఇతర అవసరాలకు కూడా ఈ మట్టిని తవ్వుకుపోతున్నారు.
అలా కొంత ఎర్రమట్టి దిబ్బలు కనిపించకుండా పోగా...పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో ఉన్న దిబ్బలు కూడా సరిగా కనిపించడం లేదు.
దీంతో అసలు ఎర్రమట్టి దిబ్బలు ఇక్కడున్నాయా అన్న పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఎర్రమట్టి దిబ్బల వద్ద ఏం జరుగుతోంది?
భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలను ఆనుకుని ఉన్న38 ఎకరాల భూముల్లో గతేడాది జూన్‌లో మట్టిని తరలించడంతో పర్యావరణవేత్తలు ఆందోళనలు చేశారు.
ఆ సమయంలో సమీప గ్రామాల రైతుల నుంచి విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూ సమీకరణ చేసి ఎర్రమట్టి దిబ్బల వద్ద అభివృద్ధి పనులు చేపట్టింది.
జులై మూడో వారంలో భీమునిపట్నం ఎయిడెడ్ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ పేరుతో ఎర్రమట్టిని తొలగిస్తూ చదును చేస్తుండటంతో మళ్లీ అలజడి మొదలైంది.
“మా సోసైటీకి కేటాయించిన భూములలోనే పనులు చేస్తున్నాం” అని భీమునిపట్నం ఎయిడెడ్ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడు హరిగోపాల్ చెప్పారు.

పర్యావరణవేత్తల ఆందోళనతో సొసైటీకి కేటాయించిన 242 ఎకరాల్లో పనులు వెంటనే నిలిపివేయాలంటూ ఇటీవల జీవీఎంసీ స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చింది. దీంతో అక్కడ పనులు నిలిపివేశారు.
ఆ ప్రాంతానికి బీబీసీ వెళ్లినప్పుడు పనులు జరగడం లేదని సొసైటీ సభ్యులు చెప్పారు.
ఈ సొసైటీ 1982లో స్థలం కోరగా 373.95 ఎకరాలు కేటాయించారు.
తర్వాత జియోలాజికల్ సర్వే చేసి బిల్డింగ్ సొసైటీకి ఇచ్చిన భూముల్లో 91.50 ఎకరాలు జియోహెరిటేజ్‌గా గుర్తించి ఆ స్థలాన్ని వెనక్కి తీసుకున్నారు.
వారసత్వ సంపద కాబట్టి ఇక్కడ తవ్వకాలు జరిపితే ఎర్రమట్టి దిబ్బలకు హాని జరుగుతుందని పర్యావరణవేత్త, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన డాక్టర్ రాజేంద్రసింగ్ అన్నారు.
ఆయన ఇటీవలే ఎర్రమట్టి దిబ్బలలో పర్యటించారు.

అవన్ని ఎర్రమట్టి దిబ్బల్లో భాగమే: పర్యావరణవేత్తలు
‘‘ఎర్రమట్టి దిబ్బలు సుమారు 12 వందల ఎకరాల్లో విస్తరించి ఉండగా, వీటిలో 262 ఎకరాలను జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించింది. అయినా కూడా ఆ ప్రాంతంలో ఎటువంటి రక్షణ కనిపించదు’’ అని పర్యావరణవేత్త, రాజకీయ నాయకుడు, జల్‌బిరదారి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ బీబీసీతో అన్నారు.
‘‘పురావస్తు, పర్యాటక శాఖల అధికారులు రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ఎర్రమట్టి దిబ్బలు క్రమంగా కనుమరుగయ్యే ప్రమాదంలో పడ్డాయి. ఎర్రమట్టి దిబ్బలకు ఒకవైపు ఐఎన్‌ఎస్ కళింగ, ఇంకోవైపు హౌసింగ్ సొసైటీ స్థలాలు, మరోవైపు సముద్రాన్ని అనుకుని ఉన్న రోడ్డు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్ని కూడా ఎర్రమట్టి దిబ్బల్లో భాగంగానే చూస్తున్నాం’’ అని సత్యనారాయణ తెలిపారు.
ఎర్రమట్టి దిబ్బల సమీపంలో ఎటువంటి నిర్మాణాలు జరిగినా కచ్చితంగా వాటికి ప్రమాదంగానే పరిగణించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
అయితే ఎర్రమట్టి దిబ్బలను సంరక్షిస్తున్నామని తహశీల్దార్ కార్యాలయం బీబీసీకి తెలిపింది.
‘‘ఆ ప్రాంతంలో 262 ఎకరాలను జియో హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు. దీనికి కనీసం 50 మీటర్ల మేర బఫర్ జోన్‌గా విడిచి పెట్టి, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అక్కడున్న భూములన్ని ఎర్రగా ఉండటంతో ఎవరు ఏ పనులు చేపట్టినా ఎర్రమట్టి దిబ్బలను తొలగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.’’ అని తహశీల్దార్ కార్యాలయం వెల్లడించింది.

కాపాడాలంటే ఏం చేయాలి?
ఎర్రమట్టి దిబ్బలను కాపాడటానికి ఏం చేయాలో రాజేంద్రసింగ్, ఏయూ జియాలజీ విభాగం ప్రొఫెసర్ ఎ. యుగంధర్ రావు కొన్ని సూచనలు చేశారు.
శాటిలైట్ సర్వే జరిపి ఎర్రమట్టి దిబ్బలను కచ్చితంగా గుర్తించి దాని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. రక్షణగా మొక్కలను నాటాలి.
ఎర్రమట్టి దిబ్బల పరిధిని తెలిపేలా మార్కింగ్ చేయాలి. అక్కడక్కడ వాచ్‌మెన్‌ను పెట్టి మానిటరింగ్ చేస్తూ ఉండాలి.
ఎర్రమట్టి దిబ్బలను చూడటానికి వచ్చే టూరిస్టులను క్వాలిఫైడ్ గైడ్లు మాత్రమే లోపలికు తీసుకుని వెళ్లే విధంగా చూడాలి.
ఎర్రమట్టి దిబ్బల ప్రాధాన్యత, భవిష్యత్ తరాలకి తెలిసేలా పూర్తి సమాచారంతో జియో పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వ అధికారులతో కలిసి జియాలజిస్టుల ఆధ్వర్యంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ఈ విభాగం ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? ఎర్రమట్టి దిబ్బలను ఎలా సంరక్షించుకోవాలనే దానిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సూచనలు చేసేలా చూడాలి.
ఎర్రమట్టి దిబ్బలలో , వాటి పక్కన కాంక్రీట్ నిర్మాణాలు, వ్యవసాయం, తోటల పెంపకాలు వంటివి చేయకూడదు.
ఇక్కడ వివిధ కారణాల కోసం తొలగించిన మొక్కలను, చెట్లను తిరిగి పెంచేలా చేయాలి.

ఎందుకు అవసరం?
భవిష్యత్తులో ఎర్రమట్టి దిబ్బలు లేకపోతే విశాఖపట్నంతోపాటు ఎర్రమట్టి దిబ్బల చుట్టుపక్కల ప్రాంతాలలో ఇబ్బందులు తలెత్తుతాయని పర్యావరణవేత్తలు చెప్పారు.
ఆంధ్రా యూనివర్సిటీ జియాలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ రాజశేఖర్ రెడ్డి, పర్యావరణవేత్త సోహన్ హట్టంగడిలు ఎర్రమట్టి దిబ్బల మీద పరిశోధనలు చేశారు.
మానవ చరిత్రతో ముడిపడి ఉన్నఈ దిబ్బలు కనుమరుగైతే దాదాపు 18 వేల నుంచి 20 వేల సంవత్సరాల నాటి వాతావరణ పరిస్థితులను వివరించగలిగే ఆనవాళ్లను కోల్పోతామని వారు తెలిపారు.
ఎర్రమట్టిలో ఉండే కాల్షియం కార్బోనైట్స్ తో కూడిన చిన్న రాళ్లులాంటివి ఎర్రమట్టి దిబ్బలు ఏర్పడిన క్రమాన్ని వివరిస్తాయని చెప్పారు.
విశాఖపట్నం, భీమిలి వంటి ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో ఉప్పు చేరకుండా ఉండటానికి ఎర్రమట్టిదిబ్బలు చాలా కీలకమన్నారు. చొచ్చుకుని వచ్చే సముద్రజలాలను అవి సహజసిద్ధంగా ఫిల్టర్ చేస్తాయని, అందువల్ల నీటిలో ఉప్పదనం తగ్గుతుందని తెలిపారు.
తుపానులు, వరదలు వంటివి వచ్చినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలకు ఎర్రమట్టి దిబ్బలు సహజ రక్షణ కవచాలుగా ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు.

ఎర్రమట్టి దిబ్బలు ఎలా ఏర్పడ్డాయి?
ఎర్రమట్టి దిబ్బలు దక్షిణాసియాలో కేవలం మూడు ప్రాంతాల్లోనే ఉన్నాయని ప్రొఫెసర్ యుగంధర్ రావు బీబీసీతో చెప్పారు.
తమిళనాడులోని టెరీ దిబ్బలు, విశాఖలో ఎర్రమట్టి దిబ్బలతోపాటు శ్రీలంకలో ఇలాంటివి ఉన్నాయని ఆయన తెలిపారు.
“బంగాళాఖాతంలో కొన్ని వేల సంవత్సరాల కిందట నీరు గడ్డకట్టుకుపోయింది. ఆ తర్వాత చాలా కాలానికి కరగడం ప్రారంభమైంది. ఆ సమయంలోనే సముద్రం మీదుగా వీచిన గాలులకు ఒడ్డున ఉన్న ఇసుక పెద్ద ఎత్తున ఎగిరి మేటలుగా ఏర్పడింది. అవే చివరకు భీమిలిలోని ఎర్రమట్టి దిబ్బలుగా ఏర్పడ్డాయి. క్వార్ట్జ్, గార్నెట్, సిల్లిమనైట్, మొనజైట్, హెమటైట్ వంటి మినరల్స్ పరస్పరం చర్య జరిపి ఇసుకకు ఎరువు రంగుని ఇవ్వడంతో ఈ దిబ్బల్లోని ఇసుక ఎర్రగా మారింది. అందుకే వీటిని ఎర్రమట్టి దిబ్బలు అంటున్నారు’’ అని యుగంధర్ రావు తెలిపారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














