ఆంధ్రప్రదేశ్: మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో 'అగ్నిప్రమాదం'పై వివాదం ఏంటి?

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో భూముల వివాదాలు, భూముల చుట్టూ అల్లుకున్న సమస్యలు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి.
ఇటీవల మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగడం, మరోసారి ఈ భూవివాదాలను తెరపైకి తెచ్చింది.
కొద్దిరోజులుగా సాగుతున్న పోలీసుల విచారణ, టీడీపీ-వైసీపీ నేతల మాటల యుద్ధాలతో ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాగించిన భూఅవకతవకలను కనిపించకుండా చేసేందుకు ఆ పార్టీ నేతలే అగ్నిప్రమాదాన్ని సృష్టించారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుండగా, తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని పెద్దిరెడ్డి వర్గీయులు విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం ఘటనలో అసలేం జరిగింది? విచారణాధికారులు ఏం చెబుతున్నారు? ఆరోపణలు చేస్తున్న, ఎదుర్కొంటున్న నేతల వాదనలేంటి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్.

బ్రిటిష్ పాలకులు 1850లో మదనపల్లెను రెవిన్యూ సబ్‌డివిజన్‌గా మార్చారు. మదనపల్లెలో బసినికొండ రోడ్డులో వెళ్తుంటే బ్రిటిష్ కాలం నాటి భవనం కనిపిస్తుంది. దాని వెనుక కొత్తగా నిర్మించిన భవనంలోనే ప్రస్తుతం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఉంది. రెవెన్యూ డివిజన్ కార్యకలాపాలన్నీ అక్కడే జరుగుతాయి.
జులై 21 రాత్రి ఈ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో జులై 22 నుంచి ఆఫీసులో కార్యకాలాపాలు నిలిచిపోయాయి. అక్కడ ప్రస్తుతం అధికారులు, పోలీసులు తప్ప మరొకరి కదలికలు కనిపించడం లేదు.
4 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలో అగ్నిప్రమాదం జరగడంతో అక్కడున్న పలు ఫైళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదానికి బాధ్యులుగా అనుమానిస్తూ ఇప్పటికే కొందరు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నేత, మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాను కూడా పోలీసులు ప్రశ్నించారు.
“హార్డ్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, పవర్ డేటా, టవర్ డేటా వంటివి తీసుకున్నాం. ఎవరెవరు ఇంటరాక్ట్ అయ్యారు? ఎక్కడ ఉన్నారు? వాళ్లేం చేశారు? మోటివ్ ఏంటి? ఇవన్నీ కూడా విచారిస్తున్నాం. అక్కడ దొరికిన అగ్గిపుల్లలను కూడా స్వాధీనం చేసుకున్నాం” అని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు బీబీసీతో చెప్పారు.
ఈ ఘటపై సీరియస్ అయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. 'ఇది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్' అని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు గతంలో ఘటనా స్థలాన్ని సందర్శించిన సమయంలో వ్యాఖ్యానించారు.

అధికారులు ఏం చెబుతున్నారు?
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్ ఘటన తర్వాత తెలిపారు. అయితే, మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని ఏపీ రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా బీబీసీతో చెప్పారు.
“షార్ట్ సర్క్యూట్ అయితే కాదు. ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు కూడా కనబడటం లేదు. బయట నుంచి ఎవరైనా వచ్చి చేశారా అంటే అది కూడా సరిగా తెలియటం లేదు. ఇది ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసినట్టు అనిపిస్తోంది. లోపలివారే చేశారా అనే సందేహం అయితే ఉంది. కానీ మొత్తం దర్యాప్తు పూర్తయిన తర్వాతే దీనిపై తుది నిర్ణయానికి వస్తాం” అని సిసోదియా తెలిపారు.
ఈ ఘటనలో రాజకీయ జోక్యం ఉందా లేదా అనేది ల్యాండ్ ఫైల్స్ రీక్రియేట్ చేసినపుడు తేలుతుందని అన్నారు సిసోదియా.
“ఇందులో రాజకీయ ప్రభావం ఉండొచ్చు. కొన్ని ఫైల్స్ లేకపోతే బాగుంటుందనే అభిప్రాయం అధికారుల్లో ఉండొచ్చు. డాటెడ్ ల్యాండ్స్ (వివాదాస్పద భూములు) అసాధారణంగా పెరిగాయి. ఇది అధికారికంగా జరిగిందా? లేకపోతే అసైన్డ్ భూములు, డి పట్టా భూముల మీద హక్కులు కల్పించడంలో అవకతవకలు జరిగాయా? అన్నది తెలియాల్సి ఉంది” అన్నారు.
సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివాదాస్పద భూములు, 22-ఏ కి సంబంధించిన ఫైల్స్ దగ్ధమయ్యాయని బీబీసీకి చెప్పారు సిసోదియా.
‘‘చిత్తూరు జిల్లాలో మేక్ ఫ్రీ హోల్డ్ భూములు 1.75 లక్షల ఎకరాలుంటే, కలెక్టర్ 82 వేల ఎకరాలను మళ్లీ వివాదాస్పద జాబితాలో చేర్చారు. వాటికి సంబంధించిన 22-ఏ ఫైళ్లు కాలిపోయాయి. అసైన్డ్ భూముల హక్కులకు సంబంధించిన ఫైళ్లు ఎక్కువగా తగలబడ్డాయి. తహశీల్దార్ ఆఫీస్, కలెక్టరేట్‌కు మధ్య ఆర్‌డీఓ కార్యాలయం ఉంటుంది. కాలిపోయిన ఫైళ్ల వివరాలు ఇక్కడ మళ్లీ తెలుసుకోవచ్చు” అని ఆయన అన్నారు.

అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చేవరకు కచ్చితంగా చెప్పలేమని సిసోదియా చెప్పారు.
“అక్కడ ఏడు లీటర్ల ఆయిల్ క్యాన్ ఉంది. కావాలనే ఆయిల్ పోశారా అన్నది తెలియాలి. లేకపోతే, అంత పెద్దగా మంటలు ఎలా వస్తాయి?’’ అని ఆయన ప్రశ్నించారు.
కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదని, వాటి గురించి ఎవరూ సరైన సమాధానం చెప్పడంలేదని ఆయన అన్నారు.
“ఏడు సీసీ కెమెరాలు పెట్టారు. అవి పనిచేయడం లేదు. ఎందుకు పనిచేయడంలేదు అని ఆర్డీఓను అడిగితే నాకు తెలియదు అంటారు. ఏవోను అడిగితే నాకు తెలియదు అంటారు. ఆరోజు పాత ఆర్డీఓ మురళీ ఇక్కడకు వచ్చారు. ఎందుకు వచ్చారో తెలీదు. వీళ్లు ఆయన్ను ఎందుకు కలిశారో తెలియదు. ఆరోజు రాత్రి ఈయన 10.50 గంటల వరకు ఆఫీసులో ఉన్నారు. ఏం చేస్తున్నారో తెలీదు. సీసీ కెమెరాలు పనిచేసి ఉంటే విచారణకు ఇంత టైం పట్టేది కాదు’’ అని సిసోదియా అన్నారు.
తహశీల్దార్ నుంచి వచ్చిన ఫైలును వెరిఫై చేసి కలెక్టర్‌కు పంపడం మాత్రమే ఆర్డీఓ కార్యాలయంలో జరిగే పని అని రిటైర్డ్ తహశీల్దార్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం మాజీ ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి బీబీసీకి తెలిపారు.
‘‘మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కాలిపోయిన ఫైల్స్ సంబంధిత తహశీల్దార్, కలెక్టర్ కార్యాలయాల్లో ఉంటాయి. వాటిని జిరాక్స్ తీసుకుంటే మళ్లీ పైల్ క్రియేట్ అవుతుంది’’ అని ఆయన అన్నారు.

22-ఏ అంటే ఏమిటి?
విజయసింహారెడ్డి బీబీసీకి తెలిపిన వివరాల ప్రకారం, నిషేధిత భూముల జాబితాను 22-ఏ అంటారు. అంటే ఈ జాబితాలో ఉన్న భూములను అమ్మడం, కొనడం చేయలేరు.
22-ఏ కింద అయిదు కేటగిరీలున్నాయి.
1(ఏ) అసైన్డ్ భూములు
1(బీ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భూములు
1(సీ) ఎండోమెంట్స్, వక్ఫ్ బోర్డు లేదా ఏదైనా ఇతర మత సంస్థలకు చెందిన భూమి
1(డీ) ల్యాండ్ సీలింగ్‌లో భాగంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న మిగులు భూములు
1(ఈ) 9/77 చట్టం ప్రకారం కొనుగోలు చేసిన అసైన్డ్ భూములు, చుక్కల భూములు, డీకేటీ భూములు
వీటిలో చుక్కల భూములు లేదా డాటెడ్ ల్యాండ్స్ అనేవి వివాదాస్పద భూములు. 1919లో జరిగిన సర్వే ప్రకారం స్పష్టమైన యజమాని తెలియని భూములను చుక్కల భూములుగా చూపుతారు. వాటికి పత్రాలు ఉండవు. కానీ, అవి రైతుల అధీనంలోనే ఉంటాయి.
డీకేటీ లేదా అసైన్డ్ ల్యాండ్ అంటే, పేద ప్రజలకు ప్రభుత్వం పంచిన భూములు. సాధారణంగా వాటిని బదిలీ చేయడం లేదా అమ్మడం, కొనడం చేయకూడదు. అయితే 1954 నుంచి 2003 మధ్య ఉన్న డీకేటీ పట్టా భూములకు హక్కులు కల్పిస్తూ గత ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. దాన్ని అమ్ముకునే హక్కు ఆ రైతుకు ఉంటుంది. అయితే ఆన్‌లైన్లో డీకేటీ ఫ్రీ హోల్డ్ అని కనిపిస్తుంది.

భూకబ్జాలపై స్థానికుల ఫిర్యాదులు
మదనపల్లె రెవిన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తమ భూముల ఆక్రమణలపై ఫిర్యాదులు చేస్తున్నారు. రూ.4 కోట్లకు పైగా విలువ ఉండే తన భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు చేయడానికి వచ్చానని వెంకటరమణ రాజు అనే వ్యక్తి బీబీసీకి చెప్పారు.
‘‘మా భూమి 15 గుంటల భూమి ఉంది. మా దగ్గర అన్ని రికార్డులూ ఉన్నాయి. కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. అయినా, ఇప్పుడు మా భూమి కబ్జాలో ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డి మా భూమిని కబ్జా చేశాడు’’ అని ఆయన ఆరోపించారు.
వెంకటరమణ రాజు చెబుతున్న విషయాలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు. ఈ ఫైళ్లు దగ్ధమైన ఘటనలో నిందితుడిగా ఉన్న మాధవరెడ్డి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాబట్టి ఆయన్ను సంప్రదించే అవకాశం బీబీసీకి దొరకలేదు.
మరికొందరు ప్రజలు కూడా వివిధ రకాల భూ సమస్యల మీద ఫిర్యాదులు, వినతి పత్రాలు ఇవ్వడానికి ఇలాగే వచ్చారు. వారిలో కొందరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై ఆరోపణలు చేశారు.

భూముల ధరలు పెరుగుతుండటంతో...
పట్టణాలు విస్తరిస్తున్న కొద్దీ, పరిశ్రమలు వస్తున్న కొద్దీ భూముల ధరలు పెరుగుతూ పోతుంటాయి. అలా ఒక చోట భూముల ధరలు పెరిగితే దాని ప్రభావం మరొక చోట కనిపిస్తుంది.
మదనపల్లె రెవిన్యూ డివిజన్‌లోని పుంగనూరు, తంబళ్లపల్లి వంటి ప్రాంతాలు బెంగళూరుకు సుమారు 4 గంటల దూరంలో ఉన్నాయి. చెన్నై కూడా 5-6 గంటల దూరంలో ఉంది. ఎన్‌హెచ్-42, ఎన్‌హెచ్-71 వంటి జాతీయ రహదారులు కూడా మదనపల్లె మీదుగా పోతున్నాయి.
అలాగే ఈ ప్రాంతం కాస్త చల్లగా ఉండటం, ప్రశాంతమైన వాతావరణం ఉండటంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వ్యాపారులు ఇక్కడ స్థలాలు కొనడానికి ఇష్టపడుతుంటారని స్థానిక స్థిరాస్తి వ్యాపారులు చెబుతున్నారు. వారు చెబుతున్న ప్రకారం, వ్యవసాయ భూములు కొనేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. దాంతో స్థిరాస్తి వెంచర్ల కోసం భూములకు గిరాకీ ఏర్పడింది.
స్థిరాస్తి వ్యాపారులు చెబుతున్న దాని ప్రకారం మదనపల్లె రెవెన్యూ డిజిజన్ పరిధిలో ఎకరా రూ.10 లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ధర పలుకుతోంది. ఇక 20 ఏళ్లకు పైబడిన అసైన్డ్ భూముల మీద హక్కులు కల్పిస్తూ 2023లో నాటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్స్) యాక్ట్-1977కు సవరణలు చేసింది. అంటే ఒక వ్యక్తికి భూమి అసైన్ చేసి 20 ఏళ్లు దాటితే ఇకపై దాని మీద ఆ వ్యక్తికి హక్కులు వస్తాయి. తద్వారా వారు అమ్ముకోవడానికి వీలుంటుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కూడా భూముల లావాదేవీలు పెరిగాయి.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై ఆరోపణలేంటి?
మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు కాలిపోయిన ఘటనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మీద తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఉందని రెవిన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.
"సబ్ కలెక్టర్ కార్యాలయం మొన్నటివరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి నియంత్రణలోనే ఉంది. నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున భూ మార్పిడి జరిగింది. ఈ విషయంలో అధికారులను స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ ప్రశ్నించిన తర్వాతే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు కాలిపోయిన ఘటన జరిగింది. ఈ ఘటనపై పెద్దిరెడ్డితోపాటు స్థానిక వైసీపీ నేతలపైనా అనుమానం ఉంది’’ అని ఆయన అన్నారు.
టీడీపీ నేతల ఆరోపణలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వివరణ కోరేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఫోనులో ఆయన అందుబాటులోకి రాలేదు. మెసేజ్ పంపించినా దానికి జవాబు ఇవ్వలేదు.
అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఈ ఆరోపణల మీద స్పందించారు.
‘‘మా ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. మా ఆస్తులన్నీ ఎన్నికల అఫిడవిట్లో చూపించాం. మేం చేస్తే రికార్డులు తారుమారు అవుతాయా? తహశీల్దార్, కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ఆ రికార్డులుంటాయి’’ అని ఆయన అన్నారు.
ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఆర్డీవో మురళీతో పాటు ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్‌లను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ వారు పోలీసుల అదుపులో ఉండటం వల్ల అది సాధ్యం కాలేదు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














