రేవంత్ రెడ్డి ‘బడే భాయ్’ తెలంగాణ అభివృద్ధికి బడ్జెట్‌లో ఏమిచ్చారు?

ఫొటో సోర్స్, PMO India/FB
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
కేంద్ర బడ్జెట్ తర్వాత తెలంగాణకు నిధుల కేటాయింపు వ్యవహారంపై చర్చ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, పోలవరం సహా వివిధ ప్రాజెక్టులకు నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌కు నిధుల కేటాయింపుపై మాట్లాడుతూ నిర్మలా సీతారామన్.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ప్రస్తావించారు.
అదే చట్టం కింద ఏర్పాటైన తెలంగాణకు మాత్రం నిధులు ఇవ్వలేదంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ మండిపడుతున్నాయి.
కేంద్ర బడ్జెట్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ‘‘తెలంగాణ అనే పేరు పలకడానికి కూడా కేంద్రం ఇష్టపడటం లేదు’’ అని వ్యాఖ్యానించారు.
“కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయించాల్సిన నిధుల్లో వివక్ష చూపడాన్ని ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. కానీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. పార్లమెంటులో చేసిన విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవటం తెలంగాణ ప్రగతిపై తీవ్రమైన ప్రభావం చూపింది.ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్‌కు సవరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సభ తీర్మానం చేస్తోంది’’ అని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సభలో ప్రవేశపెట్టారు.


ఫొటో సోర్స్, PMO India/FB
తెలంగాణ అడిగిందేమిటి?
జులై 4న ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిశారు.
ఆ సందర్భంగా 12 అంశాలపై ప్రధానికి వినతిపత్రం అందించారు. అందులో నిధులు అవసరమైన ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు, అవసరమైతే అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
తెలంగాణ అడిగినవి ఇవీ..
- తెలంగాణకు తక్షణం ఐఐఎంను మంజూరు చేయాలి.
- 2010లో హైదరాబాద్‌కు మంజూరు చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్టును పునరుద్ధరించాలి.
- రాష్ట్ర పునర్విభజన చట్టంలో ప్రస్తావించిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పాలి.
- సెమీకండక్టర్ మిషన్‌లో తెలంగాణకు చోటు కల్పించాలి
- ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లను తెలంగాణకు మంజూరు చేయాలి.
- వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద తెలంగాణకు ఇవ్వాల్సిన రూ.1,800 కోట్లు విడుదల చేయాలి.
- హైదరాబాద్-కరీంనగర్, హైదరాబాద్-నాగ్‌పూర్ మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్‌లతో పాటు నగరంలో రోడ్ల విస్తరణకు అవసరమైన 2,450 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి.
- రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలి.
- భారత్‌మాల పథకం కింద సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు రీజనల్ రింగ్ రోడ్డు భూ సేకరణకు రాష్ట్ర వాటాగా అవసరమైన 50 శాతం నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలి. అలాగే చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు ఉన్న ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆమోదం ఇవ్వాలి.
- 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలి.
- కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలి.
- తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ సైబర్ బ్యూరో ఆధునికీకరణకు అవసరమైన నిధులు మంజూరు చేయాలి.
- డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణతో పాటు, వాటిని అరికట్టడానికి కావాల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాల కొనుగోలు కోసం నిధులు మంజూరు చేయాలి.
- కేంద్రం వేలం వేస్తున్న బొగ్గు గనుల జాబితాలో ఉన్న శ్రావణపల్లి బొగ్గు బ్లాకును ఆ జాబితా నుంచి తొలగించి సింగరేణికి నేరుగా కేటాయించాలి.
- గోదావరి లోయ ప్రాంతంలో బొగ్గు నిల్వల క్షేత్రంగా సింగరేణి గుర్తించిన ప్రాంతంలోని కోయగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3 గనులను కూడా సింగరేణికి కేటాయించాలి.
- రాష్ట్రానికి అదనంగా మరో 29 ఐపీఎస్ పోస్టులు కేటాయించాలి.
- ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి సహకరించాలి.

ఫొటో సోర్స్, Telangana CMO
వీటితోపాటు గత డిసెంబర్, ఈ ఏడాది మార్చిలో రేవంత్ రెడ్డి ప్రధానిని కలిసిన సందర్భంలో మెట్రో రెండో దశకు నిధులు ఇవ్వాలని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని కోరారు. గిరిజన యూనివర్సిటీకి నిధులు కేటాయించాలని అడిగారు.
బడ్జెట్‌కు ఒక రోజు ముందు దిల్లీలో కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు.
మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు రూ. 4 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద వరంగల్, కరీంనగర్‌లను ఎంపిక చేయాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరారు. వీటిల్లో ఏ ఒక్కటీ కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావనకు రాలేదు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
బడ్జెట్‌లో తెలంగాణకు ఏం ఇచ్చారు?
తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం చూస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.6,577 కోట్లను కేంద్రం వివిధ పథకాల ద్వారా తెలంగాణకు ఇచ్చింది.
అయితే వాస్తవానికి రూ.14వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
ఆ మేరకు కేంద్రం నుంచి రావాల్సిన మిగిలిన నిధులకు కోత పడిందని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం తెలుస్తోంది.
ప్రస్తుత బడ్జెట్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు రూ.122 కోట్లు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్) కు రూ.10.84 కోట్లు, సింగరేణికి రూ.1600 కోట్లు, అటామిక్ మినరల్స్ రీసెర్చ్ డైరెక్టరేట్‌కు రూ.352 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు.
ఇవి కాకుండా కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రూ.14,300 కోట్లు, పన్నుల వాటా కింద రూ. 26 వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నట్లు ఆర్థిక శాఖలోని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాట్లాడారు.
‘‘తెలంగాణకు మొండి చేయి చూపారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు అనడం అర్థరహితం. తెలంగాణ సహా వెనుకబడిన 150 జిల్లాల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వబోతోంది. శాఖల వారీగా చెప్పే బడ్జెట్‌లో దీనిపై స్పష్టత వస్తుంది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పారు. అది సాధ్యం కాదని నిపుణుల కమిటీ తేల్చిన మాట వాస్తవం కాదా? కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించలేదు. హైదరాబాద్ - బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో 210 కిలోమీటర్లు తెలంగాణలో ఉంది’’ అని చెప్పారు.
‘అన్ని రాష్ట్రాల పేర్లూ చెప్పలేరు’
తెలంగాణకు నిధుల కేటాయింపుపై ఉన్న వివాదంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ చిట్టెడి కృష్ణారెడ్డి బీబీసీతో మాట్లాడారు.
‘‘బడ్జెట్‌లో తెలంగాణ పేరును ప్రత్యేకంగా తీసుకోకపోయినా, విడిగా ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇస్తోంది. రీజనల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు నిధులిస్తోంది. గిరిజన యూనివర్సిటీకి భూసేకరణ, టెక్నికల్ ప్రక్రియ ముందుకు సాగలేదు.
బడ్జెట్‌లో అన్ని రాష్ట్రాల పేర్లూ చెబుతూ నిధులివ్వడం అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో స్కిల్ డెవలప్‌మెంట్, వ్యవసాయం వంటి రంగాలకు రూ.2 లక్షల కోట్లు కేటాయించింది. ఆ నిధులలో కచ్చితంగా తెలంగాణకు వాటా ఉంటుంది.
అయితే, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రస్తావన తీసుకువచ్చినందున తెలంగాణకు అవసరమైన సహకారం అందిస్తున్నామని చెప్పి ఉంటే బావుండేది’’ అన్నారు.
ఐఐఎం ప్రతిపాదన లేదని చెప్పేసిన కేంద్రం
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొన్ని రోజుల ముందు.. అంటే జులై 15న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ వచ్చింది. తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేసే ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని ఆ లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.
సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని రూ. 890 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
అయితే, గిరిజన యూనివర్సిటీకి ప్రత్యేకంగా నిధులు కేటాయింపు జరగలేదు. ఈ నిధులను సెంట్రల్ యూనివర్సిటీల గ్రాంట్లలో కలిపేశారు. నిధులు ఎంతన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏముంది?
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం తరఫున కొన్ని ప్రాజెక్టులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈమేరకు అప్పట్లో కేంద్రం కొన్నిహామీలు ఇచ్చింది.
- బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలన.
- తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు (యూనివర్సిటీ ఏర్పాటు చేసింది గానీ అవసరమైన రూ. 890 కోట్ల నిధుల కేటాయించలేదు)
- తెలంగాణలో ఏదైనా సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా
- వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధుల కేటాయింపు
- తెలంగాణలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు
- తెలంగాణలో ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు
- 4,000 మెగావాట్ల థర్మల్ విద్యత్ కేంద్రం స్థాపన
- జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ పాఠశాలల ఏర్పాటు
- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) స్థాపన
- ఐటీఐఆర్‌కు సాయం

ఫొటో సోర్స్, FACEBOOK/KTR
‘‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఇస్తున్నట్లు చెప్పారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఇస్తున్నప్పుడు తెలంగాణకు కూడా నిధులు ఇవ్వాలన్న బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా?
చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఉంది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది. సాగునీటి ప్రాజెక్టుల్లో పోలవరానికి ఏ విధంగా నిధులు ఇచ్చి నిర్మిస్తున్నారో.. అదే విధంగా పాలమూరు-రంగారెడ్డికి నిధులు ఇవ్వాలన్న ఆలోచన కేంద్రానికి రాలేదు. గిరిజన యూనివర్సిటీకి నిధులు ఇవ్వలేదు’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ విషయంపై మంత్రి కేటీఆర్ స్పందించారు.
‘‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో దాదాపు 35 హామీల పైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదు. ఐఐఎం సహా నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ వంటి కేంద్ర జాతీయ సంస్థలను ఇవ్వమని మేం కోరినప్పటికీ ఒక్కటి కూడా కేంద్రం ఇవ్వలేదు. మెగా పవర్ లూమ్ క్లస్టర్‌తో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగినా కేంద్రం స్పందించలేదు’’ అని అన్నారు కేటీఆర్.

ఫొటో సోర్స్, telangana cmo
మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు రేవంత్ ఏమన్నారు..
లోక్ సభ ఎన్నికల ముందు మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవానికి వచ్చారు.
ఆ సమయంలో ‘‘పెద్దన్న(బడే భాయ్) తరహాలో తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వాలి’’ అని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ప్రధానిని కోరారు.
మోదీని పెద్దన్న అనడంపై ప్రతిపక్షాలు, సోషల్ మీడియాలో అప్పట్లో పెద్దఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత దాన్ని రేవంత్ రెడ్డి సమర్థించుకున్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ పెద్దన్న తరహాలో ఉంటూ రాష్ట్రాల అభివృద్ధికి సాయం చేయాలని.. అందుకే ఆ విధంగా కోరానని ఆయన చెప్పారు.
గత నెలలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి తెలంగాణకు నిధులు ఇవ్వాలని కోరారు. దానికి తగ్గట్టుగానే కేంద్ర బడ్జెట్‌లో నిధులు వచ్చే తీరును చూసి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రకటిస్తామంటూ ప్రభుత్వం చెప్పింది.
ప్రస్తుతం కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ప్రత్యేక ప్రాజెక్టులేవీ లేకపోవడంతో పన్నుల వాటా, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ఆధారంగా తెలంగాణ బడ్జెట్ ఉంటుందని ఆర్థిక శాఖ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














