‘రాజకీయ హింస’పై దిల్లీలో జగన్ నిరసన.. ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, FB/ysrcpofficial
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సాఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిల్లీలో నిరసన తెలిపారు.
ఏపీలోని టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఆయన దిల్లీని వేదికగా చేసుకున్నారు.
ఇప్పటికే ఆయన ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు.
బుధవారం ఆయన దిల్లీలో మాట్లాడుతూ.. ‘ఈ రోజు టీడీపీ అధికారంలో ఉంది, రేపు మేం అధికారంలో రావొచ్చు. నిన్న మేం అధికారంలో ఉన్నాం. కానీ, అప్పుడు మేం ఇలాంటి ప్రవర్తనను ప్రోత్సహించలేదు. దాడులు, ఆస్తుల ధ్వంసాన్ని మేమెప్పుడూ ప్రోత్సహించలేదు. ఇప్పుడు ఏపీలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి’ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల తరువాత హింస జరుగుతోందన్నది వైసీపీ ప్రధాన ఆరోపణ.
ఇటీవలి కాలంలో రాష్ట్రంలో కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి. పల్నాడు జిల్లా వినుకొండలో జులై 17న వైసీపీ కార్యకర్త షేక్ రషీద్ హత్య జరిగింది.
18న పుంగనూరులో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వాహనాలను కొందరు ధ్వంసం చేశారు.
ఈ ఘటనలు ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచాయి.
వైసీపీ కార్యకర్త రషీద్‌ను అందరూ చూస్తుండగానే రోడ్డు మీద కత్తితో చంపడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.
‘‘టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం చేయించిన హత్య ఇది’’ అని వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రభుత్వం ‘ప్రతీకార’ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.


ఇంతకుముందు వైసీపీ హయాంలో ఏమైందంటే..
పల్నాడు ప్రాంతంలో హత్యలు, ఘర్షణలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.
వైసీపీ ప్రభుత్వంలోనూ హత్యలు జరిగాయి. చనిపోయిన వారిలో టీడీపీ కార్యకర్తలు ఉన్నారు.
2022 జనవరిలో టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య హత్యకు గురికాగా చంద్రబాబు నాయుడు ఆయన అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు.
2019 ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణల్లో పలు గ్రామాల్లో కొందరు ఇళ్లు వదిలి వెళ్లిపోయారు.
ఆ హత్యలు వ్యక్తిగత కక్షలతో జరిగినవని పోలీసులు చెబుతూ వచ్చారు.
2020లో టీడీపీ నాయకులు బోండా ఉమ, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తున్న కారు మీద దాడి జరిగింది.
అదే ఏడాదిలో తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లడం ఉద్రిక్తతలకు దారి తీసింది.
2021 అక్టోబరులో విజయవాడలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది.
2024 ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత ఘర్షణలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. మే 13, 14 తేదీల్లో పల్నాడు, తాడిపత్రి ప్రాంతాలలో హింస చెలరేగింది. 144 సెక్షన్ విధించారు.
ఎన్నికల ఫలితాలకు ముందు కూడా తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీ వద్ద టీడీపీ నేత పులివర్తి నాని మీద దాడి జరిగింది.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత..
ఎన్నికల ఫలితాల తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ఘర్షణలు జరిగాయి. అనేక చోట్ల వైసీపీ కార్యకర్తలు గ్రామాలు వదిలిపోవాల్సి వచ్చింది.
ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ‘‘టీడీపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది’’ అని వార్త రాశారనే ఆరోపణలతో విశాఖపట్నంలోని డెక్కన్ క్రానికల్ ఆఫీసు మీద దాడి జరిగింది.
ఒక వ్యక్తిని కొడుతూ అతని చేత నారా లోకేశ్‌కు క్షమాపణలు చెప్పిస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రభుత్వ భవనాలకు రంగులు మార్చడం, శిలా ఫలాకాలను, నాడు పెట్టిన పేర్లను తొలగించడం వంటివి జరిగాయి.
ఇక పుంగనూరులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్న సమయంలో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి దగ్గర పెద్ద ఘర్షణ జరిగింది. టీడీపీ వాళ్లు చేశారంటూ వైఎస్ఆర్‌సీపీ ఆరోపించింది.
ఈ ఆరోపణల్ని టీడీపీ ఖండించింది. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ దాడులు, ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయనడానికి ఈ ఘటనలు నిదర్శనం.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ వినుకొండ వెళ్లి హత్యకు గురైన రషీద్ కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ, ఈ విషయాన్ని దేశం మొత్తానికి తెలియజేయడానికి 24వ తేదీన దిల్లీలో నిరసన దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు.

ఫొటో సోర్స్, ysrcp
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఈ పరిణామాల మీద వైసీపీ ఆందోళన చేసింది. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది.
ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ‘‘36 మందిని హత్య చేశారు’’ అంటూ జగన్ ఆరోపించారు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘‘40 రోజుల్లో 31 మందిని హత్య చేశారు’’ అంటూ లోక్ సభలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపించారు.
"హత్యలు, దౌర్జన్యాలు చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తమ పార్టీ కార్యకర్తలను దాడులకు ప్రోత్సహిస్తోంది. బాధితుల పైనే కేసులు పెడుతున్నారు. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో ఉన్న మాపై వందల మంది వచ్చి దాడి చేసి, ఇప్పుడు మాపైనే హత్యానేరం మోపారు. ఇదంతా దేశం దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాం" అని మిథున్ రెడ్డి బీబీసీతో అన్నారు.
జగన్, మిథున్ రెడ్డిలు చెప్తున్నట్లుగా ఎంతమంది మరణించారన్నది బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చెప్తున్నారు?
రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ‘‘36 మందిని హత్య చేశారు’’ అని వినుకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ఆరోపించారు.
ఆ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఖండించారు.
‘‘జూన్ 4 నుంచి జులై 22 వరకు రాష్ట్రంలో రాజకీయ కారణాలతో 4 హత్యలు జరిగాయి. అనంతపురం జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు చనిపోయారు. మృతి చెందిన వారిలో ముగ్గురు టీడీపీ వారు కాగా, ఒక్కరు వైసీపీకి చెందినవారు.
పాత కక్షలు, వ్యక్తిగత విభేదాలతో జరిగిన గొడవల్లో పల్నాడు జిల్లాలో ఒకరు, శ్రీసత్యసాయి జిల్లాలో ఒకరు హత్యకు గురయ్యారు. ఆ ఇద్దరు మృతులు వైసీపీకి చెందిన వారు" అని ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ అధికారికంగా వివరణ ఇచ్చింది.
హోం మంత్రి వంగలపూడి అనిత కూడా విపక్ష నేతలు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
కాగా ఏపీలో జరిగిన దాడులకు సంబంధించినవి అంటూ వైసీపీ దిల్లీలో ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘‘అసెంబ్లీకి రావడానికి ధైర్యం లేక..’’
అసెంబ్లీకి రావడానికి జగన్‌కు ధైర్యం సరిపోవడం లేదని, అందుకే వ్యక్తిగత కక్షలతో జరిగిన ఘటనలను భూతద్దంలో చూస్తున్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది.
మంత్రి వాసంశెట్టి సుభాష్ ‘బీబీసీ’తో మాట్లాడుతూ ‘రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారు’ అని విమర్శించారు.
"వైఎస్ జగన్, తన హయంలో జరిగిన రాజకీయ హింస అప్పుడే మరచిపోయినట్టున్నారు. కానీ, ప్రజలు మరచిపోలేదు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు ప్రస్తావించాల్సిన సమయంలో ధైర్యం లేక దిల్లీకి పారిపోయారు.
ప్రజల హక్కులను హరించిన ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపిన సంగతి మింగుడు పడకపోవడంతోనే ఇలాంటి కుయత్నాలకు దిగుతున్నారు’’ అని మంత్రి సుభాష్ అన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














