తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా, అసలేం జరిగింది?

భట్టి విక్రమార్క

తెలంగాణలో మరికొన్ని వారాల్లో జరగాల్సి ఉన్న గ్రూప్ 2 పరీక్షలను టీజీపీఎస్సీ వాయిదా వేసింది. ఆ పరీక్షలను డిసెంబర్‌లో నిర్వహించనున్నట్లు తెలిపింది.

గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్‌కు వాయిదా వేయాలంటూ కొన్ని రోజులుగా అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం (జులై 19) అభ్యర్థులతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కొందరు ఎంపీలు చర్చలు జరిపారు. అనంతరం పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో ఆగస్టులో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్‌కు రీషెడ్యూల్ చేస్తున్నట్లు టీజీపీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్‌లో ఏ తేదీన పరీక్షలు ఉంటాయన్నది తర్వాత వెల్లడిస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.

తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు

ఫొటో సోర్స్, UGC

గ్రూప్-2ను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చింది?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2016లో తొలిసారి గ్రూప్ 2 నియామకాలు జరిగాయి.

తర్వాత 2022 డిసెంబరు 29న రెండోసారి గ్రూప్-2 నోటిఫికేషన్ వచ్చింది. 783 పోస్టులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన జారీ చేసింది.

5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఆ నోటిఫికేషన్ ప్రకారం 2023 ఆగస్టు, 2024 జనవరిలలో జరగాల్సిన పరీక్షలు ఎన్నికలు, ఇతర కారణాలతో రెండుసార్లు వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు ఈ ఏడాది ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది.

అయితే, నోటిఫికేషన్ 2022 డిసెంబరులో ఇచ్చింది కాబట్టి.. ఇప్పటి ఖాళీల ప్రకారం గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంచి, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు.

పరీక్షలను డిసెంబర్‌కు వాయిదా వేయాలని కోరుతూ ఆందోళనలు చేశారు.

రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, FACEBOOK

రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏంటి?

2023 అక్టోబరు 1న సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిరుద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

దీనికి హాజరైన అప్పటి మల్కాజిగిరీ ఎంపీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ‘‘గ్రూప్-2 విషయంలో నిరుద్యోగులు ఆందోళన చెందవద్దు. త్వరలోనే ప్రజా ప్రభుత్వం రాబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంచి మళ్లీ నోటిఫికేషన్ ఇస్తాం. యువతకు న్యాయం చేస్తాం’’ అంటూ ప్రకటించారు.

కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాత నోటిఫికేషన్ ప్రకారమే 783 పోస్టులతో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవడంతో అభ్యర్థులు ఆందోళన చేశారు.

ఈ విషయంపై టీ‌జీఎస్‌పీఎస్‌సీ మాజీ చైర్మన్ గంటా చక్రపాణి కొన్ని రోజుల కిందట బీబీసీతో మాట్లాడారు.

‘‘గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. పరీక్షలకు సంబంధించి ఒక దశకు చేరుకున్నాక నిబంధనలు మార్చడానికి వీలుండదు. కానీ ఇప్పుడు గ్రూప్-2కు సంబంధించి దరఖాస్తుల దశ మాత్రమే ముగిసింది. పోస్టుల లభ్యత ఆధారంగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు పెంచేందుకు వీలుంటుంది’’ అని చెప్పారు.

2016లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రూప్-2 నోటిఫికేషన్ దాదాపుగా 700 పోస్టులతో ఇచ్చారు. ఆ తర్వాత నిరుద్యోగులు, అఖిలపక్ష నాయకుల డిమాండ్ మేరకు మరో 300 పోస్టులు కలిపి సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ను అప్పట్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన విషయాన్ని నిరుద్యోగులు గుర్తు చేస్తున్నారు.

ప్రస్తుతం నిరుద్యోగులు గ్రూప్-2 వాయిదా కోరడం వెనుక మరో బలమైన కారణం కూడా ఉందని చెప్పారు ఎకనామిక్స్ కోచింగ్ ఫ్యాకల్టీ చౌటి ప్రభాకర్.

‘‘గ్రూప్-2 రాసే అభ్యర్థుల్లో 80 శాతం మంది గ్రూప్-3 కూడా రాస్తుంటారు. ఈ రెండు పరీక్షలకు సిలబస్ చాలావరకు ఒకేలా ఉంటుంది. ఒక్క పేపర్ మాత్రమే తేడా ఉంటుంది. గ్రూప్-3 నవంబరు 17, 18 తేదీల్లో జరుగుతుంది. అదే సమయంలో కొన్ని రోజుల తేడాతో గ్రూప్-2 పరీక్షలు పెడితే అభ్యర్ధుల ప్రిపరేషన్ సులువు అవుతుంది. అలాగే గ్రూప్-2 రాసే అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్‌కు కూడా సెలక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ రెండు పరీక్షలకు ఒకేసారి చదవడం కూడా ఇబ్బంది అవుతుంది కనుక గ్రూప్ 2ను వాయిదా వేయాలన్నది వారి డిమాండ్’’ అని ప్రభాకర్ చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్-2 పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు ధరావత్ మోతీలాల్. ఈ విషయంపై ఆయన ఇటీవల ఆమరణ నిరాహార దీక్ష చేశారు.

‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకే మేం డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 783 పోస్టులకు అదనంగా పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలి. దీనివల్ల ఎక్కువ మంది ఉద్యోగాలు సాధించేందుకు వీలవుతుంది. గ్రూప్-2, 3 పరీక్షలు కొంత తేడాతో నిర్వహిస్తే, నిరుద్యోగులకు సమయం వృథా కాకుండా ఉంటుంది’’ అని ఆయన కొన్ని రోజుల కిందట చెప్పారు.

అభ్యర్థుల ఆందోళనల తర్వాత ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)