కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్ కల్పించే బిల్లు విషయంలో పునరాలోచిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రతిపాదిత రిజర్వేషన్లపై అటు పరిశ్రమ వర్గాలు, ఇటు న్యాయనిపుణుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనక్కుతగ్గింది.
‘ఈ బిల్లు ఇంకా పూర్తిగా తయారవలేదు. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై సమగ్రంగా చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటాం’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
అయితే, కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ ‘బీబీసీ హిందీ’తో మాట్లాడుతూ బిల్లులోని కొన్ని విషయాలు మాత్రమే పునఃపరిశీలించాల్సి ఉందన్నారు.
ఈ ప్రతిపాదిత బిల్లు 2016లో తీసుకువచ్చిన మునుపటి బిల్లు కంటే కొద్దిగా భిన్నమైనది. ఇందులో ‘కన్నడిగ’ పదాన్ని పునర్నిర్వచించారు.
కర్ణాటలో 15 ఏళ్ల పాటు నివసించి, కన్నడం మాట్లాడటంతోపాటు చదవడం, రాయడం వచ్చిన వారిని కన్నడిగగా పరిగణించి రిజర్వేషన్లకు అర్హులుగా పేర్కొంది.
కిరణ్ మజుందార్ షా సహా ప్రైవేటు రంగం నుంచి అనేక మంది ఈ ప్రతిపాదిత బిల్లును విమర్శించారు.
కర్ణాటక మాజీ అడ్వకేట్ జనరల్ అశోక్ హర్ణహళ్లి, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీటి వెంకటేశ్ దీనిపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగవిరుద్ధమైనదిగా వారు పేర్కొన్నారు.
ఇందుకు వారు ‘హరియాణా, పంజాబ్ హైకోర్టు’ ఇచ్చిన తీర్పులను ఉదహరించారు.
బ్రాండ్ నిపుణుడు హరీష్ బిజూర్ మాట్లాడుతూ, ‘‘ఈనిర్ణయం బ్రాండ్ బెంగళూరు ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది. కన్నడ భాషను చాలామంది వినియోగించాల్సిన అవసరం ఉంది. కానీ ఇది హఠాత్తుగా ఒక్కరోజులో జరిగిపోదు’’ అన్నారు.


బిల్లులో ఏముంది?
తీవ్రమైన విమర్శలు, మంత్రి వర్గంలో , ముఖ్యంగా పరిశ్రమలు, ఐటీ మంత్రుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ఈ బిల్లును కేబినెట్‌లో పునఃసమీక్షిస్తామని బుధవారం రాత్రి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించాల్సి వచ్చింది.
పరిశ్రమలు, కర్మాగారాలు,ఇతర సంస్థలలో స్థానిక అభ్యర్థులకు మేనేజ్‌మెంట్ కేటగిరీలో 50 శాతం ఉద్యోగాలను ‘కర్ణాటక రాష్ట్ర ఉపాధి బిల్లు - 2024’ ప్రతిపాదిస్తోంది.
సూపర్‌వైజర్, మేనేజర్, టెక్నికల్, ఆపరేషనల్, అడ్మినిస్ట్రేటివ్, ఉన్నత స్థానాలు, స్థానిక అభ్యర్థులకు రిజర్వ్ చేయాలని ఇది సూచిస్తుంది.
నాన్-మేనేజ్‌మెంట్ కేటగిరీ ఉద్యోగాల్లో, క్లరికల్, అన్‌స్కిల్డ్,సెమీ స్కిల్డ్, ఐటీ, ఐటీఈఎస్ సంస్థల్లోని ఉద్యోగులు, కాంట్రాక్ట్, క్యాజువల్ వర్కర్లు వంటి ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులే ఉండాలని ప్రతిపాదిత బిల్లు చెబుతోంది.
ప్రైవేట్ రంగంలో గ్రూప్ సి, డి ఉద్యోగాలను 100 శాతం కన్నడిగులకు ఇవ్వాలని కూడా ఈ చట్టం నిర్దేశించింది.
కర్ణాటకలో జన్మించి,15 ఏళ్లుగా రాష్ట్రంలో నివసిస్తూ, కన్నడను స్పష్టంగా మాట్లాడటం, చదవడం, రాయడంతోపాటు నోడల్ ఏజెన్సీ నిర్వహించే అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వ్యక్తినే స్థానికుడిగా నిర్వచించారు. హైస్కూల్లో కన్నడ చదవని వారు ఈ అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది.
అయితే, తగినంత మంది స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకపోతే, సదరు పరిశ్రమ, ఫ్యాక్టరీ ఆ నిబంధన సడలింపు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వం విచారణ జరిపించి తగిన ఉత్వర్వులను జారీ చేస్తుందని ప్రతిపాదిత బిల్లు తెలుపుతోంది.
సడలింపు ఇచ్చినా కూడా మేనేజ్‌మెంట్ కేటగిరీలో 25 శాతం, నాన్ మేనేజ్‌మెంట్‌లో 50 శాతం రిజర్వేషన్ ఉండాలి. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే యజమానులకు రూ. 10,000 నుంచి రూ. 25,000 వరకు జరిమానా విధిస్తారు.
సదరు పరిశ్రమ, కర్మాగారాలకు సరైన అభ్యర్ధులు దొరకకపోతే, ప్రభుత్వ ఏజెన్సీల సహకారంతో స్థానిక అభ్యర్థులకు అర్హత సాధించేలా శిక్షణ ఇవ్వాలి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పరిశ్రమ వర్గాలు ఏమంటున్నాయి?
ఈ నిర్ణయంపై పరిశ్రమవర్గాల నుంచి కిరణ్ మజుందార్ షా బహిరంగంగా ఎక్స్‌లో తన అభిప్రాయం తెలిపారు.
‘ఒక టెక్‌హబ్‌గా మనకు నైపుణ్యం కలిగినవారి అవసరం ఉంది. అలాగే స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యం ఉంది. కానీ సాంకేతికతలో మన అగ్రస్థానాన్ని ప్రభావితం చేసేలా ఈ చర్య ఉండకూడదు. అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగాల ఎంపికకు ఈ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలి’ అని ఆమె కోరారు.
ఇక ఈ ప్రతిపాదనను నేషనల్ అసోసియేషన్ ఆప్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) నిర్ద్వందంగా తప్పు పట్టింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇలాంటి నిబంధనలు కంపెనీలు వేరేచోటకు తరలిపోయేలా చేస్తాయని, ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగినవారి కొరత భారీగా ఉందని, కర్ణాటక కూడా అందుకు మినహాయింపు కాదని’’ చెప్పింది.
‘‘రాష్ట్ర జీడీపీలో దాదాపు 25శాతం సాంకేతిక రంగం నుంచే వస్తోంది. అలాగే రాష్ట్రం అత్యున్నత అభివృద్ధి సాధించేందుకు జాతీయ సగటుకన్నా ఎక్కువ తలసరి ఆదాయం పొందడంలో కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలోని డిజిటల్ ప్రతిభలో నాలుగో వంతుకు పైగా ఉన్న ఈ రాష్ట్రంలో మొత్తం జీసీసీలలో 30 శాతానికి పైగా గ్లోబల్ కేపబుల్ సెంటర్లు, 11,000 స్టార్టప్లు ఉన్నాయి. పరిశ్రమ వృద్ధికి ఆటంకం కలిగించే ఈ తరహా బిల్లు ఉద్యోగాలను, రాష్ట్ర బ్రాండ్ ను దెబ్బతీయడం చాలా బాధాకరమని’’ నాస్కామ్ పేర్కొంది. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
‘‘దేశంలోనూ, రాష్ట్రంలోనూ నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. మేం ఉద్యోగాలను సృష్టించడం లేదు. కాబట్టి స్థానికులకు పని లభించేలా రిజర్వేషన్లు సృష్టించడం ప్రభుత్వానికి సులభమైన మార్గం. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి బదులు ప్రభుత్వం దొడ్డిదారి పరిష్కారాలు వెదుకుతోంది’’ అని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ వి.బాలకృష్ణన్ అన్నారు.
ఐటీ రంగంలో దాదాపు 40 శాతంమంది బెంగళూరులోనే ఉన్నారని ఆయన చెప్పారు. ఇక్కడి ఐటీ రంగం బయటి ప్రాంతాలలోని ప్రతిభావంతులను ఆకర్షిస్తోంది.ఇక్కడి పరిస్థితులు బాగున్నాయి. ఇలాంటి వాతావరణాన్ని పాడుచేస్తే, తిరిగి దానిని నిర్మించడం కష్టమవుతుంది అని ఆయన చెప్పారు.
కానీ కర్ణాటక చిన్నతరహా పరిశ్రమల సంఘం (కేఏఎస్ఎస్ఐఏ) మాజీ అధ్యక్షుడు సీకే పద్మనాభ వాదన మరోలా ఉంది. ‘‘మేం (చిన్నతరహా పరిశ్రమల వాళ్ళం) కన్నడిగులకు 70శాతం ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వారు ఎక్కడ ఉన్నారు. మనవాళ్లు 8 గంటలు పనిచేయడానికి ముందుకు రారు. మా పరిశ్రమకు కష్టపడి పనిచేసేవారు కావాలి. కానీ ఏవో కారణావల్ల అందరూ సేవారంగాలవైపు వెళ్లాలని కోరుకుంటున్నారు’’ అని చెప్పారు.
చిన్నతరహా పరిశ్రమలలో సహాయకులుగా కూడా పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి నిరుద్యోగులు బెంగళూరుకు వస్తున్నారని పద్మనాభ చెప్పారు.

ఫొటో సోర్స్, SANTOSH LAD/FACEBOOK
కార్మిక మంత్రి ఏమన్నారంటే..
ఈ రిజర్వేషన్ బిల్లును కార్మికశాఖ మంత్రి సంతోష్ లాడ్ సమర్థించారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ ‘‘ఇది ఉద్యోగాల రిజర్వేషన్ కాదు. మేం ఈ విషయంలో చాలా పారదర్శకంగా ఉన్నాం. ఇది కేవలం ఓ ధ్రువీకరణ కార్యక్రమం. 70శాతం ఉద్యోగాలు తప్పనిసరని మేం చెప్పడం లేదు. 70శాతం ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాకపోతే కనీసం 20శాతమైన ఇవ్వమని చెబుతున్నాం. యువతలో చాలా నిరాశ ఉంది. ఓ మంత్రిగా యువతను రక్షించాల్సిన బాధ్యత ఉంది. ఇందులో అసహజమైన విషయం ఏముంది’’ అని చెప్పారు.
‘‘వ్యాపారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినప్పుడు ఉద్యోగులు బిహార్ నుంచి తమిళనాడు నుంచి రావాలని చెప్పరు. కానీ వాస్తవం ఏమిటంటే హెచ్‌ఆర్ మేనేజర్లు తమ రాష్ట్రాలవారినే నియమించుకుంటున్నారు. స్థానికులెవరికీ అవకాశం ఇవ్వడం లేదు’’ అని లాడ్ చెప్పారు.
రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేందుకు నైపుణ్యం కలిగినవారు దొరకడంలేదనే విమర్శ అర్థరహితమైనదని ఆయన చెప్పారు. ‘‘ఫలానా నైపుణ్యం ఇక్కడ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఎన్నడైనా పరిశ్రమ వర్గాలు ప్రభుత్వాన్ని సంప్రదించాయా’’ అని ప్రశ్నించారు. ‘‘ఇక్కడో పెద్ద నేచురోపతి సంస్థ ఉంది. అందులో 2,500మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో రాష్ట్రం నుంచి కనీసం 20మంది ఉద్యోగులు కూడా అక్కడ కనిపించరు’’ అని చెప్పారు.
న్యాయనిపుణులు ఏమంటున్నారు?
‘‘ఇటువంటి చట్టాన్నే 2020లో హరియాణా ప్రభుత్వం తీసుకువచ్చింది. కానీ రాజ్యాంగంలోని 19వ అధికరణకు అది విరుద్ధమంటూ హైకోర్టు దానిని కొట్టివేసింది. వ్యాపారం చేసుకునే హక్కును నియంత్రించకూడదు’’ అని కర్ణాటక మాజీ అడ్వకేట్ జనరల్ అశోక్ హర్ణహళ్లి చెప్పారు.
డాక్టర్ ప్రదీప్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1984లో ఇచ్చిన తీర్పును అశోక్ ప్రస్తావించారు. ఆ తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 5ను ఉటంకిస్తూ ‘భారతదేశంలో నివాసం’ అని ఒకే ఒక్క నివాసం ఉందని, దానిని చట్టబద్ధ ప్రయోజనం కోసం కాకుండా ఇతర ప్రయోజనాలకు ఉపయోగిస్తే ఐక్యతను, సమగ్రతను విచ్ఛిన్నం చేస్తుందని ఆ తీర్పు పేర్కొన్న విషయాన్ని అశోక్ వివరించారు.
మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీటీ వెంకటేష్ బీబీసీ తో మాట్లాడుతూ ప్రతిపాదిత చట్టం రాజ్యాంగ విరుద్ధమ న్నారు. ‘‘కన్నడిగులను మాత్రమే ఉద్యోగాల్లో చేర్చుకోమని రాష్ట్రప్రభుత్వం అడగకూడదు. అనేక దేశాలలో అనుసరిస్తున్నట్టు వివిధ ప్రాంతాల వారిని చేర్చుకోమని అడగాలి. సమ్మిళిత విధానమే నిబంధనగా ఉండాలని ప్రభుత్వం చెప్పాలి’’ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రాండ్ బెంగళూరు పరిస్థితేంటి?
బ్రాండ్ నిపుణుడు హరీష్ బిజూర్ బీబీసీతో మాట్లాడుతూ బెంగళూరును మినీ ఇండియా అన్నారు. ఇక్కడ అని భాషలు, సంస్కృతులు, ఆహారం, ఆహార్య మేళవింపును చూడొచ్చు. ప్రతిపాదిత బిల్లు కచ్చితంగా బెంగళూరు బ్రాండ్‌ను దెబ్బతీస్తుంది అని చెప్పారు.
బిజూరి మాటలు విలువైనవే. ఎందుకంటే కోవిడ్ లాక్‌డౌన్ ముగిసిన తరువాత అనేకమంది బడా బిల్డర్లు చేసిన మొదటి పని ఏమిటంటే నిలిచిపోయిన భవన నిర్మాణాలను పూర్తిచేయడానికి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ సహా దేశంలోని ఇతర ప్రాంతాలనుంచి కార్మికులను తీసుకురావడానికి ఓ విమానాన్ని అద్దెకు తీసుకున్నారు. వీటిల్లో ప్రతిరాష్ట్రానికి బెంగళూరుకు లేని ప్రత్యేకత ఒకటి ఉంది’’ అని బిజూర్ చెప్పారు.
మరోవైపు ఆంధప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో వెంటనే స్పందించారు. ‘‘మీకు స్వాగతం పలకడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది. మమ్మల్ని సంప్రందించండి’’ అని ఐటీ రంగానికి విజ్ఞప్తి చేశారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














