ఉషా చిలుకూరి గురించి ఆమె దగ్గరి బంధువులు ఏం చెప్పారంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లక్కోజు శ్రీనివాస్, వడిశెట్టి శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఉషా వాన్స్ అనే ఈ పేరు ఇప్పుడు అమెరికా రాజకీయాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తోంది.
దీనికి కారణం ఉషా వాన్స్ అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన జేమ్స్ డేవిడ్(జేడీ) వాన్స్ భార్య కావడమే.
ఉషా వాన్స్ తెలుగు సంతతికి చెందిన మహిళ. ఆమె అసలు పేరు ఉషా చిలుకూరి. ఉషా పూర్వీకులది ఆంధ్రప్రదేశ్.
రిపబ్లికన్ అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరును ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో భారత్‌లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉషా చిలుకూరి పేరు వైరల్ అవుతోంది.
ఉషా చిలుకూరి బంధువులు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నారు.
విశాఖలో నివాసం ఉంటున్న 96 ఏళ్ల ప్రొఫెసర్ చిలుకూరి శాంతమ్మ, ఉషా చిలుకూరికి దగ్గరి బంధువు.
ఉషా చిలుకూరి మేనత్త శారద కుటుంబం ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్నారు.


అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఉష భర్త జేడీ వాన్స్‌ను రిపబ్లిక్ పార్టీ ఎంపిక చేయడం పట్ల ఆమె మేనత్త శారదతో పాటు దగ్గరి బంధువు శాంతమ్మ సంతోషం వ్యక్తం చేశారు.
తమ తండ్రి, తాతల ఊరు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరిలో గల తణుకు దగ్గర ఉండేదని బీబీసీతో చెప్పారు శారద.
కానీ, చాలాకాలం కిందటే తాము మద్రాసులో స్థిరపడ్డామని ఆమె తెలిపారు. ఉషా చిలుకూరి తండ్రికి శారద సోదరి అవుతారు.
"మా పూర్వీకులు తణుకు సమీపంలోని ఒడ్డూరులో ఉండేవారు. మా తాత కూడా ఉద్యోగి. ఉద్యోగం రీత్యా వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. మా నాన్న చెన్నైలో ఉద్యోగం చేశారు. నేను, మా అన్న (ఉష తండ్రి) కూడా అక్కడే పుట్టాం. ఒడ్డూరుతో సంబంధాలు తక్కువ. తొలినాళ్లలో బంధువుల ఇంట్లో కార్యక్రమాలకు హాజరయిన గుర్తు ఉందంతే. మా అన్న చెన్నైలో చదువుకుని అమెరికాలో స్థిరపడ్డారు. మేం చెన్నైలో ఉంటున్నాం.
మా అన్నయ్య కుటుంబం, ఉషా కుటుంబంతో మాకు అనుబంధం ఉంది. ఉషా, ఆమె భర్త ఈ స్థాయికి చేరడం మా కుటుంబమంతటికీ గర్వకారణం. మరింత ఉన్నతస్థాయికి చేరాలని ఆశిస్తున్నాం." అని ఉషా చిలుకూరి మేనత్త శారద అన్నారు.
ఉషా చాలా తెలివైన పిల్లని, జేడీ వాన్స్ ఈ స్థాయికి చేరడంలో ఆమె పాత్ర ఉందని శారద అన్నారు.
ఉషతో తనకు పెద్దగా కమ్యూనికేషన్ లేదని, ఎప్పుడన్నా ఒకసారి ఆమెతో చాట్ చేస్తుంటానని శారద వెల్లడించారు. జేడీ వాన్స్‌ను రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్ధిగా ప్రకటించిన విషయం టీవీలో చూసిన వెంటనే తాను ఉషకు ఫోన్ చేసి అభినందనలు తెలిపినట్లు శారద వెల్లడించారు.
ఈ ఎన్నికల్లో ట్రంప్, జేడీ వాన్స్ గెలుస్తారని శారద ఆశాభావం వ్యక్తం చేశారు.

లా చదివేటప్పుడు జేడీ వాన్స్, ఉషా కలుసుకున్నారని, తర్వాత ప్రేమ వివాహం చేసుకున్నారని బీబీసీతో చెప్పారు ఉషా దగ్గరి బంధువు శాంతమ్మ.
తన భర్త సోదరుడి కొడుకు కూతురే ఉషా అని శాంతమ్మ ఆమెతో ఉన్న తన బంధుత్వాన్ని వివరించారు.
మొదటి నుంచి ఉషా కుటుంబం ఫారిన్‌లో ఉండటం వల్ల తమకు పెద్దగా రాకపోకలు లేవని ఆమె అన్నారు.
అయితే, చెన్నైకి వెళ్లినప్పుడు ఉషా తండ్రిని కలిసేదాన్నని ఆమె చెప్పారు.
ఇప్పుడు ఉషా కుటుంబం ఈ స్థాయికి చేరుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు.
అమెరికాలో జరిగిన ఉషా పెళ్లికి ఆమె మేనత్త శారద హాజరయ్యారని శాంతమ్మ తెలిపారు.
ఉషా పూర్వీకులు తణుకులోని ఒడ్డూరు వానపాములకు చెందిన వాళ్లని శాంతమ్మ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తాను శాన్ డియాగోలోని ఒక మిడిల్ క్లాస్ కమ్యూనిటీలో పెరిగానని ఉషా వాన్స్ ఒక ప్రసంగంలో చెప్పారు.
తన తల్లిదండ్రులు భారత్ నుంచి వలస వచ్చారని, తనకు ఒక సోదరి ఉందని ఆమె తెలిపారు.
లా చదివేటప్పుడు జేడీ వాన్స్‌ను కలుసుకున్నానని, అప్పటి నుంచి ఇప్పటివరకు తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అతనేనని ఉషా అన్నారు.
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, 2013లో వీరిద్దరూ యేల్ లా స్కూల్‌లో తొలిసారి కలుసుకున్నారు. ‘సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా’’ అనే అంశంపై జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు.
2014లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఉషా, జేడీ వాన్స్ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇవాన్, వివేక్, మీరాబెల్ వారి పేర్లు.
ఉషా అమెరికాలోనే పుట్టి పెరిగారు. ఆమె హిందూ సంప్రదాయంలో పెరగగా, జేడీ వాన్స్ క్యాథలిక్ మతాన్ని అనుసరిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉషాపై భర్త ప్రశంసలు
ఉషా కెరీర్ ఆమె భర్తకు భిన్నంగా కనిపిస్తుంది. యేల్ యూనివర్సిటీ నుంచి బీఏ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఉషా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఎర్లీ మోడ్రన్ హిస్టరీలో ఎం.ఫిల్ చేసినట్లు ఆమె లింక్డ్ ఇన్ ప్రొఫైల్‌లో ఉంది.
గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్‌కు క్లర్క్‌గా కూడా ఉషా వాన్స్ పని చేశారు. ప్రస్తుతం లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు.
జేడీ వాన్స్ తరచూ భార్యను పొగుడుతుంటారు. ఆమెను తన యేల్ యూనివర్సిటీ ‘ఆధ్యాత్మిక గురువు’గా అభివర్ణించేవారు.
సీఎన్ఎన్ రిపోర్టు ప్రకారం, జేడీ వాన్స్ ఓ సందర్భంలో ఉషా గురించి ఇలా రాశారు. ‘‘ నాకు కూడా తెలియని ప్రశ్నలను ఆమె అర్థం చేసుకుంటుంది."
తనకు తెలియని అనేక అవకాశాల గురించి కూడా తనకు ఉషా చెబుతూ ఉంటుందని వాన్స్ పేర్కొన్నారు.
‘‘ఆమె జ్ఞానం గురించి చాలామందికి తెలియదు. వెయ్యి పేజీల పుస్తకాన్ని కూడా కొన్ని గంటల్లోనే చదివేయగలదు.’’ అన్నారు జేడీ వాన్స్.
నా పక్కనుండి ధైర్యాన్ని నింపే మహిళ ఆమె అని, తనకు మార్గదర్శిగా వ్యవహరిస్తుందని వాన్స్ తరచూ చెబుతుంటారు.
‘‘నేను మరీ ఊహల్లో తేలుతుంటే ఉషా నన్ను అప్పుడప్పుడు భూమి మీదకు దింపుతుంటారు.’’ అని 2020లో మేగిన్ కెల్లీ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు జేడీ వాన్స్.
‘‘నేనెప్పుడైనా అతి గర్వంగానో, మేథావిగానో ఫీలయినప్పుడు వెంటనే ఆమె గుర్తుకు వస్తుంది. ఆమె నాకన్నా చాలా సాధించింది అన్న విషయం గుర్తు చేసుకుంటాను.’’ అని వాన్స్ అన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














