అమెరికా: 60 ఏళ్ల కిందట అధ్యక్షుడు కెనడీని కాల్చి చంపారు, అప్పుడేం జరిగింది?

కెనడీ, ఆయన భార్య

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కార్యక్రమానికి ముందు ఓపెన్ టాప్ కారులో కెనడీ, ఆయన భార్య

అమెరికాలో ఆదివారం ఉదయం దేశ మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది.

సుమారు 60 ఏళ్ల క్రితం అమెరికా 35వ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెనడీని కాల్చి చంపిన ఘటనను ఈ సంఘటన గుర్తు చేసింది.

అమెరికా అధ్యక్షుల్లో అత్యంత పిన్న వయసులోనే పదవిని చేపట్టిన వారిలో ఒకరిగా జాన్ ఎఫ్.కెనడీకి పేరుంది. జనాకర్షణ ఉన్న నేతగా, సంస్కరణవాదిగా ఆయనకు గుర్తింపు ఉంది.

కెనడీపై జరిగిన దాడికి వేలమంది ప్రేక్షకులు ప్రత్యక్ష సాక్షులయ్యారు. ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు, కుట్ర కథనాలు, రిపోర్టులు తెరపైకి వచ్చాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
పోలీసు రికార్డులో నిందితుడి ఫోటో

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పోలీసు రికార్డులో నిందితుడు ఓస్వాల్డ్ ‌ఫోటో

‘ఓపెన్ కారులో ప్రయాణించడం అధ్యక్షుడు కెనడీకి భలే ఇష్టం’

బహిరంగ ప్రదేశాల్లో, ఓపెన్ టాప్ కారుల్లో నాయకులు పర్యటనలు చేస్తున్నారంటే అది భద్రతా సిబ్బందికీ, ఇంటెలిజెన్స్‌కు, దాని ఏజెంట్లకు పెద్ద సవాలే.

బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఇరు వైపులా ఉంటారు. సాధారణ ప్రజల మధ్యలో ఎక్కడో ఒక దుండగుడు కూడా ఉండొచ్చు.

నాయకులు ఇలా రోడ్డు షోలలో పాల్గొంటున్నప్పుడు లాంగ్ రేంజ్ స్నైపర్ గన్‌తో దుండగులు కాల్పులు జరిపితే వారిని గుర్తించడం కూడా కష్టమే. ఇలాంటి సంఘటనే అమెరికాలో 1963 నవంబర్ 22న జరిగింది.

అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెనడీ, ఆయన భార్య జాక్వలైన్ జాకీ కెనడీపై దాడి జరిగింది. ఆ సమయంలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ క్లింట్ హిల్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న కారు వెనక మరో కారులో ప్రయాణిస్తున్నారు.

ఓపెన్ కారులో ప్రయాణించడం అధ్యక్షుడు కెనడీకి ఎంతో ఇష్టమని చెబుతారు.

ఆ రోజు అధ్యక్షుడు, ఆయన భార్య జాక్వలైన్ ఓపెన్ లిమోసిన్‌ (ఒక బ్రాండ్) కారులో ప్రయాణిస్తున్నారు. టెక్సస్‌ రాష్ట్రంలోని డాలస్‌లో వారి పర్యటన సాగుతోంది. ఆ రోజు వీధుల్లో ఎక్కడ చూసిన జనమే కనిపించారు.

అధ్యక్షుడి మీద డాలస్‌‌లో చాలామంది అసంతృప్తితో ఉన్నట్లు క్లింట్ హిల్‌కు సమాచారం ఉంది. కెనడీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించేవారు ఆ ప్రాంతంలో ఉన్నారు. కానీ, కెనడీపై దాడి జరగొచ్చనే హెచ్చరికలు మాత్రం రాలేదు.

అప్పుడే, క్లింట్‌హిల్ తన కుడి భుజం నుంచి ఏదో వెళ్లిన శబ్దాన్ని విన్నారు. ఆయన అలర్ట్ అయ్యారు. ముందు ప్రయాణిస్తున్న కారువైపు పరుగెత్తారు. కానీ, అప్పటికే అధ్యక్షుడిపై కాల్పులు జరిగాయి. సీక్రెట్ ఏజెంట్లు జాన్ ఎఫ్.కెనడీ భార్యను కారులో లోపల దాచిపెట్టి, చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు.

ప్రెసిడెంట్ కెనడీ చనిపోయే నాటికి ఆయనకు 46 ఏళ్లే. అంతకు మూడేళ్ల ముందే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

కెనడీ

ఫొటో సోర్స్, AFP

ఒక ఘటన, ఎన్నో కథనాలు

సంఘటన జరిగినప్పుడు అధ్యక్షుడి ముందు సీటులో కూర్చున్న టెక్సస్ గవర్నర్‌కు కూడా గాయాలయ్యాయి.

కెనడీపై దాడి జరిగిన తర్వాత గంటలోపే జేడీ టిప్పిట్ అనే పోలీసు అధికారి కూడా హత్యకు గురయ్యారు. ఆ తర్వాత లీ హార్వే ఓస్వాల్డ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అధ్యక్షుడు కెనడీని, పోలీస్ అధికారి టిప్పిట్‌ను హత్య చేసినట్లు ఆయనపై అభియోగాలు మోపారు.

ఈ హత్యలు ఆయనొక్కరే చేశారా? లేదంటే మరెవరైనా ఆయనతోపాటు ఉన్నారా? హత్యకు సంబంధించిన ప్లాన్ ఎప్పుడు మొదలు పెట్టారు, ఎవరు మొదలు పెట్టారు? విదేశీ ప్రమేయం ఉందా? లాంటి అనేక సందేహాలు అమెరికాలో చర్చనీయాంశంగా మారాయి.

అధ్యక్షుడి హత్య జరిగిన రెండు రోజుల తర్వాత అంటే నవంబర్ 24న డాలస్ పోలీసు డిపార్ట్‌మెంట్ బేస్‌మెంట్‌లో ఉన్న ఓస్వాల్డ్‌ను స్థానిక నైట్‌క్లబ్‌ యజమాని జాక్ రూబీ హత్య చేశారు.

ఓస్వాల్డ్‌ను హత్య చేసినందుకు రూబీకి మరణ శిక్ష పడింది. ఈ శిక్షపై ఆయన అప్పీల్ దాఖలు చేశారు. కానీ, దీనిపై విచారణ ప్రారంభానికి ముందే 1967లో క్యాన్సర్‌తో మరణించారు.

ఈ హత్యలపై వాషింగ్టన్ పోస్టు మాజీ రిపోర్టర్ జెఫర్సన్ మోర్లీ పలు పుస్తకాలు రాశారు.

‘‘ఈ హత్యల గురించి కేవలం వాస్తవాలను మాత్రమే రాశాను. కుట్ర కథనాలను కాదు’’ అని ఆయన చెప్పారు.

కెనడీపై కాల్పులు వెనుక నుంచి కాదు, ముందు నుంచి జరిగినట్లు జెఫర్సన్ భావించారు. జాప్రుడర్ అనే వ్యక్తి వీడియో కెమెరాలో కెనడీ చివరి క్షణాలు రికార్డయ్యాయి.

కెనడీని వెనకవైపు నుంచి కాల్చారని కొందరు వాదించగా, ముందు నుంచి కాల్చారని జెఫర్సన్ అభిప్రాయపడ్డారు.

అలాగే, ఒక వ్యక్తి కాల్పులు జరిపినప్పుడు, గన్‌పౌడర్ తన శరీరంపై ఉంటుంది. ఆయన కాల్చాడా లేదా అన్నది నిర్ధరించడానికి అనుమానితుడికి పారాఫిన్ పరీక్ష చేస్తారు. ఈ పరీక్ష విశ్వసనీయతపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఓస్వాల్డ్ బుగ్గపై చేసిన పారాఫిన్ పరీక్షలో గన్‌పౌడర్ లేదు. ఓస్వాల్డ్ నిజంగా బుల్లెట్ పేల్చాడా అన్నది డౌట్. పైగా, కెనడీ చనిపోవడానికి, టెక్సస్ గవర్నర్ గాయపడటానికి కారణం ఒకే బుల్లెట్ అని వారెన్ కమిషన్ రిపోర్టు పేర్కొనగా, రెండూ వేర్వేరని, ఒకే బుల్లెట్ కాదని టెక్సస్ గవర్నర్ జాన్ కానల్లీ అప్పట్లో వ్యాఖ్యానించారు.

కెనడీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కెనడీని వెనుక నుంచి కాదు, ముందు నుంచి కాల్చినట్లు చెప్పిన జెఫర్సన్

ఓస్వాల్డ్ మీద అప్పటికే పోలీస్ రికార్డు నమోదై ఉంది. ఆయన సోవియట్ యూనియన్ పక్షపాతిగా పేర్కొన్నారు.

‘‘1959లో ఓస్వాల్డ్ తనకు తాను మార్క్సిస్ట్‌గా ప్రకటించుకుని సోవియట్ యూనియన్‌ను సందర్శించారు. సోవియట్ పౌరసత్వానికి కూడా ఓస్వాల్డ్ దరఖాస్తు చేసుకున్నారు. 1962 వరకు అక్కడే నివసించారు. కెనడీ హత్యకు రెండు నెలల ముందు 1963 సెప్టెంబర్‌లో మెక్సికో నగరంలోని క్యూబన్, రష్యా రాయబార కార్యాలయాలను ఓస్వాల్డ్ సందర్శించారు. అక్కడ సోవియట్ లేదా క్యూబన్ ఇంటెలిజెన్స్ అధికారులను ఓస్వాల్డ్ కలిశారా? అనే అనుమానాలు ఉన్నాయి.’’ అని వారెన్ కమిషన్ రిపోర్టును ఉటంకిస్తూ ప్రొఫెసర్ థామస్ వెలాన్ అన్నారు.

కెనడీ తర్వాత లిండన్ బి. జాన్సన్ అమెరికాకు అధ్యక్షుడు అయ్యారు. కెనడీ హత్య తర్వాత జరిగిన సంఘటనలను విచారించేందుకు వారెన్ కమిషన్‌ను ఆయన నియమించారు. 1964 సెప్టెంబర్‌లో వారెన్ కమిషన్ తన రిపోర్టును సమర్పించింది.

ఆ రిపోర్టులో సౌత్‌వెస్ట్ టెక్సస్ స్కూల్ డిపాజిటరీలోని ఆరవ అంతస్తు నుంచి ఓస్వాల్డ్ కాల్పులు జరిపాడని ఉంది. జాతీయ లేదా అంతర్జాతీయ కుట్రలో లీ, రూబీలకు ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని కమిషన్ గుర్తించింది.

1968లో, వారెన్ కమిషన్‌ అందించిన రిపోర్టును నలుగురు ఫిజిషియన్ల ప్యానల్ ఆమోదించింది.

కెనడీ, ఆయన హత్యకు సంబంధించి 40 వేలకు పైగా పుస్తకాలు ప్రచురితమయ్యాయి. సెనేట్ ఆర్క్వైవ్ చేసిన లక్షల కొద్ది డాక్యుమెంట్లు 1992 నుంచి ప్రజల ముందుకు రావడంతో, ఎన్నో కొత్త విషయాలు, పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి.

2017 సర్వేలో కెనడీ హత్యలో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రమేయం ఉన్నట్టు 61 శాతం మంది అమెరికన్లు భావిస్తున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఏళ్లల్లో జరిపిన సర్వేల్లో మాత్రం భిన్నమైన అభిప్రాయాలు వినిపించాయి.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)