నెపోలియన్: ఈ తుపాకులతో కాల్చుకుని చచ్చిపోదామనుకున్నారు, వేలంలో ఎంత ధర పలికాయంటే...

నెపోలియన్

ఫొటో సోర్స్, Osenat auction house

ఫొటో క్యాప్షన్, ఈ తుపాకులతోనే నెపోలియన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు
    • రచయిత, క్యాథరిన్ ఆర్మ్‌స్ట్రాంగ్
    • హోదా, బీబీసీ న్యూస్

ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే కి చెందిన రెండు పిస్టల్స్ వేలంలో 1.69 మిలియన్ యూరోలు (సుమారు 15 కోట్ల 30 లక్షల రూపాయలు)కు అమ్ముడుపోయాయి.

పారిస్ తుపాకీ తయారీ సంస్థ లూయిన్ మారిన్ గోసెట్ రూపొందించిన ఈ ఆయుధాలు 1.2 మిలియన్ యూరోల నుంచి 1.5 మిలియన్ యూరోల ( సుమారు రూ. 10 కోట్ల నుంచి రూ. 13 కోట్ల) మధ్యన అమ్ముడవుతాయని అంచనా వేశారు.

నెపోలియన్ 1814లో అధికారాన్ని కోల్పోయిన తరువాత ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఫౌంటెయిన్ బ్లూ ప్యాలెస్ పక్కనే ఉన్న ఓసెనాట్ ఆక్షన్ హౌస్‌లో ఆదివారం నాడు ఈ తుపాకులను వేలం వేశారు.

ఫ్రాన్స్ సాంస్కృతిక శాఖ మంత్రి ఇటీవల ఆ తుపాకులను జాతీయ సంపదగా గుర్తించి, వాటి ఎగుమతిపై నిషేధం విధించిన తరువాత అవి అమ్మకానికి వచ్చాయి.

దీంతో ప్రస్తుతం వీటిని కొనుగోలు చేసిన కొత్త యజమాని నుంచి వీటిని తిరిగి కొనుగోలు చేసే ప్రతిపాదన పంపడానికి ఫ్రెంచ్ ప్రభుత్వానికి 30 నెలల సమయం ఉంది.

అలాగే వీటిని జాతీయ సంపదగా గుర్తించిన నేపథ్యంలో ఆ తుపాకులను తాత్కాలికంగా మాత్రమే విదేశాలకు పంపడానికి అవకాశంఉంది.

ఈ తుపాకులను బంగారం, వెండితో తాపడం చేశారు. వీటిపై నెపోలియన్ బొమ్మను కూడా చెక్కారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
నెపోలియన్ చిత్రం

ఫొటో సోర్స్, GETTY IMAGES

విదేశీ సైన్యం తన బలగాలను ఓడించి, అధికారాన్ని వదులుకోవలసి వచ్చినప్పుడు నెపోలియన్ 1814 ఏప్రిల్ 12 రాత్రి ఈ తుపాకులతోనే ఆత్మహత్య చేసుకోవాలని భావించారని చెబుతారు.

అయితే సీనియర్ అధికారి అర్మాండ్ డి కౌలైన్‌కోర్ట్ ఈ తుపాకుల నుంచి మందుగుండును తీసివేశారు. దాంతో నెపోలియన్ విషం తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. కానీ ప్రాణాలతో బయటపడ్డారు.

ఆ తరువాత నెపోలియన్ రెండు తుపాకులను కౌలైన్‌కోర్ట్‌కి ఇచ్చారు. ఆయన వాటిని తన వారసులకు అందజేశారు.

వేలంలో పిస్టల్స్‌కు సంబంధించిన ఒరిజినల్ బాక్స్ , గన్‌పౌడర్ భద్రపరిచే కొమ్ము, పౌడర్ ట్యాంపింగ్ రాడ్‌లు, వివిధ ఉపకరణాలు కూడా ఉంచారు.

వీటితోపాటు నెపోలియన్ చివరిరోజుల నాటి చిత్రాన్ని కూడా అమ్మినట్టు వేలం నిర్వాహకుడు జీన్-పియర్ ఒసేనాట్ చెప్పారు.

నెపోలియన్ స్మృతి చిహ్నాలు ఇంకా చాలా ఉన్నాయి.

ఆయన బ్రాండ్‌లో భాగమైన ట్రైకార్న్ టోపీలలో ఒకటి నవంబర్‌లో 1.9 మిలియన్ యూరోలకు (సుమారు 17 కోట్ల రూపాయలకు పైగా) అమ్ముడుపోయింది.

నెపోలియన్ బోనపార్టే‌ను మెడిటరేనియన్ ద్వీపానికి ప్రవాసానికి పంపగా, 1815లో తిరిగి అధికారంలోకి వచ్చారు. కానీ, ఆ తర్వాత జరిగిన వాటర్లూ యుద్ధంలో ఓడిపోయారు.

రెండోసారి దక్షిణ అట్లాంటిక్‌లోని సెయింట్ హెలెనా ద్వీపానికి ఆయనను పంపారు.

1821లో నెపోలియన్ మరణించారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)