మోదీ మెచ్చిన అరకు కాఫీ అసలు ఆంధ్రప్రదేశ్‌లోకి ఎలా వచ్చింది?

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Twitter/Narendra Modi

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

అరకు కాఫీ అంటే తనకు చాలా ఇష్టమని ప్రధాని నరేంద్రమోదీ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

2016లో విశాఖపట్నంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతరులతో కలిసి కాఫీ తాగిన ఫోటోలను ఆయన తాజాగా తన పోస్ట్‌లో షేర్ చేశారు.

ఇక్కడి కాఫీ సాగు అనేది గిరిజనుల సాధికారతకు సంబంధించిన గొప్ప అంశమని పేర్కొన్నారు.

మోదీ ట్వీట్‌ను నారా చంద్రబాబు నాయుడు రీపోస్ట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

గిరిజన సోదరులు, సోదరీమణులు ప్రేమ, భక్తిశ్రద్ధలతో అరకు కాఫీని సాగు చేస్తారని తన రీపోస్ట్‌లో చంద్రబాబు పేర్కొన్నారు.

‘‘ఇది గిరిజనుల సాధికారత, ఆవిష్కరణల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల సామర్థ్యానికి ఇది నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అయిన అరకు కాఫీని షేర్ చేసి, ఎండార్స్ చేస్తున్నందుకు ప్రధాని మోదీకి ధన్యావాదాలు’’ అని చంద్రబాబు రాశారు.

భారతదేశంలో అరకు కాఫీ టాప్ బ్రాండ్స్‌లో ఒకటి. వందేళ్ల కిందట విశాఖ మన్యానికి చేరిన ఇది కాఫీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకుంది.

ఇక్కడ గిరిజనులు సేంద్రియ పద్ధతుల్లో కాఫీని పండిస్తుంటారు.

ఇంతకీ ఈ కాఫీ ప్రయాణం అరకు మన్యంలో ఎలా మొదలైంది? ఎలా సాగుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
కాఫీ సాగు

ఫొటో సోర్స్, FACEBOOK/COFFEEBOARDIN

చెట్ల మధ్య తోటల పెంపకం...

విశాఖ ఏజెన్సీకి అసలు కాఫీ ఎలా వచ్చిందనే విషయాన్ని జీసీసీ (గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్) మాజీ ఎండీ రవి ప్రకాష్ గతంలో బీబీసీకి వివరించారు.

"1898లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తూర్పు కనుమలలోని పాములేరు లోయలో ఆంగ్లేయులు కాఫీ పంట వేశారు. అక్కడ్నించి కొద్ది కాలానికి విశాఖ జిల్లా గిరిజన ప్రాంతాల్లోకి కాఫీ పంట విస్తరించింది.

1920 నాటికి కాఫీ అరకు లోయలోని అనంతగిరి, చింతపల్లి ప్రాంతాలకు చేరుకుంది. అయితే అది ఎక్కువగా సాగవలేదు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ 1960లో విశాఖ జిల్లాలోని రిజర్వ్‌ అటవీ ప్రాంతంలో కాఫీ పంటను 10 వేల ఎకరాలలో అభివృద్ధి చేసింది.

ఈ కాఫీ తోటల్ని 1985లో అటవీ అభివృద్ధి సంస్ధకు అప్పగించింది. 1975 నుంచి 1985 వరకు జీసీసీలో ఒక ప్రత్యేక కాఫీ తోటల అభివృద్ధి విభాగం ఉండేది.

సుమారు 4,000 హెక్టార్లలో సేంద్రియ పద్ధతుల్లో కాఫీ తోటల పెంపకం గిరిజన ప్రాంతాల్లో మొదలైంది. సేంద్రియ పద్ధతుల్లో గిరిజనులు ఇక్కడ సాగు చేస్తున్న కాఫీకి 'అరకు కాఫీ' అనే పేరు స్థిరపడింది" అని చెప్పారు.

అరకు కాఫీ సాగు

పోడు వ్యవసాయం వదిలి కాఫీ తోటల్లోకి...

గిరిజన కుటుంబాలలో ఎక్కువమంది రైతులు కాఫీ పంటతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. తాము సంప్రదాయ పద్ధతులలో చేసే పోడు వ్యవసాయాన్ని విడిచిపెట్టి పెద్ద ఎత్తున కాఫీ తోటల పెంపకాన్ని ఆశ్రయించారు.

వందేళ్ల కిందట నుంచే విశాఖ ఏజెన్సీలోని అరకు, అనంతగిరి, జీకే వీధి, చింతపల్లి, పెదబయలు, ఆర్వీనగర్, మినుమలూరు, సుంకరమెట్ట తదితర ప్రాంతాల్లో కాఫీ తోటలను ఆంగ్లేయులు పెంచడం ప్రారంభించారు.

అయితే స్వాతంత్ర్యం అనంతరం ఏర్పాటైన గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 1960 నుంచి ఇక్కడ వాణిజ్యపరమైన కాఫీ తోటల పెంపకం మొదలైంది.

మొదట్లో పది వేల ఎకరాల్లో ప్రారంభమైన కాఫీ తోటలు క్రమక్రమంగా...ఇప్పుడు 1.5 లక్షల ఎకరాల వరకు విస్తరించాయి. ఇంతలా విస్తరించడానికి ఇక్కడి వాతావరణమే ప్రధాన కారణం.

అరకు కాఫీ

అరకు కాఫీ రుచికి కారణం అదే...

అరకు కాఫీ రుచికి ప్రధాన కారణం మన్యంలోని వాతావరణమేనని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ విభాగాధిపతి ప్రొఫెసర్ రామకృష్ణ బీబీసీకి తెలిపారు.

"సముద్ర మట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉండే విశాఖ ఏజెన్సీ కాఫీ తోటల పెంపకానికి అనువైన ప్రదేశం. ఇక్కడి చల్లని వాతావరణం కాఫీ తోటల సాగుకి ఎంతో అనుకూలంగా ఉంటుంది.

ఏజెన్సీలోని కాఫీ తోటలన్నీ సిల్వర్ ఓక్ చెట్ల మధ్యలో సాగవుతాయి. ఈ చెట్ల మధ్య ఉండే కాఫీ మొక్కలపై సూర్యకిరణాలు నేరుగా పడవు. అంతేకాదు ఇక్కడ పొగమంచు కూడా నేరుగా నేలను తాకదు.

దీనివల్ల చల్లదనం మరింత పెరిగి కాఫీ సాగుకు అనుకూలంగా ఉంటుంది. సముద్రమట్టానికి వందల అడుగుల ఎత్తులో ఉండే నేలల్లో క్షారగుణం తక్కువగా ఉండటం కూడా కాఫీకి ప్రత్యేక రుచిని తీసుకొస్తుంది" అని తెలిపారు.

అరకు కాఫీ

అరకు కాఫీకి గోల్డ్ మెడల్.. అంతర్జాతీయ ఖ్యాతి

ప్రపంచంలో కాఫీని అధికంగా పండించే దేశాల్లో భారతదేశానిది ఏడో స్థానం.

బ్రెజిల్ 25 లక్షల టన్నుల కాఫీ ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉంది.

ఇండియా మూడున్నర లక్షల టన్నులతో ఏడో స్థానంలో ఉంది. భారతదేశంలో... 12 రాష్ట్రాలు కాఫీని పండిస్తుండగా అందులో ఎక్కువ భాగం దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో అరబికా రకం కాఫీని పండిస్తారు.

ప్యారిస్‌లో అరకు కాఫీ బ్రాండ్‌ పేరుతో 2017లో కాఫీ షాప్‌ తెరిచారు. భారతదేశం వెలుపల ఏర్పాటైన మొట్టమొదటి 'అరకు కాఫీ' షాప్ ఇది.

నాంది ఫౌండేషన్‌కు అనుబంధంగా మహీంద్రా గ్రూప్‌నకు చెందిన అరకు గ్లోబల్‌ హోల్డింగ్స్‌ సంస్థ దీన్ని ప్యారిస్ లో ఏర్పాటు చేసింది.

ఆ తర్వాత అరకు కాఫీ రుచులు జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్‌ దేశాలకూ పాకాయి.

2018లో పారిస్‌లో జరిగిన ప్రిక్స్ ఎపిక్యూరస్-2018 పోటీలో (Prix Epicures) అరకు కాఫీ గోల్డ్ మెడల్ గెల్చుకుంది.

రుచికరమైన కాఫీ బ్రాండులకి పేరుపొందిన బ్రెజిల్, సుమత్రా, కొలంబోతో పాటు ఇతర దేశాలను వెనక్కి నెట్టి అరకు కాఫీ బంగారు పతకాన్ని పొందడం విశేషం.

అరకు కాఫీ

ఫొటో సోర్స్, FACEBOOK/COFFEEBOARDIN

కాఫీ పిక్క ఎర్రగా మారిన తర్వాతే..

సేంద్రియ పద్ధతుల్లో అరకు కాఫీని పండిస్తారు. కాఫీ మొక్కల నుంచి రాలిపడే ఆకులనే వాటికి మళ్లీ ఎరువుగా వేస్తూ సిల్వర్ ఓక్ వంటి చెట్ల నీడలో వీటిని పెంచుతారు.

ఈ తోటల్లో పనిచేసే కూలీలకు ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది. కాఫీ మొక్కకు వచ్చే పిక్కను మూడు దశల్లో పరిశీలిస్తూ ఎర్రగా చెర్రీ పండు రంగులోకి మారిన వాటిని మొక్క నుంచి వేరు చేస్తారు. వీటినీ చెర్రీఫ్రూట్ అనే పిలుస్తారు.

ఎర్రగా మారిన కాఫీ పిక్కలను ఎప్పటికప్పుడు వేరు చేస్తూ వాటిని ప్రాసెసింగ్ కోసం పంపిస్తారు. ఈ గింజలను ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎఫ్‌డీసీ) కొనుగోలు చేస్తుంది.

కొందరు కాఫీ రైతులు స్వయంగా తమ సొంత యూనిట్లతో కాఫీ పొడిని తయారు చేస్తుంటారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Twitter/Narendra Modi

తోటల నుంచి ప్రాసెసింగ్‌కి...

కాఫీ గింజలను మొక్కల నుంచి వేరు చేసిన తరువాత ప్రాసెసింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ ప్రాసెసింగ్ ఎలా చేస్తారనేది ఏజెన్సీలోని బీస్ పురానికి చెందిన రాము బీబీసీకి వివరించారు.

"ప్రాసెసింగ్ అంటే ఎండబెట్టడం నుంచి కాఫీ పొడి తయారు చేయడం వరకు. మేం ఈ మిషన్లను లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలకు కొంటాం. వీటిలో ముందుగా ఎండబెట్టిన కాఫీ గింజలను మరింత వేడి చేస్తాం. ఆ తరువాత వేడి చేసిన గింజలను మిషన్ లోని జల్లెడపై ఉంచి అరగంట సేపు రోస్టింగ్ చేస్తాం. అనంతరం యంత్రం సహాయంతో కాఫీ పొడి చేసి దానికి రుచిని పెంచడం కోసం చకోరి అనే పొడిని కలుపుతాం. అనంతరం పావు కిలో, అరకిలో ప్యాకెట్లుగా తయారు చేసి రిటైల్ గా అమ్మకాలు చేసేవారికి ఇచ్చేస్తాం. అయితే ఈ ప్రొసెసింగ్ మిషన్ల ద్వారా మేం కేవలం రోజుకి 40 కిలోలు మాత్రమే చేయగలుగుతున్నాం. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన మిషన్ల కొనుగోలుకు ప్రభుత్వం రాయితీకి అందిస్తే రోజుకి 500 కిలోల వరకు చేయగలం" అని చెప్పారు.

అరకు కాఫీ

తోటల పక్కనే అమ్మకాలు...

ప్రాసెసింగ్ తర్వాత ఘుమఘుమలాడే అరకు కాఫీ పొడి రెడీ అయిపోయినట్లే. అయితే పెద్ద మొత్తంలో రైతుల దగ్గర నుంచి జీసీసీ కొనుగోలు చేసి అరకుకాఫీ పేరుతో జీసీసీ స్టాల్స్, రైతు బజారుల్లో అమ్మకాలకు పెడుతుంది.

ఏజెన్సీలో కాఫీ తోటల పక్కనే చాలా మంది రిటైల్ గా కూడా అమ్ముతుంటారు. వీటిని ఇక్కడికి వచ్చే పర్యాటకులు కొనడానికి ఇష్టపడతారు. అరకు, అనంతగిరి, సుంకరమెట్ట తదితర ప్రాంతాల దగ్గర ఇలా కాఫీ తోటల పక్కనే అమ్ముకునేవారు ఎక్కువ మంది కనిపిస్తారు.

ఇలా అమ్మకాలు చేసే ప్రణీత్, సుష్మా బీబీసీతో మాట్లాడారు. "అరకు వచ్చినవారంతా మా వద్ద అరకు కాఫీని కొంటారు. కొందరు ఇక్కడే కాఫీ తాగుతారు. ప్రభుత్వం మా కోసం మంచి స్టాళ్లను ఏర్పాటు చేస్తే మరింత అమ్మకాలు పెరుగుతాయి" అని చెప్పారు.

కాఫీ మ్యూజియం

కాఫీ చరిత్ర మొత్తాన్ని వివరించే కాఫీ మ్యూజియం అరకులో ఉంది.

ఈ కాఫీ మ్యూజియంలో లభ్యమయ్యే కాఫీలు, తయారైన చాకెట్లు, కాఫీ చరిత్రను ఈ మ్యూజియం సూపర్ వైజర్ రామారావు బీబీసీకి వివరించారు.

"ఈ మ్యూజియంలో కాఫీ చరిత్రని తెలిపే చిత్రాలను ఏర్పాటు చేశాం. ఇథియోపియాలో పుట్టిన కాఫీ అరకు వరకు ఎలా వచ్చిందనే విషయాన్ని ఇక్కడికి వచ్చే వారికి వివరిస్తాం. అలాగే కాఫీ రుచులతో నిరంతరం రీసెర్చ్ చేస్తుంటాం. ఆ రీసెర్చ్ ద్వారా కాఫీకి వివిధ రకాల ఫ్లేవర్స్ జోడిస్తూ సరికొత్త రకాల చాకెట్లను తయారు చేస్తాం. అలాగే కాఫీని కూడా వివిధ రకరకాల రుచులలో అందిస్తాం" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)