భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంపై పాకిస్తాన్ ప్రజలు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
2024 జూన్ 29. భారత క్రికెట్ అభిమానుల డైరీలో ఎంతో ముఖ్యమైన రోజు.
భారత్‌కు వేల కిలోమీటర్ల దూరంలో వెస్టిండీస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకుంది.
ఉత్కంఠ పోరులో సాధించిన ఈ విజయంపై భారత్ నుంచే కాదు పొరుగున ఉన్న పాకిస్తాన్ నుంచి కూడా స్పందన వస్తోంది.
ప్రపంచకప్ గెలవడానికి ఇంతకంటే మంచి మ్యాచ్ మరొకటి ఉండదని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు.
"వారు అద్భుతంగా ఆడి ప్రపంచకప్‌ను గెలుచుకున్నారు. రోహిత్ శర్మ కన్నీళ్లతో మోకరిల్లడం ప్రపంచ కప్ అతనికి ఎంత ముఖ్యమైనదో చెబుతుంది. టీమిండియా అహ్మదాబాద్‌లో చేసిన తమ తప్పును సరిదిద్దుకుంది. హార్దిక్ పాండ్యా ప్రదర్శన అద్భుతం. బుమ్రా ఎంతో తెలివైన బౌలర్. బుమ్రా వికెట్లు తీశాడు, తక్కువ పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇది బౌలర్ల మ్యాచ్" అని షోయబ్ అక్తర్ అన్నాడు.
మ్యాచ్ భారత్ చేతుల్లోంచి జారిపోతుందేమో అనిపించిందని, అలాంటి క్షణాలను ఎలా హ్యాండిల్ చేసి మ్యాచ్ గెలవాలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు చూపించిందని షోయబ్ ప్రశంసించాడు.

కమ్రాన్ అక్మల్ ఏం చెప్పాడు?
ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడినని విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించుకున్నాడని పాకిస్తాన్ మాజీ స్టార్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ కొనియాడాడు.
"విరాట్ కోహ్లీ టీ20 నుంచి రిటైర్ అయ్యాడు. కానీ, అతని ఆట మ్యాచ్‌ను భారత జట్టుకు అనుకూలంగా మార్చింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ పేరు నిలిచిపోతుంది. అతడు తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాడు" అని కమ్రాన్ చెప్పాడు.
పిల్లలు క్రికెట్ ఆడాలంటే విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలని, కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ వల్లే భారత్ గెలిచిందని.. అతడు మంచి ప్రతిభ ఉన్న ఆటగాడని నిరూపించుకున్నాడని కమ్రాన్ కొనియాడాడు.

ఫొటో సోర్స్, Getty Images
రమీజ్ రాజా ఏమన్నాడంటే..
పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ డైరెక్టర్ రమీజ్ రాజా కూడా భారత జట్టుపై ప్రశంసలు కురిపించారు.
"భారత్‌కు అభినందనలు. వారు మళ్లీ ఛాంపియన్‌లుగా నిలిచారు. వారు ఆడిన ప్రతి మ్యాచ్‌లో గెలిచి ఛాంపియన్‌లుగా నిలిచారు. వారిలోని ఆత్మవిశ్వాసం, కెప్టెన్ నిలకడ, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం గేమ్‌లో ప్రతిబింబించాయి" అని రమీజ్ రాజా అన్నారు.
"అసాధ్యాలను సుసాధ్యం చేశారు. జట్టుకు ఆటగాళ్లు చాలా ముఖ్యం. ఆటగాళ్లను ఎంపిక చేయడంలో చాలా జాగ్రత్తలు అవసరం. రాహుల్ ద్రవిడ్ అద్భుతమైన వ్యక్తి. పరిస్థితికి అనుగుణంగా జట్టును ఎంపిక చేశారు. భారత్ నుంచి పాకిస్తాన్ నేర్చుకోవలసింది చాలా ఉంది’’ అని రమీజ్ అన్నాడు.

ఫొటో సోర్స్, @WAQYOUNIS99
భారత జట్టుకు, కెప్టెన్ రోహిత్ శర్మలకు పాకిస్తాన్ మాజీ కెప్టెన్, కోచ్ వకార్ యూనిస్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపాడు.
పాకిస్తాన్ జర్నలిస్టులు ఏమనుకుంటున్నారు?
"టోర్నమెంట్ అంతటా భారత్ అజేయంగా నిలిచింది" అని పాకిస్తాన్ జర్నలిస్ట్ సాద్ సాదిక్ ఎక్స్‌లో రాశారు.
‘భారత్‌లో గొప్ప కెప్టెన్సీ, ఫాస్ట్ బ్యాటింగ్ లైనప్, వికెట్లు తీసే బౌలర్లు ఉన్నారు. ఇది కేవలం ఒకరిద్దరు ఆటగాళ్లపై ఆధారపడిన జట్టు కాదని నిరూపించింది’ అని ఆయన పోస్ట్ చేశారు.
భారత్ విజయం నుంచి పాకిస్తాన్ పాఠాలు నేర్చుకోవాలని సాదిక్ అన్నారు.
"జస్ప్రీత్ బుమ్రా రెండు ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతడే మ్యాచ్‌ను భారత్‌కు అనుకూలంగా మార్చాడు" అని మరో పాకిస్తానీ జర్నలిస్ట్ అర్షద్ ట్వీట్ చేశారు.
జస్ప్రీత్ బుమ్రా భారత్‌కు అత్యంత విలువైన ఆస్తి అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘కోహ్లీ వల్లే పాకిస్తాన్‌లో సంబరాలు..’
"విరాట్ కోహ్లీ ఇప్పటివరకు పాకిస్తాన్‌లో అత్యంత ఇష్టపడే భారతీయ క్రికెటర్. అతని వల్లే ఇక్కడ చాలా మంది భారత విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు" అని పాకిస్తాన్‌కు చెందిన షేర్ ఖాన్ ‘ఎక్స్’లో రాశారు.
"ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ పర్యటనకు భారత్ వస్తే, లాహోర్‌లో జరిగే అన్ని మ్యాచ్‌లు హౌస్‌ఫుల్ అవుతాయి. ప్రేక్షకులు మొత్తం 'కింగ్' కోహ్లీని ఉత్సాహపరుస్తారు" అని హంజా చౌదరి అనే వ్యక్తి పోస్ట్ పెట్టారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














