టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లీ

టీ20 వరల్డ్ కప్‌తో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టీ20 వరల్డ్ కప్‌తో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ జట్టు దక్షిణాఫ్రికాపై విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది. ఈ విజయం అనంతరం టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు.

177 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. దీంతో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి, ప్రపంచ కప్ గెలుచుకుంది.

దక్షిణాఫ్రికా జట్టులో క్లాసెన్ 52, డీకాక్ 39, స్టబ్స్ 31, డేవిడ్ మిల్లర్ 21 పరుగులు చేశారు.

క్లాసెన్ కేవలం 27 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్లతో స్కోరు పరుగులెత్తించాడు.

క్లాసెన్ అవుట్ తరువాత దక్షిణాఫ్రికా స్కోరు వేగం మందగించింది. అక్కడికి కొద్దిసేపట్లోనే మార్కో జాన్సన్ అవుట్ కావడంతో చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా 16 పరుగులు చేస్తేనే విజయం దక్కే పరిస్థితి వచ్చింది.

అప్పటికి డేవిడ్ మిల్లర్, కేశవ్ మహారాజ్ క్రీజులో ఉన్నారు.

బీబీసీ న్యూస్ వాట్సాప్ చానల్
రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచకప్ గెలిచిన సంబరాల్లో రోహిత్ శర్మ

చివరి ఓవర్‌లో

చివరి ఓవర్ హార్దిక్ పాండ్య వేయగా తొలి బంతికే ఫలితం దక్కింది. 20వ ఓవర్ తొలి బంతిని ఆడిన డేవిడ్ మిల్లర్ సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

అయితే, ఆ తరువాత క్రీజులోకి వచ్చిన రబడ వచ్చీరాగానే ఫోర్ కొట్టాడు. దాంతో దక్షిణాఫ్రికా విజయం కోసం 4 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి వచ్చింది.

ఓవర్లో అయిదో బంతికి రబడ అవుటయ్యాడు. చివరి బంతికి నోర్జె ఒక పరుగు చేయడంతో దక్షిణాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్‌కు విజయం దక్కింది.

భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య 3 వికెట్లు, అర్షదీప్, బుమ్రా, చెరో 2 వికెట్లు తీసుకోగా.. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు.

దక్షిణాఫ్రికా ఆరంభంలోనే తడబడింది. మూడు ఓవర్లు ముగిసే లోపే రెండు వికెట్లు కోల్పోయింది.

బుమ్రాకు తొలి వికెట్ దక్కింది. బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (4) అవుటయ్యాడు.

ఆ తర్వాత దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్‌రమ్‌ (4) అవుటయ్యాడు.

అర్ష్‌దీప్ బౌలింగ్‌లో కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి మార్క్‌రమ్ పెవిలియన్ చేరాడు. 12 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఈ రెండో వికెట్ కోల్పోయింది.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఇండియా ఇన్నింగ్స్

అంతకుముందు భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

అక్షర్ పటేల్ 31 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు.

కోహ్లీ, అక్షర్ పటేల్ జోడీ నాలుగో వికెట్‌కు 54 బంతుల్లో 72 పరుగులను జోడించింది.

ఆ తర్వాత శివమ్ దుబే (27) రాణించాడు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, ఆన్రిచ్ నోర్జే చెరో 2 వికెట్లు తీశారు.

కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

కోహ్లీ నిలకడగా ఆడడంతో..

అక్షర్ పటేల్ అవుటైన తర్వాత శివమ్ దుబే క్రీజులోకి వచ్చాడు. అప్పటికి కోహ్లీ 44 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఉన్నాడు.

ఓ వైపు కోహ్లీ ఆచితూచి ఆడుతుండగా, దుబే వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి పంపించాడు.

ఈ క్రమంలో జాన్సన్ బౌలింగ్‌లో ఒక సిక్సర్ బాదాడు. షంసీ, నోర్జే ఓవర్లలో ఒక్కో ఫోర్ బాదాడు.

మరోవైపు కోహ్లీ 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

హాఫ్ సెంచరీ తర్వాత కాస్త స్పీడ్ పెంచాడు. రబడ వేసిన 18 ఓవర్‌లో ఒక ఫోర్, ఒక సిక్స్ సహా 14 పరుగులు రాబట్టాడు.

జెన్సన్ వేసిన 19వ ఓవర్‌లోనూ మరో ఫోర్, సిక్స్ కొట్టిన కోహ్లీ తర్వాత రబడకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

అర్ధసెంచరీ తర్వాత ఎదుర్కొన్న 11 బంతుల్లో కోహ్లి 26 పరుగులు చేశాడు.

కోహ్లి 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.

శివమ్ దుబే (27), జడేజా (2), హార్దిక్ పాండ్య (5 నాటౌట్) పరుగులు చేశారు.

అక్షర్ పటేల్

ఫొటో సోర్స్, Getty Images

అక్షర్ పటేల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్

విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టే బాధ్యతను తీసుకున్న అక్షర్ పటేల్ నిలకడగా ఆడాడు.

ఒక బౌండరీతో పాటు నాలుగు సిక్సర్లు బాది స్కోరును ముందుకు నడిపించాడు.

అయితే, ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు.

ఈ ఓవర్‌లో రబడ వేసిన మూడో బంతిని కోహ్లీ ఎదుర్కొన్నాడు. సింగిల్ కోసం అక్షర్ ముందుకు వచ్చాడు. కానీ, డికాక్ బంతిని అందుకోవడంతో కోహ్లీ ఆగిపోయాడు. అయితే, డికాక్ నేరుగా బంతిని నాన్‌స్ట్రయికర్ ఎండ్ వైపు విసిరేయడంతో అప్పటికే ముందుకు కొంత పరుగెత్తుకొచ్చిన అక్షర్ రనౌట్ అయ్యాడు.

47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అక్షర్ పటేల్ అవుటయ్యాడు.

రిషబ్ పంత్

ఫొటో సోర్స్, Getty Images

ఇండియా ఇన్నింగ్స్ ఇలా మొదలైంది

మొదటి ఓవర్‌లో విరాట్ కోహ్లీ మూడు ఫోర్లు బాదడంతో 15 పరుగులు వచ్చాయి.

కానీ, రెండో ఓవర్‌లోనే భారత్‌కు పెద్ద షాక్ తగిలింది.

కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన రోహిత్ శర్మ (9) నాలుగో బంతికి అవుటయ్యాడు.

వన్‌డౌన్‌లో వచ్చిన రిషబ్ పంత్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 23 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది.

తర్వాత బంతిని అందుకున్న కగిసో రబడ మూడో ఓవర్‌లో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ ఓవర్ చివరి బంతికి సూర్యకుమార్ ప్రమాదకర షాట్ ఆడాడు.

కానీ, తర్వాత కూడా క్రీజులో కుదురుకోలేదు.

అయిదో ఓవర్‌లో రబడ బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ (3) అవుటయ్యాడు.

సూర్యకుమార్ స్థానంలో వచ్చిన అక్షర్ పటేల్ తాను ఎదుర్కొన్నతొలి బంతినే బౌండరీకి తరలించాడు.

మొత్తంగా పవర్‌ప్లేలో భారత్ 3 వికెట్లకు 45 పరుగులు చేసింది.

దక్షిణాఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

బ్రిడ్జిటౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌ మైదానంలో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్‌లో గెలవడంతో 13 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ను భారత్ గెలిచినట్లయింది.

ధోని సారథ్యంలోని భారత్ జట్టు చివరగా 2011లో వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. అంతకుముందు 2007లో టీ20 వరల్డ్ కప్‌ను ధోనీ కెప్టెన్సీలోనే భారత్ గెలిచింది.

సుదీర్ఘ క్రికెట్ చరిత్ర ఉన్న దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఏ ఫార్మాట్‌లోనూ వరల్డ్ కప్‌ గెలవలేదు.

వరల్డ్ కప్ ఫైనల్

ఫొటో సోర్స్, ANI

మ్యాచ్‌కు ముందు ఎవరేమన్నారు?

‘‘ప్రపంచ క్రికెట్‌లో మేం ఇప్పటివరకు వరల్డ్ కప్ అందుకోలేకపోయాం. దాన్ని సాధించాలనే సంకల్పమే ఇప్పుడు మా జట్టును నడిపిస్తోంది’’ అని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ అన్నారు.

దక్షిణాఫ్రికా అయిదుసార్లు వన్డే వరల్డ్ కప్‌లో, రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ సెమీస్‌ వరకు వచ్చి ఓటమి పాలైంది.

దక్షిణాఫ్రికాకు ఇదే తొలి వరల్డ్ కప్ ఫైనల్ కాగా, భారత్‌కు గత 8 నెలల్లో ఇది రెండో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.

నిరుడు నవంబర్‌లో వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అద్భుతంగా ఆడుతూ ఫైనల్‌కు దూసుకొచ్చిన భారత్, ఆఖరి పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

‘‘వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి నుంచి మేం బయటపడినట్లే, దక్షిణాఫ్రికా కూడా తమ చరిత్రను పక్కనబెట్టి కొత్తగా బరిలోకి దిగుతుంది. ఆటగాళ్లు పరిస్థితులకు తగినట్లుగా మారతారు’’ అని భారత్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు.

టి20 వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)