భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్‌‌గా గౌతమ్ గంభీర్, ఎవరెవరు పోటీ పడ్డారు, విదేశీ కోచ్‌లు ఎందుకు ఆసక్తి చూపించలేదు?

గౌతమ్ గంభీర్

ఫొటో సోర్స్, R.SATISH BABU/AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, జయ్ షా, గౌతమ్ గంభీర్

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపడతారని బీసీసీఐ సెక్రటరీ జయ్ షా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా తెలియజేశారు.

ఆధునిక క్రికెట్ వేగంగా మారుతున్నదని, గౌతమ్ గంభీర్ ఈ మారుతున్న పరిణామాలను దగ్గరగా చూశాడని జయ్ షా తన ట్వీట్‌లో రాశారు.

తన కెరీర్‌లో కష్టాలను ఓర్చుకుని, చక్కటి ప్రదర్శన చేసిన గంభీర్, భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు తగిన వ్యక్తి అని తాను భావిస్తున్నానని జయ్ షా అన్నారు.

టీమ్ ఇండియాతో తనకున్న అనుభవం, స్పష్టమైన దృక్పథం ఆయనను కోచ్ రేసులో ముందు నిలబెట్టాయని జయ్ షా అన్నారు.

ఆయన కొత్త ప్రయాణానికి బీసీసీఐ పూర్తి మద్దతునిస్తుందని జయ్ షా తెలిపారు.

గౌతమ్ గంభీర్

ఫొటో సోర్స్, X@JAYSHAH

భారత క్రికెట్ హెడ్ కోచ్‌గా నియమించినందుకు గౌతమ్ గంభీర్ బీసీసీఐ సెక్రటరీ జయ్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవిలో నియమించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు.

గౌతమ్ గంభీర్

ఫొటో సోర్స్, @GautamGambhir

గౌతమ్ గంభీర్

ఫొటో సోర్స్, @GautamGambhir

గౌతమ్ గంభీర్

ఫొటో సోర్స్, Getty Images

ఎవరెవరి మధ్య పోటీ నడిచింది?

(భారత క్రికెట్ జట్టు కోచ్ పదవిపై ఎవరి మధ్య ప్రధాన పోటీ నడిచింది అనే అంశంపై ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ శార్దా ఉగ్రా జూన్ 24న బీబీసీ కోసం రాసిన విశ్లేషణ ఈ కింద చదవండి)

భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ డబ్యూవీ రామన్ భారత క్రికెట్ జట్టు కోచ్ పదవి ఇంటర్వ్యూకు హాజరైన వార్త చాలామందిని ఆశ్చర్యపరిచింది.

అంతకుముందు ఈ పదవికి మరో మాజీ లెఫ్ట్ ఆర్మ్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాత్రమే పోటీలో ఉన్నారని భావించారు.

భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్సీ మొదటి సవాలు అయితే, కోచ్ పదవి రెండో సవాలు. అలాంటి బాధ్యతకు చాలామంది గంభీర్‌నే అత్యంత సమర్థుడైన అభ్యర్థిగా పరిగణించారు.

గౌతమ్ గంభీర్, బీసీసీఐ మధ్య చివరి నిమిషంలో ఏదైనా జరగరానిది జరిగితే తప్ప రాహుల్ ద్రవిడ్ స్థానంలో డబ్యూవీ రామన్‌ను ఎంపిక చేసే అవకాశం లేదు.

అయితే, గంభీర్‌తో పోలిస్తే, రామన్‌కు కోచింగ్ అనుభవం చాలా ఎక్కువ.

రామన్‌ దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్, తమిళనాడు రంజీ జట్లకు కోచ్‌గా వ్యవహరించడమే కాకుండా, ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకూ కోచ్‌గా వ్యవహరించారు.

ఇది మాత్రమే కాదు, ఆయన 2019-2021 లలో భారత మహిళల క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నారు.

నేషనల్ క్రికెట్ అకాడమీలో రామన్ బ్యాటింగ్ కోచ్‌గానూ వ్యవహరించారు.

ఇవన్నీ పక్కన పెడితే, రామన్‌కన్నా గంభీర్ వయస్సు తక్కువ కావడం, పెద్ద టోర్నమెంట్‌లలో అత్యుత్తమ ప్రదర్శన కారణంగా ఆయననే ఫేవరెట్‌గా పరిగణిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
డబ్ల్యూవీ రామన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, డబ్ల్యూవీ రామన్

గంభీర్ వర్సెస్ రామన్

ప్రస్తుతం గౌతమ్ గంభీర్ వయసు 42 ఏళ్లు కాగా, రామన్ వయసు 59 ఏళ్లు.

భారత్ 2007లో వరల్డ్ టీ20 కప్, 2011లో క్రికెట్ వరల్డ్ కప్‌లను గెలుచుకోవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించారు.

ఆ రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.

2007 వరల్డ్ టీ20 టైటిల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 54 బంతుల్లో 75 పరుగులు సాధించిన గంభీర్, భారత టాప్ స్కోరర్‌గా నిలిచారు.

ఇక 2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఏడో ఓవర్‌లోనే వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ వికెట్లను కోల్పోయింది.

గంభీర్ ఆ ఇన్నింగ్స్‌ను నిలబెట్టడమే కాకుండా 122 బంతుల్లో 97 పరుగుల ఇన్నింగ్స్‌తో భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచారు.

2014లో, గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో, కోల్‌కతా నైట్ రైడర్స్ తమ రెండవ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అప్పుడు రామన్ జట్టుకు సపోర్ట్ స్టాఫ్‌గా ఉన్నారు.

గంభీర్ 2022లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా ఉంటూ, తొలి ఏడాదిలోనే ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడంలో కీలకపాత్ర పోషించారు.

ఈ ఏడాది, గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మెంటార్‌గా తిరిగి వచ్చి, సునీల్ నరైన్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభింపచేయడం లాంటి కీలక నిర్ణయాలతో జట్టు విజయానికి దోహదపడ్డారు.

కోల్‌కతా రెండుసార్లకు పైగా ఐపీఎల్ గెలిచిన మూడో జట్టుగా నిలవడంలో గంభీర్ పాత్ర ఉంది.

వ్యూహాలు, ఆట గురించి తాజా సమాచారం తెలిసి ఉండటమే గంభీర్‌కు కలిసి వచ్చే అంశమని భారత ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ అన్నారు.

గంభీర్ ఇప్పటికీ స్వయంగా క్రికెట్ ఆడుతూ లేటెస్ట్ ట్రెండ్‌లను అర్థం చేసుకుంటారు.

గౌతం గంభీర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గంభీర్ గతంలో బీజేపీ ఎంపీగా పనిచేశారు.

'భారత జట్టుకు కోచ్‌ కావడాన్ని ఇష్టపడతా’

క్రికెట్ ఫీల్డ్‌లో సాధించిన విజయాల ఆధారంగానే గంభీర్ ఈ పదవికి అర్హులు. ఇందుకోసం ఆయన తన రాజకీయాల సాయం తీసుకోవాల్సిన అవసరం రాలేదు.

గంభీర్ 2019లో భారతీయ జనతా పార్టీలో చేరి తూర్పు దిల్లీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

ప్రభుత్వంలో, బీసీసీఐలో అత్యంత శక్తివంతమైన వ్యక్తికి ఆయన సన్నిహితుడు. ఆ తర్వాత గంభీర్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

ఫోర్బ్స్ లీడర్‌షిప్ ఈవెంట్‌లో, గంభీర్ మాట్లాడుతూ: "నేను రాజకీయాల్లోనూ నా అదృష్టాన్ని పరీక్షించుకున్నాను. నేను ఒక విషయం చెప్పగలను. నేను దేన్నీ అంత సులభంగా వదిలిపెట్టను. నేను మంచి ఉద్దేశంతో పూర్తి నిజాయితీతో చేయగలిగినంతా చేయడానికి ప్రయత్నించాను. కానీ, కొన్నిసార్లు మీరు మీ మనసుకు ఇష్టమైన పని ఏదో నిర్ణయించుకోవాలి. నా మనస్సు క్రికెట్‌తో ఉంది, అందుకే నేను క్రికెట్‌కి తిరిగి వచ్చాను." అని అన్నారు.

జూన్ ప్రారంభంలో అబుదాబిలో జరిగిన ఒక కార్యక్రమంలో "నేను భారత జట్టుకు కోచ్‌గా ఉండడానికి ఇష్టపడతాను. మీ జాతీయ జట్టుకు శిక్షణ ఇవ్వడం కంటే గొప్ప గౌరవం వేరే లేదు. మీరు దేశంలో, దేశం బయట నివసిస్తున్న 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తారు." అన్నారు.

భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్‌గా ఎన్నికైన వ్యక్తి మూడేళ్లపాటు పని చేసే అవకాశం ఉంటుంది.

భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కోచ్‌లు జాన్ రైట్, గ్యారీ కిర్‌స్టన్, రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్‌లకు ఇలాంటి అవకాశం దక్కలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో గంభీర్‌కు భారత క్రికెట్ జట్టు తదుపరి కోచ్ అయ్యే అవకాశం వస్తే, ఆయన తన సహాయకులుగా ఎవరిని ఎంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

కోల్‌కతా నైట్ రైడర్స్‌లో గంభీర్ సహచరుడు, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా పరిశీలిస్తున్నారు.

డేటా, వీడియో విశ్లేషణలపై తనకు సమయం లేదని గంభీర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆయన తన నిర్ణయాలను ఆటను చూసి, ఆలోచిస్తూ తీసుకుంటారు.

ఇలాంటి పరిస్థితిలో, మోర్కెల్ వంటి సహాయకుడు డేటా, వీడియో విశ్లేషణలాంటి అంశాలతో ఆయనకు సహాయపడగలరు.

డబ్ల్యూ వీ రామన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

డబ్ల్యూవీ రామన్ పాత్ర ఏమిటి?

గంభీర్‌కి పోటీదారుగా మాత్రమే కాకుండా, డబ్ల్యూవీ రామన్ పేరు ఆయన సహాయకుడిగానూ ప్రస్తావనకు రావడం విశేషం. డ్రెస్సింగ్ రూమ్‌లో టీమ్‌కు వ్యూహాత్మక సలహాదారు పాత్రను పోషించగల పెద్దమనిషిగా, ప్రశాంతంగా ఉండే బ్యాటింగ్ కోచ్ అవసరమూ ఉంది.

అయితే చివరి ప్రశ్న ఏమిటంటే, ప్రపంచంలో అత్యధిక అభిమానులను కలిగిన జట్టుగా ఉన్న భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి ఎందుకు కేవలం కొన్ని దరఖాస్తులే వచ్చాయి? ఎందుకు విదేశాల నుంచి ఎవరూ దరఖాస్తు చేయలేదు?

ఈ ప్రశ్నకు అనేక సమాధానాలు ఉండొచ్చు. ఎందుకంటే భారత పురుషుల క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఉండటం ప్రతిష్టాత్మకమైన బాధ్యత.

ప్రపంచంలోని క్రికెట్‌ను ఇష్టపడే అతిపెద్ద దేశంలో, అతిపెద్ద మార్కెట్‌ కలిగిన ఈ గేమ్‌కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన బాధ్యతల్లో ఇది ఒకటి.

ఈ పదవికి ఆకర్షణీయమైన జీతం, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా ఏటా రూ.10 నుంచి 12 కోట్లు తీసుకుంటున్నట్లు అంచనా.

అయితే, ఇవన్నీ ఉన్నా కూడా, భారత క్రికెట్ అంతర్గత పని విధానం, బీసీసీఐ వర్కింగ్ కల్చర్ తెలియని ఏ విదేశీ ప్రొఫెషనల్ ప్లేయరైనా ఈ పదవికి ఎందుకు దరఖాస్తు చేస్తారు?

పైగా, ఐపీఎల్, ఇతర ఫ్రాంచైజీ లీగ్ క్రికెట్‌లో తక్కువ ఒత్తిడి, ఆకర్షణీయమైన వేతనాలు ఉన్న కోచింగ్ అవకాశాలు వాళ్లకు అందుబాటులో ఉన్నాయి.

లీగ్ క్రికెట్‌లో కోచ్‌గా ఉన్నవాళ్లు ఏడాదిలో పది నెలలు ఇంటికి దూరంగా, ప్రతిక్షణం మీడియా నిఘాలో ఉండాల్సిన అవసరం లేదు.

ఇదొక్కటే కాదు, ఐపీఎల్ ఫ్రాంచైజీ బీసీసీఐ కంటే ప్రొఫెషనల్. దానికి మంచి ప్రణాళికాబద్ధమైన నిర్వహణ వ్యవస్థ ఉంది. అందుకే విదేశీ కోచ్‌లు ఆసక్తి చూపలేదని అనుకోవచ్చు.

షారూఖ్, గంభీర్

ఫొటో సోర్స్, GETTY IMAGES

కొత్త లీడర్ల తయారీలో సవాళ్ళు

జట్టు ప్రతిష్ఠ కోసం ప్రతిదీ త్యాగం చేయడానికి మానసికంగా సిద్ధమైన భారతీయులు మాత్రమే భారత జట్టు కోచ్ పదవి తీసుకోగలుగుతారు.

కొంతకాలం కిందటి వరకు గంభీర్ భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లతో ఆడారు. అందువల్ల ఆయన సూపర్ స్టార్ ఆటగాళ్లనూ నియంత్రించగలరని భావిస్తున్నారు.

ఫోర్బ్స్ ఈవెంట్‌లో, నాయకత్వం గురించి గంభీర్ మాట్లాడుతూ: "తర్వాత తరం నాయకులను సృష్టించడం అనేది నాయకుడి మొదటి, అతి ముఖ్యమైన లక్షణం అని నేను భావిస్తున్నాను. మీరు కేవలం మీ ఒక్కరి గురించి ఆలోచించడమే కాదు, మీరు నాయకులను తయారు చేసే వాతావరణాన్నీ సృష్టించాలి." అని చెప్పారు.

భారత క్రికెట్ ఇప్పుడు పురుష, మహిళా నాయకులను తయారు చేయడానికి ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉంటుంది. రాబోయే రోజుల్లో గంభీర్ తర్వాత భారత జట్టు కోచ్ బాధ్యతలను ఎవరు నిర్వహించగలరు, ఒత్తిళ్లను ఎలా ఎదుర్కోగలరు అన్న విషయాన్నీ ఆలోచించాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)