లవ్ ట్యాక్స్: ప్రేమించి పెళ్లి చేసుకుంటే 'కుట్ర వరీ' కట్టాల్సిందే, లేదంటే గ్రామ బహిష్కరణ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎస్.ప్రశాంత్
- హోదా, బీబీసీ కోసం
తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని ఓ గ్రామంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలకు పన్ను విధిస్తున్నారు. ఒకవేళ పన్ను చెల్లించకపోతే వారిని ఊరి నుంచి బహిష్కరిస్తారు. దీనిని 'కుట్ర వరీ' అని పిలుస్తారు. కుట్ర అంటే క్రైమ్(నేరం), వరీ అంటే ట్యాక్స్(పన్ను).
వడక్కలూర్ గ్రామ కులపెద్ద బీబీసీతో మాట్లాడుతూ, ఎన్నో తరాలుగా ఈ ఆచారం కొనసాగుతోందని చెప్పారు.
ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ క్రాంతికుమార్ పాడి బీబీసీతో చెప్పారు.
ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు బీబీసీ క్షేత్రస్థాయిలో అధ్యయనం (ఫీల్డ్ స్టడీ) చేసింది.

ప్రేమించి పెళ్లి చేసుకుంటే 'పన్ను'
కోయంబత్తూరు జిల్లా అన్నూర్ సమీపంలో ఓ గ్రామంలో ప్రేమ పెళ్లి చేసుకున్న జంటలను కులపెద్దలు బహిష్కరిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. అంతేకాకుండా, ప్రేమ పెళ్లి చేసుకున్న జంటలకు 'కుట్ర వరీ' (నేరం చేసినందుకు పన్ను - క్రైమ్ ట్యాక్స్) చెల్లించిన తర్వాత గ్రామంలోకి అనుమతించే ఆచారం కూడా కొనసాగుతోందనే ఫిర్యాదు కూడా వచ్చింది.
దీంతో, అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వడక్కలూర్ గ్రామంలో బీబీసీ క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రేమ వివాహాలు చేసుకున్నందుకు 'క్రైమ్ ట్యాక్స్' కట్టాల్సి వచ్చిన కొందరితో మాట్లాడింది.
అన్నూర్ నుంచి 5 కిలోమీటర్లు ప్రయాణించి మేం వడక్కలూర్ గ్రామానికి చేరుకున్నాం. అరటి తోటలు, ఇతర పంటలతో గ్రామం పచ్చగా కళకళలాడుతోంది.
గ్రామ జనాభాలో 95 శాతం మంది షెడ్యూల్డ్ తెగకు చెందినవారు. దాదాపు 220 ఇళ్లు ఆ తెగకు చెందిన వారివే. గ్రామంలో ఈ కులంవారికి చెందిన కరుప్పరాయన్ దేవాలయం ఉంది.
గ్రామ బహిష్కరణకు గురైన జంటలు గుడిలోకి రాకూడదని కులపెద్దలు బెదిరిస్తున్నారని బాధితులు బీబీసీతో చెప్పారు.

'నేను వేరే మతానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా'
గ్రామ కట్టుబాట్లతో ఇబ్బందులు ఎదుర్కొన్న కొందరు తమ అనుభవాలను బీబీసీతో పంచుకున్నారు.
వేరే మతానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నానని ఊరి నుంచి పంపించేశారని, క్రైమ్ ట్యాక్స్ చెల్లించి గ్రామంలోకి తిరిగి వచ్చినట్లు 40 ఏళ్ల రమేశ్ చెబుతున్నారు. ఆయన కూలి పనులకు వెళ్తుంటారు.
రమేష్ అప్పుడు జరిగిన సంఘటనలను వివరిస్తూ, ''మాది వడక్కలూర్. పనికోసం బయటికి ప్రాంతానికి వెళ్లినప్పుడు, అక్క్కడ వేరే మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఊరికి వచ్చా. అయితే, ఊర్‌పన్నాడిగా పిలిచే మా కులపెద్ద, ఆయన అనుచరగణం మమ్మల్ని ఊళ్లోకి రానివ్వలేదు'' అన్నారు.
''గ్రామస్తులకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకోవడం తప్పు అని, అందుకు బదులుగా గ్రామ పంచాయతీకి 'క్రైమ్ ట్యాక్స్'గా 500 రూపాయలు చెల్లించమన్నారు'' అని రమేశ్ చెప్పారు.

'ఇంటింటికీ వెళ్లి క్షమాపణ చెప్పా'
"గ్రామస్తులకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకుని తప్పు చేశానని ఊళ్లో ఇంటింటికీ వెళ్లి క్షమాపణ చెప్పా. గ్రామ పంచాయతీకి వచ్చి క్షమాపణ చెప్పాలని, అలాగే క్రైమ్ ట్యాక్స్ కట్టేందుకు అంగీకరిస్తేనే ఊళ్లోకి రానిస్తామన్నారు'' అని రమేశ్ చెప్పారు.
పన్ను చెల్లించడం వల్లే తమను ఊళ్లోకి రానిచ్చారని ఆయన విచారం వ్యక్తం చేశారు.
ఊళ్లోకి రావడం గురించి రమేశ్ చెబుతూ, ''పెళ్లయ్యాక, ఊళ్లో ప్రశాంతంగా జీవిద్దామని ఇక్కడికి వచ్చా. పన్ను చెల్లించాలని నిర్ణయించుకుని ఊళ్లోని 200 ఇళ్లకు, ఇంటింటికీ వెళ్లి క్షమాపణలు చెప్పా. గ్రామంలోని కరుప్పరాయన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీలో నేను, నా భార్య ఊరందరికీ క్షమాపణ చెప్పి ఊళ్లో ఉంటున్నాం'' అని రమేశ్ వివరించారు.
''నాకు ఎదురైన అనుభవం భయంకరమైనది. పెళ్లి చేసుకుని స్వేచ్ఛగా బతకలేకపోయా. ఈ వెనుకబాటుతనం నశించాలి'' అని రమేశ్ అన్నారు.

'మా తమ్ముడు ఊరొదిలి వెళ్లిపోయాడు'
కులాంతర వివాహం చేసుకున్నాడని తన తమ్ముడిని ఊరి నుంచి వెళ్లగొట్టారని, అందువల్ల వేరే ఊరు వెళ్లిపోయాడని గ్రామానికి చెందిన కరుప్పస్వామి చెప్పారు.
బీబీసీతో కరుప్పస్వామి మాట్లాడుతూ.. "10 ఏళ్ల కిందట నా తమ్ముడు వేరేకులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో, కులపెద్ద నా తమ్ముడిని గ్రామంలోకి అనుమతించలేదు. తమ్ముడితో మాట్లాడినా, ఇంట్లోకి రానిచ్చినా మీరు కూడా ఊరొదిలి వెళ్లిపోవాల్సి వస్తుందని నన్ను, మా అమ్మానాన్నను కూడా బెదిరించారు'' అని ఆయన చెప్పారు.
గ్రామంలో విధించే పన్ను కట్టేందుకు ఇష్టపడని తన తమ్ముడు వేరే ఊళ్లో ఉంటున్నాడని, పదేళ్లుగా ఊరికి తిరిగొచ్చింది లేదని ఆయన చెప్పారు.

'నా కుటుంబాన్ని బహిష్కరించారు'
''నేను రెండేళ్ల పాటు కులపెద్దగా ఉన్నప్పుడు, ప్రేమ పెళ్లిళ్లకు అనుమతించొద్దనే ఆచారం ఉండేది. అది ఇష్టం లేకనే ఆ పదవికి రాజీనామా చేశా'' అని గ్రామ మాజీ కులపెద్ద సుందరం చెబుతున్నారు.
తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని, తన కుటుంబాన్ని కూడా ఊరి నుంచి బహిష్కరించారని ఆయన చెప్పారు.
''మా గ్రామానికే చెందిన, మా కులానికి చెందిన వ్యక్తితోనే 2021లో నా కూతురు పెళ్లి జరిగింది. దీంతో ఇంటింటికీ వెళ్లి క్షమాపణ కోరాలని, క్రైమ్ ట్యాక్స్ చెల్లించాలని అన్నారు. అందుకు నిరాకరించడంతో మా కుటుంబాన్ని బహిష్కరించారు. కానీ, నా కూతురు, ఆమె అత్తింటి వారు పన్ను చెల్లించి గ్రామంలో ఉంటున్నారు.
మా కుటుంబాన్ని బహిష్కరించడం వల్ల, మా ఇంటికి వస్తే నా కూతురిని కూడా బహిష్కరిస్తామని కులపెద్ద పురుషోత్తమన్ బెదిరించారు. దీంతో, పెళ్లైనప్పటి నుంచి ఇప్పటి వరకు నా కూతురు మా ఇంటికి కూడా రాలేకపోయింది'' అని సుందరం అంటున్నారు.
దీనిపై, గ్రామ మాజీ కులపెద్ద సుందరం.. ప్రస్తుత కులపెద్ద పురుషోత్తమన్‌తో పాటు ఆయన అనుయాయులపై కేసు పెట్టారు.

ఊరి నుంచి బహిష్కరిస్తే ఏమవుతుంది?
ఊరి నుంచి బహిష్కరిస్తే ఏం చేస్తారో కూడా సుందరం చెప్పారు.
''గ్రామంలోని కరుప్పరాయన్ గుడిలోకి మమ్మల్ని రానివ్వరు. దుకాణాలకు వెళ్తే ఎక్కువ సేపు నిలబెడతారు. పెళ్లి, చావులకు వెళ్లినా అక్కడి నుంచి వెళ్లగొడతారు. ఇతరులు మనతో మాట్లాడినా వారిని కూడా ఊరి నుంచి బహిష్కరిస్తారు'' అని ఆయన అన్నారు.
ప్రస్తుతం పురుషోత్తమన్ కులపెద్దగా ఉన్నారని, ఆయన భార్య వంచిక్కోడి పంచాయతీ ప్రెసిడెంట్‌గా రెండుసార్లు ఎన్నికయ్యారని బాధితులు చెబుతున్నారు. పురుషోత్తమన్, ఆయన అనుచరులు ఈ ఆచారాన్ని అమలు చేస్తున్నారు.

'తరతరాలుగా ఉంది'
బాధితుల ఆరోపణలపై ఊర్‌పన్నాడిగా పిలిచే కులపెద్ద పురుషోత్తమన్‌తో బీబీసీ మాట్లాడింది.
"మా కులంలో తరతరాలుగా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. మేం కూడా అదే అనుసరిస్తున్నాం. వాళ్లు చెప్పినట్లు క్రైమ్ ట్యాక్స్ తప్పుకాదు, అది కట్టాల్సిన పన్ను. దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాలకు, గ్రామంలో పెళ్లిళ్లకు, శుభకార్యాలకు, సంతాప కార్యక్రమాలకు ఈ సొమ్మును వెచ్చిస్తాం'' అని ఆయన చెప్పారు.
''మాజీ కులపెద్ద సుందరం, ఆయన తండ్రి, తాత, మా నాన్న, ఇంకా ఎంతోమంది ప్రేమ వివాహాల విషయంలో ఇలానే వ్యవహరించారు. ఆలయం కోసం వసూలు చేసిన పన్నుకు సుందరం లెక్కలు చెప్పడం లేదు. తన సొంత కూతురు కూడా ప్రేమ వివాహం చేసుకోవడంతో దీన్నో అభూత కల్పనలా చేసి చూపుతున్నారు'' అని పురుషోత్తమన్ ఆరోపించారు.
పురుషోత్తమన్ ఆరోపణలను సుందరం ఖండించారు, ‘‘ఈ కాలంలోనూ ఇలాంటి పద్ధతులు ఉండడం సరికాదని, ప్రేమ పెళ్లి చేసుకున్నవారు ప్రశాంతంగా జీవించాలనే ఉద్దేశంతో కోర్టులో కేసు వేశా. విషయం నుంచి తప్పించుకోవడం కోసం, అసలు విషయాన్ని దారి మళ్లించడం కోసం పురుషోత్తమన్ ప్రయత్నిస్తున్నారు. ఆలయానికి సంబంధించిన అన్ని లెక్కలను నేను గతంలోనే అప్పజెప్పా'' అని సుందరం చెప్పారు.

కఠిన చర్యలు తీసుకుంటాం : కలెక్టర్
ఇలాంటి వాటిని అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం ఏం చేయబోతుందని కోయంబత్తూర్ జిల్లా కలెక్టర్ క్రాంతికుమార్ పాడిని బీబీసీ అడిగినప్పుడు, ''ఆలయానికి సంబంధించిన నగదు వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు గతంలో ఫిర్యాదు వచ్చింది, విచారణలో ఈ విషయం బహిర్గతమైంది'' అని ఆయన చెప్పారు.
దేవదాయశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో రెండు దఫాలు చర్చలు జరిగాయని, ప్రేమ పెళ్లిళ్లతో పాటు ఇతరులు గుడిలోకి వెళ్లి పూజలు చేసుకునేలా సమస్యను పరిష్కరించినట్లు ఆయన చెప్పారు.
''అలాగే, పాత పద్ధతులను విడనాడేలా గ్రామంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. గ్రామ కట్టుబాట్ల పేరుతో ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న జంటలపై బహిష్కరణ వంటి వాటికి పాల్పడితే కఠిన పోలీసు చర్యలు ఉంటాయి. అరెస్టులతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దీన్ని ఎట్టిపరిస్థితిల్లోనూ ఉపేక్షించేది లేదు'' అని జిల్లా కలెక్టర్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- రేవణ్ణ: కర్ణాటక రాజకీయాలను శాసించిన ఆ కుటుంబం 60 రోజుల్లో ఎలా పతనావస్థకు చేరిందంటే...
- జనం చూస్తుండగానే హత్య.. అంతమందిలో కాపాడడానికి వచ్చింది ఒక్కరే - ఎక్కువ మంది ఉన్నప్పుడు సాయం దొరికే అవకాశం తక్కువవుతుందా?
- ఇబ్న్ బతూతా: తుగ్లక్ రాయబారిగా భారత్ నుంచి చైనాకు వెళ్లిన ఈ ట్రావెలర్ ఎవరు?
- నీట్, నెట్ వివాదం: పేపర్ లీక్‌కు పాల్పడితే 10 ఏళ్ళ వరకు జైలు, కోటి రూపాయల దాకా జరిమానా, ఇంకా ఈ కొత్త చట్టంలో ఏముందంటే...
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














